ఎస్‌.ఎం.ఎస్‌ చార్జీల మోత

Jul 3,2024 05:00 #banks, #charges, #sms

ఈ మధ్య బ్యాంకులవారు ఎస్‌.ఎం.ఎస్‌ చార్జీల మోత మోగించడం మరీ ఎక్కువైంది. దీంతో ఎందుకు తమ బ్యాంకు ఖాతా లోని డబ్బు మాటిమాటికీ ఎంత కోత పడుతున్నదో తెలియని అగమ్యగోచర పరిస్థితుల్లో ఖాతాదారులు కొట్టుమిట్టాడుతున్నారు. పరిస్థితి ఎలా తయారయ్యిందంటే ఇంట్లో డబ్బు పెట్టుకుంటే రక్షణ సమస్య. అదే బ్యాంకులో వేసుకుంటే ఇలా తమ బ్యాంకు ఖాతా లోని డబ్బు కేంద్ర ప్రభుత్వం వారు అనుసరిస్తున్న కొన్ని అర్థం, పర్ధంలేని అస్తవ్యస్థమైన విధానాలు ఖాతాదారుల పాలిట పెనుశాపంగా పరిణమిస్తున్నది. దీంతో ప్రజల పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా తయారయ్యింది. అంటే మనం కష్టపడి సంపాదించుకొన్న సొమ్ము దొంగల పాలు అయినట్లు ఇలా ఎస్‌.ఎం.ఎస్‌ల రూపంలో మన సొమ్ము స్వాహా అయిపోతుండటం మరీ విడ్డూరమైన, శోచనీయమైన విషయం. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాల మూలాన బ్యాంకులలో డబ్బులు డిపాజిట్‌ చేయాలంటేనే ప్రజలు ఓ విధమైన అభద్రతా భావానికి గురవుతున్నారనే మాట సత్య దూరం కాదు. ఏమైనా బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రజలను నానా రకాలుగా ఇబ్బంది పెట్టేలా, వారి ఆర్థిక స్థితిగతులపై దెబ్బ తీసేలా వ్యవహరించడం తగదు.

– బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచెర్ల, నంద్యాల జిల్లా.

➡️