మెరుగ్గా ‘ఆడుదాం ఆంధ్ర’

Dec 7,2023 07:12 #Andhra Pradesh, #Articles, #DYFI, #Sports
article on atadukundam andhra sports in ap ramanna

”ఆడుదాం-ఆంధ్ర” దేశంలోనే అతిపెద్ద మెగాటోర్నీగా చరిత్రలో నిలిచిపోతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. యువతను క్రీడలవైపు ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన సమాజం వైపు నడిపించడంపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్రపంచీకరణ యుగంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధించాము. దాంతో పాటు అంతే స్థాయిలో అసమానతలూ పెరిగాయి. ఇప్పుడున్న యువతరం ఆటలు అంటే మొబైల్‌ ఫోన్‌లో ఆటలే అనే పరిస్థితి ఏర్పడింది. పోటీ ప్రపంచంలో మెజారిటీ విద్యార్థులకు, యువతకు ఆటలు దూరమై చాలా కాలం అవుతుంది. అంతేకాక డ్రగ్స్‌కు, ఇతర చెడు అలవాట్లకు యువత బలి అవుతుంది. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న గ్రామీణ, సంప్రదాయ క్రీడలను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలి. ఇవి గెలుపు కోసమో లేదా ప్రైజ్‌ మనీ కోసం మాత్రమే కాదు. మనుషుల మధ్య ఐక్యతకు దోహదం చేస్తాయి. శారీరక మానసిక ఉల్లాసం, ఉత్సాహంతో పాటు ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా దేహదారుఢ్యం పెంచుతుంది. ఆరోగ్యకరంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది. క్రీడల వల్ల చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుందని అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ”ఆడుదాం ఆంధ్ర” పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించడాన్ని అభినందించాలి. దీంతో పాటు 15 ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహిస్తే బాగుండేది. ప్రాథమిక స్థాయి నుంచి ఇటువంటి ఆటల పోటీలు పిల్లలకు నాయకత్వ లక్షణాలు నేర్పుతాయి. సమిష్టితత్వం అలవడుతుంది. ఇందులో అథ్లెటిక్స్‌ కూడా చేర్చి ఉంటే మరింత ఉత్సాహంగా యువత పాల్గొనేవారు.

ఇదంతా బాగానే ఉన్నా ఈ పోటీలకు గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో తగిన ఆటస్థలాల్లేవు. మరి ఎక్కడ నిర్వహిస్తారన్నదే పశ్న. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు గ్రామ స్థాయి నుంచి క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి, క్రీడా సామగ్రిని సమకూర్చి, వసతులు కల్పిస్తే ”ఆడుదాం ఆంధ్ర” తప్పకుండా విజయం సాధిస్తుంది. ప్రస్తుత స్థితి అయితే కేవలం ప్రభుత్వ ప్రచార ఆర్భాటం కోసం హడావుడిగానే మిగిలిపోతుంది. ఇప్పటికే క్రీడల్లో మన రాష్ట్రం బాగా వెనుకబడి ఉంది. కొన్ని క్రీడా మైదానాలు కబ్జాకు గురైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రాయలసీమ విశ్వవిద్యాలయంలోనే స్టాండింగ్‌ ట్రాక్‌లు లేవంటే మారుమూల గ్రామాల పరిస్థితి అర్థం అవుతుంది. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే నాడు నేడు పేరుతో ఒక్క క్రీడా మైదానాన్ని నిర్మించారా? గత ప్రభుత్వం గాండీవం పేరుతో పాంచజన్య ప్రాజెక్టు కింద నిధులు కేటాయించినా పూర్తి స్థాయిలో ఖర్చు చేయకుండా క్రీడలకు అన్యాయం చేసింది. ప్రస్తుత యువ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పరిస్థితి మారుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. సిఎం పుట్టిన రోజున సీఎం కప్పు పేరుతో క్రీడలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు తప్ప నిధులు ఇవ్వలేదు. దీంతో పిల్లల చార్జీలు, ఇతర ఖర్చులు పీడీలు, పీఈటిలే భరించారు. ఇంకొన్ని చోట్ల విద్యార్థులే భరించాల్సిన పరిస్థితి వచ్చింది. అంత పెద్ద టోర్నీ నిర్వహించి నిధులు ఇవ్వకపోవడం ఎమిటి? గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి ప్రోత్సాహకాలు ఇప్పటివరకు అరకొరగా చెల్లించింది. ఇందులో స్వర్ణపతకం 5 లక్షలు, రజిత పతకం 4 లక్షలు, క్యాంసం పతకం సాధించిన వారికి 3 లక్షల రూపాయల చొప్పున అందించాలి. జీవోలు ఇచ్చారు తప్ప నగదు మాత్రం ఇవ్వకుండా శాప్‌ కార్యాలయం చుట్టూ క్రీడాకారులను ప్రదక్షిణలు చేయిస్తున్నారు. మరి ఈ ఏడాది గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల్లో గెలుపొందిన వారికి ప్రోత్సాహకాలు ఎప్పుడిస్తారో చూడాలి!

శాప్‌ తీరే క్రీడాకారులకు శాపం

రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించడం, శిక్షణా, క్రీడా సామగ్రి ఇచ్చి ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) ఉద్దేశం. కానీ ఇప్పుడు దానికి బదులుగా శాప్‌ వ్యాపారం చేస్తోంది. ఎవరైనా క్రీడలు నేర్చుకోవాలని ప్లే గ్రౌండ్‌కు వస్తే గంటల చొప్పున రేటు నిర్ణయించారు. క్రీడా మైదానాలను, స్టేడియాలను, స్విమ్మింగ్‌ ఫూల్‌, జిమ్‌ సెంటర్లను నిర్వీర్యం చేసేందుకు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. మహిళా క్రీడాకారులను వేధించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, నగదు ప్రోత్సాహకాల కోసం వచ్చిన వారిని కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం, సామగ్రి కొనుగోలులో అవినీతి ఆరోపణలొస్తున్నాయి. ఇటీవల కాలంలో శాప్‌లో కోచ్‌ల రిక్రూట్మెంట్‌ లేదు. పర్మినెంటు కోచ్‌లు పట్టుమని పదిమంది లేరు. కనీస వేతనాలివ్వడం లేదు. గత ఐదు నెలలుగా వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా తీసుకున్న కోచ్‌లకు వేతనం రూ. 19,500, ణూA కోచ్‌లకు వేతనం రూ.15,000 ఇస్తున్నారు. చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు కోచ్‌లు. అర్హత, వారు సాధించిన పతకాల ఆధారంగా కోచ్‌లను ఎందుకు పర్మినెంట్‌ చేయడం లేదు?

షెడ్యూల్‌

డిసెంబర్‌ 15 నుంచి 20 వరకు గ్రామ/వార్డు స్థాయిలో, 21 నుంచి జనవరి 4 వరకు మండల స్థాయిలో, జనవరి 5 నుంచి 10 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 11 నుంచి 21 వరకు జిల్లా స్థాయి, జనవరి 22 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు 15 ఏళ్ల వయసు నుంచి పైబడిన ప్రతి ఒక్కరూ అర్హులే. ప్రతి క్రీడాకారుడూ రెండు క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది. అన్ని క్రీడా పోటీల్లోనూ మహిళలకూ ప్రవేశం ఉంది. వారికి వేరుగా పోటీలు నిర్వహిస్తారు. నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 13 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్‌ ప్రభుత్వం ఇచ్చిన లింక్‌ ద్వారా గానీ, 1902కి కాల్‌ చేసి గానీ, సచివాలయం దగ్గర గానీ, వలంటీర్ల్‌ ద్వారా గానీ నమోదు చేసుకోవచ్చు. మొత్తం 3 లక్షల మ్యాచ్‌లు నిర్వహిస్తారు. వీటితో పాటు కాలయాపన కోసం యోగా, మారథాన్‌, టెన్నీకాయిట్‌ వంటి పోటీలేని సంప్రదాయ క్రీడలు నిర్వహించనుంది. ఈ క్రీడలను ఎవరు నిర్వహించాలి ?రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలు టోర్నీని జిల్లా కలెక్టర్‌, సిఇఓ, చీఫ్‌ కోచ్‌ల సమన్వయంతో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఎలా నిర్వహిస్తారు? వారికి ఉన్న అవగాహన ఎంత? రాష్ట్ర వ్యాప్తంగా 15004 గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రతి సచివాలయం నుంచి 10 మంది వలంటీర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. సుమారు 1.50 లక్షలమంది వలంటీర్లకు ఐదు రకాల క్రీడల నిర్వహణకు అవగాహన కల్పించేందుకు పీఈటి, పిడి, జిల్లా చీఫ్‌ కోచ్‌ల ద్వారా క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) అన్‌లైన్‌లో ఐదు రకాల క్రీడలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మొత్తం క్రీడాకారులు 34 లక్షల మంది పాల్గొంటారని అంచనా. సంవత్సరాలుగా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విద్య చదివిన వారిని పక్కన పెట్టి కేవలం వారం రోజులు అన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చి ఆటలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి? అది జరిగే పనేనా? రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు UGD, MPED, BPED తదితర ఫిజికల్‌ కోర్సులు చదివి ఉన్నారు కదా. వారిని ఎందుకు ఉపయోగించరాదు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు యాడ్స్‌ ఇచ్చి ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ యువతపై ఎందుకు చూపడం లేదు?

బాల్యం నుంచే ప్రారంభం

క్రీడల అభివద్ధిలో దేశం వెనకబడి ఉంది. ఇటీవల బీజింగ్‌లో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో 107 పతకాలు సాధించి పర్వాలేదు అనిపించినా అది ప్రభుత్వ ప్రోత్సాహంతో కాక…వారి సొంత సామర్థ్యంతో నెట్టుకొచ్చారు అన్నది మాత్రం నిజం. మన జనాభా ప్రకారం మనం ఎక్కడ ఉండాలి. ఎక్కడ ఉన్నాం. అనేది చూస్తే అర్థం అవుతుంది. ఉదాహరణకు మన పక్కనే ఉన్న చైనా క్రీడల కోసం నిధులు కేటాయింపు, బాల్య దశ నుంచి శిక్షణ, ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఈరోజు ఆసియా క్రీడల్లో మొదటి స్థానంలో, ఒలింపిక్స్‌లో అమెరికాను చివరి దాకా వెంటబడి రెండో స్థానంలో నిలిచింది. కేవలం ఒలింపిక్స్‌లో, అంతర్జాతీయ స్థాయిలో గెలిచినప్పుడు మాత్రం కోట్ల రూపాయలు నగదు ప్రకటించి, ఉద్యోగం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత క్రీడల ఊసే ఉండదు. మన రాష్ట్రంలో వందలాది పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు లేరు. ఒక సర్వే ప్రకారం రెండు వేల మందికి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయడూ లేడు. పాఠశాలలకు ప్రతి ఏడాది స్పోర్ట్స్‌ కిట్టు ఇవ్వలేకపోతే వారు ఏమి నేర్చుకుంటారు? దేంతో ప్రాక్టీస్‌ చేయాలి? ఏదైనా జోనల్స్‌ జరిగితే సొంత ఖర్చుతోనో లేదా వ్యాయామ ఉపాధ్యాయుడి ఖర్చుతోనో లేదా దాతల సహకారంతోనో వెళ్లాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కదా. గతంలో ప్రతి మండలానికి ఇండోర్‌ స్టేడియం అని 2.10 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎక్కడా పనులు పూర్తి కాలేదు. ఇప్పటివరకు గుంతలు తవ్వి వదిలేశారు. కొన్ని చోట్ల ట్రాక్‌ వేసి వదిలేశారు. వెయ్యి మంది విద్యార్థులు ఉన్న హైస్కూల్లోనే సంవత్సరానికి క్రీడల కోసం ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. ప్రైవేట్‌ పాఠశాలల్లో అయితే సరే సరి. కనీసం ఉదయం ప్రేయర్‌ చేసుకోవడానికి కూడా స్థలం ఉండదు. అన్ని రూమ్‌లు అగ్గిపెట్టెల్లాగా ఉంటాయి. 74 జీవోను సైతం సక్రమంగా అమలు చేయడం లేదు. కేరళ, తమిళనాడు, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలు పెద్ద ఎత్తున క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా 4 శాతం అమలు చేస్తున్నారు. కొన్ని ఉద్యోగాలు డైరెక్ట్‌గా స్పోర్ట్స్‌ కోటాలో ఇస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం అలా జరగడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బాల్య దశలోనే క్రీడలకు ప్రాధాన్యత, క్రీడా రంగానికి నిధులిచ్చి విద్యార్థులను ప్రోత్సహించాలి. ఉద్యోగాల్లో 2% కోటాను పెంచాలి.

ఆడుదాం ఆంధ్ర ప్రోత్సాహాకాలు

‘ఆడుదాం ఆంధ్ర’ టోర్నీలో పాల్గొనే జట్లకు ఐదు దశల్లో మొదటి రెండింటికి నగదు బహుమతి లేదు. కేవలం షీల్డ్‌, సర్టిఫికేట్లు మాత్రమే అందజేస్తారు. అయితే సర్టిఫికెేట్లకు ఎటువంటి విలువ ఉండదనేది వాస్తవం. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లేదా రిజిస్ట్రేషన్‌ క్రీడా సంఘాలు ఇచ్చే సర్టిఫికెేట్లకు మాత్రమే విలువ ఉంటుంది. గతంలో నిర్వహించిన సీఎం కప్పునకు నిధులివ్వకుండా చేసినట్లు ఇప్పుడు కూడా చేయరు కదా ! అని క్రీడాకారులు భయపడుతున్నారు.

బ్రాండ్‌ అంబాసిడర్లు

ఆసియా క్రీడల్లో గెలుపొందిన మన తెలుగు బిడ్డ మైనేని సాకేత్‌ (రజితం) టెన్నిస్‌ క్రీడాకారుడు. వెన్నం జ్యోతి సురేఖ, యర్రాజి జ్యోతి, బొమ్మదేవర ధీరజ్‌, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక వంటి క్రీడాకారులను దీనికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించడం ఆహ్వానించదగ్గ విషయం. రాష్ట్రానికి పేరు, ప్రతిష్ట తెచ్చి తెలుగు జాతి గౌరవాన్ని దేశం నలుమూలలకు తీసుకెళ్లిన వారికి తగిన గౌరవం దక్కింది. అదేవిధంగా జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిలో కూడా మరికొంతమంది పతకాలు సాధించిన క్రీడాకారులను ఎంపిక చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సినవి

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి. ప్రతి మండల కేంద్రంలో ఇండోర్‌ స్టేడియాలను నిర్మించాలి. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడ్పి నియమించి స్పోర్ట్స్‌ మెటీరియల్‌ ఉచితంగా పంపిణీ చేయాలి. ఆగిన జోనల్స్‌ ప్రారంభించాలి, కోచ్‌ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి. ఉన్న కోచ్‌లకు కనీస వేతనాలు చెల్లించాలి. ఉద్యోగాలలో స్పోర్ట్స్‌ కోటాను పెంచాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన వారికి పెండింగ్‌లో ఉన్న నగదు ప్రోత్సాహకాలు వెంటనే చెల్లించాలి. కబ్జాకు గురైన క్రీడా మైదానాలను కాపాడాలి. పేÊప్లే విధానాన్ని రద్దు చేయాలి. క్రీడల అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయించి ఖర్చు చేయాలి. శాప్‌ కోచ్‌లకు కనీస వేతనాలు అమలు చేయాలి.

article on atadukundam andhra sports in ap ramanna
వ్యాస రచయిత : జి. రామన్న, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి, 9177590726
➡️