పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పై జిహాదిస్టులు తిరుగుబాటు చేసి పదవీచ్యుతుణ్ణి గావించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. చమురు సంపన్నమైన ఈ ప్రాంతంలో రష్యా, ఇరాన్ పలుకుబడిని దెబ్బతీసి, తన ఆధిపత్యానికి ఎదురు లేకుండా చూసుకోవాలన్న అమెరికా దుష్ట పన్నాగంలో భాగమే సిరియాలో అసద్‌పై తిరుగుబాటు. ఇంతకుముందు అరబ్ ప్రపంచంలో రంగు విప్లవాలను అమెరికా ఎలా ప్రోత్సహించినదీ చూశాం. సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు గత దశాబ్దన్నర కాలంగా అమెరికా కుట్రలు పన్నుతూనే ఉంది. ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు బయటకు పోజు పెట్టే అమెరికా, ఇతర పశ్చిమ దేశాల కపట వైఖరి సిరియాలో మరోసారి బట్టబయలైంది. అసద్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అల్‌ఖైదా మూలాలున్న జిహాదిస్టు గ్రూపులకు సామ్రాజ్యవాద దేశాలు అధునాతన ఆయుధాలు, డబ్బు ఇచ్చి ఎలా ఎగదోసిందీ అందరికీ ఎరుకే. సిరియాలో అసద్ నిష్క్రమణ వెనుక ప్రాంతీయ, అంతర్జాతీయ శక్తుల పాత్ర తక్కువేమీ లేదు. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన హయత్ తెహ్రీర్ అల్ షామ్ (హెచ్‌టిఎస్) అధినేత అబూ అహ్మద్ అల్ జొలాని అమెరికా కస్టడీలో అయిదేళ్లు ఉండి 2011లో సిరియాలో తలెత్తిన తిరుగుబాటుకు ముందు విడుదలయ్యాడు. ఆ తిరుగుబాటును లేవనెత్తడంలో జొలానీ పాత్ర ఉంది. హెచ్‌టిఎఎస్, ఫ్రీ సిరియన్ ఆర్మీ, స్థానిక తీవ్రవాద గ్రూపులను అన్నిటినీ కలుపుకుని సిరియన్ నేషనల్ అలయెన్స్ పేరుతో కూటమి ఏర్పాటు చేసి అసద్ ప్రభుత్వాన్ని కూల్చడమే ఏకైక ఎజెండాగా సిరియాలో అలజడి సృష్టించాడు. పదకొండు రోజుల క్రితం ఇడ్లిబ్‌లో మొదలైన తిరుగుబాటు అలెప్పో, హామ్ పట్టణాలను ఒక్కొక్కదానిని వశపరచుకుంటూ రాజధాని డమాస్కస్‌ను శనివారం రాత్రి ముట్టడించడంతో పారాకాష్టకు చేరింది. పరిస్థితి తీవ్రతను గమనించిన అధ్యక్షుడు అసద్ హింసను నివారించేందుకు శాంతియుతంగా అధికార బదలాయింపునకు వీలుగా దేశం వీడి కుటుంబంతో సహా రష్యాకు వెళ్లిపోయారు. సిరియా ప్రధాని జలీల్ అధికార మార్పిడిలో తిరుగుబాటు దారులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడంతో రాజ్యాధికారం ఇప్పుడు జిహాదిస్టుల చేతుల్లోకి వచ్చింది. సిరియాపై ఆధిపత్యం కోసం విభిన్న గ్రూపుల మధ్య విభేదాలు ఎటువంటి మలుపు తీసుకుంటాయో చెప్పలేం. ఇంతలోనే సిరియాకు చెందిన గొలాన్ హైట్స్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఇజ్రాయిల్ భీకర దాడులు ప్రారంభించింది. 1967లో యుద్ధం తరువాత కుదిరిన ఒప్పందం ప్రకారం ఏర్పాటైన గొలాన్ హైట్స్ బఫర్ జోన్‌లోకి ఇజ్రాయిల్ చొరబడడంపై అరబ్ లీగ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇజ్రాయిల్ దురాక్రమణను ఆపాలని ముక్త కంఠంతో అవి డిమాండ్ చేస్తున్నా అమెరికా, వాటి మిత్ర పక్షాలు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. అసద్ పతనం తరువాత అమెరికా తదుపరి లక్ష్యం ఇరానేనని వార్తలొస్తున్నాయి. సిరియా పరిణామం తరువాత ఈ ప్రాంత రాజకీయ భౌగోళిక స్వరూపంలో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. తిరోగామి శక్తుల చేతుల్లో సిరియా భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. 1970లో అధికారంలోకి వచ్చిన హఫీజ్ అల్ అసద్‌ను ఆధునిక సిరియా నిర్మాతగా పేర్కొంటారు. ఆయన వారసుడిగా 2000లో పగ్గాలు చేపట్టిన తనయుడు బషర్ అల్ అసద్ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేశారు. అయితే, పశ్చిమ దేశాల ఆంక్షలు, అంతర్యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. సుమారు కోటీ 20 లక్షల మంది వలసపోయారు. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోనే సుమారు 20 లక్షల మంది శరణార్ధులుగా రోజులు నెట్టుకొస్తున్నారు. తీవ్రవాద సంస్థ అల్‌ఖైదాకు ఒకనాటి శాఖ అయిన హెచ్‌టిఎస్ లక్ష్యం సిరియాను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే. సున్నీలు, షియాలు, క్రైస్తవులు, అలవిలు, డ్రూజ్‌లు తదితర మతాల ప్రజలు సహజీవనం చేసే ప్రాంతాన్ని లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దడంలో అసద్ నేతృత్వంలోని బాత్ పార్టీ విశేషమైన కృషి చేసింది. శాంతి, సౌభాగ్యం, ప్రజాస్వామ్యం, విభిన్న సంస్కృతులు, జాతులు, మతాలతో కూడిన వైవిధ్యాన్ని కాపాడుకుంటూ ఐక్యంగా ముందుకు సాగడం నేడు సిరియా ముందున్న అతి పెద్ద కర్తవ్యం. ఇందుకోసం సిరియాలోని లౌకిక, ప్రజాతంత్ర శక్తులు సాగించే పోరాటానికి అంతర్జాతీయ కార్మిక వర్గం బాసటగా నిలవాలి. ఈ పోరాటంలో అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా భారత్ సిరియా ప్రజల పక్షాన గట్టిగా నిలబడాలి.