ఆధునిక భారతదేశంలో ప్రజల మనస్సుల్లో రెండు రకాల జాతీయ చైతన్యం ఉంటుందని, అందులో ఒకటి భాషా-ప్రాంతీయ జాతీయత-అంటే ఒక బెంగాలీగానో తమిళుడిగానో, ఒక గుజరాతీగానో, ఒక ఒడియాగానో-రెండవది యావత్ భారతదేశానికీ చెందిన భారత జాతీయతగా ఉంటాయని ప్రముఖ మార్క్సిస్టు పండితుడు లేటు అమలేందు గుహా ఎవ్వరూ కాదనలేని విధంగా వాదించారు. ఈ ద్వంద్వ స్వభావాన్ని గుర్తించి, ఆమోదించడం అవసరమని, ఈ రెండింటిలో ఏ ఒక్కదానిపైనో అతిగా నొక్కి రెండవదానిని విస్మరిస్తే చాలా ప్రమాదకరంగా ప్రతిస్పందనలు వస్తాయని ఆయన చెప్పాడు. అతిగా కేంద్రీకరణకు పూనుకోవడం అంటే విశాల భారత జాతీయత మీదనే ఎక్కువగా నొక్కడం అవుతుంది. అది దానికి వ్యతిరేకంగా ప్రతిచర్యలకు దారి తీస్తుంది. అది ప్రాంతీయ వేర్పాటువాదానికి, ఒక్కోసారి ఈ దేశం నుండే విడగొట్టుకోవాలనే ధోరణికి దారితీసి దేశ సమైక్యతకే ముప్పు తెస్తుంది.
ఇందిరా గాంధీ హయాంలో జరిగిన కేంద్రీకరణ-అందులో హిందూత్వ-నయా ఫాసిస్టు లక్షణాలేమీ లేవు-1980లలో అస్సాం వేర్పాటువాదానికి దారితీసిన నేపథ్యంలో అమలేందు గుహా తన వ్యాసాన్ని రచించారు. ఇప్పుడు నయా ఫాసిస్టు కేంద్రీకరణ మన ముందు అత్యంత దిగ్భ్రాంతికర వేగంతో ఆవిష్కరించబడుతున్న నేపథ్యంలో మళ్ళీ అటువంటి వేర్పాటువాద ప్రమాదమే దాని వెనుక పొంచివుంది.
ఫాసిజం ఎక్కడ ఏయే ప్రత్యేకతలతో ఉన్నప్పటికీ, అనివార్యంగా కేంద్రీకరణతో ముడిపడి వుంటుంది. నిజానికి నాయకుని పట్ల భక్తితో వ్యవహరించే దాని స్వభావం వలన అధికారం యొక్క మూలాలు తల్లకిందులౌతాయి. మామూలుగా ప్రజాస్వామ్యంలో అధికార మూలాలు ప్రజల దగ్గర మొదలౌతాయి. నాయకులంటే ఆ ప్రజలకు ప్రతినిధులుగా వ్యవహరించేవారుగా ఉంటారు. కాని ఫాసిస్టు పాలన ఉన్న చోట నాయకుడు తానే యావన్మంది ప్రజలకీ ప్రతినిధిని అని ప్రకటించుకుంటాడు. ఇక్కడ ప్రజలు అంటే వాస్తవ ప్రజానీకం కాదు. ఒక ఊహాజనితమైన ఉనికి (అది కూడా మొత్తం ప్రజలలో ఒక భాగం మాత్రమే) కలిగి వుంటారు. అంటే ఇక్కడ హిందువులు లేదా ఇంకొక దేశంలో మెజారిటీ జాతిగా ఉండేవారు ఎవరైనప్పటికీ, ప్రజల్లో కొంతమందిని ‘పరాయివారు’గా చిత్రించి వారిని మినహాయించి తక్కిన వారందరికీ ఏకైక ప్రతినిధి నాయకుడే ఔతాడు. ఆ నాయకుడే అధికారానికి మూలమూ, కేంద్రమూ కూడా ఔతాడు. ఈ విధంగా నిజమైన అధికారం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో, ఆ వాస్తవాన్ని తల్లకిందులు చేసేసినప్పుడు అనివార్యంగా అది కేంద్రీకరణ రూపంలో వ్యక్తం ఔతుంది. అందుచేత ఎన్డీయే ప్రభుత్వం ముందెన్నడూ లేని విధంగా చాలా ఎక్కువగా వనరులను, అధికారాన్ని కేంద్రీకరించడం ఆశ్చర్యాన్ని కలిగించదు.
నయా ఉదారవాదంతోబాటే కేంద్రీకరణ కూడా సాగుతుంది. స్వల్ప సంఖ్యలో ఉండే కార్పొరేట్-ఫైనాన్స్ గుత్తాధిపతులు నయా ఉదారవాద వ్యవస్థలో పెత్తనాన్ని చెలాయిస్తారు. తమకు అన్ని విధాలా లొంగివుండే ప్రభుత్వం చేతుల్లో అధికారాలు, వనరులు అన్నీ కేంద్రీకరించబడి వుండాలని వారు కోరుకుంటారు. ఐతే కార్పొరేట్-నయా ఫాసిస్టు కూటమి ఏర్పడడంతో, నయా ఉదారవాదం సంక్షోభంలో పడినప్పుడు, ఈ కేంద్రీకరణ క్రమం మరింత ఎక్కుగా బలపడుతుంది.
ఇక్కడ ఎక్కువ వివరాల్లోకి పోనవసరం లేదు. పాత అమ్మకపు పన్ను స్థానంలో ప్రవేశపెట్టిన జిఎస్‌టి వనరుల కేంద్రీకరణకు స్పష్టమైన ఉదాహరణ. రాజ్యాంగంలో ఈ అమ్మకపు పన్ను అనేది రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా పరిగణించబడింది. రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో దాదాపు 80 శాతం అమ్మకపు పన్ను ద్వారానే సమకూరేది. దాని స్థానంలో జిఎస్‌టి విధించినప్పుడు ముందుకు తెచ్చిన వాదనలు బూటకమైనవే అయినా, వాటికి నయా ఉదారవాదం అండ ఉంది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్)-ఇదే తర్వాత జిఎస్‌టి అయింది-విధిస్తే అప్పుడు పన్ను మీద పన్ను విధించే పరిస్థితి ఉండదని, అంతేగాక, ప్రతీ వస్తువు మీదా దేశమంతటా ఒకే రేటులో పన్ను విధిస్తే దాని వలన జాతీయ మార్కెట్ అంతా ఐక్యంగా రూపొందుతుందని దీనిని సమర్ధించినవారు వాదించారు. ఇలా దేశమంతటా ఒకే రేటు పన్ను విధించడానికి వేరు వేరు రాష్ట్ర ప్రభుత్వాల నుండి పన్ను విధించే అధికారాన్ని వేరే ఒక సంస్థకు అప్పగించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించే తమ అధికారాలను ఆ సంస్థకు కట్టబెట్టాలని వారు చెప్పారు. ఆ సంస్థే జిఎస్‌టి కౌన్సిల్. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలతోబాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాతినిధ్యం కలిగివుంటుంది.
జిఎస్‌టి ని సమర్ధిస్తూ చేసిన వాదనలు బూటకం అని చెప్పడానికి అమెరికా ఉదాహరణ చాలు. ప్రపంచంలోని అతి పెద్ద పెట్టుబడిదారీ దేశం అమెరికా. అక్కడ పన్ను రేట్లు రాష్ట్రాలను బట్టి మారుతూ వుంటాయి. అంటే అక్కడ సమాఖ్యతత్వం అమలు అవుతోందన్నమాట. అంతమాత్రాన అమెరికాలో ఏకీకృతమైన మార్కెట్ లేదని ఎవరూ అనలేరు. అలాగే వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు పన్ను రేట్లు ఉండడం అమెరికా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఆటంకం కాలేదు.
జిఎస్‌టి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాన్ని అవి ఒదులుకోవడమే. ఐతే అలా ఒదులుకోడానికి ఒక హామీ ఇచ్చి రాష్ట్రాలను ఒప్పించారు. జిఎస్‌టి అమలు మొదలైన సంవత్సరం నుండి పన్ను ఆదాయంలో ఆ యా రాష్ట్రాలకు కలిగే వృద్ధి గనుక 14 శాతం కన్నా తక్కువ ఉంటే ఆ కొరవను ఐదేళ్ళపాటు కేంద్రం భర్తీ చేస్తుందన్నదే ఆ హామీ. నిజానికి జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత కాలాన్ని ఆ ముందు కాలంతో పోల్చుకుంటే రాష్ట్ర జిఎస్‌టి (ఎస్‌జిఎస్‌టి) నుండి వచ్చే ఆదాయం, కేంద్రం నుండి వచ్చే నష్ట పరిహారం కలిపి పెరిగిన రేటు కన్నా జిఎస్‌టి ద్వారా వచ్చిన ఆదాయం పెరిగిన రేటు ఎక్కువగా ఉంది. అంటే జిఎస్‌టి వర్తించే సరుకుల మీద పాత విధానం ప్రకారమే రాష్ట్రాలు పన్నులు విధించివుంటే వాటికి ఎక్కువ ఆదాయం లభించి వుండేదన్నమాట. కేంద్రం ఇచ్చే నష్టపరిహారాన్ని కలుపుకున్నా, ఇంకా రాష్ట్రాలు నష్టపోతున్నాయి. అంతకన్నా ముఖ్యంగా రాష్ట్రాలు తమకు రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కును కోల్పోయాయి. ఇప్పుడు కేంద్రం ముందు అడుక్కు తినేవాళ్ళుగా మిగిలిపోయాయి. ఫెడరల్ స్వభావానికి ఇది తీవ్ర విఘాతం.
వనరుల కేంద్రీకరణతోబాటు అధికారాల కేంద్రీకరణ కూడా సాగుతోంది. ఇందుకు కేంద్రం నియమించే గవర్నర్లు ఒక సాధనంగా ఉపయోగపడుతున్నారు. నమ్మకమైన హిందూత్వవాదులో, లేకపోతే కేంద్రం చెప్పు చేతల్లో మెలిగే అధికారులో మాత్రమే ఈ మధ్య గవర్నర్లుగా నియమించబడుతున్నారు. దీనిని మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. గవర్నరు పదవి అనేది గౌరవ సూచకమైనదని, నామక: అధికారాలు మాత్రమే ఉంటాయని, ఆ పదవిలో రిటైరైన రాజకీయ నాయకులనో, అధికారులనో నియమించడం వలన పెద్ద ప్రమాదం ఏమీ లేదని అనుకున్నారు. కాని ఈ మధ్య కాలంలో గవర్నర్లు అన్ని వ్యవహారాల్లో వేలు పెడుతూ ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వపు కార్యకలాపాలకు ఆటంకంగా తయారౌతున్నారు.
గవర్నర్లు ఈ విధంగా వ్యవహరిస్తున్న ఒక కీలకమైన రంగం విశ్వవిద్యాలయాలు. ఇక్కడ గవర్నర్లు చాన్సలర్లుగా వ్యవహరిస్తారు. అదొక గౌరవపూర్వకమైన హోదాయే. ఆ హోదాలో గవర్నరు వైస్ చాన్సలర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. కాని ఇప్పుడు వైస్ చాన్సలర్ల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా గవర్నర్లే తమకు నచ్చినవారిని నియమిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నియమించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌లో అందరూ కేంద్రానికి విశ్వాసంగా మెలిగేవారే ఉంటారు. ఆ సంస్థ ఇటీవల కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించింది. అవి అమలైతే దేశంలో ఉన్నత విద్య చాలా తీవ్రంగా దెబ్బ తింటుంది. ఐతే ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రమే తీసుకుందాం. ఆ మార్గదర్శకాలలో రాష్ట్రాల యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్లను నియమించడంలో రాష్ట్రాలకు ఏ పాత్రా లేకుండా పోయింది.
ఇంతవరకూ అమలులో ఉన్న పద్ధతి ప్రకారం వైస్ చాన్సలర్‌ను నియమించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు అవుతుంది. ఆ కమిటీలో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఇద్దరు ఉంటారు. ఒకర్ని చాన్సలర్, అంటే గవర్నర్ నియమిస్తారు. మామూలుగా అయితే ఈ విషయంలో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తారు. కాని ఇప్పుడు యుజిసి మార్గదర్శకాల ముసాయిదా ప్రకారం ముగ్గురు సెర్చ్ కమిటీ సభ్యులలో ఒకర్ని యుజిసి, ఒకర్ని గవర్నర్, ఒకర్ని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియమిస్తారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన పనే లేదు. అంటే వైస్ చాన్సలర్ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్రా లేదు. ఆ యూనివర్సిటీలకు నిధులు మాత్రం రాష్ట్రమే సమకూర్చాలి. వైస్ చాన్సలర్‌ను మాత్రం యుజిసి రూపంలోను, గవర్నర్ రూపంలోను కేంద్రమే నిర్ణయిస్తుంది.
ఉన్నత విద్యా రంగంలో కేంద్రం రాష్ట్రాలమీద పగ సాధిస్తున్న రీతిలో కేంద్రీకరణకు పాల్పడుతోంది.
రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా గవర్నర్లు స్వతంత్రంగా వ్యవహరించడం అనేది రాజ్యాంగంలో పేర్కొన్నదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా పూర్తి విరుద్ధం. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టల్లా వ్యవహరిస్తూ గవర్నర్లు రాజకీయ వ్యవస్థను కేంద్రీకరణ వైపు వేగంగా నెడుతున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం మీద పెత్తనం చెలాయించడం ద్వారా గవర్నర్లు ప్రజల ఆదేశాన్ని తృణీకరిస్తున్నారు. ఎన్నికల ద్వారా నియామకం కాని గవర్నర్ ఎన్నికైన ప్రభుత్వాన్ని, దాని నిర్ణయాలను కాదని స్వతంత్రంగా వ్యవహరించడం అంటే అది ప్రజాస్వామ్యం మీద దాడి అవుతుంది. ఈ విధమైన దాడి కొనసాగితే దానికి ప్రతిచర్యగా వచ్చే పరిణామాలు దేశ స్థిరత్వాన్నే ప్రమాదంలో పడవేస్తాయి.
కేంద్రం, రాష్ట్రాల నడుమ వనరులను, అధికారాలను వేరు చేసి వుంచడంలో రాజ్యాంగం చాలా శ్రద్ధ చూపింది. ఒక స్వతంత్రమైన ప్రతిపత్తి ఉన్న ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పరచడం ఈ సమ తూకాన్ని పాటించడం కోసమే. ఆధునిక భారతదేశ ప్రజల ద్వంద్వ జాతీయ చైతన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాటు చేశారు. కేంద్రీకరణ అంటే రాష్ట్ర ప్రభుత్వాలను అణచివేయడం. అంటే భాషా-ప్రాంతీయ చైతన్యానికి విలువనివ్వకుండా నిరాకరించడమే. రాజ్యాంగపు ఈ స్ఫూర్తిని ఉల్లంఘించడం వలన చాలా తీవ్ర పరిణామాలు జరుగుతాయి. కాని ముందుచూపు లోపించిన ఈ కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రమాదాలేవీ కనిపించడం లేదు.
( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్ పట్నాయక్