బిల్లు భారం

ట్రూఅప్‌ చార్జీల పేరిట వినియోగదారుల నుంచి రూ.6,072 కోట్ల అదనపు ఎలక్ట్రిసిటీ బిల్లుల వసూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒడిగట్టడం దుర్మార్గం. నిత్యావసర వస్తువులు సహా అన్నింటి ధరలూ ఆకాశాన్నంటుతున్న వేళ, ఉపాధి సన్నగిల్లి ఆదాయాలు దిగజారుతున్న సమయాన సర్కారు మోదిన విద్యుత్‌ భారం ప్రజలకు శరాఘాతం. ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజి కాస్ట్‌ అడ్జెస్ట్‌మెంట్‌ (ఎఫ్‌పిపిసిఎ) మాటున మూడేళ్ల కింద 2022-23లో వాడుకున్న కరెంట్‌కు ఇప్పుడు వినియోగదారుల నుంచి బిల్లులు బాదేందుకు అనుమతించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కం) ఎ.పి. విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి)ని కోరగా వెను వెంటనే బహిరంగ విచారణ తతంగం ముగించిన మండలి, ట్రూఆప్‌ చార్జీల వసూళ్లకు అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చేసింది. ప్రజలపై చార్జీలు మోదొద్దని పలు సంస్థలు, పార్టీలు, ప్రజలు విన్నవించినా కనికరించలేదు. పైగా డిస్కంలు రూ.8,114 కోట్ల వసూళ్లకు అనుమతి కోరగా రూ.2 వేల కోట్లు తగ్గించామని, అది ప్రజలకు తామిచ్చిన పెద్ద ఊరట అని సమర్ధించుకోవడం పెద్ద దగా. ఈ డిసెంబర్‌ మొదలుకొని 15 మాసాలపాటు బిల్లులు గుంజుతారు. నెలకు యూనిట్‌కు గరిష్టంగా రూ.1.58 వంతున అదనంగా జనం గోళ్లూడగొట్టి వసూలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
తమకు అధికారమిస్తే కరెంట్‌ బిల్లులు నియంత్రిస్తామని, సోలార్‌ పథకం ద్వారా బిల్లుల భారం తగ్గిస్తామని టిడిపి కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చింది. చంద్రబాబు మారారని ఆశ పడ్డ వారి ఆశలు ఆవిరి కావడానికి నాలుగు మాసాలు పట్టలేదు. తామైతే 35 శాతం బిల్లులు తగ్గించేవారమని ప్రతిపక్షంలో ఉండగా బాబు చాలా తడవలు వల్లెవేశారు. తగ్గించడమేమో, 44 శాతం పెంచడం అమానుషం. చార్జీల పెంపుపై ఇఆర్‌సి ఆర్డర్‌ను చూసి కొత్తగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే పవర్‌ సెక్టార్‌పై విడుదల చేసిన వైట్‌ పేపర్‌లో చార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగానే శెలవిచ్చారు. జనమే గ్రహించలేకపోయారు. 2022-23, 2023-24 ఇంధన సర్దుబాటు చార్జీల బకాయిలు రూ.17,137 కోట్ల వరకు ఉన్నాయన్నారు సిఎం. వాటిలో 6,072 కోట్ల వసూళ్లకు లైన్‌క్లియర్‌ చేశారు. ఇంకా 11,826 కోట్ల బకాయిలున్నాయి. ఈ పూర్వరంగంలోనే వాటినీ వసూలు చేస్తామని విద్యుత్‌ శాఖా మంత్రి తాజాగా కుండబద్దలు కొట్టారు. ట్రూఅప్‌ చార్జీల వసూళ్లకు కూటమి సర్కారు చెప్పే సాకు గత ప్రభుత్వ నిర్వాకం. అది నిజమే. కానీ ఈ ప్రభుత్వానికి ప్రజలపై భారం వేయొద్దన్న ఆలోచన ఉన్నట్లయితే ట్రూఅప్‌ భారం తాను భరించి జనానికి ఉపశమనం కలిగించొచ్చు. గతంలో ట్రూఅప్‌ వసూళ్ల పిటిషన్లను ఇఆర్‌సి చెంతకు చేరకుండా చేసిన అనుభవం టిడిపికి ఉండింది కూడా.
పవర్‌ సెక్టార్‌లో ఒకటవ, రెండవ దశల ‘సంస్కరణ’లను తానే అమలు చేశానని, చేయబోయేది 3.0 రిఫార్మ్స్‌ అని శ్వేతపత్రంలో సిఎం ప్రకటించారు. ఇక్కడ సంస్కరణలు అంటే ప్రజలకు మంచి చేసేవి కావు. ప్రపంచబ్యాంక్‌ ఆదేశాలు. ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి ప్రైవేటు, కార్పొరేట్లకు అడ్డంగా దోచిపెట్టేవి. ఎలక్ట్రిసిటీ బోర్డు విభజన, జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు, ఇఆర్‌సి, పిపిఎలు, షార్ట్‌టర్మ్‌ కొనుగోళ్లు అందులో భాగమే. ఏనాడో కాల్చిన కరెంట్‌కు కొన్నేళ్ల తర్వాత బిల్లులు కట్టాలన్న ఎఫ్‌పిపిసిఎ విధానమూ అంతే. కేంద్రంలో మోడీ ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణల చట్టం ప్రతిపాదిస్తే టిడిపి, జనసేన, వైసిపి పోటీ పడి మరీ జైకొట్టాయి. సదరు పార్టీల ఏలుబడిలో కరెంట్‌ బిల్లులు తగ్గుతాయనుకోవడం అత్యాశ, అవివేకం. బిజెపి సంస్కరణలు కార్పొరేట్ల యథేచ్ఛ దోపిడీకి దారులు వేస్తాయి. ప్రజలపై పెనుభారాలు మోపుతాయి. ఇప్పటికే గ్రీన్‌, విండ్‌, థర్మల్‌, సోలార్‌, పంప్డ్‌ స్టోరేజి పేరిట విద్యుత్‌ రంగాన్ని అదానీకి ఏ విధంగా కట్టబెడుతున్నారో చూస్తున్నాం. బిజెపి విధానాల అమలు విషయంలో వైసిపి, టిడిపి కూటమి ఒకటే. ట్రూఅప్‌ చార్జీల వసూలు నిర్ణయాన్ని కూటమి సర్కారు ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ మెడలు వంచేందుకు ప్రజలు నాటి బషీర్‌బాగ్‌ ఉద్యమ స్ఫూర్తిని కనబరచాలి.

➡️