అమెరికా విద్యార్థి ఉద్యమం

  • నాడు వియత్నాం! నేడు పాలస్తీనా !

పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయిల్‌ మిలిటరీ రఫా, తదితర ప్రాంతాల్లో మారణకాండను తీవ్రం చేస్తోంది. చివరకు ఐరాస తరఫున పనిచేస్తున్న సహాయ సిబ్బందిని కూడా వదలటం లేదు. సోమవారం జరిపిన దాడుల్లో ఐరాస తరఫున పనిచేస్తున్న వారిలో మన దేశానికి చెందిన వ్యక్తి మరణించాడు. రఫా లోని ఐరోపా ఆసుపత్రికి ఒక వాహనంలో ఇతరులతో కలసి వెళుతుండగా ఇజ్రాయిల్‌ మిలిటరీ జరిపిన దాడిలో అతడు మరణించగా మిగిలిన వారికి గాయాలయ్యాయి. గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 35 వేల మందికి పైగా మరణించారు. వారిలో 70 శాతం పైగా పిల్లలు, మహిళలు ఉన్నారు. పాలస్తీనియన్ల ఊచకోత గురించి అణు మాత్రమైనా పట్టని అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు యూదు వ్యతిరేకత పెరుగుతోందని మాత్రం గుండెలు బాదుకుంటున్నాయి. ఆ సాకుతో ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. కొద్ది వారాల క్రితం అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలోనే ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడు కెనడా, ఐరోపా ముఖ్యంగా బ్రిటన్‌కు విస్తరించింది. రఫా మీద దాడులను అంగీకరించేది లేదన్నది అమెరికా ఉత్తుత్తి బెదిరింపు మాత్రమే అని తేలిపోయింది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు ఆ నగరం పరిసరాలలో ఉన్న 14 లక్షల మంది జనాభాలో సగం మంది దాడులను తప్పించుకొనేందుకు ఇతర ప్రాంతాలకు పారిపోయారు.
ప్రతి మతంలోనూ దురహంకారులు ఉంటారు. దానికి యూదు అతీతం కాదు. ఐరోపాలో ముందుకు తెచ్చిన యూదు వ్యతిరేకత వారిని అష్టకష్టాలపాలు చేసింది. లక్షలాది మంది ప్రాణాలు తీసింది. ఆ దుర్మార్గాన్ని యావత్‌ ప్రపంచం ఖండించింది. కానీ ఇప్పుడు అదే మత ప్రాతిపదికన ఏర్పడిన ఇజ్రాయిల్‌ పాలకుల అరబ్‌ లేదా ముస్లిం వ్యతిరేకతను అనేక పశ్చిమదేశాలు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. పాలస్తీనా సాగిస్తున్న మారణకాండకు మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించి మానవ హక్కులను కాపాడాలని కోరుతున్నారే తప్ప యూదు వ్యతిరేకతను ముందుకు తీసుకురాలేదు. ఇజ్రాయిల్‌ పాలకులు యూదు దురహంకారులు తప్ప అక్కడ ఉన్న సామాన్య పౌరులందరూ అలాంటి వారే అనటం లేదు. ఐరాస తీర్మానం ప్రకారం పాలస్తీనా ఏర్పడకుండా అడ్డుకుంటున్నది అక్కడి పాలకులు, యూదు ఉన్మాదం తలకెక్కించిన మిలిటరీ, వారిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న పశ్చిమ దేశాలు తప్ప పౌరులు కాదు. పాలస్తీనాలోని గాజా, పశ్చిమ గట్టు, తూర్పు జెరూసలెం ప్రాంతాలలోని పౌరులపై దశాబ్దాల తరబడి సాగిస్తున్న దమనకాండ గురించి తన పౌరులకు బోధ చేసేందుకు ఎన్నడూ ఒక చట్టం చేయని అమెరికా పార్లమెంటు దిగువసభ ఇటీవల ”యూదు వ్యతిరేక జాగృతి బిల్లు” తెచ్చింది. దానికి 91 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా 320 మంది మద్దతు తెలిపారు. యూదు వ్యతిరేకత అమెరికాలో ఉన్న యూదు విద్యార్థుల మీద ప్రభావం చూపుతుందని చట్టం ప్రకటించింది. దాన్ని సెనెట్‌ కూడా ఆమోదిస్తే అధ్యక్షుడి ఆమోదంతో చట్టంగా మారుతుంది. ఒకసారి అది ఉనికిలోకి వస్తే వివాదాస్పద యూదు వ్యతిరేక నిర్వచనాలతో విద్యార్థులు, ఇజ్రాయిల్‌ దమనకాండపై గళమెత్తే ఇతరులను అణచివేసే అవకాశం ఉంది. ఈ బిల్లును సెనెట్‌ ఆమోదించకూడదని అనేక మంది కోరుతున్నారు. విద్యార్థులు చేస్తున్నది మరొక యుద్ధ వ్యతిరేక ఉద్యమం కాగా దాన్ని యూదు వ్యతిరేకమైనదిగా పశ్చిమ దేశాల మీడియా చిత్రించటం పాలక వర్గాల కనుసన్నలలో నడవటం తప్ప మరొకటి కాదు.
గతంలో వియత్నాంపై జరిపిన దురాక్రమణ, హత్యాకాండ, అత్యాచారాలకు నిరసనగా అమెరికా యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. చివరకు బతుకు జీవుడా అంటూ అమెరికన్లు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. అక్కడ కనీసం 30 లక్షల మంది అమాయక పౌరులను అమెరికన్‌ సైనికులు హతమార్చారు. గతంలో వియత్నాంలో మాదిరి ఇప్పుడు గాజాలో జరుగుతున్న మారణ కాండలో అమెరికా ప్రత్యక్ష భాగస్వామి కాదు. ఇజ్రాయిల్‌కు మద్దతు ఇవ్వటాన్ని వ్యతిరేకించటం అమెరికా యువతలో పెరిగిన చైతన్యానికి ఒక నిదర్శనం. గతంలో మాదిరి జరుగుతున్నవాటిని మూసి పెట్టటం ఇప్పుడు సాధ్యం కాదు. అమెరికాలో జరుగుతున్నదాని గురించి ఒక విశ్లేషకుడు ఒక సినిమా కథతో పోల్చాడు. ‘మోర్ఫస్‌’ అనే చిత్రంలో ఒక వ్యక్తి తన వద్దకు వచ్చిన ఆశ్రితుడికి ఎరుపు, నీల వర్ణపు రంగుల మాత్రలు ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమంటాడు. ఎరుపు రంగు దాన్ని సేవించిన వారికి తమ చుట్టూ జరుగుతున్న భయంకర అంశాలన్నీ కనిపిస్తాయి. అదే నీలి రంగు మాత్ర వేసుకుంటే నిజంగా జరుగుతున్నదాన్ని మరిపింపచేస్తుంది. ఆ సినిమాలో ఆశ్రితుడు ఎర్ర రంగు మాత్ర తీసుకున్నట్లుగా ఇప్పుడు అమెరికా సమాజంలోని నవ తరం కూడా అదే మాదిరి పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న అకృత్యాలను చూస్తున్నారని, వ్యతిరేకంగా స్పందిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ఒక్క ఇజ్రాయిల్‌కు మద్దతు ఇవ్వటమే కాదు తమ ప్రభుత్వం అనేక చోట్ల ఉగ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో జరుపుతున్న దారుణాలను కూడా ఇప్పుడు విద్యార్థులు స్పష్టంగా చూస్తున్నారు.
అమెరికా జరుపుతున్న దారుణాలను ప్రపంచం చూస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో అమెరికన్లు వాటిని ఏ మేరకు గమనించారన్న చర్చ ఒకటి ఉంది. ఏదైనా శృతి మించితే వారు కూడా స్పందిస్తారని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. పాలస్తీనా విముక్తి కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులని అమెరికా ఎప్పటి నుంచో చిత్రిస్తున్నది. ప్రతి దేశంలో సామ్రాజ్యవాదం, నిరంకుశ పాలకులు చేసింది అదే. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా సాగిస్తున్న చర్యలతో నిజానికి ఉగ్రవాదం పెరిగింది తప్ప తగ్గలేదు. అనేక మందిని ఉగ్రవాదులుగా మార్చిందంటే అతిశయోక్తి కాదు. బ్రౌన్‌ విశ్వవిద్యాలయం జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం వివిధ దేశాలలో అమెరికా కారణంగా 45 లక్షల మంది మరణించారు. వారిలో అమెరికా మిలిటరీ ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల మందిని చంపివేసింది. కనీసం 3.8 కోట్ల మంది తమ నెలవులు తప్పారు. ఎమెన్‌ అంతర్యుద్ధంలో అమెరికా మద్దతు, పథకం ప్రకారం జోక్యం చేసుకున్న సౌదీ అరేబియా కారణంగా దశాబ్ది కాలంలో 2.33 లక్షల మంది మరణించారు. ఐరాస కార్యాలయం 2020లో చెప్పినదాని ప్రకారం వారిలో ఆహారం, ఆరోగ్యసేవలు, మౌలిక సదుపాయాల లేమి వంటి పరోక్ష కారణాలతో మరణించిన వారు 1.31 లక్షల మంది ఉన్నారు. ఇటీవలి ప్రపంచ పరిణామాల్లో సౌదీ అరేబియా-ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎమెన్‌లో జోక్యానికి స్వస్తి పలికింది. సద్దాం హుస్సేన్‌ను తమ పలుకుబడి కిందకు తెచ్చుకొనేందుకు ఇరాక్‌పై అమెరికా అమలు జరిపిన ఆంక్షల కారణంగా ఐదు లక్షల మంది పిల్లలు మరణించారని అంచనా. ఇంకా ఇలాంటి అనేక దారుణాల్లో తమ నేతల, దేశ పాత్ర గురించి…విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో గుడారాలు వేసుకొని నిరసన తెలుపుతున్న విద్యార్థులు అరచేతిలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేస్తున్నారు.
అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనటమే కాదు, అనేక దేశాల పాలకులను ప్రోత్సహించి లక్షలాది మంది మరణాలకు బాధ్యురాలైంది. ప్రస్తుత బంగ్లాదేశ్‌ 1971కి ముందు పాకిస్తాన్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేసేందుకు ‘పాక్‌ మిలిటరీ ఆపరేషన్‌ సెర్చ్‌ లైట్‌’ పేరుతో జరిపిన మారణకాండలో మూడు లక్షల మంది మరణించగా కోటి మంది తమ ప్రాంతాల నుంచి పారిపోవాల్సి వచ్చింది. దానికి అమెరికా పూర్తి మద్దతు ఇచ్చింది. మన దేశం జోక్యం చేసుకొని పాక్‌ మిలిటరీని ఓడించి బంగ్లాదేశ్‌ విముక్తికి తోడ్పడింది. అంతకు కొద్ది సంవత్సరాల ముందు ఇండోనేషియాలో కమ్యూనిస్టులను అణచివేసేందుకు మిలిటరీ నియంత సుహార్తోను గద్దె మీద కూర్చోబెట్టి కనీసం పది లక్షల మందిని ఊచకోత కోయించటంలో సిఐఏ ప్రధాన పాత్ర పోషించింది. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా మిత్రపక్ష దేశాల మీద యుద్ధం ప్రకటించిన హిట్లర్‌ వంటి వారిని తప్ప ప్రపంచంలో నియంతగా పేరు మోసిన ప్రతి వాడినీ అమెరికా బలపరిచింది. హిట్లర్‌కు సైతం ఆయుధాలు అమ్మి తొలి రోజుల్లో మద్దతు ఇచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంతో బ్రిటన్‌ ప్రపంచాధిపత్యం అంతరించి అమెరికా రంగంలోకి వచ్చింది. అప్పటి నుంచి సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలతో సాగించిన ప్రచ్ఛన్న యుద్ధంలో తాము విజేతలం అని ప్రకటించుకొనే వరకు అంటే 1949 నుంచి 1989 వరకు వివిధ దేశాలలో పాలకులను మార్చేందుకు అమెరికా 72 ప్రయత్నాలు చేయగా 29 సందర్భాలలో అమెరికా కుట్రలో భాగస్వాములైన వారు జయప్రదమయ్యారు. కూల్చిన వాటిలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆరు ఉన్నాయని బోస్టన్‌ కాలేజీ రాజకీయ శాస్త్ర అధ్యాపకురాలు లిండ్సే ఓ రూర్‌కే పేర్కొన్నారు. ఒక వలసవాదిగా అమెరికా దుర్మార్గం చిన్నదేమీ కాదు. ఆసియాలోని ఫిలిప్పైన్స్‌ను ఆక్రమించకొని అక్కడ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే రెండు నుంచి ఆరు లక్షల మందిని జాత్యహంకారం, ఇతర కారణాలతో అమెరికన్‌ పాలకులు హత్య చేశారని అంచనా.
1968లో వియత్నాంలో దురాక్రమణ, మారణకాండలకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన ఆందోళనకు, ఇప్పుడు గాజాలో జరుపుతున్న ఇజ్రాయిల్‌ మారణకాండకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి విద్యార్థిలోకం గళమెత్తటానికి గల పోలికలు చర్చలోకి వచ్చాయి. అప్పుడూ ఇప్పుడూ ఆందోళన కాలేజీ ప్రాంగణాల్లోనే ప్రారంభమైంది. నాడూ నేడు పోలీసులను పిలిపించి అణచివేతకు పాల్పడ్డారు. నవతరం-పాతవారి మధ్య కొన్ని సైద్ధాంతిక విబేధాలు గతంలోనూ వర్తమానంలోనూ ఉన్నాయి. నిజానికి ఇవి పెద్ద అంశాలు కావు. ఫ్రెంచి వలస ప్రాంతంగా ఉన్న ఇండోచైనాను రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఆక్రమించింది. అది ఓడిన తరువాత తిరిగి ఫ్రాన్సు ఆక్రమించిన వియత్నాంలో విముక్తి పోరాటం కారణంగా 1954లో స్వాతంత్య్రం వచ్చింది. ఉత్తర, దక్షిణ వియత్నాంలుగా దాన్ని విభజించారు. ఫ్రెంచి పాలకులు తప్పుకున్న తరువాత దక్షిణ వియత్నాం కేంద్రంగా అమెరికా రంగంలోకి వచ్చి ఉత్తర వియత్నాంను ఆక్రమించేందుకు, దక్షిణ వియత్నాంలో విముక్తి పోరాటాన్ని అణచేందుకు చూసింది. స్వతంత్ర పాలస్తీనాను రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రెండుగా చీల్చి ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేశారు. ఆ వెంటనే పాలస్తీనా ప్రాంతాలను పశ్చిమ దేశాల మద్దతుతో అది అక్రమించి ఇప్పటి వరకు పాలస్తీనా స్వతంత్ర దేశం ఏర్పడకుండా అడ్డుకుంటున్నది. మానవత్వానికి ముప్పు తెచ్చిన కారణంగా విద్యార్థులు వీధుల్లోకి రావటం చైతన్యానికి నిదర్శనం. రఫాలో దాడులను అడ్డుకోవటంలో విఫలమైన తమ ప్రభుత్వం మీద అమెరికా విద్యార్థులు మరింతగా వీధుల్లోకి వస్తారా, ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

ఎం. కోటేశ్వరరావు

➡️