అసాంజే – ముగింపు కాదు, ఆరంభం !

Jun 28,2024 05:20 #editpage

వికీలీక్స్‌ సంస్థ స్థాపకుడు, అమెరికా వంచన, దుర్మార్గాలను సాధికారికంగా బయటపెట్టి పెను సంచలనం సృష్టించిన జూలియన్‌ అసాంజే పద్నాలుగు సంవత్సరాల తరువాత ప్రవాసం, నిర్బంధం నుంచి విడుదల అయ్యాడు. ఇది హర్షించాల్సిన పరిణామం. అమెరికా సర్కార్‌తో కుదిరిన రాజీలో భాగంగా తన మీద మోపిన గూఢచర్య నేరారోపణను అసాంజే అంగీకరించాడు. దానికి గాను ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించారు. అయితే బ్రిటన్‌లో ఇప్పటికే అంతకంటే ఎక్కువ కాలం జైల్లో ఉన్నందున శిక్షా కాలం పూర్తయినట్లు పరిగణించి వెంటనే విడుదల చేశారు. మాతృభూమి ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగు పెట్టాడు. చీమ కూడా చొరరాని, గాలి శబ్దాన్ని కూడా పసిగట్టి పహారా కాసే ఏర్పాట్లున్న అమెరికా నిఘా యంత్రాంగం నుంచి కూడా మిలియన్ల కొద్దీ రహస్య ఫైళ్లను కూడా జర్నలిస్టులు తలచుకొంటే ఎలా సంపాదించగలరో ప్రపంచానికి చాటాడు. తొలుత తన మీద నేరం మోపిన అమెరికాలోని వర్జీనీయాలో కాకుండా అమెరికా కామన్‌వెల్త్‌ లోని పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలోని ఉత్తర మరియానా దీవుల్లో తనపై విచారణ జరపాలని అసాంజే విధించిన షరతును జో బైడెన్‌ సర్కార్‌ అంగీకరించింది. తద్వారా తాను అమెరికా గడ్డ మీద కాలు మోపననే మాటను నెగ్గించుకున్నాడు. అసాంజే చర్యల వలన ఎందరికో ముప్పు ఏర్పడిందని, ఎంతో నష్టం జరిగిందని, అతనికి 175 సంవత్సరాల శిక్ష పడుతుందని ఊరూ వాడా నానా యాగీ చేసిన అమెరికా చివరకు నేరం చేసినట్లు అంగీకరిస్తే చాలు వదలివేస్తామని చెప్పింది. ఈ ఉదంతాన్ని మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాల్సి ఉంది. ఈ ఉదంతంలో ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పటానికి అవసరమైన అంశాలు ఉన్నాయి. ప్రపంచంలో రాజీ పడిన అనేక ఉదంతాల్లో ఇది ఒకటి. రాజీ పడిన ప్రతిదీ తప్పు కాదని చరిత్ర రుజువు చేసింది. అందువలన వాటిని పరిగణనలోకి తీసుకోవటం తప్ప అంతకు మించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
ప్రపంచంలో అనేక మంది జర్నలిస్టులు సంచలనాత్మక అంశాలను బయటపెట్టారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. నిజానికి వారి వెనుక ఎందరో ఉన్నారు. అలాంటి వారికి విశ్వాసం కలిగించటమే సదరు జర్నలిస్టుల ప్రత్యేకత అని చెప్పక తప్పదు. చేలేసా మానింగ్‌ అనేక అమెరికా మిలిటరీ అధికారిణి ద్వారా రహస్య పత్రాలు అసాంజే ఆధ్వర్యంలోని సంస్థకు చేరాయి. ఈ అంశం వెలుగులోకి వచ్చిన తరువాత ఆమె మీద కేసులు మోపి 35 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా దాన్ని ఏడు సంవత్సరాలకు తగ్గించటంతో 2017లో జైలు నుంచి విడుదలైంది. తరువాత ఏడాది పాటు జైలు శిక్ష, జరిమాన చెల్లించటానికి సిద్ధపడింది తప్ప అసాంజేకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు ఆమె నిరాకరించింది. అసాంజేను విడుదల చేయాల్సిందిగా ఐరోపాతో సహా అనేక దేశాలు, సంస్థల నుంచి అమెరికా ప్రభుత్వంపై నానాటికీ ఒత్తిడి పెరుగుతున్న పూర్వ రంగంలో జో బైడెన్‌ రాజీకి అంగీకరించాల్సి వచ్చింది. అసాంజే ప్రస్తావన వచ్చినపుడల్లా అమెరికా ఇలాంటి దుర్మార్గాల పాల్పడిందా అని నూతన తరాలు తెలుసుకొనేందుకు తోడ్పడింది. అది మరింత నష్టదాయకంగా మారింది. రెండవది రహస్యం అన్న పత్రాలను ముద్రించినందున లేదా ఇంటర్నెట్‌ ద్వారా అందుబాటులో ఉంచినందున జరిగిన నష్టం ఏమిటో రుజువు చేసేందుకు అమెరికా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. కేసును విచారించిన న్యాయమూర్తి కూడా అదే చెప్పాడు. తన భర్త కేసుకు సంబంధించిన వివరాలను సమాచార స్వేచ్ఛ హక్కు కింద అమెరికా నుంచి సంపాదించి లోకానికి వెల్లడించాల్సిందిగా అసాంజే భార్య స్టెల్లా యావత్‌ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేసింది. కేసు నడిచినంత కాలం భర్తతో పాటు నిలిచిన ధీరవనితగా ఆమె చరిత్రకెక్కినందుకు అమెను అభినందించాల్సిందే. తన భర్త నేరాన్ని అంగీకరించారంటే దాని అర్ధం జర్నలిజానికి కట్టుబడి ఉన్నందుకే అన్నారు. ఈ కేసులో జర్నలిజాన్ని ఒక నేరంగా మార్చిన…వార్తల సేకరణ, ప్రచురణను నేరంగా పరిగణించబడిన వాస్తవాన్ని గ్రహించి కేసు తీరుతెన్నులను బహిర్గత పరచాలని ఆమె విజ్ఞప్తి చేసింది. అసాంజే ఉదంతంతో పరిశోధనాత్మక జర్నలిజం ఆగదు, తమ పాలకుల దుర్మార్గాలను వెల్లడించాలని చిత్తశుద్ధితో కోరుకొనేవారికీ కొదవ ఉండదు. అదేమీ దేశద్రోహం కాదు, ప్రజల పక్షాన నిలవటమే. ఇరాన్‌, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దారుణాలను వికీలీక్స్‌ బయటపెట్టింది. తరువాత సాగిన వాటిని వెలువరించేందుకు ప్రతి ఒక్క జర్నలిస్టూ అసాంజేగా మారాల్సిన అవసరం ఉంది.
– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️