‘పక్షులు మానవునికి జీవన గమనం నేర్పుతాయి. వాటిని కాపాడటం మన కర్తవ్యం’ అంటారు భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడు సలీం అలీ. జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన అద్భుత జంతుజాలమే పక్షులు. ఈ సృష్టిలో పక్షులది ఒక ప్రత్యేకమైన స్థానం. ప్రకృతికి అందాన్ని, మానవాళికి జీవవైవిధ్యంతో పాటు ఆనందాన్ని అందిస్తాయి. ‘భూమిపై జీవితం యొక్క గొప్ప ఆనందాలలో పక్షుల గానం ఒకటి’ అంటారు ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు రాబర్ట్ లిండ్. వీటి జీవన విధానం మనిషికి సహనాన్ని, శ్రమను, స్వేచ్ఛను నేర్పుతాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. పక్షులు-పర్యావరణం మధ్య ఉన్న అవినాభావ సంబంధం మానవాళి మనుగడకు అత్యంత ముఖ్యమైనది. వ్యవసాయంలో కీలకమైన పాత్ర వహిస్తాయి. పంటలకు హానిచేసే, కీటకాలను, పురుగులను తినడం ద్వారా తెగుళ్లు రాకుండా పరోక్షంగా పంటలను రక్షిస్తాయి. పువ్వుల్లోని పుప్పొడిని ఒకచోటు నుండి మరోచోటుకు తీసుకువెళ్లి పునరుత్పత్తికి సహాయపడతాయి. విత్తనాలను వ్యాప్తి చేయడంలో సహాయపడటం ద్వారా అడవుల పెరుగుదలకు సహకరిస్తాయి. చనిపోయిన జంతువులను తినే రాబందు వంటి పక్షులైతే పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలోనూ సహాయపడతాయి. అందుకే-‘పక్షులు వ్యవసాయానికి, పర్యావరణానికి సహజ మిత్రులు’ అంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, పక్షులు మానవాళికి అవసరమైన ఆహార గొలుసులో ముఖ్యమైన భాగంగా ఉంటూ పర్యావరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ప్రాముఖ్యతను వివరిస్తూ ‘ప్రతిదీ మరొకదానితో ముడిపడి ఉంది’ అంటారు జాన్ ముయిర్. పర్యావరణంలోని ఈ సంక్లిష్టమైన సంబంధాలలో పక్షులు ఒక ముఖ్యమైన బంధం. పక్షులు, మూగజీవాలు కళ్ల ముందే చనిపోతున్నా పెద్దగా పట్టించుకోరు చాలామంది. కానీ, ఓ పక్షి ప్రాణాలు కాపాడేందుకు స్వయంగా జడ్జి, కలెక్టర్ రంగంలోకి దిగారు. కన్నూరు జిల్లా, ఉల్లిక్కల్ పంచాయతీ పరిధిలోని మూసేసిన ఓ టెక్స్‌టైల్ షాపు గ్లాస్ ప్యానెల్‌లో ఓ పక్షి చిక్కుకుంది. ఆ ప్యానెల్‌లో నుంచి బయట పడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ సాధ్యం కాలేదు. పక్కనున్న షాపులవాళ్లు చూసినా కాపాడలేని పరిస్థితి. బిజినెస్ పార్ట్‌నర్స్ మధ్య ఏర్పడిన వివాదం కారణంగా ఆ షాపును కొన్ని నెలల క్రితం కోర్టు సీజ్ చేసింది. షాపు తెరవాలంటే, కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. ఇందుకోసం జిల్లా కలెక్టర్, ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. దీనిపై స్పందించిన జడ్జి… నేరుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపును తెరిపించి, మూడు రోజులపాటు గ్లాస్ ప్యానెల్‌లో చిక్కుకున్న పక్షిని ప్రాణాలతో కాపాడారు. ఆ పక్షి… స్వేచ్ఛగా గాల్లోకి ఎగిరిపోయింది.
అయితే, పక్షుల మనుగడ నేడు ప్రమాదంలో పడింది. ఈ ఒక్క పక్షినైతే రక్షించగలిగారు. కానీ, పట్టణీకరణ, అడవుల నిర్మూలన, కాలుష్యం, వ్యవసాయంలో రసాయనాల వినియోగం వల్ల పక్షుల ఆవాసాలు తగ్గిపోతున్నాయి. ఆహారం లభించక, విషపూరితమైన వాతావరణంలో జీవించలేక అనేక పక్షి జాతులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. ‘అభివృద్ధి క్రమం అంతా ప్రకృతి హక్కుల ఉల్లంఘనే’ అంటారు పర్యావరణ కార్యకర్త సత్యశ్రీనివాస్. ఆధునిక సాంకేతికత అభివృద్ధి వల్ల పక్షుల మనుగడకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. సెల్‌టవర్ల నుంచి వచ్చే రేడియో తరంగాలు వీటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పక్షుల సంఖ్య తగ్గిపోవడం కేవలం ప్రకృతికి జరిగే నష్టం మాత్రమే కాదు, ఇది మానవాళి మనుగడకు కూడా పెను ముప్పుగా మారుతున్నది. పక్షులు, పర్యావరణం మనకు వారసత్వంగా లభించిన సంపద. ఈ సంపదను కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్తరాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించగలం. ‘పక్షులను కాపాడటం అంటే, ప్రకృతిని కాపాడటం. ప్రకృతి లేని జీవితం అసంభవం’ అని ఎల్డో లియోఫోల్డ్ అంటారు. చిన్నచిన్న చర్యలే పెద్ద మార్పులకు నాంది పలుకుతాయన్నట్లుగా…కలెక్టర్, జడ్జి మాదిరిగా, పర్యావరణ పరిరక్షణకు మనం వేసే ఒక్క అడుగే పెద్ద మార్పునకు దారితీస్తుంది.
