మన ప్రాచీనులు నమ్మినట్లు జీవ ఆవిర్భావం అనేది ఏ ఒక్క రోజో జరగలేదు. ప్రముఖ శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలను విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. మనిషి ఒక రకమైన కోతి జాతి నుంచి పరిణామం చెందుతూ వచ్చాడని ఈ సిద్ధాంతం చెబుతోంది. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాద రచనలకు కూడా ఊపిరి పోసింది. ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటి నుంచీ లేవనేది ఈ సిద్ధాంతం ప్రధానమైన వాదన. కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివి. పిల్లులూ, చిరతపులులూ, పెద్ద పులులూ, సింహాలూ మరొక జాతికి చెందినవి. గుర్రాలూ, గాడిదలూ, జీబ్రాలూ ఒకలాంటివి. గతంలో వీటికి తలొక ”పూర్వీకుడూ” ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ ‘ఆదిమ’ శునకానికీ, మార్జాలానికీ, అశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది. ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలూ, పక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది. వీటిలో కొన్ని శాకాహారులుగానూ, మరికొన్ని మాంసాహారులుగానూ రూపొందడానికి భౌతిక ప్రేరణలూ, పర్యావరణ పరిస్థితులే కారణాలయి ఉంటాయనే ఉద్దేశంతో డార్విన్ చాలా పరిశోధనలు చేశారు. జీవజాతుల మధ్య సంఘర్షణ ఉంటుంది. సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణ, ప్రకృతిలో సంఘర్షణ. ఈ సంఘర్షణలో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన సార్థక జీవులు. ఇవే మనుగడను సాగిస్తాయి. ఈ జీవులలోని వైవిధ్యాలే తరాలు మారుతూ పోగా కొత్త జాతుల ఉత్పన్నానికి మూలాధారాలు అవుతాయి. ఇది సంక్షిప్తంగా డార్విన్ పరిణామ వాదం. దీనినే మనుగడ కోసం పోరాటం అంటారు. ఇటువంటి విషయాలను క్రోడీకరించి డార్విన్ ‘జీవ జాతుల ఉత్పత్తి’ అనే పుస్తకాన్ని రాసి 1859 నవంబర్ 24న తొలిసారి ప్రచురించారు.
/ నవంబర్ 24 జీవపరిణామ దినోత్సవం/
– యం. రాం ప్రదీప్,
సెల్ : 9492712836