గణాంకాలలో మేటి

Jun 29,2024 05:42 #editpage

గణాంకాలు, ఆర్థిక ప్రణాళికలో ప్రొఫెసర్‌ ప్రశాంత చంద్ర మహలనోబిస్‌ చేసిన సేవలకు గుర్తుగా ఈయన పుట్టిన రోజు జూన్‌ 29న జాతీయ గణాంక దినోత్సవంగా మన దేశం పాటిస్తుంది. డాక్టర్‌ మహలనోబిస్‌ ఒక ప్రముఖ భారతీయ గణాంక శాస్త్రవేత్త. ఆయన భారతీయ గణాంకాల పితామహుడిగా కూడా పరిగణించ బడ్డాడు. స్వాతంత్య్రా నంతరం భారతదేశపు మొదటి ప్రణాళికా సంఘంలో సభ్యుడు కూడా. ఆయన ఆవిష్కరించిన ”మహాలనోబిస్‌ డిస్టెన్స్‌” పద్ధతి అనేది గణాంక డేటా విశ్లేషణలో అత్యంత ప్రజాదరణ పొందిన కొలమానాలలో ఒకటి. గణాంక విశ్లేషణలో నమూనా పద్ధతుల ప్రాముఖ్యతను సూచించే భావనగా పైలట్‌ సర్వేలను ప్రవేశ పెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. డాక్టర్‌ మహలనోబిస్‌ 1931లో కలకత్తాలో స్థాపించబడిన ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపక సభ్యుడు కూడా. ఈ సంస్థ గణాంక పరిశోధనతో పాటు విద్య కోసం ఒక ప్రధాన సంస్థగా ఉద్భవించింది. 1950 లలోనే మన దేశానికి మొదటి డిజిటల్‌ కంప్యూటర్‌ తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. దీన్ని బట్టి చూస్తే ఆయనకు గణాంక రంగంలో ఎంత ముందు చూపు ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. గణాంక రంగంలో ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. భారతీయ గణాంక సంస్థకు కార్యదర్శిగా, భారత ప్రభుత్వ కేబినెట్‌కి గణాంక సలహాదారుడుగాను పని చేశారు. ఆయన దేశానికి చేసిన సేవకు 1968లో పద్మవిభూషణ్‌ కూడా లభించింది.
– జనక మోహన రావు దుంగ,
సెల్‌ : 8247045230

➡️