బంగ్లా జమాతేపై నిషేధం రద్దు!

మతోన్మాద జమాతే ఇస్లామీ పార్టీపై ఉన్న నిషేధాన్ని బుధవారం నాడు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. ఆ పార్టీ, దాని అనుబంధ విద్యార్థి విభాగానికి చెందిన వారు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటు న్నారంటూ ఆగస్టు ఒకటవ తేదీన నాటి అవామీ లీగ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. తరువాత నాలుగు రోజులకే హసీనా ప్రభుత్వ పతనం, ఆమెను బలవంతంగా మిలిటరీ అధికారులు మన దేశానికి పంపటం తెలిసిందే. తమ దర్యాప్తులో అలాంటి రుజువులేమీ లేవని తేలినందున నిషేధాన్ని ఎత్తివేసినట్లు యూనస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిణామం తరువాత తమ పార్టీ నమోదును రద్దు చేస్తూ గతంలో ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించి పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయనున్నట్లు జమాతే ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో జమాతే ఇస్లామీ ఒక వివాదాస్పద సంస్థ. బ్రిటీష్‌ ఇండియాలో 1941లో ఏర్పడిన ఈ సంస్థ బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటాన్ని వ్యతిరేకించటమేగాక పాకిస్తాన్‌తోనే కలసి ఉండాలనే వైఖరి తీసుకుంది. విముక్తి కోసం పోరాడిన వారి మీద దాడులు, హత్యలకు పాల్పడింది. దాంతో ముజిబుర్‌ రహమాన్‌ ప్రభుత్వం 1972లో దాన్ని నిషేధించింది. ముజిబుర్‌ హత్య తరువాత అధికారానికి వచ్చిన జియావుర్‌ రహమాన్‌ ప్రభుత్వం దాన్ని ఎత్తివేసింది. జమాతే పార్టీ కార్యకలాపాలు లౌకిక వ్యవస్థ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నందున దాని రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ 2009లో దాఖలైన పిటీషన్‌పై 2013లో హైకోర్టు విచారించి ఆమోదించింది. అప్పటి నుంచి అది ఎన్నికల్లో నేరుగా పాల్గొనటం లేదు. బంగ్లాదేశ్‌ నేషనలిస్టు (బిఎన్‌పి), ఇతర పార్టీల కూటమిలో భాగస్వామిగా ఉంటూ అవామీ లీగ్‌ను వ్యతిరేకిస్తున్నది. అయితే అవామీలీగ్‌ అణచివేత చర్యల కారణంగా జమాతేతో చేతులు కలిపినప్పటికీ దానితో సంబంధాలను వ్యతిరేకించే శక్తులు కూడా బిఎన్‌పిలో ఉన్నాయి. గతేడాది కూడా సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసినప్పటికీ దాని ప్రతినిధులు కోర్టుకు రాని కారణంగా కొట్టివేశారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించేందుకే అవకాశాలున్నాయి. ఒక వేళ అదే జరిగితే జమాతే వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీకి దిగటం ఖాయం.
షేక్‌ హసీనా ప్రభుత్వానికి, ఆమె పార్టీకి మద్దతు ఇచ్చిన కారణంగా ఆమె పతనం తరువాత బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హసీనా దౌత్య వీసాను ప్రభుత్వం రద్దు చేసింది. హత్యతో సహా అనేక కేసులను నమోదు చేసింది. దీంతో ఆమెను తమ దేశానికి అప్పగించాలన్న డిమాండ్‌ను అక్కడి అవామీ లీగ్‌ వ్యతిరేక పార్టీలు పదే పదే డిమాండ్‌ చేస్తున్నాయి. ఆమె గురించి నరేంద్ర మోడీ సర్కార్‌ మౌనంగా ఉండటంతో సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అవామీ లీగ్‌ ఇతర పార్టీ నేతల మీద కూడా కేసులు నమోదు చేయటమేగాక ఇప్పటి వరకు ఇద్దరు మాజీ మంత్రులను అరెస్టు చేశారు.
బంగ్లాదేశ్‌ యువతలో ఉన్న ఆగ్రహానికి దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఒక కారణం. విదేశీ చెల్లింపుల సమస్యలతో పాటు ఇటీవల వచ్చిన వరదలు కూడా గోరు చుట్టు మీద రోకటి పోటులా మారాయి. ఆగస్టు 21వ తేదీ నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 20 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా మరో 11 బిలియన్‌ డాలర్లు అవసరం కాగా డిసెంబరు నాటికి కనీసం 8 బిలియన్‌ డాలర్లు అవసరమని అంచనా వేసి ఐ.ఎం.ఎఫ్‌తో సహా వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడి జనం షేక్‌ హసీనా గద్దె దిగాలని మాత్రమే కాదు. తమ పరిస్థితి మెరుగుపడాలని కూడా కోరుకుంటున్నారు. అది జరగకపోతే మరోసారి ఆందోళన మరో రూపంలో జరగటం ఖాయం.

– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️