ఏకపక్ష చర్య

ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష నిర్ణయాల జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుంది. ఆ జాబితాలోకి తాజాగా వక్ఫ్‌ సవరణ బిల్లుపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ప్రహసనం కూడా చేరింది. బిజెపి ఎంపి జగదాంబికా పాల్‌ నేతృత్వంలోని జెపిసి ప్రతిపక్షాలు చేసిన ప్రతిపాదనల్లో ఒక్కదానిని కూడా పరిగణన లోకి తీసుకోలేదు. గంపగుత్తగా వీటన్నింటిని తిరస్కరించి, అధికార పక్ష సవరణలనే ఏకపక్షంగా ఆమోదించుకుంది. మోడీ మార్కు నిరంకుశత్వానికి ఇదొక నిదర్శనం. ఈ ఏకపక్ష చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ మోడీ సర్కారు కొంచెం కూడా చలించకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల దాని లెక్కలేని తనాన్ని తెలియజేస్తోంది. ఈ బిల్లు ద్వారా ముస్లిం ధార్మిక ఆస్తుల నిర్వహణ విధానంలో మోడీ ప్రభుత్వం 44 మార్పులు చేస్తోంది. గత ఏడాది ఆగస్టులో మోడీ ప్రభుత్వం లోక్‌సభలో ప్రతిపాదించిన బిల్లులో 14 మార్పులు చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఈ మార్పులన్నీ బిజెపి, ఎన్‌డిఎ కూటమిలోని పార్టీలు ప్రతిపాదించినవే కావడం గమనార్హం. జెపిసిలో ఆమోదం పొందడంతో బడ్జెట్‌ సమావేశాల్లోనే ఈ వివాదాస్పద బిల్లు మరోసారి పార్లమెంటుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నిజానికి, ఈ బిల్లు విషయంలో మోడి ప్రభుత్వం మొదటి నుండి ఏకపక్షంగానే వ్యవహరిస్తూ వచ్చింది. రాష్ట్రాల జాబితాల్లోకి వచ్చే భూముల అంశంలోకి కేంద్రం చొరబాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ముస్లింలకు సంబంధించిన వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం కల్పించడం ద్వారా వక్ఫ్‌ ఆస్తులను తన పెత్తనం కిందకు తెచ్చుకోవాలన్న హిందూత్వ శక్తుల పన్నాగం దాగిఉంది. దీనిపై బిల్లును మోడీ ప్రభుత్వం రూపొందించింది. దీంతో భగ్గుమన్న ప్రతిపక్షాలు అప్పట్లో తీవ్ర స్థాయిలో స్పందించాయి. ఈ బిల్లు సమాఖ్య వాదానికి తూట్లు పొడుస్తోందని విమర్శించాయి. సిపిఎం ఎంపి కె. రాధాకృష్ణన్‌ కేంద్రం ప్రతిపాదించిన బిల్లు ఎలా రాజ్యాంగ వ్యతిరేకమో సోదాహరణంగా వివరించారు. రాజ్యాంగంలోని 25, 26, 27, 28, 29, 30 ఆర్టికళ్లకు ఇది విరుద్ధమని చెప్పారు. బిల్లుతో వక్ఫ్‌బోర్డు నామినేటెడ్‌ బోర్డుగా మారుతుందని, భాగస్వామ్య పక్షాలతో ఎందుకు చర్చించలేదని నిలదీస్తే ప్రభుత్వం నుండి సమాధానం లేదు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వేరే గత్యంతరం లేని స్థితిలో మోడీ ప్రభుత్వం బిల్లును జెపిసికి నివేదించింది. నిష్పక్షపాతంగా చర్చ జరగాల్సిన జెపిసిలో కూడా సంఖ్యాబలాన్ని ఆసరాగా తీసుకుని ఒంటెత్తుపోకడలకు పోయింది. మూడు రోజుల క్రితం జరిగిన జెపిసి తొలి సమావేశంలోనే పదిమంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేయడం ద్వారా జెపిసి తన ఏకపక్ష, పక్షపాత వైఖరిని స్పష్టం చేసిన జెపిసి ఛైర్మన్‌ ఆ తరువాత కూడా ఆ ధోరణినే కొనసాగించారు. నిర్దేశిత షెడ్యూల్‌ను ముందుకు మార్చడం, సమయం లేదంటూ సభ్యులందరికీ కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం, ప్రతిపక్షాల వినతులను ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా, అధికార పక్ష సవరణలతో ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలను మత ప్రాతిపదికన విభజించడం ద్వారా లబ్ధి పొందాలన్న ఏకైక లక్ష్యంతో బిజెపి ఈ తరహా కపట విన్యాసాలకు పాల్పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
తాజా బిల్లు చట్ట రూపం దాల్చితే, ప్రస్తుతం ఉన్న కేంద్ర వక్ఫ్‌ కౌన్సిల్‌, రాష్ట్రాల వక్ఫ్‌బోర్డులు రద్దు కావడమో, నామమాత్రావశిష్టంగా మిగిలిపోవడమో, పరిమితం కావడమో జరుగుతుంది. వివాదంలో ఉన్న భూమిని ప్రభుత్వం నియమించిన అధికారి తనిఖీ చేస్తారని, ఆయన ప్రభుత్వ భూమి అని నిర్ధారిస్తే, వక్ఫ్‌బోర్డుకు ఇక ఎటువంటి హక్కులు ఉండవని జెపిసి ఆమోదించిన సవరణల్లో పేర్కొన్నారు. ఏదైనా ఆస్తిని వక్ఫ్‌ ఆస్తిగా ప్రకటించడానికి ఇప్పటిదాకా వక్ఫ్‌ బోర్డుకు ఉన్న అధికారాన్ని కూడా తొలగించారు. ప్రస్తుతం ముస్లిమేతరులు కూడా వక్ఫ్‌కు భూమిని విరాళంగా ఇవ్వవచ్చు. తాజా సవరణల ప్రకారం అటువంటి అవకాశం ఉండదు. భూమి ఇచ్చే వారు కనీసం ఐదేళ్లపాటు ఇస్లామిక్‌ మత పద్ధతుల ప్రకారం జీవించినట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజలకు ఉన్న మత హక్కును హరించడమే! సున్నితమైన ఈ అంశంపై విస్తృత చర్చల ప్రాతిపదికన కాకుండా మోడీ ప్రభుత్వం దుందుడుకుగా, ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గం! ఈ ఏకపక్ష చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి.

➡️