కులీనుల గుప్పెట్లో అమెరికా!

Dec 26,2024 03:49 #America, #Capitalism, #Donald Trump

విచిత్రం ఏంటంటే రాజకీయ నాయకులు, మీడియా రష్యా గురించి గానీ, పుతిన్‌ గురించి గానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ‘కులీన పరిపాలన’ అన్న పదం తరచూ వాడుతుంటారు. పుతిన్‌ హయాంలో కులీనులు మహా శక్తివంతంగా ఎలా తయ్యారో కూడా వివరిస్తుంటారు. కానీ అమెరికాలోను, ఇతర దేశాల్లోను జరుగుతున్న వ్యవహారాలను ఉదహరించేటపుడు ఇదే ‘కులీన పరిపాలన’ అన్న పదం మనకు చాలా అరుదుగా వినబడుతుంటుంది. నిజానికి ‘కులీన పరిపాలన’ అనేది ప్రపంచవ్యాప్త నైజంగా చలామణి అవుతున్నది. దీని ప్రధాన స్థావరం అమెరికానే. వాస్తవం ఇదే. కానీ ఈ నిజాన్ని ఇక్కడ మాట్లాడడానికి ఎవరూ ఇచ్చగించరు. అతి కొద్ది మంది శత కోటీశ్వరులు ప్రపంచ అర్థిక వ్యవస్థతో సింహ భాగాన్ని స్వంతం చేసుకుని నియంత్రిస్తున్నారు. ఈ మాటకు తిరుగులేదు. అంతే కాదు! వాళ్లే ఇవాళ అవినీతికర ప్రచార ఆర్థిక వ్యవస్థ ద్వారా అమెరికన్‌ ప్రభుత్వాన్ని స్వంతం చేసుకుని, నియంత్రిస్తున్నారు. 2020వ సంవత్సరం నుండి లెక్క తీస్తే ప్రపంచంలో 50 కోట్ల మంది ప్రజానీకం పేదరికంలోకి జారిపోతే, కేవలం ఐదుగురు అతి సంపన్నులు గంటకు 14 మిలియన్‌ డాలర్ల సంపాదనతో తమ సంపదను, రెట్టింపు చేసుకున్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్న శ్రేణిలో ముందు వరుసలో ఉన్న ఎలన్‌ మస్క్‌ ఎన్నికల రోజు నుండి ఈ రోజు వరకు 120 బిలియన్‌ డాలర్ల ఆదాయం గడించాడు. 120 బిలియన్‌ డాలర్లు. అర్థమవుతుందా! ఆ తరువాత వరుసలో ఉన్న జెఫ్‌ బెజోస్‌ (అమెజాన్‌) గత నెలలో 67 బిలియన్‌ డాలర్లు పోగేసుకున్నాడు. మార్క్‌ జుకర్‌బర్గ్‌ (మెటా-ఫేస్‌బుక్‌, వాట్సప్‌ అధిపతి) ఈ ఏడాది 90 బిలియన్‌ డాలర్ల సంపద పోగేసుకున్నాడు. అంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన శత కోటీశ్వరులు అనూహ్యమైన స్థాయిలో సంపద పోగేసుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులలో పైశ్రేణి 1 శాతం మంది ఒక్క దశాబ్ద కాలంలో 42 ట్రిలియన్‌ డాలర్ల సంపదను కైవశం చేసుకున్నారు. ఇదే దశాబ్ద కాలంలో 50 శాతం మంది అట్టడుగు స్థాయి ప్రజానీకం జీవన ప్రమాణాలు ఏ మాత్రం మెరుగు పడలేదు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఈ భూమి మీద ఉన్న 95 శాతం జనాభా సంపద కన్నా 1 శాతం ప్రపంచ కుబేరుల సంపద హెచ్చుగా ఉన్నది.
పన్ను రహిత స్వర్గధామాలుగా పిలవబడే కేమాన్‌ దీవులలో ఈ ప్రపంచ కుబేరులు 32 ట్రిలియన్‌ డాలర్లు దాచిపెట్టుకున్నారు. అంటే ప్రభుత్వాలకు చెల్లిరచాల్సిన పన్నులు ఎగవేశారన్నమాట. ప్రభుత్వమేమో నిధుల కొరతతో సతమతం అవుతుంటుంది. వీళ్లు మాత్రం ఎగవేసిన పన్నులను బొక్కసాలలో దాచిపెట్టుకుంటూ వుంటారు. వీళ్లు తమ సంపదను కాపాడుకోడానికి ‘పలుకుబడిని’ కొనుగోలు చేస్తారు. మరీ ముఖ్యంగా ఎన్నికలను కూడా.
అమెరికాలో అపర కుబేరుల సంఖ్య మొత్తం జనాభాలో 0.0005 శాతం. వాస్తవానికి వీళ్లు లెక్కలోకి రారు. కాని వీళ్లు 2024 అధ్యక్ష ఎన్నికల వ్యయంలో 18 శాతం ఖర్చు భరించారు. వాళ్లు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది ఈ ఎన్నికలను కొనుగోలు చెయ్యడానికే. ఈ సారి అధ్యక్ష ఎన్నికలలో 150 బిలియనీర్‌ కుటుంబాలు 2 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాయి. ఎలన్‌ మస్క్‌ ఒక్కడే డొనాల్డ్‌ ట్రంప్‌కి దన్నుగా 277 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాడు. ‘ఒక్కడే 277 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాడా?’ అని ఆశ్చర్యపడకండి. అది అతని పెట్టుబడి. అందుకు తగిన ప్రతిఫలంగా కాంట్రాక్టులు దక్కించుకున్నాడు (ప్రభుత్వంలో పదవి కూడా). ఆయుధ తయారీ పరిశ్రమాధిపతులు ఈ ఎన్నికలలో 38 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఇందుకుగాను రక్షణ వ్యయానికి కేటాయించే బిలియన్ల కొద్దీ డాలర్లలో తమ వాటా సంపాదించుకుంటారు. అవినీతి మార్గాల్లో ఎంత ప్రజాధనం దుబారా అవుతోందో గమనించండి. ఎరుపాక్‌ (ఎ.ఐ.పి.ఎ.సి) సంస్థ ఇజ్రాయిల్‌, నెతన్యాహు పచ్చి మితవాద విధానాల పట్ల, గాజా హత్యాకాండ పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించిన సెనెటర్‌ను ఓడించడానికి 100 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. ఇప్పుడు అమెరికాలో నడుస్తున్నది ప్రజాస్వామ్యం కాదని అర్థం చేసుకోవడానికి మీకు రాజకీయ అర్థశాస్త్రంలో పి.హెచ్‌.డి పట్టా ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఒక వ్యక్తి, ఒక ఓటు స్వామ్యం కాదు. ఓ గుప్పెడు మంది మన భవిష్యత్తును నిర్ణయిస్తున్నారు. దీనినే ‘కులీన పరిపాలన’ అంటాం. ఈ కులీన శక్తులే అమెరికాలోనూ, ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ రాజ్యం చేస్తున్నాయి. ఈ కులీన శక్తులే పర్యావరణం, పేదరిక నిర్మూలన, కార్మిక కుటుంబాల జీవన ప్రమాణాల్లో మెరుగుదల వంటి అన్ని అంశాలలో ప్రభుత్వ విధానాలను శాసిస్తాయి. రాబోయే కొద్ది నెలల్లో ఈ కులీన శక్తులు మన రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేసి అక్రమ సంపదను ఎలా దోచుకని దాచుకుంటున్నాయి. ట్రంప్‌ అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాయి? అనే అంశాలపై ప్రజానీకాన్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలి. సమాజం పట్ల ఆపేక్ష ఉన్న వారంతా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా.

– వ్యాసకర్త – బెర్నీ శాండర్స్‌, అమెరికన్‌ రాజకీయవేత్త, వెర్మోంట్‌ సెనెటర్‌

➡️