రాష్ట్రంలో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్.ఆర్.ఇ.డి.సి.ఎ.పి) ద్వారా 7,400 మెగావాట్ల సామర్థ్యంతో పంప్ట్ స్టోరేజి పవర్ ప్రాజెక్టులకు 2019 నుండి 2025 మధ్య రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఉత్తరాంధ్ర ‘ఏజెన్సీ’ ప్రాంతాలలో-రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లోని ఆదివాసీలను, ఇతర పేదలను వారి ఆవాసాల నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడం దారుణం.
హైడ్రో పవర్ ప్రాజెక్టు సామర్థ్యం-కేటాయింపు
పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు మండలంలో కురుకుట్టి పి.ఎస్.పి (1,200 మెగావాట్లు), పాచిపెంట మండలంలో కర్రివలస పి.ఎస్.పి (1,000 మెగావాట్లు) ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలంలోని పెదకోట పి.ఎస్.పి 2024 ఆగస్టులో దాని సామర్థ్యాన్ని 1,500 మెగావాట్లు నుండి 1,800 మెగావాట్లకి పెంచింది. నవయుగ కంపెనీకి గుజ్జిలి పి.ఎస్.పి (1,500 మెగావాట్లు), చిట్టాంపాడు పి.ఎస్.పి (800 మెగావాట్లు) కేటాయించారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు చింతపల్లి, కొయ్యూరు మండలాల్లోని యర్రవరం పి.ఎస్.పి (1,200 మెగావాట్లు) కేటాయించారు.
హైడ్రో పవర్ ప్రాజెక్టుపై గోప్యత ఎందుకు?
1/70 చట్టాన్ని, ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో వర్తించే వివిధ రాజ్యాంగ నిబంధనలను బహిరంగంగా ధిక్కరిస్తూ ఈ ప్రాజెక్టులకు అనుమతించిన తీరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీటిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీల షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు నియమాలు (పెసా), అటవీ హక్కుల చట్టం (ఎఫ్.ఆర్.ఏ) ఉన్నాయి. ముఖ్యంగా పెసా లోని సెక్షన్ 5 ప్రకారం ఏదైనా భూసేకరణకు ముందు, ప్రభుత్వం వివరణాత్మక ప్రాజెక్ట్ సమాచారాన్ని మండల ప్రజా పరిషత్‌కి సమర్పించాలి. ఈ సమాచారంలో సమగ్ర ప్రాజెక్ట్ రూపురేఖలు, సామాజిక ప్రభావాలు, భూసేకరణ ప్రత్యేకతలు, కొత్త స్థిరనివాసుల గురించి సమాచారం, వారి తెగలపై సామాజిక ప్రభావం, ప్రభావిత వర్గాలకు ప్రతిపాదిత పరిహారం వంటివి ఉండాలి. అప్పుడు ఎంపిపి చట్టబద్ధంగా ప్రభావిత గ్రామ పంచాయతీ, గ్రామ సభలతో సంప్రదించి వారి అంచనాలు, సిఫార్సులను సేకరించాలి. ఈ సంప్రదింపుల తర్వాత, ఎం.పి.పి ఈ సిఫార్సులను ఏకీకృతం చేసి, భూసేకరణ అధికారికి తుది సిఫార్సును సమర్పించాలి. వారు ఈ సిఫార్సులకు కట్టుబడి ఉండాలి. లేదా తేడా చేస్తే వివరణాత్మక రాతపూర్వక సమాధానం అందించాలి. ఎఫ్.ఆర్.ఏ లోని సెక్షన్ 6, వ్యక్తిగత, కమ్యూనిటీ అటవీ హక్కులను నిర్ణయించే ప్రక్రియను ప్రారంభించడానికి, పర్యవేక్షించడానికి గ్రామసభను ప్రాథమిక అధికారంగా స్పష్టంగా పేర్కొంటుంది. అటవీ భూమిని లేదా అటవీ నివాసుల హక్కులను ప్రభావితం చేసే ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభం నుండే గ్రామసభ పాల్గొనాలని ఎఫ్.ఆర్.ఏ నిర్దేశిస్తుంది. అంతేకాకుండా, ఎఫ్.ఆర్.ఏ లోని సెక్షన్ 4(డి) కమ్యూనిటీ అటవీ వనరులను నియంత్రించడానికి, వన్యప్రాణులు-జీవవైవిధ్య రక్షణకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి గ్రామసభ అధికారాన్ని బలోపేతం చేస్తుంది. ఆదివాసీ తెగలు, కంపెనీలైన వాటాదారులు ఈ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని నిర్దేశిస్తుంది. ఈ సంప్రదింపుల ప్రక్రియను దాటవేశారు. ఈ పి.ఎస్.పి లకు సంబంధించి, ఎటువంటి సమాచారం అందించబడలేదు. ఎటువంటి చర్చ జరగలేదు. పారదర్శకత లేదు. ఈ ప్రాంతాల్లోని ఆదివాసీలకు ఉద్దేశపూర్వకంగా దీన్ని గోప్యంగా ఉంచారు. ఆదివాసీ తెగల నుండి సంప్రదింపులు, సమ్మతి లేకపోవడాన్ని మనం గమనించాలి.
షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూమిని లీజుకు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ భూ బదిలీ నియంత్రణ (ఎల్.టి.ఆర్) చట్టం ద్వారా నిషేధం. షెడ్యూల్డ్ ప్రాంతాలలో ప్రైవేట్ సంస్థలు ప్రాజెక్టులను చేపట్టలేవని సుప్రీంకోర్టు 1997 సమతా కేసులో పేర్కొంది. అంతేకాకుండా, ఇది చట్టబద్ధమైన అవసరం అయినప్పటికీ, గిరిజన సలహా మండలి (టి.ఎ.సి)లో ఈ ప్రాజెక్టులపై చర్చ, ముందస్తు సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికీ టి.ఎ.సి ని నియమించలేదు. ఈ ఆరు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వల్ల కలిగే భారీ స్థాయి స్థానభ్రంశం గురించి, ఆదివాసీ తెగ వర్గాల జీవనోపాధిని కోల్పోయే అవకాశం గురించి ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తుంది.
అటవీ, వ్యవసాయ భూమి సేకరణ
యర్రవరం ప్రాజెక్టుకు అత్యధికంగా 735.63 ఎకరాలు, తరువాత గుజ్జిలి 673.13 ఎకరాలు, పెదకోట 499.44 ఎకరాలు, కురుకుట్టి 422.99 ఎకరాలు, కర్రివలస 377.99, చిట్టంపాడు 500 ఎకరాలు అవసరం. మొత్తం ఉద్దేశించిన 3,361.35 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వ ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ వాస్తవానికి సుమారు పది వేల ఎకరాల అటవీ, వ్యవసాయ భూమికి నష్టం జరిగే అవకాశం ఉందని ఆదివాసీ తెగలు పేర్కొంటున్నాయి.
భూసేకరణ సమస్యకు మించి, స్థానిక నీటి వనరులపై ప్రాజెక్టులు ఆధారపడటం వలన నీటి భద్రత గురించి, ఈ వనరులపై ఆధారపడిన ఆదివాసీ తెగలు, దిగువ రైతులపై దాని సామాజిక ప్రభావం గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. ఈ పి.ఎస్.పి లలో ప్రతి ఒక్కటి ఎగువ, దిగువ జలాశయాన్ని నిర్మిస్తారు. దీనికి చాలా పెద్ద మొత్తంలో భూమి అవసరం. వరద ఉధృతితో వేలాది ఎకరాల అటవీ,వ్యవసాయ భూమి మునిగే అవకాశాలు చాలా ఎక్కువ.
నీటి భద్రత-ఆందోళన
కురుకుట్టి, కర్రివలస పి.ఎస్.పి లు రెండూ బోదురుగెడ్డ నది నుండి నీటిని తీసుకోవడానికి నిర్ణయించబడ్డాయి. ఇది ఒడిశాలో ఉద్భవించి, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి, నాగావళి నది పరీవాహక ప్రాంతంలోని సువర్ణముఖి నదిలో కలుస్తుంది. ఈ రెండు ప్రాజెక్టులు ఈ నదిపై నిర్మించిన దిగువ జలాశయాన్ని పంచుకుంటాయి. అదే సమయంలో, ఎర్రవరం (పి.ఎస్.పి) ఎర్రవరం, గనగుల గ్రామాల మధ్య ప్రవహించే ఒక చిన్న, పేరులేని ప్రవాహం నుండి నీటిని పొందాలని నిర్ణయించారు. నీరు తగ్గి చివరికి తాండవ జలాశయం ఖాళీ అవుతుంది. దిగువ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
శారద నదిలోకి ప్రవహించే రెండు చిన్న ప్రవాహాల నుండి నీటిని తీసుకునే ఓపెన్-లూప్ వ్యవస్థగా మొదట భావించిన గుజ్జిలి పి.ఎస్.పి, తరువాత పర్యావరణ సమస్యలకు ప్రతిస్పందనగా క్లోజ్డ్-లూప్ వ్యవస్థగా పున:రూపకల్పన చేయబడింది. ఇది ఇప్పుడు దిగువ జలాశయం నుండి 6.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనాం జలాశయం నుండి నీటిని ఉపయోగించుకుంటుంది. బొడ్డేరు నదిపై నిర్మించిన కోనాం జలాశయం ప్రస్తుతం 12,638 ఎకరాల సాగునీటి ప్రాంతానికి సేవలు అందిస్తుంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఈ పి.ఎస్.పి కి దిగువ జలాశయంగా పనిచేస్తుంది. అదేవిధంగా, పెదకోట పి.ఎస్.పి యొక్క నీటి వనరు కూడా పర్యావరణ పరిగణనల కారణంగా మార్చబడింది. ప్రారంభంలో బొడ్డేరు నది (శారద నది ఉపనది)పై దిగువ జలాశయంతో ఓపెన్-లూప్ వ్యవస్థగా రూపొందించబడిన దీనిని క్లోజ్డ్-లూప్ వ్యవస్థగా సవరించారు. బొడ్డేరు నది యొక్క సహజ ప్రవాహాన్ని కాపాడటానికి కోనం జలాశయాన్ని దాని నీటి వనరుగా ఉపయోగించుకోవడానికి కూడా ఉద్దేశించబడింది.
గుజ్జిలి, పెదకోట పి.ఎస్.పి లను క్లోజ్డ్-లూప్ వ్యవస్థలుగా పున:రూపకల్పన చేసినప్పటికీ, పర్యావరణ ప్రభావంపై ఆందోళనలు కల్గిస్తోంది. పెదకోట ప్రాజెక్ట్‌ను క్లోజ్డ్-లూప్ వ్యవస్థగా పున:రూపకల్పన చేసినప్పటికీ, నిపుణుల అంచనా కమిటీ (ఇ.ఎ.సి) బొడ్డేరు నదిపై దాని దిగువ జలాశయం ఉన్నందున దీనిని ఓపెన్-లూప్ ప్రాజెక్ట్‌గా మార్చారు. తత్ఫలితంగా, ప్రాజెక్ట్ ప్రతిపాదకులు కేంద్ర విద్యుత్ అధారిటీ (సి.ఇ.ఏ), కేంద్ర జల సంఘం (సి.డబ్ల్యు.సి) నుండి ఆమోదాల కోసం దీనిని ఓపెన్-లూప్ వ్యవస్థగా పరిగణించి వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డి.పి.ఆర్)ను సిద్ధం చేయాలని ఇ.ఎ.సి సిఫార్సు చేసింది.
ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టులలో ఆదివాసీలు తమ జీవనోపాధి కోసం-గృహ అవసరాలు, వ్యవసాయం కోసం ఉపయోగించే స్థానిక వనరుల నుండి నీటిని తీసుకోవడం జరుగుతుంది. ఈ వాగులు, నీటి వనరులు వివిధ జలాశయాలకు క్యాచ్‌మెంట్‌లో భాగమని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. వాస్తవానికి, ఇది ప్రాజెక్టు ప్రాంతాల సమీపంలోని ఆదివాసీల నీటి భద్రతపై మాత్రమే కాకుండా, మైదానాల్లోని రైతులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రాజెక్టుల నీటి డిమాండ్ల విస్తృత ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం, ఆరు ప్రాజెక్టులకు సంబంధించిన డి.పి.ఆర్ లు తుది దశలో ఉన్నాయి. అయితే కురుకుట్టి, కర్రివలస ప్రాజెక్టులు పొరుగు రాష్ట్రమైన ఒడిశాతో సరిహద్దు వివాదాల రూపంలో అదనపు అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. అయితే బలమైన స్థానిక వ్యతిరేకత కారణంగా యెర్రవరం ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. మిగిలిన ప్రాజెక్టు బాధిత ఆదివాసీ తెగలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీల దోపిడికి అడ్డుగా వున్న రాజ్యాంగ హక్కులను సవరించాలని, రద్దు చేయాలని బాహాటంగానే ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆదివాసీలు అప్రమత్తంగా వుండి చట్టాలు, హక్కులను రక్షించుకోవాలి.
- వ్యాసకర్త : పి. అప్పలనర్స, గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, సెల్ : 9490300917