అరుణ తార ఆర్‌.ఎస్‌

Sep 6,2024 05:40 #Articles, #Aruna Tara R.S, #edit page

పార్టీ శ్రేణులు ఆప్యాయంగా ఆర్‌.ఎస్‌ గా పిలుచుకునే కామ్రేడ్‌ రుద్రరాజు సత్యనారాయణరాజు గారు 90వ పడిలో ప్రవేశించారు. శరీరం బలహీన పడుతున్నా మానసికంగా ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఉద్యమంలో చురుగ్గా ఉండడానికి ఉత్సాహంతో, తపనతో ఆతృతపడుతూనే వున్నారు. తన ఉద్యమ జీవితంలో ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎంత నిర్బంధాన్ని, చెరసాల జీవితాన్ని ఎదుర్కోవలసి వచ్చినా మొక్కవోని దీక్షతో కమ్యూనిస్టు ఉద్యమం కోసం జీవితాన్ని ధారపోయటం అందరికీ ఉత్తేజకరం, ఉత్ప్రేరకం.
తెల్లని దుస్తులతో సన్నగా, పొడవుగా రివటలాగ వుండే ఆర్‌.ఎస్‌ ది ఎంతమందిలో వున్నా కొట్టొచ్చినట్లుగా అందరి దృష్టిని ఆకర్షించే రూపం. కలుపుగోలుతనం, చురుకుదనం, సమరశీలత, ఆవేశం, సమసమాజ ఆశయం పెనవేసుకుపోయిన ప్రజల మనిషి ఆర్‌.ఎస్‌.
కృష్ణా, గోదావరి తీర ప్రాంతంలో జాతీయోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న కాలంలో, రైతాంగ ఉద్యమం ప్రభంజనంలా పెరుగుతున్న రోజులలో ఆర్‌ఎస్‌ ఉద్యమాల వైపు, రాజకీయాల వైపు ఆకర్షించబడ్డారు. ఉద్యమాల నిర్వహణలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న సాచివేత వైఖరిని అంగీకరించలేక ప్రత్యామ్నాయ ఆలోచనల వైపు యువతరం మళ్ళుతున్న రోజుల్లో అనేకమంది యువకులు సమసమాజ ఆశయం వైపు, కమ్యూనిస్టు పార్టీ వైపు మొగ్గు చూపారు. అటువంటి రెండో తరం యువ కార్యకర్తల్లో ఆర్‌.ఎస్‌ ఒకరు. అంతకు ముందు తరం చేసిన అసమాన త్యాగాలు, కృషి, పోరాటాల ఫలితంగా ఆనాడు గోదావరి, కృష్ణా డెల్టాలో కమ్యూనిస్టు ఉద్యమం, రైతాంగ ఉద్యమం, విదార్థి ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం అజేయమైన శక్తిగా ఆవిర్భవించాయి. ఈ అసమాన కృషి, త్యాగాల మూలంగానే కమ్యూనిస్టు పార్టీకి సామాన్య ప్రజలు 1946, 1955 ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు.
ఈ కాలంలో గ్రామసీమల్లో భూస్వాములు, పోలీసులు కుమ్మక్కై కమ్యూనిస్టులను వేటాడి, వేధించిన తీరును కామ్రేడ్‌ ఆర్‌.ఎస్‌ కు ఎదురైన నిర్బంధం చూస్తే కమ్యూనిస్టు ఉద్యమం ఎటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నదో అవగతమవుతుంది. ఆర్‌.ఎస్‌ లాంటి యువకులు ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఎన్నో అసమాన త్యాగాలు చేశారు. ప్రజల కోసం ఎంతటి కష్టాలకైనా ఎదురొడ్డే కమ్యూనిస్టులను ప్రజలు ఎంత ఆదరిస్తారో, కడుపులో పెట్టుకొని రక్షించుకుంటారో, తమ కోసం అసమాన త్యాగాలు చేసిన కమ్యూనిస్టు పార్టీకి ఎలా అండగా ఉంటారో ఆర్‌.ఎస్‌ ప్రస్తావించిన ఘటనలు మనకు తెలుపుతాయి.
క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో వర్గ సమరం ఎలా నిరంతరం జరుగుతుందో, వర్గ రాజకీయ పోరాటాలతో కుల వ్యవస్థ ఏ రూపంలో మేళవించబడుతుందో ఆర్‌.ఎస్‌ స్వగ్రామమైన చించినాడలో జరిగిన పరిణామాలు మనకు వెల్లడిస్తాయి. కూలి పోరాటాలు, రైతాంగ పోరాటాలపై ఆధారపడి గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ బలపడింది. సామాజికంగా అగౌరవానికి, అణిచివేతకు గురయ్యే తరగతులకు సమానత్వ కాంక్షను పెంపొందించటం, దానికోసం నిలబడటం మూలంగా కమ్యూనిస్టు పార్టీ బలహీన వర్గాలలో వేళ్ళూనుకున్నది. గ్రామ పంచాయితీ పాలనను ప్రజలకు దగ్గరగా, సామాన్య ప్రజలకు అనుకూలంగా, అవినీతి రహితంగా 65 సంవత్సరాల పాటు కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు నిర్వహించటం ద్వారా గ్రామ పాలనకు భూస్వాములను దూరంగా ఉంచగలిగింది. గ్రామ ఆధిపత్యాన్ని దక్కించుకునేందుకు భూస్వామ్య పెత్తందారులు ఎన్ని కుయుక్తులు పన్నినా, కుట్రలు చేసినా, కులాల మధ్య, కుటుంబాల మధ్య తగాదాలు పెంచాలని చూసినా ప్రధాన నాయకులను, కార్యకర్తలను భౌతికంగా తొలగించాలని దాడులు చేసి ముగ్గురిని పొట్టనబెట్టుకున్నా గ్రామ పార్టీ కార్యకర్తలు ధైర్య సాహసాలతో అన్ని కుట్రలనూ ఎదుర్కొని ప్రజా ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు పోయినందున చించినాడ ఇప్పటికీ కమ్యూనిస్టులకు కంచుకోటగానే మిగిలి వున్నది. ఈ చించినాడ రాజకీయ విజయంలో కామ్రేడ్‌ ఆర్‌ఎస్‌ కీలక పాత్ర నిర్వహించారు. చించినాడ రాజకీయ పోరాట చరిత్ర రాయగల్గితే ప్రజా కార్యకర్తలకు ఒక పెద్ద రాజకీయ పాఠÄంగా ఉపయోగపడుతుంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ పొందిన జయాపజయాలు, వాటి పర్యవసానాలు ఆర్‌.ఎస్‌ జీవితాన్ని కూడా అన్ని మలుపులూ తిప్పాయి. పోరాటాలు, ఉద్యమాలు, వర్గ రాజకీయాలు కమ్యూనిస్టు ఉద్యమానికి బలాన్ని, ప్రజా పునాదినిస్తాయి. మితవాదం, అతివాదం, రాజకీయ అవకాశవాదం ఉద్యమాన్ని నిర్వీర్యం చేసి, ప్రజా పునాదిని బలహీనం చేస్తాయి. ఆంధ్రాలో, తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఎదురైన విషాద అనుభవం ఇదే. 1955 ఎన్నికల కాలం నుండి ఏదో రూపంలో ఈ మూడు జాడ్యాలు కమ్యూనిస్టు ఉద్యమాన్ని పీడిస్తూనే వచ్చాయి. వీటికి వ్యతిరేకంగా నిలబడి ప్రజా ఉద్యమాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం కూడా మరోవైపు జరుగుతూనే వచ్చింది. ఇప్పటికీ కమ్యూనిస్టు ఉద్యమం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో రాజకీయ ప్రాధాన్యతను కలిగివున్నదంటే కమ్యూనిస్టు పార్టీ పోరాట వారసత్వాన్ని కార్యకర్తలు, నాయకులు కొనసాగిస్తున్నందు వల్లనేనని కామ్రేడ్‌ ఆర్‌.ఎస్‌ జ్ఞాపకాలను పరిశీలిస్తే స్పష్టమౌతుంది. ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్ర భాగాన ఉన్న గోదావరి జిల్లాల్లో క్రమేణా ప్రజాపునాది బలహీన పడటంలో అతివాద, మితవాద ధోరణులు ఎటువంటి హానికర పాత్రను పోషించాయో ఆర్‌ఎస్‌ జ్ఞాపకాల్లో మనం స్థూలంగా గమనించవచ్చు. ఇప్పటికీ ఆ ఎదురు దెబ్బల నుండి కమ్యూనిస్టు ఉద్యమం కోలుకోలేదు. నేటి తరం కార్యకర్తలు ఆర్‌.ఎస్‌ నాటి యువతరం కార్యకర్తల వలె కృషి చేస్తేనే పాత వైభవాన్ని మనం తిరిగి పొందడం సాధ్యమవుతుంది.
కామ్రేడ్‌ ఆర్‌.ఎస్‌ చించినాడ గ్రామ సర్పంచిగానే కాకుండా శాసనసభ్యుడిగా కూడా అసెంబ్లీలో మంచి కృషి చేశారు. శాసనసభను ప్రజా పోరాటం చేస్తున్న ప్రజల వాణిని అటు ప్రభుత్వం దృష్టికి, ఇటు ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు శాసనసభను ఉపయోగించుకున్నారు. ఆ విధంగా ప్రజా పోరాటాలకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచారు. పార్లమెంటరీ పదవులను వ్యక్తిగత సౌకర్యాల కోసం ఆర్థిక స్వలాభం కోసం వినియోగించుకోవడం పరమావధిగా భావించే బూర్జువా పార్టీల ప్రతినిధుల మాదిరిగా కాకుండా వ్యవహరించటం కమ్యూనిస్టులకు సాధారణ విషయంగా వుండాలి. కానీ, కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీ అవకాశవాదానికి గురైనప్పుడు కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులు కూడా బూర్జువా ప్రజాప్రతినిధుల మాదిరిగానే వ్యవహరించటం జరుగుతుంది. ఈ పరిస్థితి కమ్యూనిస్టు పార్టీ జవసత్వాలను పీల్చేసి, ప్రజాపునాదిని బలహీనపరుస్తుంది. గత రెండు మూడు దశాబ్దాల్లో ముఖ్యంగా బూర్జువా పార్టీలతో నిరంతరం పొత్తులు సుదీర్ఘ కాలం కొనసాగించిన చోట, అధికారంలో ఎక్కువ కాలం ఉన్నచోట ప్రజా ప్రతినిధుల పనితీరు దిగజారడాన్ని, బూర్జువా జీవనశైలి ప్రభావం పడడాన్ని చూడగలం. ఈ జాడ్యానికి దూరంగా ఉండడం ఎలాగో ఆర్‌.ఎస్‌ అనుభవం మనకు నేర్పుతుంది.
కామ్రేడ్‌ ఆర్‌.ఎస్‌ సమరశీల రాజకీయ జీవితం నేటి యువతరానికి ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. మాస్‌లైన్‌, ప్రజా మార్గాన్ని పార్టీలో పునరుద్ధరణ చేయాలని, పోరాటాలను ఉధృతం చేయడం ద్వారా పార్టీ స్వతంత్ర పునాదిని బలపర్చుకోవాలని పార్టీ ప్రయత్నిస్తున్న నేటి తరుణంలో ఆర్‌.ఎస్‌ జీవితం నుండి నాయకులు, కార్యకర్తలు ఎంతో నేర్చుకోవచ్చు. ఆర్‌.ఎస్‌ జీవితం అనుభవాల గనిలాంటిది. ఈ చిన్న పుస్తకంలో అన్నీ వ్యక్తం కాలేదు. అయినా ప్రజా ఉద్యమాలకు ఆర్‌.ఎస్‌ జ్ఞాపకాలు ప్రేరణనిస్తాయి.

(2018 ఫిబ్రవరిలో ప్రచురించిన ఆర్‌.ఎస్‌ ‘నా జీవిత పథం’ ముందు మాట)

-రచయిత సిపిఐ(ఎం), పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు

➡️