రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్‌కు నిజమైన నివాళి

Apr 13,2024 05:05 #editpage

ఏప్రిల్‌ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలోనే ఒకవైపు 18వ సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర బిజెపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యానాలు గమనిస్తే 2029 నాటికి ఈ రాజ్యాంగాన్ని కొనసాగిస్తారా? మౌలిక మార్పులు చేస్తారా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ప్రధాన మంత్రి స్వయంగా ‘ఈ పదేళ్లు మీరు చూసినది ట్రైలర్‌ మాత్రమే, అసలు సినిమా రాబోయే కాలంలో చూస్తారు’ అనటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. రాబోయే కాలంలో రాజ్యాంగ మార్పులు ఉంటాయనే అంశం ఆయన మాటల్లో ధ్వనించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకుడు అనంత కుమార్‌ హెగ్డే మాట్లాడుతూ బిజెపికి ఎన్నికలలో 400 స్థానాలు లభిస్తే లౌకిక విధానాన్ని రాజ్యాంగం నుంచి తొలగించడంతో పాటు రాజ్యాంగాన్ని సమూలంగా మార్పులు చేస్తామని చెప్పటం బిజెపి, సంఫ్‌ుపరివార్‌ ఆలోచనా విధానాన్ని తెలుపుతున్నది.
సర్వోన్నతమైన భారత రాజ్యాంగం
భారత రాజ్యాంగ పరిషత్‌ దాదాపు 3 సంవత్సరాలపాటు కృషి చేసి రాజ్యాంగాన్ని రూపొందించింది. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆధ్వర్యంలో ముసాయిదా కమిటీ 60 రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి రూపొందించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్‌ 1949 నవంబర్‌ 26న ఆమోదించింది. భారతదేశంలోని ‘భిన్నత్వాన్ని’ కాపాడవలసిన బాధ్యత రాజ్యాంగంపై వున్నదని డాక్టర్‌ అంబేద్కర్‌ 75 ఏళ్ల క్రితమే పేర్కొన్నారు. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు గ్రాన్‌విల్లే ఆస్టిన్‌ ‘భారత రాజ్యాంగాన్ని భారత ప్రజల చిరకాల స్వప్నం’గా వర్ణించాడు. రాజ్యాంగ నిర్మాతలు పీఠికలో రాజ్యాంగ లక్ష్యాలను, ఆదర్శాలను పొందుపరచటమే కాక ప్రాథమిక హక్కులను రాజ్యాంగం మూడవ భాగంలో, ఆదేశిక సూత్రాలను రాజ్యాంగం నాల్గవ భాగంలో చేర్చారు. ప్రాథమిక హక్కుల ద్వారా ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు, ఆదేశిక సూత్రాల ద్వారా సంక్షేమ రాజ్యస్థాపన జరగాలనీ అంబేద్కర్‌ ముసాయిదా కమిటీ సభ్యులు భావించారు. గత 75 ఏళ్లుగా దాదాపు 105 రాజ్యాంగ సవరణల ద్వారా, ఆ రాజ్యాంగంలో అనేక మార్పులు, చేర్పులు జరిగినప్పటికీ భారతదేశ ‘భిన్నత్వాన్ని’ కాపాడడంలో, దేశ సమగ్రత కొనసాగటంలో రాజ్యాంగం ముఖ్య పాత్ర పోషించింది. ఇప్పుడీ రాజ్యాంగంపైనే దాడి జరుగుతున్నది.
మౌలిక స్వరూపానికి ముప్పు
1973లో ప్రఖ్యాతి చెందిన కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌ నాయకత్వాన గల ధర్మాసనం ‘రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని’ (బేసిక్‌ స్ట్రక్చర్‌) వివరించింది. గత 5 దశాబ్దాలుగా కేశవానంద భారతి కేసు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరిస్తూ ‘ఫెడరలిజం, సెక్యులరిజం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయవ్యవస్థ’ మొదలగు అంశాలను పేర్కొన్నది. గత 50 ఏళ్లుగా సుప్రీంకోర్టు అనేక తీర్పులలో ‘మౌలిక స్వరూపాన్ని’ తిరిగి పేర్కొన్నది. ఇప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ముప్పు ఏర్పడే పరిస్థితులను నరేంద్ర మోడీ ప్రభుత్వం సృష్టిస్తున్నది.
రాజ్యాంగ వ్యవస్థలపై దాడి
గత పదేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తూ, వాటిని నిర్వీర్యం చేయటానికి ప్రయత్నం జరుగుతున్నది. మాంటెస్క్సూ ప్రతిపాదించిన అధికార పృథక్కరణ సిద్ధాంతం ప్రకారం కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖలు వేటి పరిథిలో అవి పని చేస్తూ, స్వతంత్రంగా వుంటూ సమన్వయంతో పని చేస్తూ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి. కాని ఆచరణలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్యనిర్వాహకవర్గం ఆధిక్యత ధోరణి కనబరుస్తూ శాసన నిర్మాణ శాఖకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పార్లమెంట్‌ సమావేశాలు సక్రమంగా నిర్వహించకపోవడం, సమావేశాలకు ప్రధాని ఎక్కువ రోజులు హాజరు కాకపోవటం, పార్లమెంట్‌ సమావేశాలు అవుతుండగా ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లడం జరుగుతున్నది. పార్లమెంట్‌లో బిల్లులపై సమగ్ర చర్చ జరగడం లేదు. మూడు వ్యవసాయ చట్టాలు ఆమెదించిన తీరే దీనికి నిదర్శనం. బిల్లులను సెలక్ట్‌ కమిటీలకుగాని, స్టాండింగ్‌ కమిటీలకు గాని నివేదించటం లేదు.
అనేక రాజ్యాంగ సంస్థలను తమ చెప్పుచేతలలో పెట్టుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలో 324వ నిబంధన ప్రకారం నియమించే ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్‌లను నియమించే ప్రక్రియను ఇటీవల పూర్తిగా మార్పు చేసి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియామక కమిటీ నుంచి తొలగిస్తూ చట్టసవరణ చేశారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల నియామకం, కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ నియామకాలలో సంఫ్‌ు పరివార్‌ భావజాలం వున్నవారిని నియమిస్తున్నారు. యు.జి.సి, ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి వంటి విద్యాపరమైన సంస్థలన్నీ తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోయాయి.
సామాజిక న్యాయం అవసరం లేదా?
రాజ్యాంగ నిర్మాతలు పీఠికలో ప్రజలందరికీ ‘సామాజిక న్యాయం’ జరగాలని పేర్కొన్నారు. దీని కోసం రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరిచారు. రాజ్యాంగం 5,6 షెడ్యూళ్లలో గిరిజనుల కోసం అనేక రక్షణలు కల్పించారు. షెడ్యూల్డ్‌ ప్రాంత ప్రజలకు అనేక హక్కులు ఇచ్చారు. రాజ్యాంగంలోని 16వ భాగంలో షెడ్యూల్‌ కులాలకు, తెగలకు, వెనకబడిన తరగతులకు రాజకీయ, విద్య, ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు కల్పించారు. మండల్‌ కమిషన్‌ నియామకం కూడా ఆ కాలంలో ఈ నిబంధనల ప్రకారమే జరిగింది.
కాని గత పదేళ్లుగా బిజెపి నాయకులు, సంఫ్‌ు పరివార్‌ నాయకులు చేస్తున్న ప్రకటనలను గమనిస్తే సామాజిక న్యాయానికి, రిజర్వేషన్లకు ఎంత వ్యతిరేకులో అర్ధం అవుతుంది. మనువాద ఆధారిత రాజ్యాంగం ఉండాలన్నది వారి లక్ష్యం. దేశంలో అనేక ప్రాంతాలలో మైనారిటీలు, దళితులపై దాడులు జరుగుతున్నాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటమేకాక, ఆందోళనలకు మద్దతు ఇస్తున్నారు. మణిపూర్‌లో గత సంవత్సర కాలంగా కుకీలు-మెయితీల మధ్య రిజర్వేషన్ల పేరుతో మణిపూర్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా చిచ్చురాజేశాయి. మణిపూర్‌లో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శతాబ్దాలుగా కొనసాగిన అణచివేతను సరిదిద్దటానికి సామాజిక న్యాయాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఒక ప్రధానమైన అంశంగా భావించబట్టి, తరువాతి కాలంలో రిజర్వేషన్‌ అమలుకు అనేక రాజ్యాంగ సవరణలు చేశారు. బిజెపి ఆలోచనా విధానం సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వున్నది.
లౌకిక విధానం వద్దంటున్న సంఘ్ పరివార్‌
బిజెపి సంఫ్‌ు పరివార్‌ విధానాలు లౌకిక విధానానికి విరుద్ధం. రాజ్యాంగంలో ‘లౌకిక’ (సెక్యులర్‌) అనే పదం ఉండటం వారికి అసలు నచ్చటం లేదు. రాజ్యాంగం రూపొందించినప్పుడు పీఠికలో ‘లౌకిక’ అనే పదం లేదని, 1976లో 42వ రాజ్యాంగం సవరణలతో చేర్చారని, దానిని తొలగించాలని, లౌకిక విధానం వద్దని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 1973లో కేశవానంద భారతి కేసులో, 1994లో ఎస్‌.ఆర్‌.బమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ‘లౌకికవాదం’ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని పేర్కొన్నది. రాజ్యాంగ నిర్మాతలు 25 నుంచి 28 వరకు నిబంధనలలో ప్రజలకు మత స్వేచ్ఛను కల్పించారు. 29,30 నిబంధనల ద్వారా మైనారిటీలు తమ విద్య, భాష, సంస్కృతిని అభివృద్ధి చేసుకోవటానికి అవకాశాలు కల్పించారు.
ప్రపంచంలో ఆధునిక రాజ్యాలన్నీ లౌకికరాజ్యాలే. లౌకిక విధానం లేకుండా ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్య విధానం కొనసాగదు. మత రాజ్యాలన్నింటిలో ప్రజాస్వామ్యం లేకపోవటం అనేక దేశాలలో గమనించవచ్చు. భారత దేశాన్ని ‘హిందూ మత ఆధిక్యత’ (హిందుత్వ) గల రాజ్యంగా మార్చాలన్న సంఘపరివార్‌ ఆలోచనా విధానం. అందువల్ల లౌకికవాదాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.
భారతదేశంలో 5 వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఉమ్మడి సంస్కృతి రూపుదిద్దుకున్నది. హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం, భౌద్ధం, జైనం, సిక్కు, పార్సీ మొదలగు మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలతో భారతీయ జీవన విధానం రూపొందింది. బ్రిటీష్‌ పాలకులు 1857 తిరుగుబాటు తరువాత ‘హిందు-ముస్లిం’ ఐక్యతను సహించలేకపోయారు. ‘విభజించు-పాలించు’ సిద్ధాంతంతో హిందూ-ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి, మతపరమైన విభేదాలు ప్రోత్సహించారు. ముస్లింలీగ్‌, హిందూ మహాసభ తదితర సంస్థలు ఏర్పడటానికి బ్రిటిష్‌ పాలకుల విధానాలే కారణం. ఈ విభజనే క్రమంగా పెరిగి 1947లో దేశవిభజనకు దారి తీయటం చరిత్ర సాక్షిగా మన కళ్ల ముందున్న సత్యం. సంఘ పరివార్‌ బ్రిటీష్‌ పాలకుల వలె ప్రజలలో మతపరమైన విభజన తేవటానికి జమ్మూకాశ్మీర్‌కు 370వ ఆర్టికల్‌ రద్దు, రామాలయ నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలు, మొదలగు వాటిని ముందుకు తెచ్చింది. ఇప్పుడు ఏక పౌరస్మృతి అమలు గురించి మాట్లాడటం కూడా మతపరమైన విభజనకే. లౌకికవాదాన్ని పరిరక్షించుకోవటమే భారత జ్రల సమైక్యతకు ఆలంబనగా ఉంటుంది.
న్యాయ వ్యవస్థపై ఒత్తిడి
గత పదేళ్లుగా న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచి, న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కొలీజియం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాలలో జోక్యం చేసుకుని తమకు అనుకూలమైన న్యాయమూర్తుల నియామకాలు జరిగే విధంగా ఒత్తిడి తెస్తున్నది. కొన్ని సందర్భాలలో కొలీజియం చేసే సిఫార్సులను ఆమోదించకుండా సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నది. తమకు అనుకూలమైన తీర్పులు చెప్పిన న్యాయమూర్తులను వారి పదవీకాలం పూర్తయిన వెంటనే వేరే ఉన్నత పదవులలో నియమిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వెంటనే జస్టిస్‌ రంజన్‌ గొగోరుని రాజ్యసభ సభ్యుడిగా పంపటం దీనికి పెద్ద ఉదాహరణ. రంజన్‌ గొగోరు అనేక కేసులలో మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు చెప్పారు. న్యాయవ్యవస్థ ఒత్తిడిలో ఉన్నది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ను రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటు చేసి న్యాయమూర్తుల నియామకాలు జరపవలసి ఉన్నది.
రాష్ట్రాల హక్కులకు విఘాతం
గత దశాబ్ద కాలంలో భారత సమాఖ్య ఒత్తిడికి గురవుతున్నది. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించి వేస్తున్నది. అధికార విభజనలో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై కూడా కేంద్రం చట్టాలు చేస్తూ రాష్ట్రాల అధికారాలపై దాడి చేస్తున్నది. పార్లమెంటు ద్వారా కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను చేయటం దీనికి పెద్ద ఉదాహరణ. రైతాంగ ఉద్యమం ద్వారా మాత్రమే చట్టాలను ఉపసంహరించుకున్నది. జి.యస్‌.టి ద్వారా రాష్ట్రాలు సుమారు 3 లక్షల కోట్లు నష్టపోయాయి. పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సులు కూడా కేంద్రానికి అనుకూలంగా ఉన్నాయి. అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను, తమకు అనుకూలంగా లేకపోతే గవర్నర్ల ద్వారా ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్‌, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయకపోవడంతో కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లవలసి వచ్చింది. రాష్ట్రాలలో భిన్నమైన రాజకీయ పార్టీలు గెలుపొంది అధికారంలో ఉండటం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సహించలేకపోతున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపించటమే దీనికి పెద్ద ఉదాహరణ. ‘ఇండియా’ బ్లాక్‌ ఏర్పడటాన్ని బిజెపి సహించలేకపోతున్నది. ఫెడరలిజంలో భిన్నమైన పార్టీలు అధికారంలో ఉండటం సహజమనే విషయం వారికి నచ్చటం లేదు.
ఏమి జరగాలి?
డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున మాట్లాడుతూ…’భారతదేశంలో భిన్నత్వాన్ని పరిరక్షించటానికి, భిన్న జాతుల, మతాల, కులాల, ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు పరిరక్షించటానికి’ అనేక చర్చలు చేయటం వలనే రాజ్యాంగ రచనకు మూడు సంవత్సరాలు పట్టిందని పేర్కొన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయటానికి ఈ నాటి పాలకులు పూనుకున్నారు. రాబోయే ఎన్నికలలో 400 స్థానాలు సంపాదించి, రాజ్యాంగాన్ని, మౌలిక స్వరూపాన్ని పూర్తిగా మార్చే ఉద్దేశంలో వున్నారు. వీటిని ఎదుర్కోవాలంటే రాబోయే ఎన్నికలలో మతతత్వ శక్తుల ఓటమికి పౌరసమాజం నుంచి మేథావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాలు, ప్రజలు కృషి చేయాల్సి వుంది. ఈ కృషి జరిగి రాజ్యాంగాన్ని సంరక్షించుకోవటమే డాక్టర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.

– కె.యస్‌.లక్ష్మణరావు

/ వ్యాసకర్త శాసనమండలి సభ్యులు, సెల్‌ : 8309965083 /

➡️