రాష్ట్రంలో మహిళలు, బాలికలపై హత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు మిక్కిలి గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. ఒక ఘాతుకం మర్చిపోకముందే మరొకటి చోటు చేసుకొని స్త్రీలను బెంబేలెస్తున్నాయి. ఒక్కో ఘటన చూస్తుంటే వింటుంటే మనం ఉన్నది నాగరిక సమాజంలోనా మధ్య యుగాల్లోనా అనేంత పాశవికంగా జరుగుతున్నాయి. వారం రోజుల్లోనే రాష్ట్రంలో ఇద్దరిపై గ్యాంగ్ రేప్, మరో ఇద్దరిపై ఘోర దాడులు ముంచుకొచ్చాయి. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కడప జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై ఆమె స్నేహితుడే పెట్రోలు పోసి తగలబెట్టగా, 90 శాతం గాయాలతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడవడం అత్యంత బాధాకరం. తెనాలిలో నర్సు దాడికి గురై బ్రెయిన్ డెడ్ స్టేజిలో గుంటూరు జనరల్ ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవలే నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారానికి, హత్యకు గురైంది. జూన్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వారానికే బాపట్ల జిల్లా చీరాల వద్ద పంట పొలాల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించగా ఆమె సామూహిక అత్యాచారం, హత్యకు గురైందని ప్రాథమికంగా పోలీస్ దర్యాప్తు చేపట్టారు. ఇవి లోకానికి తెలిసొచ్చిన అఘాయిత్యాల్లో కొన్ని మాత్రమే. బయటికి రానివి ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు.
మహిళలపై నేరాలు ఇంతగా పెచ్చుమీరడానికి ఉన్మాదులు యథేచ్ఛగా చెలరేగి పోవడానికి ప్రధాన కారణం నేరం చేయకూడదన్న భయం లేకపోవడమే. సత్వర దర్యాప్తు, నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడితేనే నేరాలు అదుపులోకి వస్తాయి. ఉదాహరణకు జూన్‌లో బాపట్ల జిల్లాలో మహిళ హత్యాచారానికి గురైతే ఇప్పటికీ కేసు అతీగతీ లేదు. అలాంటిదే ఇంకో ఘటన జరిగాక తీరిగ్గా ఇప్పుడు ప్రత్యేక కోర్టులని, హైకోర్టుకు లేఖ రాస్తామంటున్నారు ముఖ్యమంత్రి, హోం మంత్రి. ఆడపిల్లపై చేయి వేసిన వాడికి అదే చివరి రోజవతుందని సి.ఎం, హోం మంత్రి నాలుగు మాసాల్లో ఎన్నో సార్లు హూంకరించినా ఘోరాలు ఆగింది లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపై, చిన్న పిల్లలపై నేరాలు 74 జరిగాయన్నది ఒక లెక్క. ఆరుగురు హత్యకు గురికాగా, మరో ఐదుగురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అలాగని ఈ ప్రభుత్వం వచ్చాకనే మృగాళ్లు పుట్టుకొచ్చారని కాదు. గత ప్రభుత్వంలోనూ మహిళలపై కిరాతకాలు జరిగాయి. దిశ పోలీస్‌స్టేషన్లు, యాప్ అన్నా ఘోరాలు నిరాటంకంగా జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం వల్లిస్తున్న ఫాస్ట్ ట్రాక్, స్పెషల్ కోర్టులు, నేరస్తులపై ఉక్కుపాదం వంటివి కూడా ఆ కోవలోనివే. అప్పుడూ ఇప్పుడూ మహిళలే సమిధలవుతున్నారు.
కేంద్రంలో మోడీ పాలన వచ్చాక దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు ఒక ధోరణిగా మారిపోయాయి. నయా-ఉదారవాదం, మతోన్మాదాలే మహిళలపై హింసను ప్రేరేపిస్తున్నాయన్నది వాస్తవం. మణిపూర్‌లో కొన్ని నెలలపాటు కీచకపర్వం నడిచింది. ఇంకా నడుస్తోంది. అందుకు బాధ్యుడైన తమ సి.ఎం ను మార్చకుండా బిజెపి, మోడీ వెనకేసుకొచ్చారు. గుజరాత్‌లో ఆరేళ్ల బాలికపై స్కూలు హెడ్ మాస్టర్ లైంగికంగా హింసించి హత్య చేశాడు. మహారాష్ట్రలో ఇద్దరు విద్యార్థినులపై లైంగిక దాడి జరిగింది. ‘బేటీ పఢావ్ బేటీ బచావ్’ అంటే ఇదేనా? స్త్రీలకు ఎటువంటి విలువ లేదని చెప్పే సనాతన, మనువాదుల ఏలుబడిలో మహిళలకు రక్షణ ఉంటుందా? వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు, పిల్లలు అదృశ్యమయ్యారని బాధపడ్డ జనసేనాని, తాను పాలనలోకొచ్చాక ఆ విషయాన్ని మర్చిపోవడానికి, ప్రస్తుతం రాష్ట్రంలో స్త్రీలపై జరుగుతున్న దుర్మార్గాలపై మౌనం బిజెపి సనాతన ధర్మాన్ని భుజానేసుకున్నందుకేనేమో! ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారన్నది ఒక శ్లోకం. పూజించటం మాటేమోగాని స్త్రీలను బతకనివ్వని చెరబట్టే విపత్కర రోజులు దాపురించాయి. మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలకు ఆ బాధ్యత తెలియజెప్పేందుకు ఉద్యమాలే శరణ్యం.
