భౌతికవాద పునరుజ్జీవం నేటి కర్తవ్యం

Jan 23,2025 05:20 #Articles, #edite page, #Science

భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో భారతీయ భౌతిక తత్వ శాస్త్రాన్ని బోధించకపోవడం వలన భారతీయ తాత్విక మూలాలు విద్యార్థులకు, ఆధునిక మేధావులకు అందడంలేదు. అసలు నిజానికి భారతీయ మొదటి తత్వశాస్త్ర భాగాలుగా చార్వాకం, జైనం, బౌద్ధం, సాంఖ్యం ప్రసిద్ధమైనవిగా చెప్పబడినవి. సర్వదర్శన సంగ్రహంలో వీటినే తత్వశాస్త్ర మొదటి దర్శనాలుగా ప్రకటించారు. ఈనాడు అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల్లోను, రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లోను తత్వశాస్త్ర విభాగాల్లో చార్వాకాన్ని చెప్పకపోవడం వలన వేదాలే మొదటివి అనుకునే పరిస్థితి వచ్చింది. కాని నిజానికి వేదాలు భారతీయ భౌతికవాదాన్ని పూర్వపక్షంగా వచ్చినవే. భారతదేశం ప్రధానంగా నదీ నాగరికతతో పాటు మాతృస్వామికమైన దేశం. నిప్పు, నీరు, గాలి, నేలను జీవన విధానంగా మలుచుకోన్న దేశం. ఈ మూలాలు విశ్వవిద్యాలయాలలో విద్యార్థులకు తెలియకపోతే వారికి ప్రాకృతిక భౌతిక జ్ఞానం తగ్గుతుంది. ఇప్పుడు ప్రయాగలో జరుగుతున్న కుంభమేళా నదీ నాగరికతను ఎలా విధ్వంసం చేస్తుందో తెలుసుకోలేరు. భారతదేశంలో తత్వ శాస్త్రమంటే ఆధ్యాత్మిక వాదంగా ప్రచారం చేశారు. తత్వశాస్త్రమనగానే ఆత్మ గురించో, పరలోకం గురించో చెప్పేదనే భావన ఏర్పడింది. నిజానికి భౌతికాంశాల నుండి రూపొందిన దాన్నే తత్వ శాస్త్రం అంటారు. భారతదేశంలో అతి ప్రాచీన జాతులు ఈ తాత్వికాంశాల మీద సుదీర్ఘమైన చర్చ చేశారు. శరీరానికి, చైతన్యానికి ఉన్న సంబంధాన్నీ మానవునికీ ప్రకృతికి ఉన్న సంబంధాన్నీ విశ్వ పరిణామాన్ని, మానవ పరిణామాన్నీ భౌతిక దృక్పథంతో వారు వివేచించారు. మానవునికి తన చుట్టూ వున్న ప్రకృతి, సమాజం పట్ల ఉదయించిన అనేక ప్రశ్నలకు వారు భౌతిక దృక్పథంతో సమాధానం వెతికారు. మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పునీ, నీరునీ, గాలినీ, భూమినీ వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. నిప్పుని, నీరునీ, గాలినీ, భూమినీ వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడానికి ముందు, దాని భౌతిక శక్తిని అర్ధం చేసుకోక ముందు వడివడిగా ముందుకు నడవలేకపోయాడు. నిప్పు మానవ సామాజిక పరిణామంలో కీలక పాత్ర వహించింది. నిప్పుని ఆరాధించిన జాతుల కంటే, నిప్పుని భౌతిక శక్తిగా గుర్తించిన జాతులు శక్తివంతంగా ముందుకు నడిచాయి. నిప్పు మానవ జీవితాన్ని ఒక భౌతిక శక్తిగా ప్రభావితం చేసింది. భారతదేశంలో చార్వాకులు నిప్పుకి ‘భౌతిక శాస్త్రతత్వాన్ని’ రూపొందించారు. నిప్పునారాధించే జాతులకీ, నిప్పుని అధీనం చేసుకొన్న జాతులకీ భారతదేశంలో సమరం జరిగింది. తన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని సమన్వయించుకోవడంలో విఫలమైనవారు భావవాదులుగా రూపొందారు. వీరు భౌతిక సామాజిక వాస్తవికతకు భిన్నమైన భావవాదంతో భౌతికవాదులకెదురు నిలుస్తూ వచ్చారు. నిప్పుని పదార్ధంగా కనుగొన్న చార్వాకుల వారసులు భారతీయ ఆదిమ జాతుల వారే. అడవులు తగులబెట్టి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల పరిణామం నుండి వ్యవసాయ సంస్కృతిని రూపొందించి నిప్పుని భౌతిక శక్తిగా వాడుకున్నారు.

వేదాలు భారత దేశానికి వలస వచ్చిన రాజకీయ తెగలైన ఆర్యులు రూపొందించుకున్న భావజాలం. ఈ వేదాలు క్రీ||పూ|| 2000-750 సంవత్సరాల మధ్యలో రచించబడినాయని వింటర్‌నిట్జ్‌ పేర్కొన్నాడు. కీత్‌ క్రీ||పూ|| 1200-350 సంవత్సరాల మధ్యలోవని తెలిపాడు. సాధారణంగా వేద రచన క్రీ.పూ 1400 ప్రాంతంలో ప్రారంభమై క్రీ||పూ 600 వరకు జరిగిందని చరిత్రకారులు భావిస్తున్నారు. వేద శబ్దమునకు ”జ్ఞానమ”ని అర్ధం ఇవ్వబడింది. జైమిని అభిప్రాయం ప్రకారం వేదాలు రెండు భాగాలు. 1. మంత్రాలు 2. బ్రాహ్మణాలు. మంత్రాల సంకలనాన్ని సంహితలని అంటారు. ఋగ్వేదానికీ, యజుర్వేదానికీ, సామ వేదానికీ, అధర్వణ వేదానికీ, సంహితలున్నాయి. ఇవి ఒకరి నోటి నుండి ఒకరు కంఠస్థం చేశారు. అందుకే వీటిని శృతులు అన్నారు. వేదాలను సంహితులుగానే కాక బ్రాహ్మణాలుగా, అరణ్యకాలుగా కూడా విభజించారు. నాలుగు వేదాల్లో అతి పురాతనమైంది ఋగ్వేదం. ఋగ్వేద మంత్ర కర్తలలో విశ్వామిత్రుడు, వశిష్టుడు, భరద్వాజుడు, గౌతముడు ముఖ్యులు. వీరు క్రీ||పూ 1500 ప్రాంతం వారీగా గుర్తింపబడ్డారు. ఋగ్వేదం క్రీ||పూ 1520 ప్రాంతం నుండి క్రీ||పూ 1420 దాకా వివిధ ఋషుల చేత రాయబడుతూనే ఉంది. ఋగ్వేదంలో అగ్ని, వరుణుడు, సూర్యుడు, ఇంద్రుడు మొదలైన దేవతలను కొనియాడారు. నిజానికి చార్వాక వాదం, జైనవాదం, బౌద్ధవాదం, సాంఖ్య తత్వశాస్త్రం బోధించబడితే విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు భారతదేశంలో తాత్విక మూలాలు అర్థం అవుతాయి. దానివల్ల దేశంలో వైజ్ఞానిక, శాస్త్రీయ, సాంకేతిక జ్ఞానం పెరుగుతుంది. అయితే బిజెపి, ఆర్‌యస్‌యస్‌, విశ్వహిందూ పరిషత్‌ల భావజాలాలు చొప్పించాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. భారత దేశం ఒక మతానికి సంబంధించినది కాదు. ఒక వర్ణాధిపత్యానికి లోబడదు. ఇది లౌకికవాద భావజాలంతో కూడినది. భారతదేశ భౌగోళిక పరిస్థితుల నుంచి అనేక ఉపఖండాల నుండి మన దేశానికి వలస వచ్చిన పాలకులు భిన్న మతాలను తీసుకు వచ్చారు. వైదికం, ఇస్లాం, క్రైస్తవం బయట నుండి వచ్చినవే. చార్వాకం, బౌద్ధం, జైనం, సాంఖ్యం దేశీయంగా పుట్టిన తత్వాలు, ధర్మాలు. అవి ఆ తరువాత మతాలుగా పిలువబడ్డాయి. అందుకే ఈనాడు భారతీయ తాత్విక బోధన ద్వారా విద్యార్థులను, పరిశోధకులను, రాజకీయవేత్తలను ప్రభావితం చేయాలంటే భారతీయ భౌతికవాద చింతన తప్పక జరగాలి.
నీటిని కల్మషం చేసే కుంభమేళాలు భారతదేశ సంస్కృతి కాదు. ఇవి వ్యవసాయ సంస్కృతికి, పారిశ్రామిక విధానాలకు వ్యతిరిక్తమైనవి. మనిషిని మూఢ విశ్వాసాల్లోకి నెట్టి జ్ఞాన శూన్యం చేస్తాయి. తాత్విక జిజ్ఞాస నుండి కర్మకాండల్లోకి నెడతాయి. ఇవి పితృస్వామిక భావజాలంతో నడుస్తున్నాయి. ఇవి యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. యువతను లైబ్రరీలకు, పరిశోధనలకు, రచనలకు, సృజనానికి, కళాసృష్టికి వెళ్లకుండా నిరోధిస్తున్నాయి. అందుకే, భారతదేశంలో నూతన సామాజిక తాత్విక విప్లవం నేటి అవసరం. ఆ దిశగా పయనిద్దాం.

2016 | Kaila Neelambram and Vazramma Award | Dr Katti Padma Rao, Andhra Pradesh, Dalit Mahasabha – Friends For Education

వ్యాసకర్త : డా|| కత్తి పద్మారావు, సెల్‌ : 9849741695 

➡️