లౌకిక రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్‌కు నివాళి

Apr 13,2025 05:10 #Ambedkar, #Articles, #edit page

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలోనే రాజ్యాంగ మౌలిక స్వరూప అంశాలైన ఫెడరలిజం, లౌకికవాదం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, న్యాయశాఖ స్వతంత్రత మొదలైన వాటిని కాపాడుకోవాలనే చర్చ విస్తృత స్థాయిలో జరుగుతున్నది. గవర్నర్ల అధికారాలు, వక్ఫ్‌ చట్టం, జమిలి ఎన్నికలు, డీలిమిటేషన్‌ మొదలైన అంశాలపై కూడా అనేక అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీనికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఏ ప్రభుత్వం, ప్రత్యేకించి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి…. రాజ్యాంగ మౌలిక అంశాలపై దాడి చేయటమే.

రాజ్యాంగ మౌలిక స్వరూపం

1973లో భారత సుప్రీంకోర్టు కేశవనాంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్పు చేసే అధికారం పార్లమెంట్‌కు లేదని చెప్పింది. మౌలిక స్వరూప లక్షణాలుగా ఫెడరలిజం, లౌకికవాదం, రాజ్యాంగ ఆధిక్యత, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, న్యాయశాఖ స్వతంత్రత మొదలగు వాటిని తెలిపింది. గత పదేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తున్నది.

ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం

రాజ్యాంగంలోని ఒకటవ నిబంధన భారతదేశాన్ని ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ గా పేర్కొన్నది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు ప్రాధాన్యత కలిగి ఉండాలని చెప్పింది. రాజ్యాంగం ఏడవ షెడ్యూల్‌లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా అధికారాలను కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజించింది. కేంద్రం గత పదేళ్లుగా రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లోకి తీసుకుంటున్నది. జిఎస్‌టి ద్వారా రాష్ట్రాల ఆర్థిక వనరులు కేంద్రం చేతుల్లోకి వెళ్లాయి. జిఎస్‌టి వలన రాష్ట్రాలు రూ.3 లక్షల కోట్లు నష్టపోయాయి. ఆర్థిక సంఘాలు చేసే సిఫార్సులను కేంద్రం తన ఇష్టానుసారంగా అమలు చేస్తున్నది. రాష్ట్ర జాబితాలోగల వ్యవసాయంపై కేంద్రం చట్టాలు చేయడం ఫెడరలిజానికి పూర్తి విరుద్ధం. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 400 రోజులుపైగా ఆందోళన చేశారు. జాతీయ విద్యావిధానం-2020 కూడా రాష్ట్రాలతో సంప్రదించకుండానే ప్రకటించారు.
సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బంది పెడుతున్నది. తమిళనాడు గవర్నర్‌ రవి అనేక బిల్లులను ఆమోదించక పోవడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు నిధుల మంజూరులో కూడా కేంద్రం వివక్షత చూపుతున్నది. ఫెడరలిజాన్ని సంరక్షించుకుంటేనే దేశ సమైక్యత, సమగ్రత కొనసాగుతుంది.

లౌకికవాదం

భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. ప్రజలకు మత స్వేచ్ఛను కల్పించింది. రాజ్యాంగంలో 25 నుండి 28 నిబంధనలు మత స్వేచ్ఛకు ప్రాతిపదికగా ఉన్నాయి. రాజ్యాంగంలో 29, 30 నిబంధనలు మైనారిటీలకు హక్కులు కల్పించాయి. మైనారిటీలు తమ సంస్కృతి, భాష, లిపి, విద్య మొదలగు వాటిని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించింది. లౌకికవాదానికి భిన్నంగా ప్రజల మధ్య మతపరమైన విభజన తేవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే 370వ నిబంధన రద్దు చేయడం, మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించే ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సిఎఎ) చేయడం మతపరమైన విభజన కోసమే. మైనారిటీ ప్రజల హక్కులపై దాడిలో భాగంగా ఇటీవల ‘వక్ఫ్‌ బిల్లులు’ ఆమోదించి మైనారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. వక్ఫ్‌ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. గోరక్షక దళాల పేరుతో మైనారిటీలు, దళితులపై దాడులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘మతతత్వాన్ని’ రెచ్చగొట్టి ప్రజలలో మతపరమైన విభజన తేవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చరిత్రను వక్రీకరించి మతపరమైన భావజాలంతో సిలబస్‌ను, పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నారు. ప్రత్యేకించి మొఘల్‌ చక్రవర్తుల పరిపాలనపై దాడి చేస్తున్నారు. మొఘలుల చరిత్ర లేకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమాల ద్వారా కూడా మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశానికి లౌకిక స్వభావాన్ని కల్పించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉన్నది.

జమిలి ఎన్నికలు

నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికల కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయకత్వాన కమిటీ వేసింది. ఆ కమిటీ జమిలి ఎన్నికలను సిఫార్సు చేసింది. జమిలి ఎన్నికలు రాజకీయ నియంతృత్వానికి దారితీస్తాయని రాజ్యాంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. భారతదేశంలో చారిత్రకంగా బహుపార్టీ విధానం రూపుదిద్దుకున్నది. గత 5 దశాబ్దాలుగా భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే, రాష్ట్రాలలో భిన్నమైన పార్టీలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటున్నాయి. భారతదేశంలో ప్రాంతీయ, సామాజిక ఆంక్షలు పెరిగాయి. కార్పొరేట్‌ శక్తుల అండదండలతో బిజెపిని కేంద్రంలోను, అన్ని రాష్ట్రాలలోను అధికారంలోకి తేవటానికి జమిలి ఎన్నికలు దోహదపడతాయని నరేంద్ర మోడి, అమిత్‌ షా ద్వయం భావిస్తున్నారు. జమిలి ఎన్నికలు రాజ్యాంగ, ఫెడరల్‌ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.

డీలిమిటేషన్‌ ప్రక్రియ

ప్రస్తుతం దేశంలో డీలిమిటేషన్‌ ప్రక్రియపై చర్చ జరుగుతున్నది. 2026లో లోక్‌సభ నియోజకవర్గాలను జనాభా ఆధారంగా పెంపుదల చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. 1972లో లోక్‌సభ స్థానాల సంఖ్య 543గా నిర్ణయించారు. అప్పటి నుంచి నియోజకవర్గాల పెంపుదల జరగలేదు. గత 5 దశాబ్దాలలో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పద్ధతులను విజయవంతంగా అమలు చేశాయి. విద్య, అక్షరాస్యత, పేదరికం తగ్గుదల మొదలగు విషయాలలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విజయవంతమైనాయి. కానీ బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్నది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య జనాభా నియంత్రణకు సంబంధించి అసమానతలు ఏర్పడ్డాయి. ఇప్పుడు 2026లో జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇది సమ న్యాయం, సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. జనాభా నియంత్రణలో విజయవంతమైనందుకు దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోతాయి. దీనిపై ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేసి ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ సమతౌల్యత కోసం కృషి జరగాలి.

రాజ్యాంగ వ్యవస్థలపై ఒత్తిడి

గత దశాబ్ద కాలంగా రాజ్యాంగ వ్యవస్థలైన న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్‌, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వంటి సంస్థలు అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులలో ‘కొలీజియం’ ద్వారా జరుగుతున్న న్యాయమూర్తుల నియామకంలో అనేక లోపాలు బహిర్గతం అయ్యాయి. తమకు నచ్చిన వారిని న్యాయమూర్తులుగా నియమిస్తున్నారు. న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసిన వారిని ఉన్నతమైన పదవులలో నియమిస్తున్నారు. జస్టిస్‌ రంజన్‌ గొగోరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన కొద్ది రోజులలో రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు. ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఎలక్షన్‌ కమిషన్‌ పనితీరుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎలక్షన్‌ కమిషన్‌ రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా పనిచేయాలి. కానీ గత కొనేళ్లుగా ఎలక్షన్‌ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పని చేస్తున్నది.

రాజ్యాంగ ఆధిక్యత ఉండాలి

భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనదని మినర్వా మిల్స్‌ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. దేశంలో కార్యనిర్వాహక వర్గం, శాసనశాఖ, న్యాయశాఖ, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. కాని గత కొన్నేళ్లుగా రాజ్యాంగ సూత్రాలను, ఆశయాలను ఉల్లంఘిస్తూ పాలన జరుగుతున్నది. రాజ్యాంగ ఆధిక్యత ఉండే విధంగా పాలన జరగాలంటే పౌర సమాజం ఒత్తిడి అవసరం.
డాక్టర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ రచనా సమయం నాటికి 60 దేశాల రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేశారు. వాటిలోని ముఖ్య అంశాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. గత 75 ఏళ్లుగా రాజ్యాంగం కాలపరీక్షకు తట్టుకుని నిలబడింది. ప్రస్తుత భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను ఎదుర్కొని…రాజ్యాంగ మౌలిక, లౌకిక స్వభావాన్ని సంరక్షించుకోవడంతో పాటుగా, రాజ్యాంగ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడమే…డా||అంబేద్కర్‌కు భారత ప్రజానీకం అర్పించే నివాళి.

వ్యాసకర్త : కె.యస్‌.లక్ష్మణరావు శాసనమండలి మాజీ సభ్యులు,
సెల్‌ : 8309965083/

➡️