వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక-2024 ఈ జనవరి 28న విడుదలైంది. దేశ వ్యాప్తంగా పౌరుల సాయంతో చేసిన ఇంటింటి సర్వే ఇది. గ్రామీణ భారతంలో విద్యార్థుల పఠన స్థాయి, బోధనా స్థాయి ఎలా ఉన్నదనే వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. దేశ పురోగతికి పునాది వంటి పాఠశాల విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు గ్రామీణ భారత దేశంలో జాతీయ స్థాయిలోనే ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన రాష్ట్రం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో సౌకర్యాలుగానీ, విద్యా ప్రమాణాలు కానీ జాతీయ స్థాయి సగటు కన్నా మరింత తీసికట్టుగా ఉండడం మరింతగా ఆందోళన కలిగిస్తుంది. ఆ నివేదిక నుండి కొన్ని వివరాలు (పట్టిక) మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
పట్టికలో పేర్కొన్న అంశాలను గమనిస్తే మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో విద్యార్థుల చేరిక అఖిల భారత స్థాయి కన్నా తక్కువగా ఉన్నదని స్పష్టమవుతున్నది.
అలాగే రెండవ తరగతి పాఠ్యాంశాలను చదవగలిగిన మూడవ తరగతి, ఐదవ తరగతి విద్యార్థుల శాతం చాలా తక్కువగానూ, అఖిల భారత స్థాయితో పోలిస్తే ఇంకా తక్కువగాను ఉండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది.
అలాగే విద్యార్థులకు మంచి నీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యాల అందుబాటులో కూడా మన రాష్ట్రం అఖిల భారత సగటు కన్నా తక్కువ స్థాయిలో ఉన్నది.
ఇక కంప్యూటర్లు అందుబాటులో ఉన్న పాఠశాలల సంఖ్య, విద్యార్థులు కంప్యూటర్లను వినియోగిస్తున్న పాఠశాలల సంఖ్య కూడా అఖిల భారత సగటుతో పోలిస్తే తక్కువగా ఉన్నది.
గత కొన్నేళ్ళుగా మన రాష్ట్రంలో ఈ ప్రమాణాలు తగ్గుముఖం పట్టాయి. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో అధ్యయన ప్రమాణాలు ఇంతగా పడిపోవడానికి గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంత విద్యాభివృద్ధి మీద దృష్టి పెట్టకపోవడమే కారణం. వరుసవారీ ప్రభుత్వాలు ప్రైవేటు విద్యాసంస్థల పట్ల ఉన్న మోజుతో గ్రామీణ ప్రాంత విద్యను పెంపొందించడంలో తీవ్ర అలసత్వం పాటించాయి. తగినన్ని నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించాయి. దీని మూలంగా విద్యార్జనలో మన రాష్ట్రం వెనుకబడిపోయింది. బోధనా సిబ్బంది నైతికత, విద్యార్థుల అధ్యయన ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు వెనుకపట్టు పడ్డాయి.
పైన పేర్కొన్న ప్రమాణాలలో బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిషా, త్రిపుర వంటి రాష్ట్రాలు మన రాష్ట్రం కన్నా మెరుగైన స్థితిలో ఉండడం మనకు సిగ్గుచేటైన విషయం.
నూతన విద్యా విధానంలోని 26.1 పేరాలో ఈ కింది విధంగా పేర్కొన్నారు. ‘పిల్లలకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం సమాజ మెరుగైన భవిష్యత్తుకు అవసరం కాబట్టి విద్యా రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెంచడానికి ఈ విధానం కట్టుబడి ఉంది. దుదృష్టవశాత్తు 1968 విద్యా విధానం, తదనంతరం సవరించిన 1986 విద్యా విధానం, ఆపై 1992లో పునరుద్ఘాటించిన విద్యా విధానాల్లో పేర్కొన్నట్లు విద్యా రంగానికి స్థూల జాతీయోత్పత్తిలో ఆరు శాతం నిధులు కేటాయించాలన్న లక్ష్యానికి ఇన్నేళ్లుగా చేరుకోలేకపోయాం. ప్రస్తుతం మన దేశంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి కేటాయించిన నిధులు స్థూల జాతీయోత్పత్తిలో 4.43 శాతంగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ మొత్తం వ్యయంలో విద్యా రంగ వ్యయం కేవలం 10 శాతానికే పరిమితమై ఉన్నది (ఆర్థిక సర్వే 2017-18). అభివృద్ధి చెందిన, చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే ఈ గణాంకాలు చాలా స్వల్పం’.
ప్రభుత్వ విద్యా రంగంలో పెట్టుబడులు జాతీయ స్థాయిలోనే అత్యల్పంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో అయితే మరింత తక్కువగా ఉన్నాయి.
ఉదాహరణకు 2024-25 రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వ విద్యారంగ వ్యయం 12.3 శాతం ఉన్నది. ఇది 2023-24 సంవత్సరంలో రాష్ట్రాల విద్యా రంగ వ్యయ సగటు 14.7 శాతానికన్నా చాలా తక్కువ.
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞాన చోదక అభివృద్ధి, డిజిటల్ పరిపాలన, నాలెడ్జ్ హబ్, కృత్రిమ మేధ వినియోగం పెంపుదల వంటి లక్ష్యాలు సాధించాలని నిర్దేశించుకున్నది. ఈ లక్ష్యాలు సాధించాలంటే విద్యారంగ అభివృద్ధి ముఖ్యంగా గ్రామీణ విద్యారంగ అభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకుంటే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 కాగితం మీద కలగానే మిగిలిపోతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన 3-5 ఏళ్ల వయసున్న పిల్లలకు ప్రీ-స్కూలింగ్, ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యాభివృద్ధికి అవసరమైన కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడం, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం వంటి చర్యలకు అవసరమైన నిధులు కేటాయించాలి.
ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి విద్యార్థుల వసతి గృహాలు ఎంత దయనీయమైన పరిస్థితులలో ఉన్నాయో వివరిస్తూ గతంలోనే నేను మీకు ఒక లేఖలో తెలియజేశాను. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఈ వసతి గృహాలను ఆధునీకరించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ప్రైవేటు విద్యా సంస్థలను ముఖ్యంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించే వైఖరికి స్వస్తి చెప్పి ప్రభుత్వ విద్యా వ్యవస్థను, ప్రభుత్వ విశ్వవిద్యాల యాలను పటిష్టం చేసే చర్యలు చేపట్టి తద్వారా అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలి. విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ల నియామకంతో రాజకీయ జోక్యం లేకుండా డాక్టర్ సి.ఆర్. రెడ్డి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ఉద్దండులను నియమించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. వైస్-ఛాన్సలర్ల నియామకంలో రాజకీయ జోక్యం పెరగడం మూలంగా విశ్వవిద్యాలయాల ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఏ రాష్ట్ర భవిష్యత్తు అయినా విశ్వవిద్యాలయాల బోధనా ప్రమాణాలు, బోధనా సిబ్బంది నైతికత మీద ఆధారపడి ఉంటాయి. విద్యారంగ సర్వతోముఖాభివృద్ధికి, వికాసానికిగాను బోధానా సిబ్బంది నియామకాల్లో అన్ని ప్రాంతాల వారికి, నిర్లక్ష్యానికి గురైన తరగతుల వారికి తగు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
రాష్ట్రం నుండి, రాష్ట్రేతరుల నుండి విద్యారంగ నిష్ణాతులతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించి రాష్ట్రంలో ప్రీ-స్కూలింగ్ నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మన విద్యా వ్యవస్థను ఎలా పటిష్టం చేసుకోవాలన్న విధివిధానాలను రూపొందించుకోవాలి. అలాగే ప్రీ-స్కూలింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఈ రంగంలో విశేష కృషి జరుపుతున్న ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌జిఓల) సలహాలు స్వీకరించాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజానుకూల దృక్పథంతో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు ముందడుగు వెయ్యాలని ఆశిస్తున్నాను.
(రాష్ట్ర విద్యా రంగ పరిస్థితులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఇటీవల రాసిన లేఖ పూర్తి పాఠం)
రచయిత : భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శిఇ.ఎ.ఎస్. శర్మ