అంగన్‌వాడీలపై ‘ఎస్మా’ అప్రజాస్వామికం

article on esma on anganwadi workers in ap ycp govt

పాలకులందరూ ఒక చెట్టు కర్రలే. ఆ కర్రలతో వాయించడమే వారికి తెలిసిన విద్య. కాకపోతే ఒకొకసారి సన్నాయి వాయించి, అసలు సమయం వచ్చినప్పుడు ప్రజల వీపులు వాయిస్తారు. అన్ని ముసుగులు ఉద్యమాల కాలంలోనే తొలగిపోతాయి. బాంధవుళ్లు అన్న నోళ్ళే ఒళ్ళు బలిసిందా అని ఘీంకరిస్తారు. సమ్మెలు ఆపుతారా, అణచివేయమంటారా అని గాండ్రిస్తారు. ఉడత ఊపులకే ఉద్యమాలు భయపడితే ఈ మాత్రం స్వేచ్ఛ, ఈ మాత్రం హక్కులు శ్రమజీవులకు దక్కెేవి కాదన్నది చరిత్ర చెబుతున్న సత్యం.

ఇందిరమ్మ కాలం నాటి ‘ఎస్మా’ చట్టం ఈ అన్న రాజ్యంలో మరోసారి ఆంధ్ర రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. దేశ చరిత్రలో అత్యంత భయానక చీకటి రోజులుగా నిలవడానికి కారణమై, చెత్తబుట్టలో మూలుగుతున్న ‘ఎస్మా’ చట్టాన్ని ముఖ్యమంత్రి మరోసారి బూజుదులిపి అంగన్‌వాడీలపై ప్రయోగించి నాటి రోత చరితకు వారసుడుగా నిలవదలిచారా! 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ‘ఎస్మా’ (అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం) ఆయుధాన్ని జీవో నెంబర్‌ 2 ద్వారా ఉపయోగించడం ఎవరిని సంతృప్తి పరచడానికి? ఏం సాధించడానికి? బ్రహ్మాస్త్రం ఉందో లేదో తెలియదు, ఒకవైళ ఉంటే పిచుకుల మీద ప్రయోగిస్తే ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. కాని బలమైన సర్పం చలి చీమల చేత చిక్కి చావడం మాత్రం నిత్య అనుభవమే. పాలకుల అణచివేత ఉన్నచోటల్లా ఉద్యమ కెరటాలు లేస్తూనే ఉంటాయి. ఇది చరిత్ర నేర్పుతున్న సత్యం. అధికార మదాంధకారంలో విర్రవీగిన నేతలకు చరిత్రలో ఏ గతి పట్టిందో ఎస్మా పాలకులు గుర్తుంచుకోవాలి.

కనీస వేతనం ఇవ్వండి, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించండి అని ఇన్నేళ్ళుగా అంగన్‌వాడీలు అడుగుతుంటే…’మీ సేవ స్వచ్ఛందం’ అని చెప్పిన పాలకులకు 25 రోజుల సమ్మె తర్వాత వీరి సేవ అత్యవసరం అని గుర్తుకు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు కాని స్వచ్ఛంద సేవకులమైన మా మీద ఎస్మా ఎలా ప్రయోగిస్తారు అని అంగన్‌వాడీ కార్మికులు అడుగుతున్న ప్రశ్నకు ఇప్పుడు పాలకులు జవాబు చెప్పాలి. తనను అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారని సానుభూతి పవనాల కోసం నిత్యం పరితపించే ముఖ్యమంత్రి నేడు అంగన్‌వాడీల మీద ఎస్మా పెట్టడం ఏం న్యాయమో, ఏం సక్రమమో ఆంధ్ర ప్రజలకు చెప్పాలి. అంగన్‌వాడీలపై ఎస్మా చట్టాన్ని ఉపయోగించిన రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను నిషేధించడంతో పాటు వారి వేతనాలకు కోత కోసింది.

  • అంగన్‌వాడీల సమ్మె ఎందుకు?

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లో సుప్రీంకోర్టు చెప్పింది. అంగన్‌వాడీల నియామకంలో కాంట్రాక్టర్లు, ఏజెంట్ల లాంటి మధ్యవర్తులు ఎవరూ లేరు. ప్రభుత్వమే నియమిస్తుంది. ప్రభుత్వమే పని చేయించు కుంటుంది. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు వీరికి వర్తిస్తుంది. దీని ప్రకారం రెగ్యులర్‌ ఉద్యోగుల్లో చిట్టచివరన ఉన్న వారికి చెల్లించే కనీస వేతనం, డి.ఎ, ఇతర అలవెన్స్‌లు కలిపి రూ. 26 వేలు ఇవ్వాలి. వాస్తవంగా కార్మికులకు పి.ఎఫ్‌, ఇఎస్‌ఐ, పెన్షన్‌ అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఇవి ఏవీ అంగన్‌వాడీలకు అమలు కావడంలేదు. అయినా నేడు అంగన్‌వాడీలు అడుగుతున్నదేమిటి? తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీలకు ఇచ్చే వేతనం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వమని. ఇలా ఇస్తామని ఎవరు చెప్పారు? స్వయానా నేటి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పూర్తయింది. ప్రస్తుతం తెలంగాణలో ఇస్తున్న వేతనాల కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వమని వారు అడుగుతున్నారు. అలా కాదు. మేము అధికారంలోకి వచ్చిన నాటికి ఎంత వేతనం ఉంటే దానిపై వెయ్యి ఇస్తామన్నామని మంత్రి గారు సెలవిస్తున్నారు. అలాగేకాని, మీరు అధికారంలోకి వచ్చిన నాడు సరుకుల ధరలు, ఇంటి బాడుగలు, బస్సు చార్జీలు, పిల్లల చదువుల ఫీజులు, ఆసుపత్రుల వైద్యం ఫీజులు ఎంత ఉంటే అంతకే ఇవ్వండి. వేతనం పెంచమని మేము అడగమని అంగన్‌వాడీలు అంటున్నారు. ఇప్పుడు చెప్పండి మాట తప్పింది ఎవరు? మడమ తిప్పింది ఎవరు?

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు అమలు చేయమని అడిగినా…చట్టబద్ధంగా, అత్యంత ప్రజాస్వామిక పద్ధతుల్లో విజ్ఞప్తులు, ఆందోళనలు చేసినా…చలించక, అనివార్యంగా సమ్మె చేసే పరిస్థితులను సృష్టించిన పాలకులు నేడు అంగన్‌వాడీలను నేరస్థులుగా చూస్తారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్‌వాడీల ఉద్యమాలను బలపరచిన పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అణచివేయాలని చూడడం పాలకుల ద్వంద్వనీతికి నిదర్శనం.

  • ‘ఎస్మా’ చట్టం అంటే?

‘ఎస్మా’ అనేది భారత పార్లమెంట్‌ చట్టం. అత్యవసర సేవలకు అంతరాయం కలుగకుండా కేంద్రం లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సందర్భాల్లో అమలు చేయడానికి రూపొందించుకున్న చట్టం ఇది. పేరుకు ఏం చెప్పినా సమ్మెలను, కార్మిక ఉద్యమాలను అణచివేయడానికి పాలకులు తయారు చేసుకున్న అస్త్రం ఇది. 1968లో రూపొందించబడిన ఈ చట్టం 1971, 1981, 1985, 1990, 2013లలో పలు మార్పులు చేయబడింది. ఈ చట్టం ప్రకారం నిర్దేశించన రంగం లేదా ప్రాంతంలో కనీసం ఆరు నెలల పాటు సమ్మెలు చేయడానికి వీలుండదు. ఒకవేళ సమ్మె చేస్తే వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయవచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వారితో పాటు, వారిని ప్రోత్సహించారనే పేరుతో ఎవరినైనా నిర్బంధించవచ్చు. తనకు దేశంలో ఎదురు లేదని భావించిన ఇందిరా గాంధీ సర్కారు 1971లో ఈ చట్టాన్ని ఉపయోగించి 16 సంస్థల్లో కార్మికుల సమ్మెలను నిషేధించింది. రైల్వే కార్మికులపై ఎస్మా, నాసా చట్టాలను ప్రయోగించి వారి సమ్మెను క్రూరంగా అణచివేయాలని చూసింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరగడంతో దేశం మొత్తం ఎమర్జెన్సీని విధించింది. నియంతగా వ్యవహరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీనే కాదు, ఆమె కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆనాడు పోరాడిన కార్మికులు కోల్పోయిన హక్కులను, ఉద్యోగాలను తిరిగి సాధించుకొని చరిత్రలో నిలిచిపోయారు. మన రాష్ట్రంలో కూడా విద్యుత్‌, ఆర్టీసీ కార్మికులు సమ్మెలు చేసిన సమయంలో నాటి ప్రభుత్వం ఈ ఎస్మాను ప్రయోగించింది. పోలీసుల ద్వారా సమ్మె శిబిరాలను తొలగించింది. ప్రదర్శనలను నిషేధించింది. చివరకు కార్మిక ఉద్యమానికి తలొంచి చర్చలు జరిపి ఆయా రంగాల కార్మికుల డిమాండ్లను పరిష్కరించాల్సి వచ్చింది. మన జీవిత కాలంలోనే కేంద్రంలో నరేంద్ర మోడీ చారిత్రాత్మకమైన రైతాంగ ఉద్యమాన్ని ఎంతగా అణచిపెట్టాలని చూశారో, ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేశారో చూశాం. చివరకు జరిగింది ఏమిటి, దేశ ప్రజలకు ఆ ప్రధానే క్షమాపణ చెప్పుకోవలసి వచ్చింది. అదే ఉద్యమాల బలం. దాన్ని గుర్తించ నిరాకరిస్తే ఆ పాలకుల గతే ఈ ప్రభుత్వానికీ పడుతుంది.

ఉడత ఊపులతో, తాటాకు చప్పుళ్లతో కార్మిక వర్గాన్ని భయపెట్టి లొంగదీసుకోవాలనుకోవడం పాలకుల దుర్నీతి. పాలకులు ఎవరైనా వారి బుద్ది కార్మిక, కష్టజీవులను అణచివేయడమే. అందుకు వైసిపి మినహాయింపు కాదని రుజువైంది. నేడు అంగన్‌వాడీలు, రేపు ఎవరైనా ఈ చట్టానికి గురికావలసి వస్తుంది. అందుకే ఎస్మా చట్టం ప్రయోగానికి వ్యతిరేకంగా, తమ డిమాండ్ల సాధనకు పోరాడుతున్న అంగన్‌వాడీ, మున్సిపల్‌, ఎస్‌ఎస్‌ఎ కార్మికులకు అండగా నిలవడం ప్రజాతంత్రవాదులందరి కర్తవ్యం.

 

– వ్యాసకర్త : వి. రాంభూపాల్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

➡️