కాశ్మీర్‌ ఎన్నికలతో మోడీకి మరో పాఠం?

Aug 25,2024 04:46 #editpage

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల సంఘం (ఇ.సి) అనివార్యంగా నిర్వహిస్తున్న జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికలపై ప్రపంచమంతా దృష్టి పెట్టింది. 2019లో మోడీ రెండవ సారి గెలిచిన తర్వాత 370వ అధికరణం రద్దు తర్వాత కేంద్రం చెప్పుకున్న గొప్పల నిజానిజాలేమిటో తెలుసుకునే సందర్భంగా అందరూ ఈ ఎన్నికలను చూస్తున్నారు. 2014లో చివరి సారి జరిగిన ఎన్నికలలో ఏర్పడిన శాసనసభ 2018లో రద్దయిన తర్వాత ఇంతవరకూ కాశ్మీర్‌లో ఎన్నికైన ప్రభుత్వమే లేకుండా పోయింది. సుప్రీం కోర్టు ఖచ్చితమైన ఆదేశాలిచ్చి వుండకపోతే ఇప్పుడైనా ఎన్నికలు జరిగేవా అనేది సందేహమే. ఇప్పటికైనా కోర్టు చెప్పినట్టు ఇసి సెప్టెంబరు 30 గడువు కొంచెం పొడగించి సెప్టెంబరు 18, 25, అక్టోబరు 2 తేదీలలో మూడు దశలుగా జరుపుతున్నది. దాంతోపాటే హర్యానా ఎన్నికలు కూడా జరుపుతూ మహారాష్ట్ర ఎన్నికలు మాత్రం తర్వాతకు వాయిదా వేసింది. ఇందుకు ఇ.సి చెబుతున్న కారణం చూస్తే కాశ్మీర్‌ పరిస్థితిపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా చేసిన హడావుడి అవాస్తవమని తేలిపోతుంది. కాశ్మీర్‌ ఎన్నికలలో శాంతిభద్రతల రీత్యా అధిక సంఖ్యలో సాయుధ దళాలు అవసరం గనక మహారాష్ట్రలో ఎన్నికలు జరపలేమన్నది దాని సమాధానం. ఏమైనా అసలంటూ ఎన్నికలు జరపడం ఆహ్వానించదగిన పరిణామం. 370 రద్దుతో కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం, రాష్ట్ర హోదా తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం స్థానిక ప్రజలు ఏ మాత్రం ఆమోదించలేకపోయారు. దాన్ని వివిధ రూపాలలో వ్యక్తం చేస్తూ వస్తున్నారు కూడా. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రకటించేందుకు, బిజెపిని దానితో చేతులు కలిపే పక్షాలనూ ఓడించేందుకు ఇది సరైన అవకాశమని భావిస్తున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఈ కారణం వల్లనే ఒకవైపున బిజెపి, మరోవైపున దానితో గతంలో చేతులు కలిపిన పిడిపి (పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ) రకరకాల మల్లగుల్లాలు పడుతుంటే అతి కీలకమైన పార్టీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నది. ఆగష్టు 26 నామినేషన్ల ప్రారంభం కాగా ఈ లోగానే ఏదో ఒక అవగాహనకు రావాలన్నది ఆ రెండు పార్టీల లక్ష్యంగా వుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ తదితరులు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేతలైన ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లాలతో చర్చలు జరిపి దాదాపు ఒక అవగాహనకు వచ్చినట్టు ప్రకటించడం ఈ దిశలో పెద్ద ముందడుగేనని చెప్పొచ్చు.
బలాబలాల తీరు
కాంగ్రెస్‌ కాన్ఫరెన్స్‌లు చివరి సారిగా 2008లో కలసి పోటీ చేసి విజయం సాధించాయి. 2014లో విడివిడిగా తలపడ్డాయి. ఆ ఎన్నికల నాటికి మెహబూబా ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహ్మద్‌ సయ్యద్‌ జీవించి వున్నారు. 28 స్థానాలతో పిడిపి పెద్ద పార్టీగా రాగా కాన్ఫరెన్స్‌ 15కు పరిమితమైంది. బిజెపికి 25, కాంగ్రెస్‌కు 12 వచ్చాయి. జమ్మూలో స్థానాలు తెచ్చుకున్న బిజెపిని వదలిపెట్టి మిగిలిన లౌకిక పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజాస్వామిక వాదులు భావించినా అదిసాధ్యం కాలేదు. ప్రాంతీయ పార్టీలుగా ఎన్‌సి పిడిపి మధ్య వైరుధ్యాలే అందుకు కారణమైనాయి. జమ్మూలో స్థానాలు తెచ్చుకున్న బిజెపితో కలిపి సర్కారు ఏర్పాటు చేయడం తనకు ప్రయోజనమని పిడిపి భావించింది తప్ప పర్యవసానాలు పట్టించుకోలేదు. వాస్తవానికి ఆ రెండు పార్టీల రాజకీయ వ్యూహాలు పూర్తి విరుద్ధంగా వుంటాయి. ఎన్నికలలోనూ ఒకరినొకరు తీవ్రంగా తిట్టుకున్నారు. అయినా సరే ఎన్‌సిని రాకుండా చేయడం ధ్యేయంగా బిజెపి పిడిపి చేతులు కలిపి అధికారంలోకి వచ్చాయి. ముఫ్తీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ముఫ్తీ మరణం, దీర్ఘకాల అనిశ్చితి తర్వాత మెహబూబా పదవి చేపట్టినా ఇరుపార్టీల మధ్య సఖ్యత కుదిరింది లేదు. ఈ లోగా తీవ్రవాదులు, విచ్ఛిన్న శక్తుల కుట్రలకు తోడు తమ ఆధిపత్యం పెంచుకోవాలన్న బిజెపి ఆరాటం పరిస్తితిని ఇంకా దిగజార్చింది. చివరకు 2018 నవంబరులో అప్పటి గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ శాసనసభ రద్దుకు సిఫార్సు చేశారు. ఆ కాలంలో జరిగిన కుటిల రాజకీయాలేమిటో ఆయనే తర్వాత బయిటపెట్టారు కూడా. వీటన్నిటి కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. కాశ్మీర్‌లోనే తాము అధికారంలో భాగస్వాములు కావడం గొప్ప మార్పుగా భావించిన బిజెపి దాన్ని నిలబెట్టుకోవడమే ఏకైక లక్ష్యంగా దుస్సాహసాలకు పాల్పడింది. 2019లో 370 రద్దు దానికి పరాకాష్ట. ఒక విధంగా ఈ నిరంకుశ చర్య కలహిస్తున్న ఎన్‌సి, పిడిపిని ఇతర లౌకిక ప్రజాస్వామిక శక్తులను ఒకతాటి మీదకు తెచ్చింది. ముందు నుంచి ప్రజాస్వామ్య పోరాటంలోనూ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలోనూ ముందున్న సిపిఎం సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంఎల్‌ఎ మహ్మద్‌ యూసఫ్‌ తరిగామి వంటివారు ఈ కృషిలో చొరవ చూపారు. 370 రద్దు తర్వాత ఏడాదికి గుప్కార్‌ అలయన్స్‌ పేరిట ఒక తాటి మీదకు వచ్చి ఉమ్మడిగా పోరాడతామని ప్రకటించారు.
డిడిిసి, లోక్‌సభ సంకేతాలు
అందుకు తగినట్టే 2020తె డిసెంబర్‌లో కాశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి సంఘాలకు (డిడిసి) జరిగిన ఎన్నికలలో గుప్కార్‌ అలయన్స్‌ ఆధిక్యత సాధించగా బిజెపి జమ్మూలో ప్రభావం చూపించింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికలలోనైతే జమ్మూలోని ఉద్దంపూర్‌, జమ్మూ స్థానాలు బిజెపి గెల్చుకోగా, శ్రీనగర్‌, అనంతనాగ్‌ రాజౌరి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తెచ్చుకుంది. కాశ్మీర్‌ లోయలోని బారాముల్లా స్థానం నుంచి పిడిపిపై నేషనల్‌ కా న్ఫరెన్స్‌ తరపున ఒమర్‌ అబ్దుల్లా విజయం సాధిస్తారని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయగా వేర్పాటువాద అవామీ ఇత్తేహాద్‌ పార్టీ అభ్యర్థి, మూడు సార్లు ఎంఎల్‌ఎ షేక్‌ అబ్దుల్‌ రషీద్‌ ఇంజనీర్‌్‌ స్వతంత్రుడుగా విజయం సాధించారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన ప్రత్యేకంగా కోర్టు ద్వారా వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం మీడియాను ఆకర్షించింది. లోక్‌సభ ఎన్నికలలో వచ్చిన ఓట్ల ప్రకారం చూస్తే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 36 చోట్ల, బిజెపి 29 చోట్ల ఆధిక్యతలో వుండగా మొహబూబా మఫ్తి పిడిపిి కేవలం అయిదు చోట్ల. కాంగ్రెస్‌ ఏడు చోట్ల ఆధిక్యత తెచ్చుకోగలిగాయి. కాంగ్రెస్‌, ఎన్‌పి ‘ఇండియా’లో వున్నా లోక్‌సభ ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేశాయి. ఈ ఫలితాల ప్రభావంతో కూడా కేంద్రం సుప్రీం కోర్టు ఆదేశించినా ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చింది. పైగా హోం శాఖ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాలనాధికారాలు నియామక అధికారాలు మరింత పెంచేసింది. జమ్మూలో సీట్లు పెంచుకోవడంతో పాటు రిజర్వేషన్ల పాచికనూ ఉపయోగించింది. టెర్రరిజం అణచివేత పేరిట సైనిక దళాల చర్యలు, రాజకీయంగా గవర్నర్‌ అధికారాలు పెంపు, కార్పొరేట్లకు నజరానాల పెంపు, మతపరమైన విభజన తీవ్రం చేయడం ఉధృతంగా సాగించింది. మరోవైపున తీవ్రవాద కార్యకలాపాలు కాశ్మీర్‌ నుంచి జమ్మూకు వ్యాపించాయంటూ అక్కడ ప్రత్యేకంగా సైనిక బలగాలను పెంచింది. ఇంత జరుగుతున్నా ప్రధాన ప్రాంతీయ పార్టీలైన పిడిపి ఎన్‌సి మాత్రం పరస్పర వైరుధ్యాలనే ప్రధానంగా చూస్తూ చేతులు కలపడానికి నిరాకరించడమే లోపం, కాని ప్రజల్లో మాత్రం వ్యతిరేకత పెరిగింది. మొదట్లో ప్రాంతీయ పార్టీలను కేంద్రానికి ఏజంటుగా చూసిన వారే ఈ పరిణామాల తర్వాత బలపర్చడం మొదలు పెట్టారు. ఆఖరుకు కొంత కాలం ఎన్నికలకు దూరంగా వుండిపోయిన పార్టీలు కూడా ఓట్లతోనే సమాధానమిస్తామని రంగంలోకి దిగాయి, రషీద్‌ ఇంజనీర్‌ విజయం అలాంటిదే. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన అవామీ పార్టీకి 14 చోట్ల ఆధిక్యత వచ్చింది. కాశ్మీర్‌ లోయలో ఎన్‌సి, పిడిపిలకు కలిపితే 70 శాతం ఓట్లున్నాయి గాని అవి కలిసి పోటీ చేసే అవకాశం కనిపించదు. బిజెపి గెలిచిన జమ్మూ స్థానం ఉద్దంపూర్‌లో కూడా దానికి పది శాతం ఓట్లు తగ్గగా కాంగ్రెస్‌ ఓట్లు పెరిగాయి. ఇదేగాక జమ్మూ కాశ్మీర్‌ పీపుల్స్‌ పార్టీ, ఆప్‌ పార్టీ కూడా ఓట్లు తెచ్చుకున్నాయి.
లౌకిక పార్టీల సమీకరణ-బిజెపి ఎత్తుగడలు
మొత్తంగా చూస్తే కాశ్మీర్‌లో లౌకిక పార్టీలన్నిటికీ కలిపితే గణనీయమైన ఆధిక్యత వుంది. వారంతా ఒక తాటిపైకి వచ్చి పోటీ చేయాలని బిజెపిని ఓడించాలని సిపిఎం ఎప్పుడూ చెబుతున్నది. కానీ పిడిపికి స్థానాలు కేటాయించే అవకాశం లేదని ఎన్‌సి ముందే ప్రకటించింది. ఇక ఆ పార్టీ కూడా చాలా విషయాల్లో కలసి రాకుండా విడిగానే వ్యవహరిస్తూ వస్తోంది. ఈ పూర్వరంగంలో కాంగ్రెస్‌ ఎన్‌సి నాయకులు సమావేశం తర్వాత ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు ప్రకటించడం హర్షణీయమైన పరిణామమే. పునర్విభజన తర్వాత మొత్తం 90 స్థానాలలో 47 కాశ్మీర్‌లో 43 జమ్మూలో వున్నాయి. ఇప్పుడు యాభై చోట్ల ఎన్‌సి పోటీ చేస్తే 35-38 చోట్ల కాంగ్రెస్‌ పోటీ వుంటుందని భావిస్తున్నారు. మిత్రపక్షాలకు కూడా చోటు కల్పించనున్నట్టు ఎన్‌సి నాయకులు సూచనగా చెప్పారు. పిడిపిని కూడా వస్తే కలుపుకుంటారా అని అడగ్గా ఎవరికీ తలుపులు మూయలేదని వ్యాఖ్యానించారు. మరోవైపున లోక్‌సభలో మెజార్టీ కోల్పోయిన బిజెపి కాశ్మీర్‌లోనూ ఆశలు సన్నగిల్లిన స్థితిలో వుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తోడు ఇప్పటివరకూ దూరం పెట్టిన రామ్‌ మాధవ్‌ను తీసుకొచ్చి బాధ్యత అప్పగించడంలోనూ ఈ సంగతి బోధపడుతుంది. గతంలో కాశ్మీర్‌ ఈశాన్య రాష్ట్రాలలో ఆయన చాలా బాగా పని చేశారనేది ఆరెస్సెస్‌ అంచనాగా చెబుతారు. ముఖ్యంగా పిడిపితో కూటమి కట్టడంలో ఆయన పాత్ర చాలా వుంది గనక ఆపద్ధర్మంగా పిలిపించారంటున్నారు. దీంతోపాటు స్వయంగా అమిత్‌ షాతో సహా రంగంలోకి దిగి విద్వేష ప్రచారం తీవ్రం చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ కాశ్మీర్‌కు ప్రత్యేక పతాకం వుండాలనే ఎన్‌సి కోర్కెకు ఒప్పుకుంటారా, పాకిస్తాన్‌తో చర్చలకు ఒప్పుకుంటారా అంటూ మత పరమైన పది ప్రశ్నలు వదలడం ఇందుకో నిదర్శనం, ఇదే విషయమై తరగామిని అడిగినపుడు కాశ్మీర్‌ పార్టీలు మొదటి నుంచి ఆ వైఖరితోనే వున్నాయని గుర్తు చేశారు. బిజెపి, పిడిపి కూటమి కట్టినప్పుడు కూడా ఇదే వైఖరితో వున్నాయి గనక ఇప్పుడేదో కొత్తగా వివాదం చేయడంలో అర్థమేముంది? కాశ్మీరియత్‌, ఇన్సానియత్‌, జంబోరియత్‌ అనే మూడు అంశాలను కాపాడటం కీలకంగా ఎన్నికలలో పాల్గొని విజయం సాధించాలని లౌకిక వాదులు కోరుతున్నారు. మీడియా పైనా గతంలో విధించిన ఆంక్షలు సడలించాలని కూడా తరిగామి కోరారు. మానవ హక్కులపై దాడి, సైనిక వలయంలా మారిన పరిస్థితి సడలించకుండా ఎన్నికల పోరాటం సాధ్యం కాదు. మరి మోడీ సర్కారు ఆ విజ్ఞత చూపకపోతే కేంద్రంపై నిరసన ఇంకా పెరుగుతుంది. అది ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిబింబించవచ్చు.

తెలకపల్లి రవి

➡️