మరో నిరంకుశ చర్య

Jan 23,2025 06:08 #Articles, #edit page

వైస్‌ ఛాన్సలర్ల నియామకంపై గవర్నర్లకు పూర్తి అధికారం కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ జారీ చేసిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ రాష్ట్రాల హక్కులకు పాతర వేయడమే! ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఉన్నత విద్యా వ్యవస్థలో ఊహించడానికి కూడా సాధ్యం కాని మార్పులను కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తలపెట్టింది. వాటిలో అత్యంత కీలకమైనది వైస్‌ ఛాన్సలర్ల నియామక నిబంధనలను పూర్తిగా మార్చడానికి ప్రతిపాదించడం. వీరి నియామకాలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పాత్రను పూర్తిగా తొలగించడంతో పాటు, అన్ని అధికారాలను గవర్నర్లకు అప్పగించాలని పేర్కొనడంతో పాటు, వైస్‌ ఛాన్సలర్లకు ఎంపికకు సంబంధించిన విద్యాపరమైన అర్హతలను సడలించారు. విశ్వవిద్యాలయాలంటేనే మేథో నిలయాలు! వేనవేల చర్చలకు, భావాల ఘర్షణకు, నూతన ఆవిష్కరణలకు కేంద్రాలు! ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్‌ దేశ నిర్మాణం ఇక్కడే జరుగుతుంది. అటువంటి సంస్థకు నాయకత్వం వహించే వ్యక్తి ఎలా ఉండాలి? తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు రంగానికి చెందిన వారితో పాటు, ఎటువంటి అకడమిక్‌ అనుభవం లేని వారిని కూడా వైస్‌ ఛాన్సలర్లగా నియమించే అవకాశం ఉంది. పైగా దీనికి సంబంధించి ఎటువంటి సెర్చి కమిటీలు, అధ్యయనాలు, పరిశీలనలు ఉండవు. అంతా గవర్నర్‌ కన్నుసన్నల్లోనే! కీలకమైన బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన నియామకాల్లోనూ ఇటువంటి మార్పులనే కేంద్రం తాజాగా ప్రతిపాదించింది.

గవర్నర్‌కు అప్పగించే అధికారాలు నిజానికి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మతతత్వ, కార్పొరేట్‌ శక్తుల కలయికగా నరేంద్రమోడీ ప్రభుత్వం ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక కీలక రంగాలను సంఫ్‌ు పరివారంతోనూ, ఆ భావజాలంతోనూ నింపిన ఘనత కేంద్ర సర్కారుకు ఉంది. ఇప్పుడు ఉన్నత విద్యా రంగాన్ని అటువంటి మౌఢ్యపు ఆలోచనలతో మెదళ్లను నింపుకున్న వారితోనూ, ఆ భావజాలాన్ని ప్రచారం చేసే వారితోనూ నింపివేయడానికే ఈ కుటిల ఎత్తుగడలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనిలోపనిగా ఉన్నత విద్యను పూర్తి స్థాయిలో వ్యాపార మయం చేసి తమ కార్పొరేట్‌ బాస్‌ల ఆకాంక్షలను నెరవేర్చడానికి కూడా ప్రతిపాదిత మార్పులు ఉపయోగపడతాయి. అందుకే, రాష్ట్ర ప్రభుత్వాలతో, విద్యారంగ నిపుణులతో ఏ మాత్రం చర్చించకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం, యుజిసి ఈ ముసాయిదాను రూపొందించి విడుదల చేశాయి. ఈ చర్య పూర్తిగా అప్రజాస్వామికం!

రాజ్యాంగపు 42వ సవరణ ద్వారా ఉన్నత విద్యను రాష్ట్ర జాబితా నుండి, ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేశారు. దీనర్ధం కేంద్ర ప్రభుత్వానికి విశేషాధికారాలు కట్టబెట్టినట్లు కాదు. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌ రాష్ట్రాల జాబితాలోని 32వ అంశం ప్రకారం విశ్వవిద్యాలయాలను స్థాపించడానికి, పర్యవేక్షించడానికి రాష్ట్రాలకు అధికారం ఉంది. అందువల్లే, వివిధ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు ఆ యా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన చట్టాల ప్రకారమే నడుస్తాయి. ఆర్టికల్‌ 66 ప్రకారం ఉన్నత విద్యాలయాలు, పరిశోధన సంస్థలకు మధ్య సమన్వయం చేయడానికి, ప్రమాణాలు నిర్దేశించడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. 1949 ఆగస్టు 31న రాజ్యాంగ సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కూడా ఇదే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పారు. యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల నిర్వహణ కోసం అవుతున్న ఖర్చులో 80 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయి. అయితే, ఈ వాస్తవ పరిస్థితులు, రాజ్యాంగ నిర్దేేశాలను కేంద్రంలోని మోడీ సర్కారు నామమాత్రంగా కూడా పట్టించుకోవడం లేదు. అందుకే, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ఈ చర్యపై తీవ్రంగా స్పందించాయి. రెండు రాష్ట్రాలు ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాలు చేశాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులు కేంద ప్రభుత్వానికి, ఎన్‌డిఎ యేతర పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఆ రెండు రాష్ట్రాలే కాదు. ఉన్నత విద్యను కాషాయీకరించడాన్ని, వ్యాపారమయం చేసే ఎత్తుగడలను తిప్పికొట్టడానికి జరిగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. రాజ్యాంగాన్ని, అది నెలకొల్పిన విలువలను రక్షించుకోవాలి.

➡️