సరైన సమయంలో…

Nov 28,2024 05:55 #Articles, #edit page, #supreem court

ఒకవైపు రాజ్యాంగంపై దాడి చేస్తూ, మరోవైపు తామే దాని పరిరక్షకులమని చెప్పుకుంటూ దేశ ప్రజల్లో మితవాద శక్తులు అయోమయాన్ని సృష్టిస్తున్న వేళ రాజ్యాంగ పీఠికలో సెక్యులర్‌, సోషలిస్టు పదాల వినియోగంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు చారిత్రాత్మకమైనది. ఈ తీర్పుతో మతవాద, మితవాద శక్తుల బండారాన్ని మరోసారి దేశ ప్రజల ముందు అత్యున్నత న్యాయస్థానం బట్టబయలు చేసింది. దేశ ప్రజలందరి స్వేచ్ఛకు, భద్రతకు, గౌరవప్రదమైన జీవనానికి పూచీ ఇచ్చే ఈ పదాల వినియోగంపై అభ్యంతరాలు అర్ధరహితమని తేల్చిచెప్పింది. రాజ్యాంగ వజ్రోత్సవాలకు ఒక్క రోజు ముందు అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును ప్రకటించింది. అయితే, నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించిన వజ్రోత్సవాల్లో సుప్రీం తీర్పు ఊసు నామమాత్రంగా కూడా లేకపోవడం, ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లే సంకల్పం కొంచెం కూడా కనిపించకపోవడం గమనార్హం.దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన సందేశంలోగానీ, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో మోడీ చేసిన ప్రసంగంలోగాని ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం యాదృచ్ఛికం కాదు. కీలకమైన ఈ అంశంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల వైఖరికి, రాజ్యాంగానికి, దేశ ప్రజలకు పొంచి ఉన్న ముప్పునకు ఈ మౌనాన్ని సంకేతంగానే భావించాలి.

నిజానికి రాజ్యాంగ పీఠికలోని ‘లౌకిక..సోషలిస్టు’ పదాలపై మితవాద శక్తుల దాడి ఇప్పటిది కాదు. అలాగే ఈ పదాల వినియోగాన్ని ప్రశ్నించే ప్రయత్నాలను సుప్రీంకోర్టు తిరస్కరించడమూ కొత్త కాదు. పీఠికను సవరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి, న్యాయవాది అశ్విని ఉపాధ్యారు విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజరు కుమార్‌ ధర్మాసనం తోసిపుచ్చింది. పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం ప్రవేశికకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. మన రాజ్యాంగం సజీవంగా, చలనశీలతను కలిగి ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో కేశవానంద భారతి కేసులో పేర్కొన్న రాజ్యాంగ మౌలిక స్వరూప (బేసిక్‌ స్ట్రక్చర్‌) అంశాన్ని ప్రస్తావించింది. ప్రభుత్వాలు ఎటువంటి ఆర్థిక విధానాలు అనుసరించాలన్నది రాజ్యాంగం నిర్దేశించలేదని, అదే సమయంలో అందరికీ సమాన అవకాశాలు, సమానత్వం ఉండాలన్న రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షను సోషలిస్టు అనే పదం తెలియచేస్తుందని ధర్మాసనం వివరించింది. ప్రభుత్వానికి సొంత మతం ఉండదని, అన్ని మతాల వారు సమానమే అని ప్రజలందరికి సమాన హక్కులు వర్తిస్తాయని, ప్రభుత్వానికున్న లౌకిక స్వభావం ప్రజల మత విశ్వాసాల ఆచరణను అడ్డుకోకూడదని పేర్కొంది. ప్రభుత్వం ఏ మతానికీ మద్దతివ్వకూడదని, అలాగే ఏ మతాన్ని వ్యతిరేకించకూడదని ధర్మాసనం దిశా నిర్దేశం చేసింది. ఇప్పుడే కాదు, 1994 నాటి ఎస్‌ఆర్‌ బొమ్మయ్ కేసులో సెక్యులరిజాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా సుప్రీంకోర్టు పేర్కొంది. వివక్ష లేకుండా అన్ని మతాల వారికి సమాన అవకాశాలు, భద్రత కల్పిస్తామని సెక్యులరిజం అనే పదం తెలుపుతుందని మరో కేసులో వివరించింది. 1978లోని ఫ్రాన్సిస్‌ కొరోలి వర్సెస్‌ యు.టి ఆఫ్‌ ఢిల్లీ, 1996లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లోనూ, 2002లో అరుణా రారు వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులోనూ అత్యున్నత న్యాయస్థానం ఇదే వైఖరిని పదేపదే చెప్పింది.
‘భారత ప్రజలమైన మేము..’అంటూ ప్రారంభమయ్యే పీఠిక మన రాజ్యాంగపు ఆత్మ! సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటపు సంఘర్షణ, దాని లక్ష్యాలు, దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు దానిలో ఇమిడి ఉన్నాయి. స్వాతంత్య్ర పోరాటంతో ఏ మాత్రం సంబంధంలేని మితవాద శక్తులు ఆ పోరాట ఫలాలను ధ్వంసం చేయడానికి అదేపనిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దోపిడికి అన్ని విధాల అనుకూలించే మనువాద భావజాలాన్ని రుద్దడమే వారి లక్ష్యం. ఆ ప్రయత్నాలను ప్రతిఘటించి సమానత్వం, సామాజిక న్యాయం, లౌకికతత్వాన్ని పెంపొందించే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.

➡️