భావజాలంపై దాడి

మానవ జీవితాన్ని ప్రభావితం చేసిన పుస్తకాలు, తమ పుస్తకాల ద్వారా ప్రపంచానికి అద్వితీయమైన జ్ఞాన సంపదను అందించిన రచయితలు ఏ దేశానికైనా గొప్ప సంపద. మంచి పుస్తకాలు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి, ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తాయి. ‘తినే పదార్థాల ప్రభావం మనిషిమీద వున్నట్టే… చదివే పుస్తకాల ప్రభావమూ మనిషిమీద వుండి తీరుతుంది’ అంటారు కొడవటిగంటి. పుస్తక పఠనం వల్ల బుద్ధికుశలత, ఏకాగ్రత పెరుగుతుంది. ఎవ్వరైనా వ్యక్తిగత, వృత్తిగత, సామాజిక జీవితంలో రాణించాలంటే పుస్తకాలు చదవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా వున్న ఎంతోమంది మేధావులు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలకు పుస్తకాలు చదవందే రోజు గడవదు. ‘జీవితంలో విజయాలు సాధించేందుకు విజయగాథలు చదవాలి’ అంటారు అమెరికా రచయిత జిమ్‌రోమ్‌. అభివృద్ధికి పుస్తకం తల్లిలాంటిది. కొంతమంది మత విద్వేషాలతో ఆ విజ్ఞానాన్ని సమాధి చేయాలని చూస్తున్నారు. ప్రజలు ఏం తినాలో, ఏం కట్టుకోవాలో, ఏ సాహిత్యం చదవాలో నిర్ణయించే మతోన్మాదం సమాజానికి ప్రమాదం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. కుల మతాలు ఏవైనా, ప్రాంతం, దేశం ఏదైనా విజ్ఞానాన్ని పంచేది పుస్తకమే. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు పుస్తకాలపై దాడి చేయడం శోచనీయం.
భావస్వేచ్ఛ, భావ సంఘర్షణలో భిన్న దృక్పథాలు, భిన్న వైఖరులు ఎప్పుడూ వుంటాయి. పురాణేతిహాసాల మీద కూడా అనేక భిన్నాభిప్రాయాలు వున్నాయి. రామాయణ కల్పవృక్షం మీద విమర్శ చేస్తూ..’రామాయణ విషవృక్షం’ రాశారు రంగనాయకమ్మ. 1925లో చలం రాసిన ‘మైదానం’ నవల అతి పెద్ద సంచలనం. చలం భావాలను వ్యతిరేకిస్తూ…1933లో విశ్వనాథ సత్యనారాయణ ‘చెలియలికట్ట’, 1960లో గోపీచంద్‌ ‘గడియపడని తలుపులు, మెరుపుల మరకలు’ వంటి పుస్తకాలు రాశారు. కట్టమంచి రామలింగారెడ్డి మన ప్రబంధాలను, ప్రబంధ కవులను ‘కవిత్వ తత్వ విచారము’ అనే విమర్శనా గ్రంథంలో ఉతికి ఆరేశారు. అయితే, ఈ గ్రంథాన్ని ఖండిస్తూ కూడా మరో పుస్తకం వచ్చింది. వందేళ్ల క్రితం నాటి ‘మాలపల్లి’ నవలను అప్పటి మదరాసు ప్రభుత్వం రెండుసార్లు నిషేధించినా… దాన్నెవరూ నిలువరించలేకపోయారు. రాచరిక వ్యతిరేక కవిత్వం రాసిన వేమన, వీరబ్రహ్మం, అన్నమయ్య వంటివారిని కూడా జైళ్లలో వేయలేదు. ఈ ఆధునిక కాలంలోనే ఆ దుస్థితి దాపురించింది. ఇప్పుడు నిషేధాలు ఆ రూపంలో లేకపోయినా…ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వ్యతిరేక భావజాలంపైనా, సాహిత్యంపైనా, కవులు, రచయితలు, జర్నలిస్టులపైనా దాడులు, నిర్భంధాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇది స్వేచ్ఛ, సృజనాత్మకతకు, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.
గతంలో ‘అర్థనారి’ పుస్తక రచయిత పెరుమాళ్‌ మురుగన్‌పై దాడి తెలిసిందే. హైదరాబాద్‌ బుక్‌ ఫెస్టివల్‌లో వీక్షణం ఎడిటర్‌పై కొందరు దాడికి తెగబడ్డారు. తిరుపతి బుక్‌ ఎగ్జిబిషన్‌లో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ రాసిన ‘ద్రౌపది’ పుస్తకం అమ్మొద్దని, త్రిపురనేని రామస్వామి సాహిత్యాన్ని తూలనాడుతూ దాడికి దిగారు. ఇటీవల నెల్లూరులో జరిగిన పుస్తక ప్రదర్శనలో ఎంవీఎస్‌ శర్మ రాసిన ‘సనాతన ధర్మం అంటే ఏమిటి?’ పుస్తకావిష్కరణను అడ్డుకునేందుకు యత్నించారు. పుస్తకాలను చించినంత మాత్రాన వాటిలోని భావాలను చంపలేరు. భావప్రకటనా స్వేచ్ఛను అరికట్టలేరు. ఇది రాజ్యానికి, వ్యక్తికి మధ్య జరిగే పోరాటం. ‘ఏ మతోన్మాదమైనా మొదట తన వాళ్ల కళ్లను పీకి అంధులను చేస్తుంది. తర్వాత మెదడు పీకి అవివేకులను చేస్తుంది. ఆ తర్వాత గుండెను పీకి క్రూరులుగా మార్చుతుంది. తర్వాత నరబలిని కోరుతుంది. ఇప్పుడిది మితిమీరిపోయింది. అతి త్వరగా మన పిల్లల కళ్లు, గుండె, మెదడులను ఈ మతోన్మాదపు నోటికి చిక్కకుండా కాపాడాల్సి వుంది’ అంటారు దేవనూరు మహాదేవ. సాహిత్యం జీవితాన్ని, విమర్శ సాహిత్యాన్ని ఉన్నతీకరిస్తుంది. అలాంటి ఉన్నతమైన సాహిత్యానికి మకిలి అంటించడం, మతోన్మాద రంగుటద్దాల నుంచి చూడటం పరిపాటిగా మారింది. సాహిత్యం, సంస్కృతి, లౌకిక భావజాలంపై జరిగే దాడులు దేశభవితకు నష్టం కలిగిస్తుంది.

➡️