మరో ‘స్టాక్‌’ కుంభకోణం!

Jun 8,2024 05:30 #editpage

లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడిన అనంతరం స్టాక్‌ మార్కెట్‌ పైకెగసి, వాస్తవ ఫలితాలొచ్చాక అమాంతం పడిపోవడంతో భారతీయ మదుపరులు దాదాపు 31 లక్షల కోట్ల రూపాయలు కోల్పోవడం మరో భారీ స్టాక్‌ కుంభకోణం. ఇదేదో ఆర్థిక కారణాలతో ఏవో సంస్థలు దివాలా తీయడం లేక స్టాక్‌ బ్రోకర్ల ఊదరగొట్టే ప్రచారం వల్లనో జరిగిందిగాక సాక్షాత్తూ దేశ ప్రధాని, హోం మంత్రి చేసిన సూచనల మేరకే స్టాక్స్‌లో మదుపు చేసినందువల్ల ఇందులో కేంద్ర ప్రభుత్వ పెద్దల పాత్ర ప్రత్యక్షంగా ఉందన్నది నిర్వివాదాంశం. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు జరిపించాలన్న పలువురి డిమాండ్‌ సమర్ధనీయమే! దేశంలో ఇంతకుముందు కూడా కొన్ని స్టాక్‌ కుంభకోణాలు జరిగాయి కానీ దేశ అత్యున్నత పదవులనలంకరించిన పెద్దల ప్రత్యక్ష ప్రోత్సాహంతో జరిగినవి లేవు. అనేక విషయాల్లో ప్రత్యేకతను చాటుకున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ తమ విశ్వసనీయత కోల్పోవడం కూడా ఒక ముఖ్యమైన అంశం. కుట్ర పూరితంగానే ఎగ్జిట్‌ పోల్స్‌ ఇచ్చారన్న విమర్శ అన్ని సంస్థల విషయంలోనూ కరెక్టు కాకపోయినా వాటిని పదేపదే హోరెత్తించిన కార్పొరేట్‌ మీడియా దుష్ట బుద్ధిని మాత్రం అందరూ అర్థం చేసుకోవడం అవసరం. గుజరాత్‌ అభివృద్ధి నమూనా అనీ నరేంద్ర మోడీ గొప్ప పరిపాలనాదక్షుడనీ వగైరా ఆకాశానికెత్తిన ప్రచారాలను వారు 2014 ఎన్నికల ముందునుంచీ చేస్తున్నదే! దీనినిబట్టి ప్రజలను వారు ఎంతలా తప్పుదారి పట్టిస్తున్నదీ అవగతం చేసుకోవచ్చు.
ఎన్నికల సందర్భంగా ప్రధాని, కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రి స్టాక్‌ మార్కెట్‌పై వ్యాఖ్యలు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్టాక్‌ మార్కెట్‌ అత్యంత వేగంగా పెరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. హోం మంత్రి మాట్లాడుతూ జూన్‌ 4న స్టాక్‌ మార్కెట్‌ ఎగిసిపడుతుందని, ఈలోగా మీరందరూ అందులో ఇన్వెస్ట్‌ చేయాలనీ కోరారు. ఆర్థిక మంత్రి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అసలు ప్రధాని, కేంద్ర మంత్రులు మదుపర్లకు ఎందుకు ఇలా పెట్టుబడులు పెట్టాలని సూచనలు చేశారన్నది పెద్ద ప్రశ్న. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించడం వారి పనా? స్టాక్‌ వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడినందుకు సెబీ దర్యాప్తును ఎదుర్కొంటున్న బిజినెస్‌ గ్రూప్‌నకు చెందిన ఒకే మీడియా సంస్థకు వారిద్దరూ ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చారన్నది మరో ప్రశ్న. బిజెపికి, బూటకపు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వాహకులకు, అలాగే ఎగ్జిట్‌ పోల్స్‌కు ఒక రోజు ముందు పెట్టుబడులు పెట్టి, ఐదు కోట్ల మంది భారత రిటైల్‌ ఇన్వెస్టర్లను పణంగా పెట్టి పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించిన విదేశీ ఇన్వెస్టర్లకు మధ్య గల సంబంధం ఏమిటన్నదీ తేలాలి. కేవలం ఆర్థిక అంశమే అయితే సెబి దర్యాప్తులో వాస్తవాలు తెలియవచ్చు. కాని రాజకీయ నేతల పాత్ర, దేశ విదేశీ ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థల ప్రమేయం కలిగిన ఇటువంటి అంశంపై జెపిసి మాత్రమే అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం సాధ్యమవుతుంది.
పదేళ్ల క్రితం అధికారానికి వచ్చాక తమ పాలనలో కార్పొరేట్లకు అందునా క్రోనీలకే లబ్ధి చేకూర్చిన మోడీ మూడోసారి అధికారం చేపట్టకముందే దేశ విదేశీ ద్రవ్య బేహారులకు దేశంలోని సాధారణ మదుపరుల సొమ్మును హారతిగా ఇచ్చారు. అయితే, ఇంతకు ముందరి రెండుసార్లు మాదిరిగా కాకుండా ఇప్పుడు బిజెపి సొంత మెజార్టీ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్‌- స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణం పట్ల ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు గొంతెత్తాలి. తద్వారా సామాన్య మదుపరుల బాధ, ఆవేదనలకు ప్రతిస్పందించిన వారవవుతారు. అంతేగాక ఒక ప్రెజర్‌ గ్రూపుగా కూడా ప్రజలు వారిని గుర్తిస్తారు. ఇది కేవలం ఒక రాజకీయ అంశం లేక పాలనాపరమైనది మాత్రమేగాక ప్రజల కష్టార్జితం కొల్లగొట్టిన ఉదంతÛం. అందుకనే రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగు దేశం, జనతాదళ్‌ తదితర ఎన్‌డిఎ మద్దతు పార్టీలు ప్రతిస్పందించాలి. ఇదేదో మదుపరుల సమస్యగా మాత్రమేగాక జనం సొమ్ము కార్పొరేట్లు కొల్లగొట్టిన వ్యవహారం కనుక సమాజహితం కోరే శక్తులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అందుకు ప్రజలందరి మద్దతు అవసరం.

➡️