వక్ఫ్‌ చట్ట సవరణ-మైనారిటీలపై దాడి

వక్ఫ్‌ అన్నది అరబిక్‌ పదం. మత పరమైన, దాతృత్వ పరమైన లక్ష్యాలతో ఏర్పడిన ఆస్తిని వక్ఫ్‌గా పరిగణిస్తారు. ఒకసారి వక్ఫ్‌ ఆస్తిగా ఏర్పడ్డాక…దానిని వెనక్కు తీసుకోడానికి గాని, వేరే వాళ్ళు స్వాధీనం చేసుకోడానికిగాని, ఇతరులకు అమ్మడానికి గాని వీలు లేదు.
దేశంలో భారతీయ రైల్వే తర్వాత అతి ఎక్కువ భూమి వక్ఫ్‌ల వద్దే ఉందని ప్రకటించారు. ఆ తర్వాత ఈ విస్తారమైన, విలువైన భూమిని ఏవిధంగా చేజిక్కించుకోవాలన్నది చర్చ జరిగింది. ఈ భూమిలో అధిక భాగం పట్టణ ప్రాంతాల్లో ఉంది. అందుచేత దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. భూదాహంతో తహతహలాడుతున్న కార్పొరేట్‌ వ్యక్తుల కళ్ళు ఈ వక్ఫ్‌ భూముల మీద పడ్డాయి. ఇందుకు ఒక ఉదాహరణ అంబానీది. ముంబైలో చట్ట విరుద్ధంగా చాలా విలువైన వక్ఫ్‌ భూమిని అంబానీ కొనుగోలు చేసి అక్కడ తన భార్య కోసం రూ.16,000 కోట్లు వెచ్చించి ఒక రాజమహల్‌ నిర్మించాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. బహుశా అంబానీ ఈ కేసు ఓడిపోవచ్చు.
ఇటువంటి కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడడానికి, వాళ్ళు మరిన్ని వక్ఫ్‌ భూముల్ని చేజిక్కించుకోడానికి వీలుగా మోడీ ప్రభుత్వం ఆ వక్ఫ్‌ భూముల మీద పెత్తనాన్ని తన చేతుల్లోకి తీసుకోడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో వక్ఫ్‌ సవరణ చట్టం-2025ను పరిశీలించాలి.
మోడీ ప్రభుత్వ హయాంలో మైనారిటీలు ఎడతెగని బాధలు అనుభవిస్తున్నారు. ముస్లింల జీవితాలలోని అన్ని పార్శ్వాలలోకీ వివక్షత చొచ్చుకుపోతున్నది. ముస్లింలు ఈ దేశానికి చారిత్రికంగా అందించిన అభివృద్ధిని తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. సమాజంలో లౌకిక, హేతుబద్ధ భావాలను వ్యక్తం చేసేవారి గొంతుకలను నొక్కేస్తున్నారు.
ఇటువంటి నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం వక్ఫ్‌ చట్టానికి సవరణ తేవడం వెనుక ఉద్దేశం ముస్లిం మహిళలకు ప్రయోజనాలు కల్పించడం కోసమేనని ప్రకటిస్తోంది. ఇంతకన్నా మోసపూరితమైనది, అసంబద్ధమైనది ఇంకొకటుంటుందా? సుల్తానుల, మొఘల్‌ చక్రవర్తుల కాలంలో… ముస్లిం ప్రజల ప్రయోజనాల కోసం…ఈ వక్ఫ్‌ ఆస్తులు ఇస్లామిక్‌ ఆచారాల ప్రకారం ఏర్పడ్డాయి. 1932లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ సాంప్రదాయాలను అన్నింటినీ ఒక చట్ట రూపంలోకి తెచ్చి వక్ఫ్‌ చట్టం చేసింది.
వక్ఫ్‌ చట్టాన్ని 1959లో, 1964లో, 1969లో, 1984లో సవరించారు. ఇవన్నీ చిన్న చిన్న మార్పుల కోసమే జరిగాయి. కొత్తగా తలెత్తుతున్న అవసరాలకు అనుగుణంగా, ఇస్లామిక్‌ పండితుల, ముస్లిం సంస్థల సలహాల మేరకు ఈ సవరణలు చేశారు. ఆ తర్వాత ఒక జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ చట్టాన్ని లోతుగా అధ్యయనం చేసింది. అనంతరం ఆ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు 1995లో సమగ్రమైన వక్ఫ్‌ చట్టాన్ని చేశారు. ఈ చట్టం ప్రకారం వక్ఫ్‌ వ్యవహారాలను నిర్వహించేందుకు, పర్యవేక్షించేందుకు వక్ఫ్‌ బోర్డులు ఏర్పడ్డాయి. ప్రతీ వక్ఫ్‌నూ ఒక ముఠావాలి లేదా ఒక ముఠావాలి కమిటీ నడుపుతాయి. ఈ కమిటీలో ఆస్తిని దానం చేసినవారు, ఇతర ముస్లిం సభ్యులు ఉంటారు. వారు ఇస్లాం చట్టాల, సాంప్రదాయాల ప్రకారం వక్ఫ్‌లను నిర్వహిస్తారు.
ఈ కార్యకలాపాలనన్నింటినీ పర్యవేక్షించడానికి, మార్గదర్శకత్వం నెరపడానికి ప్రతీ రాష్ట్రంలోనూ ఒక వక్ఫ్‌ బోర్డు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక సీనియర్‌ అధికారి ఈ బోర్డుకు ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా (సిఇవో) ఉంటారు. అన్ని వక్ఫ్‌లు రిజిస్టరు చేసుకునివుండాలి. వాటి వార్షిక ఆదాయ వ్యయాల వివరాలను వక్ఫ్‌ బోర్డుకు ప్రతీ ఏడూ సమర్పించాలి. ఎక్కడైనా వివాదం తలెత్తితే దానిని వక్ఫ్‌ బోర్డు వక్ఫ్‌ చట్టాల ప్రకారం పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కారం కాకుండా మిగిలిపోతే ఆ వివాదాన్ని కోర్టుకు నివేదిస్తారు.
వక్ఫ్‌ చట్టం అమలులో చాలా బలహీనతలు పొడచూపాయి. ఉదాహరణకు:1995 చట్టం వక్ఫ్‌ నిబంధనలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత ఇచ్చింది. కాని చాలా రాష్ట్రాలు నేటికీ ఆ నిబంధనలను రూపొందించలేదు. కేంద్ర ప్రభుత్వం ఒక కేంద్ర వక్ఫ్‌ కమిషనర్‌ను నియమించాలని ఆ చట్టం ఆదేశించింది. కాని కేంద్ర ప్రభుత్వం ఆ ఆదేశాన్ని సైతం అమలు చేయడంలో విఫలమైంది. ప్రభుత్వాలవైపు నుండి తలెత్తిన పలు లోపాల కారణంగా అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
వక్ఫ్‌ల నిర్వహణలో అవకతవకలు, అవినీతి వంటివి చోటు చేసుకుంటున్నాయని, వక్ఫ్‌ ఆస్తులు కబ్జా అయిపోతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ తప్పులకు కేవలం ముస్లిం ప్రజానీకాన్ని లేదా ఆ వక్ఫ్‌ సంస్థలను మాత్రమే నిందించడం సరైనదేనా? వ్యవస్థాగతంగా ఉన్న అనేక లొసుగుల వలన, పర్యవేక్షణా లోపాల వలన ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడున్న చట్టాన్ని కట్టుదిట్టంగా, సమర్ధవంతంగా అమలు జరపడమే పరిష్కారం. ప్రభుత్వ నిర్వహణా లోపాలను సరిదిద్దుకోవడం మానేసి కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ చట్టాన్ని సవరించడానికి పూనుకుంది. అందుకు ఆ లోపాలనే సాకుగా చూపిస్తోంది. ఈ వైఖరి అంతిమంగా వక్ఫ్‌ లక్ష్యాలకు, దాని ప్రయోజనాలకు హానికరంగా తయారు కాగలదు.
1995 వక్ఫ్‌ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా నలభై పైగా సవరణలను ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఆ కమిటీ చాలా తొందరపాటుగా వ్యవహరించి తన సిఫార్సులను ఇచ్చింది. ప్రతిపక్షాలకు చెందిన కమిటీ మెంబర్ల అభిప్రాయాలను నమోదు చేయలేదు. అక్కడితో ఆగకుండా వారందరినీ కమిటీ నుండి బహిష్కరించారు. కమిటీలోని పాలక పార్టీ సభ్యులు మాత్రమే కూర్చుని ఆ సిఫార్సులను ఆమోదించారు. ఆ సిఫార్సులన్నీ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నవే. కమిటీ నివేదికను స్పీకర్‌ త్వరగా ఆమోదించారు. వెంటనే ఆ బిల్లును లోక్‌సభ లోను, రాజ్యసభలోను మెరుపు వేగంతో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది.
సవరించిన చట్టాన్ని వెంటనే అమలులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో భారీ ఎత్తున వక్ఫ్‌ భూములు కబ్జాలకు గురౌతాయన్న ఆందోళనలు తలెత్తాయి. మైనారిటీలలో ఇది భయాన్ని, ఆందోళనను కలుగజేసింది. దాంతో వారు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వేలాదిగా నిరసన ప్రదర్శనలకు దిగారు. అన్ని ప్రజాస్వామిక, ప్రతిపక్ష పార్టీలూ వారికి మద్దతుగా నిలిచాయి. వక్ఫ్‌ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలన్న వారి డిమాండ్‌ను పూర్తిగా సమర్ధించాయి.
ముందే వివరించినట్టు, ‘వక్ఫ్‌’ అనేది ఒక అరబిక్‌ పదం. దాని మూలాలు ఇస్లామిక్‌ సాంప్రదాయాలలో, పద్ధతులలో ఉన్నాయి. అయితే ఇప్పుడు చట్టానికి చేసిన సవరణ వక్ఫ్‌ మౌలిక భావననే మార్చేయడానికి పూనుకుంది. ‘ఐక్య యాజమాన్యం’, ‘సాధికారత’, ‘సామర్ధ్యం’, ‘అభివృద్ధి’ వంటి పదాలను జొప్పించింది. ఈ పదాల వెనుక గూఢంగా వేరే ప్రయోజనాలు దాగున్నాయని ఆందోళన కలుగుతోంది. వక్ఫ్‌ ఎల్లప్పుడూ ఇస్లామిక్‌ సూత్రాలనే అనుసరిస్తోంది. అటువంటప్పుడు ”ఐక్య యాజమాన్యం” అన్న పదాన్ని జొప్పించడం ఎందుకు? ఎవరితో ఐక్యత? దానివలన మత స్వయం నిర్ణయాధికారానికి ఎటువంటి ముప్పు వాటిల్లనుంది? ముస్లిమేతరులను వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణలో భాగస్వాములుగా చేయడానికే ఈ పదాన్ని చేర్చారా? ఇటువంటి ఉమ్మడి ఆస్తుల నిర్వహణలో ఈ ప్రభుత్వం ఇంతవరకూ ప్రదర్శించిన నిర్వాకం ఎలా ఉంది?
వక్ఫ్‌ ఆస్తులు యావత్తు ముస్లిం ప్రజానీకానికీ ఉపయోగపడడం కోసం ఉన్నాయి. కాని చట్ట సవరణలో అనవసరంగా ముస్లింలలో చీలికలు తెచ్చే విధంగా ముస్లింలను వర్గీకరించడం జరిగింది. వక్ఫ్‌ బోర్డులను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. కాని ఈ చట్ట సవరణ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పాత్రను పూర్తిగా విస్మరించింది. ఇది రాష్ట్రాల అధికారాల మీద ప్రత్యక్ష దాడి.
సవరించిన చట్టంలోని క్లాజు నెం.4 అసలు చట్టంలోని వక్ఫ్‌ ప్రయోజనాన్నే వక్రీకరిస్తోంది. ”ఏ వ్యక్తి యొక్క స్థిర, చరాస్తులనైనా” అని అసలు చట్టంలో ఉన్నదానిని ఇప్పుడు ”ముస్లిం మతాన్ని కనీసం గత ఐదేళ్ళుగా ఆచరిస్తున్న ఏ వ్యక్తి యొక్క స్థిర, చరాస్తులనైనా” అని మార్చారు. గతంలో ముస్లిమేతరులు కూడా మైనారిటీలకు మద్దతుగా వక్ఫ్‌లను ఏర్పరచడానికి సహకరించారు. ఇప్పుడు అలా సహకరించడానికి వీలు లేకుండా సవరణ చేశారు. ఇది కేవలం మైనారిటీలకు మాత్రమే వ్యతిరేకంగా లేదు. ఏ వ్యక్తికైనా వక్ఫ్‌కు దానం చేసే స్వేచ్ఛను ఇది కాలరాస్తోంది. 1995 చట్టంలో ఉన్న సమైక్యతా స్ఫూర్తిని దెబ్బ తీస్తోంది. ఇంతవరకూ వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించి ఏ విచారణనైనా చేపట్టడానికి వక్ఫ్‌ బోర్డుకు అధికారం ఉండేది. ఇప్పుడు ఆ అధికారాన్ని జిల్లా కలెక్టర్‌కు బదలాయించారు. ఒక ముస్లిం-నిర్వహణ యాజమాన్య సంస్థ నుండి అధికారం ప్రభుత్వ అధికారులకు అప్పగించడం జరిగింది. ఇప్పుడు వక్ఫ్‌ రిజిస్ట్రేషన్‌ కూడా జిల్లా కలెక్టర్‌ సమక్షంలోనే జరగాలి. ఇంతవరకూ ఇస్లామిక్‌ సాంప్రదాయాలకు అనుగుణంగా జరుగుతున్నదానికి ఇది విరుద్ధం. వక్ఫ్‌ పరిధిలోకి వచ్చే ప్రభుత్వ భూములపై నిర్ణయాధికారం ఇప్పుడు జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. గతంలో వక్ఫ్‌ కమిషనర్‌ను వక్ఫ్‌ బోర్డు నియమించేది. ఆ వక్ఫ్‌ కమిషనర్‌కు ఉన్న అధికారాలను తొలగించి వాటిని కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టారు. ఇది వక్ఫ్‌ వ్యవస్థకు ఉన్న మతపరమైన హక్కులపై తీవ్ర దాడి.
గతంలో చట్టం వక్ఫ్‌ బోర్డులో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలని నిర్దేశించింది. ఇప్పుడు సవరించిన చట్టంలో ఇద్దరు మాత్రమే మహిళలు ఉండాలని చెప్తోంది. కేంద్ర వక్ఫ్‌ కౌన్సిల్‌లో అందరూ ముస్లింలే ఉండాలని ఇంతకు ముందున్న చట్టం చెప్పింది. కాని ఇప్పుడు చేసిన సవరణ ప్రకారం ఇద్దరు ముస్లిమేతరులను కౌన్సిల్‌ సభ్యులుగా చేర్చవచ్చు. ఇది ఒక మత వ్యవస్థలో ఇతరులు చొరబడడం అవుతుంది. ముస్లిం సంస్థలలో మత వివాదాలను రేకెత్తించడానికి దారి తీస్తుంది. ఇక్కడ సహజంగానే ఈ ప్రభుత్వానికి ఒక సవాలు ఎదురౌతుంది. ”ఈ ప్రభుత్వం హిందూ దేవాలయాల నిర్వహణ కోసం ముస్లిం సభ్యులను నియమించే ఆలోచననైనా చేయగలుగుతుందా?”
పాత చట్టం ప్రకారం వక్ఫ్‌ బోర్డు వివాద పరిష్కారం కోసం ఏర్పరిచే ఏ ట్రిబ్యునల్‌లోనైనా సభ్యులుగా ఇస్లామిక్‌ చట్టంలో నిపుణులైనవారినే నియమించాలి. ఇప్పుడు ఆ షరతు ఏదీ లేదు. ఏ వ్యక్తినైనా, ఎటువంటి నైపుణ్యం లేకపోయినా, ఏ పరిజ్ఞానమూ లేకపోయినా ట్రిబ్యునల్‌కు సభ్యుడిగా నియమించవచ్చు. ముస్లిమేతరులను కూడా నియమించవచ్చు. ఇది ముస్లిం మత వ్యవహారాల్లో ఇతరులను చొప్పించి మత ఘర్షణలను రెచ్చగొట్టడానికి దారితీస్తుంది.
గతంలో వక్ఫ్‌ బోర్డులో ఒక ముస్లిం పార్లమెంటు సభ్యుడు కాని అసెంబ్లీకి చెందిన ముస్లిం సభ్యుడు కాని ఉండాలని చట్టంలో ఉంది. కాని ఇప్పుడు దానిని తొలగించారు. దాని వలన బోర్డులో ముస్లిమేతరుల ఆధిపత్యం పెరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రభుత్వం హిందూ దేవాలయాల ట్రస్టుల్లో ముస్లింలను నియమించడానికి సిద్ధంగా ఉందా? గతంలో వక్ఫ్‌ ట్రిబ్యునళ్లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది. ఇప్పుడు దానిని తొలగించి నేరుగా జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టారు. ఇక రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ ఎక్కడుంటుంది? గతంలో వక్ఫ్‌కు చెందిన అకౌంట్లను ఆడిట్‌ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది. ఇప్పుడు సవరించిన చట్టం ప్రకారం ఆ అధికారాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంది.
గతంలో బ్రిటిష్‌ పాలనా కాలంలో జిల్లా కలెక్టర్లకు కొన్ని అధికారాలను ఇచ్చారు. కాని ఆ కలెక్టర్లకు ఉన్న విపరీతమైన పనుల భారం వలన, బహు బాధ్యతల వలన వక్ఫ్‌కు సంబంధించిన పనులను వారు పట్టించుకోడంలో విఫలమయ్యారు. అందుచేత ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునళ్ళను ఏర్పాటు చేశారు. ఇప్పుడు చట్టానికి చేసిన సవరణలు మళ్ళీ పరిస్థితిని మొదటికే తెస్తున్నాయి. ముస్లిం వక్ఫ్‌ బోర్డు, ముస్లిం సభ్యులతో కూడిన ట్రిబ్యునళ్ళు చేస్తున్న పనులను జిల్లా కలెక్టర్లకు, ముస్లిమేతర అధికారులకు అప్పజెప్పడం అంటే వక్ఫ్‌ ఆస్తుల మీద ఇస్లామిక్‌ యాజమాన్యం స్థానంలో ప్రభుత్వ ప్రత్యక్ష యాజమాన్యాన్ని తీసుకురావడమే అవుతుంది.
ఈ సవరణలన్నీ చూస్తే వక్ఫ్‌లను మెరుగ్గా నిర్వహించే లక్ష్యంతో కాకుండా, ఒక మత విద్వేషపు మానసిక స్థితి నుండి కేంద్ర ప్రభుత్వం వీటిని తెచ్చిందని స్పష్టం అవుతోంది. రాజ్యాంగంలో 25, 26 అధికరణలు మైనారిటీలకు గ్యారంటీ చేసిన ప్రాథమిక హక్కులకు ఈ సవరణ భంగం కలిగిస్తోంది. తమ మత సంస్థలను తాముగా నిర్వహించుకునే హక్కును ఒక కుట్ర ప్రకారం వారికి నిరాకరించడం జరుగుతోంది. ఈ సవరణలను సమర్ధించుకోడానికి ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో వాస్తవమూ లేదు, అవి సరైనవీ కావు. కేవలం ఒక మత విద్వేష ఎజండాను అమలు చేసే లక్ష్యమే కనిపిస్తోంది. వక్ఫ్‌ అసలైన స్ఫూర్తిని దెబ్బతీసి దానిని ఒక ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే సంస్థగా, ముస్లిమేతరుల పెత్తనంలో నడిచే వ్యవస్థగా మార్చివేసే ప్రమాదం కనిపిస్తోంది. సహజంగానే ఈ సవరణలు మైనారిటీలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ‘హిందూ రాజ్యం’ స్థాపించాలనే దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు తీవ్ర అస్థిరతకు కారణమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ చట్ట సవరణలను ఉపసంహరించడమే పరిష్కారం.

( స్వేచ్ఛానుసరణ )

 

హన్నన్‌ మొల్లా

➡️