రాజ్యాంగబద్ధ సంస్థల్లోకి తమకు తలలూపే మనుషులను జొప్పించి, వ్యవహారాలను తనకు అనుకూలంగా మార్చుకునే మంత్రాంగాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చాలా ఏళ్లుగా నడుపుతోంది. తాజాగా వివాదాస్పదం అయిన కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం ఆ తంతుకు కొనసాగింపు. ఏకపక్ష నియామకానికి అవకాశం ఇచ్చే విధంగా చట్టంలోనే మార్పు తెచ్చిన బిజెపి, దాని మీద అత్యున్నత న్యాయస్థానంలో కేసు నడుస్తుండగానే ఆగమేఘాల మీద కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్‌ని నియమించటం అప్రజాస్వామికం. కోర్టులో వ్యాజ్యం తేలేదాకా నియామకంపై వేచి చూద్దామని ప్రతిపక్ష నేత సూచించినా, దానిని పెడ చెవిని పెట్టటం కేంద్రం ఏకపక్ష ధోరణికి నిదర్శనం.
ఇటీవల దేశంలో ఏ ఎన్నిక జరిగినా కేంద్ర ప్రభుత్వ తీరు మీదా, ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మీదా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ సాక్షాత్తూ ప్రధానమంత్రి మోడీ విద్వేష వ్యాఖ్యలు చేసినా ఏమాత్రం చలించని ఎన్నికల సంఘం-ప్రతిపక్ష నేత చిన్న ఉల్లంఘనకు పాల్పడ్డా తీవ్రంగా స్పందించింది. మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాలపై సిపిఎం, ఇతర పార్టీలూ ససాక్ష్యంగా ఫిర్యాదు చేసినా, కట్టడికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో అసాధారణంగా పెద్ద సంఖ్యలో ఓటర్లు చేరటంపై అభ్యంతరాలు, అనుమానాలూ వ్యక్తం చేసినా ఎన్నికల సంఘం కిమ్మనలేదు. ఓడిన వారు చేసేవన్నీ ఆధారాలు లేని ఆరోపణలే అని కొట్టి పారేసింది తప్ప-అలాంటి అనుమానాలకు తావిచ్చిన పరిస్థితులపై కనీస పరిశీలన చేయలేదు. ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నికల కమిషన్ నిబద్ధత, నిష్పాక్షికత పట్ల అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రత, పారదర్శకతలపై అనుమానాలూ, ఆరోపణలూ తలెత్తినప్పుడు వాటిని నివృత్తి చేయటం ఆ సంస్థల బాధ్యత. నమ్మకం సడలిపోని విధంగా ప్రవర్తించటం కేంద్ర పాలకుల కనీస నైతికత. కానీ, మోడీ ప్రభుత్వం నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న తరహాలోనే వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాల మీద తిరిగి గద్దింపులకు దిగుతోంది.
చట్టసభలకు సత్తువను, ప్రజాస్వామ్యానికి విలువనూ చేకూర్చే ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగే ఎన్నికల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని పార్టీలూ, అర్హత గల వ్యక్తులూ ఎన్నికల్లో పాల్గొనటానికి భయాలూ ప్రలోభాలూ లేని పరిస్థితుల్లో పౌరులు ఓటుహక్కు వినియోగించుకోవటానికి సమాన అవకాశాల్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది. ఒక పార్టీకో, అధికారానికో తలూపే గంగిరెద్దు బాపతు అధికారులతో నిష్పాక్షిక నిర్వహణ సాధ్యం కాదు. ఏ అధికార బలానికీ భయపడని, తలొగ్గని నిబద్ధులే ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలి. రాజ్యాంగబద్ధంగా అలాంటి అధికారమూ, బాధ్యత ఎన్నికల సంఘానికి దఖలు పడినప్పటికీ-దాని నిష్పాక్షికతకు, స్వేచ్ఛకు దెబ్బ కొట్టేలా మోడీ సర్కారు చట్టం తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక సిఫార్సు కమిటీలో గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండేవారు. ఆ కూర్పులో సిజెఐ స్థానే కేంద్రమంత్రిని చేర్చుతూ, బిజెపి తెచ్చిన చట్టం వివాదాస్పదం అయింది. ముగ్గురిలో ఇద్దరు అధికార పక్షానికి చెందినవారే కాబట్టి-సహజంగానే కమిషనర్ల నియామకంలో వారి మాటే చెల్లుబాటు అవుతుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై ఆ మర్నాడే విచారణ ఉన్నప్పటికీ, బిజెపి కనీస విలువ పాటించకుండా అత్యవసర నియామకానికి దిగింది. కమిటీలో సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా మోడీ, అమిత్‌షా జోడీ సిఫార్సు చేయటం, రాష్ట్రపతి ఆమోదించటం, జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించటం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ హడావిడి తతంగంలో తమ మాట చెల్లుబాటు కావాలన్న కమలనాథుల స్వార్థం తప్ప మరొకటి కనపడదు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే వ్యవస్థలు భ్రష్టు పడతాయి. ఇప్పటికే ప్రమాదకరంగా ఆవరించి ఉన్న మోడీ సర్కారు నిరంకుశ, అప్రజాస్వామిక ధోరణులకు అడ్డుకట్ట వేయడం ప్రజల, ప్రజాస్వామిక వాదుల కర్తవ్యం.