పరిహాసం!

ఒక ప్రాజెక్టు కారణంగా ఎవరు తమ సర్వస్వమూ కోల్పోతున్నారో వారికి తొట్టతొలిగా న్యాయం జరగాలి. పూర్తిస్థాయి పునరావాసం, జీవనోపాధి కల్పించి, ఆ తరువాతనే ప్రాజెక్టు పనిని తలకెత్తుకోవాలి. ఇది అంతర్జాతీయ పునరావాస సూత్రం. చేపడుతున్నది భారీ బహుళార్థక ప్రాజెక్టు అయినప్పుడు, అది పూర్తి కావటానికి ఏళ్లకు ఏళ్లు పడుతున్నప్పుడు, ఆ భారీతనం వల్లనే వందలాది గ్రామాలు ముంపునకు గురై, లక్షలాది మందీ నిర్వాసితులు అవుతున్నప్పుడు- ప్రభుత్వాలు మొట్టమొదటగా దృష్టి పెట్టాల్సింది పునరావాస కల్పన మీదనే! కానీ, మనదేశంలో ఏ ఒక్క ప్రాజెక్టు విషయంలోనూ ఇలాంటి సహజ న్యాయ విధానం అమలు కాలేదు. మన రాష్ట్రంలో వందలాది గిరిజన గ్రామాలను ముంచెత్తే పోలవరం ప్రాజెక్టు లక్షల మంది ఆదివాసీల బతుకులను అస్తవ్యస్తం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పునరావాసానికి అత్యంత అథమ ప్రాధాన్యం ఇస్తున్నందువల్ల – త్యాగ జనుల ఇక్కట్లూ, ఇబ్బందులూ ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. కాలువల్లో పారాల్సింది నీళ్లు తప్ప నిర్వాసితుల కన్నీళ్లు కాదన్న ఇంగితం పాలకులకు లేకుండా పోయింది!

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తొలి విడత నిర్వాసితులంటూ 20,946 కుటుంబాలకు నష్టపరిహారం విడుదల చేసింది. పదేళ్ల క్రితం ప్రకటించిన ప్యాకేజీ లెక్కల్లోనే పరిహారం చెల్లించటం అన్యాయం. పోస్టాఫీను పథకాల్లో డిపాజిట్టు చేసుకున్న సొమ్ము సైతం పదేళ్లలో రెట్టింపునకు పైగా పెరుగుతుంది. 2015లో నిర్ణయించిన రూ.5.86 లక్షల పరిహారాన్నే చెల్లించటం నిర్వాసితులను వంచించటమే అవుతుంది. అత్యంత మానవత్వంతో చేపట్టాల్సిన పరిహార చెల్లింపు ప్రక్రియను పాలకులు పరిహాస స్థాయికి దిగజార్చటం దారుణం.

పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి చేశామని, 2027 నాటికి సంపూర్తి చేసి, కాలువల్లో నీళ్లు పారిస్తామని రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. తనకు అమరావతి, పోలవరం రెండూ రెండు కళ్ళు వంటివని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే ప్రాజెక్టును నేరుగా సందర్శించి, శ్వేతపత్రం విడుదల చేసి, వివిధ పనుల దశాదిశలపై సమీక్షించారు. ప్రాజెక్టు పూర్తిపై ఎంతో శ్రద్ధాసక్తి ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – ప్రాజెక్టు కోసం తమ భూమిని, ఊరిని, ఉనికిని, చరిత్రని, చెట్టుని, సంస్క ృతిని … ఒక్క మాటలో చెప్పాలంటే- తమ సమస్తాన్ని త్యాగం చేస్తున్న నిర్వాసితుల గురించి, వారికి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించటం గురించీ ఒక్క మాటా చెప్పటం లేదు. పోలవరం నిర్మాణానికి తనదే పూర్తి బాధ్యత అని విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం కూడా పునరావాసం మీద శ్రద్ధ చూపటం లేదు. ఐదేళ్ల పాటు రాష్ట్ర పాలన సాగించిన వైసిపి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తానని చెప్పింది తప్ప – దానిని ఆచరణలో పెట్టలేదు. పునరావాస కల్పన, నిర్వాసితుల తరలింపు 13 శాతానికి మించి ముందుకు సాగలేదు. నిర్మించిన పునరావాస కాలనీల్లో కూడా పూర్తిస్థాయి వసతులను ఏర్పాటు చేయలేదు. మనుషులను మనుషులుగా గుర్తించని, గౌరవించని ఘోర నిర్లక్ష్యానికి ఈ ఉదంతం ఒక తార్కాణం. ప్రాజెక్టు నిర్మిస్తే ముంపు ఎంత మేర జరుగుతుందన్న నిర్ధారణ కూడా శాస్త్రీయంగా జరగలేదు. నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే 2022 జులైలో వచ్చిన వరదలకు 41.75 కాంటూరుకు పైన ఉన్న గ్రామాలు సైతం దారుణమైన ముంపునకు గురయ్యాయి. శాస్త్రీయంగా, సవ్యంగా మళ్లీ లెక్కలు తీసి, ముంపు గ్రామాలను, నిర్వాసిత కుటుంబాల సంఖ్యను పునః నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టును ప్రకటించి, దాదాపు ఒక తరం కాలం గడిచిపోయింది. పునరావాసం పూర్తిస్థాయిలో సమకూర్చకుండానే ప్రభుత్వాలు నిర్వాసితులను కష్టనష్టాల్లో ముంచెత్తుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం పట్ల, నిర్వాసితుల పట్ల ప్రదర్శించిన నిర్పూచీతనాన్ని వదులుకోవాలి. కాంటూరు లెక్కలను తాజాపరిచి, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం… పెరిగిన ధరలకు అనుగుణంగా పరిహారం చెల్లించాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలి. పునరావాసం పూర్తిస్థాయిలో చేపట్టి, నిర్వాసితులు తమ బతుకు దారిలో కాళ్లూనుకునేలా చేసిన తరువాతనే ప్రాజెక్టు పనులు చేపట్టాలి. ఈలోగా ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించాలి.

➡️