వ్యవసాయ విద్యుత్‌-కొత్త డిస్కాం-పర్యవసానాలు

May 18,2024 05:25 #editpage

/ నిన్నటి తరువాయి /

కమిషన్‌ ఇచ్చిన చార్జీల ఉత్తర్వు ప్రకారం 2024-25లో రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు 11299 మి.యూ అవసరం. ఎల్‌.టి, హెచ్‌.టి కేటగిరీలలో వ్యవసాయానికి, అనుబంధ కేటగిరీలకు కలిపి మొత్తం 18279 మి.యూ అవసరం. కమిషన్‌ నిర్ధారణ ప్రకారం డిస్కాంలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లభించే సంప్రదాయేతర, ఆర్‌.ఇ 17578 మి.యూ. ఇందులో సెప్టెంబరు నుండి వచ్చే ఏడాది మార్చి వరకు ‘సెకి’ నుండి లభించే సౌర విద్యుత్‌ 3204 మి.యూ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లభించే జల విద్యుత్‌ కలిపి ఇది 21452 మి.యూ అని కమిషన్‌ నిర్ధారించింది. ‘సెకి’ సరఫరా చేసే విద్యుత్‌తోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అవసరాన్ని తీర్చాలంటే కొత్త డిస్కాంకు 2026-27 నుండే సాధ్యమవుతుంది. రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ, దాని అనుబంధ కేటగిరీలను కొత్త డిస్కాం పరిధిలోకి తెస్తే, దానికి ఇంకా అదనంగా విద్యుత్‌ అవసరమవుతుంది. కొత్త డిస్కాం కింద చేయబోయే ఏర్పాటును బట్టి ప్రస్తుత డిస్కాంలపై దాని ప్రభావం ఎలా ఉంటుందనేది పరిశీలించాల్సి వస్తుంది. ప్రస్తుత డిస్కాంల కిందనున్న కేటగిరీలను కొత్త డిస్కాం పరిధిలోకి తీసుకు వచ్చిన మేరకు ప్రస్తుత డిస్కాంల డిమాండు తగ్గుతుంది. ఆ మేరకు పంపిణీ నష్టాలు కూడా తగ్గి, అవి కొనుగోలు చేసే ఆర్‌.ఇ శాతంగా పెరుగుతుంది. 2027-28 నుండి ప్రస్తుత మూడు డిస్కాంలు కనీసం ఏ మేరకు ఆర్‌.ఇ కొనుగోలు చేసి తీరాల్సి వస్తుందనేది ఆ సంవత్సరం నుండి అమలులోకి వచ్చే విధంగా భవిష్యత్‌లో కమిషన్‌ జారీ చేసే ఆర్‌పిపిఓపై ఆధారపడి ఉంటుంది.
కొత్త డిస్కాం పరిధిలోకి తెచ్చే కేటగిరీల డిమాండు మేరకు ప్రస్తుత డిస్కాంల డిమాండు తగ్గుతుంది. ఆ విధంగా మిగులు విద్యుత్‌ పెరిగిన మేరకు ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించి, ఆ మేరకు కొనుగోలు చేయని విద్యుత్‌కు స్థిర చార్జీల భారాన్ని మూడు డిస్కాంల వినియోగదారులపై మోపాల్సి వస్తుంది. 17000 మి.యూ సౌర విద్యుత్‌ను కొత్త డిస్కాంకు బదిలీ చేశాక, ప్రస్తుత మూడు డిస్కాంల పరిధిలో అమలులో ఉన్న పిపిఎల ప్రకారం సగటున యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు వ్యయం పెరుగుతుంది. దానితో పాటు మూడు విద్యుత్‌ పంపిణీ కంపెనీల పరిధిలోని కేటగిరీల వినియోగదారులకు యూనిట్‌కు కాస్ట్‌ ఆఫ్‌ సర్వీస్‌ (సిఒఎస్‌) పెరుగుతుంది. తత్ఫలితంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీగాని, చార్జీలుగాని, రెండూగాని పెరుగుతాయి.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పొందుతున్న వినియోగదారులకు ఏ ప్రాజెక్టుల నుండి ఎంత విద్యుత్‌ను ఏ ధరలకు కొంటున్నారు? ఏ డిస్కాం ద్వారా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారనే వాటి వల్ల ఉచిత విద్యుత్‌ విధానం కొనసాగినంత కాలం తేడా ఏమీ ఉండదు. అయితే, విద్యుత్‌ పంపిణీ ప్రైవేటీకరణ, నేరుగా ప్రయోజనం బదిలీ (డిబిటి) అమలు జరిగితే పర్యవసానాలు ఎలా ఉంటాయనేది చూడాలి. ప్రైవేటు డిస్కాంలను మోడీ ప్రభుత్వ విధానం ప్రకారం అనుమతిస్తే, వాటి పరిధిలో వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్‌ పంపిణీ చేయాల్సిన బాధ్యత కొత్త డిస్కాం ఏర్పాటు వల్ల వాటికి ఉండదు. అధిక లాభాలు వచ్చే ప్రాంతాల, కేటగిరీల వినియోగదారులు ప్రైవేటు డిస్కాంల పరిధిలోకి వచ్చే మేరకు ప్రస్తుత మూడు డిస్కాంల డిమాండు ఆ మేరకు తగ్గి, మిగులు విద్యుత్‌, దానితో ముడిపడిన భారాలు వినియోగదారులకు పెరుగుతాయి. క్రాస్‌ సబ్సిడీ ఆదాయం, లాభాలు తగ్గుతాయి. మెరిట్‌ ఆర్డర్‌ డిస్పాచ్‌ సూత్రం ప్రకారం ప్రధానంగా ఎ.పి జెన్కో ధర్మల్‌ ప్రాజెక్టుల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గించాల్సి వస్తుంది. జెన్కో, డిస్కాంలకు సిబ్బంది అవసరం తగ్గి, వారి ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అవి ఆర్థిక సంక్షోభంలో పడే ముప్పు ఏర్పడుతుంది.
కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ 2005 జూన్‌ 8న జారీ చేసిన విద్యుత్‌ నిబంధనల ప్రకారం, సిఇఆర్‌సి నిర్ణయించిన చార్జీలను రాష్ట్ర కమిషన్‌ మార్చగూడదు. సిఇఆర్‌సి నిర్ణయించిన చార్జీలను పరిగణించి సంబంధిత ప్రాజెక్టు నుండి డిస్కాంలు విద్యుత్‌ కొనుగోలు చేయవచ్చా అనేది రాష్ట్ర కమిషన్‌ నిర్ణయించవచ్చు. అయితే ‘సెకి’ విషయంలో సిఇఆర్‌సి చార్జీలను నిర్ణయించక ముందే ఎపిఇఆర్‌సి డిస్కాంలు ఆ విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సెయిల్‌ పి1 నుండి 625 మె.వా విద్యుత్‌ కొనుగోలుకు కమిషన్‌ షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తీరును గత జనవరి 29న జరిగిన బహిరంగ విచారణలో మేము ప్రశ్నించగా, కొత్తగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకునే ముందు తమ అనుమతి పొందాలని గత కమిషన్‌ ఆదేశం జారీ చేసిందని, ఆ ఆదేశం చట్ట విరుద్ధమైనదని కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సి.వి.నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. అయితే, ఆ ఆదేశం ఉన్నది గనుక దాని ప్రకారం ‘సెయిల్‌’ నుండి విద్యుత్‌ కొనుగోలుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చామని ఆయన చెప్పారు. గత కమిషన్‌ ఇచ్చిన ఆదేశం చట విరుద్ధమైనపుడు, ప్రస్తుత కమిషన్‌ దానిని పాటించకుండా, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకునేందుకు కమిషన్‌లో ముందస్తు అనుమతి డిస్కాంలకు అవసరం లేదని ఆదేశం ఇచ్చేందుకు అడ్డంకి ఏమీ లేదు. డిస్కాంలు కమిషన్‌లో పిపిఎ, సంబంధిత ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం, చార్జీలు, ఆ విద్యుత్‌ అవసరాన్ని వివరిస్తూ, సంబంధిత పత్రాలతో పిటిషన్‌ దాఖలు చేసినపుడే, కమిషన్‌ వాటిని తన వెబ్‌సైట్లో ఉంచి, ఆసక్తిగల వారి నుండి నివేదనలను ఆహ్వానించి, వాటిపై బహిరంగ విచారణ జరిపి, ఉత్తర్వులు ఇచ్చే విధానం 25 ఏళ్ళుగా అమలు జరుగుతున్నది. సెయిల్‌, సెకి వ్యవహారాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి. ‘సెకి’ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను, ఒప్పందాలను బహిర్గతం చేయకుండా, బహిరంగ విచారణలు జరపకుండా కమిషన్‌ పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యం సూత్రాలకు తిలోదకాలిచ్చింది. చార్జీలు, ట్రూఅప్‌ క్లెయిములపై తప్ప మిగిలిన అంశాలపై బహిరంగ విచారణలు అవసరమని చట్టంలో లేదని తన పత్రికా పకటనలో పేర్కొన్న కమిషన్‌ 25 ఏళ్ళుగా ఎపిఇఆర్‌సి అనుసరిస్తున్న విధానాలను విస్మరిస్తున్నది. విద్యుత్‌ చట్టం-2003 ప్రకారం తన అధికారాలను వినియోగించేటపుడు, విధులను నిర్వర్తించేటపుడు, రాష్ట్ర కమిషన్‌ పారదర్శకత ఉండేటట్లు చూడాలి (సెక్షన్‌ 86(3)). కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో అదానీ గ్రూపుకు ఎడాపెడా ప్రయోజనాలు చేకూరుస్తున్న, వాస్తవాలను మరుగు పరుస్తున్న, అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై విచారణకు చర్యలు తీసుకోకుండా దాటవేస్తున్న నేపథ్యంలో ‘సెకి’ వ్యవహారంలో ఎపిఇఆర్‌సి వ్యవహరించిన తీరును చూడాలి.


ఎం.వేణుగోపాలరావు

/వ్యాసకర్త విద్యుత్‌ రంగ నిపుణులు/

➡️