ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి, సహచర మంత్రి ఆతిషి ని ఆ పీఠంపై తాత్కాలికంగా కూర్చోబెట్టడం ఉన్నంతలో తెలివైన ఎత్తుగడ. మద్యం పాలసీ వ్యవహారంలో ఈడీ, సీబీఐ కేసుల నేపథ్యంలో ఆరు మాసాలు జైల్లో ఉన్నారు. సుప్రీం కోర్టు బెయిల్‌పై బయటకు వచ్చారు. కేసు నమోదు అయినప్పుడు గానీ, జైలులో ఉన్నప్పుడుగానీ ముఖ్యమంత్రి పీఠం వదులుకొని, ప్రజాభిమానం పొందేవరకు ఇటు చూడనని అనలేదు. బెయిల్ వచ్చాక మాత్రమే ఆ అగ్నిపరీక్షకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆయన ముందున్న ఆప్షన్లలో ఇదే మెరుగు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా కొనసాగినా సుప్రీం ఆదేశాలు ఆయన అధికారాలకు కత్తెర వేశాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లరాదని, ఫైళ్లు కదపరాదని సవాలక్ష ఆంక్షలు. ఒకవైపు లెఫ్టినెంట్ గవర్నర్, రెండో వైపు ఆంక్షల పరిధుల్లో ఆయన చేయగలిగేది తక్కువ. వచ్చే ఎన్నికల్లో చెప్పుకోగలిగేది తక్కువ. పోనీ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామంటే అది ఆయన చేతుల్లో లేదు. రద్దు మాత్రం చెయ్యగలడు గానీ ఎన్నికలకు అనుకున్న టైమ్‌లో వెళ్లగలగడం లెఫ్టినెంట్ గవర్నర్ ఇష్టం మీద ఉంటుంది. ఆపై ఎన్నికల కమిషన్ ఇష్టంలో ఉంటుంది. కాబట్టి రాజీనామా చేసి తన భవిష్యత్తును ప్రజల చేతిలో పెట్టారు. కాబట్టి ఆయన్ని అన్యాయంగా బలిపశువు చేశారన్న ఉద్వేగం, ఆయన పదవీ త్యాగం ఎన్నికల వరకూ కొనసాగే వీలుంటుంది. ఈ లోగా ఢిల్లీ ప్రభుత్వ వైఫల్యాలు ఆయన ఖాతాలో పడవు. అదో లాభం. పాచిక పారుతుందో లేదో అప్పుడే చెప్పలేం. మళ్ళీ ఎన్నికల వేళకి ఆప్ కి మెజారిటీ వచ్చి, అంతవరకూ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి పార్టీ విధేయత తప్ప, స్వంత ఎజెండాలు తయారవక పోతే కేజ్రీవాల్ వ్యూహం నెరవేరినట్టే. లేకపోతే ఒక మంచి ఎత్తుగడతో విఫలయత్నం చేసినట్టే.
– డా.డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ, విజయనగరం.