చెరకు రైతులకు చేదు అనుభవం!

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో రెండు సంవత్సరాల క్రితం వరకు దాదాపు 30 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పండిన 5.50 లక్షల టన్నుల చెరకును పంచదార ఉత్పత్తికి తరలించే పరిస్థితి వుండేది. అలాంటిది నేడు 1 లక్ష టన్నులకు రైతాంగం దిగిపోయారంటే ప్రభుత్వాలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించాయో అర్ధమౌతోంది.
గోవాడ సహకార చక్కెర ఫ్యాక్టరీ గత 6 దశాబ్దాలుగా నడుస్తుండడం, మిషనరీ పాతది కావడంతో దిగుబడి తగ్గడం, ఆధునీకరణకు నిధులు లేక పంచదారకు మార్కెట్‌ సౌకర్యం కల్పించకపోవడం, గత పాలక వర్గాల అవినీతికి పాల్పడడంతో నేడు అత్యంత దయనీయ స్థితిలో ఈ ఫ్యాక్టరీ నడుస్తోంది. 2025 జనవరి 20వ తేదీన చెరకు క్రషింగ్‌ ప్రారంభించినా నిధుల లేమితో యంత్రాలను సరిగా శుద్ధి చేయకపోవడంతో ప్రారంభం నుండి ఇప్పటికి 40 సార్లు చెరకు గానుగాట ఆగిపోయి రైతులు, కార్మికులకు అగ్నిపరీక్ష పెట్టింది. దీంతో ఫ్యాక్టరీకి చెరకు తీసుకువచ్చిన రైతాంగం విసిగి, వేసారి భారీ ఆందోళన నిర్వహించి ప్రభుత్వానికి, అధికారులకు పెద్ద హెచ్చరిక ఇచ్చారు. రాష్ట్రంలో మిగిలిన ఏకైక సహకార గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ దయనీయ పరిస్థితి, అక్కడ రైతాంగం పడుతున్న ఇబ్బందులను గమనించి…సిపిఎం రక్షణ యాత్రలో భాగంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…ఇటీవల గోవాడ చక్కెర ఫ్యాక్టరీని సందర్శించి అక్కడ రైతాంగం, కార్మికుల స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ ఆధునీకరణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని, చెరుకు రైతాంగానికి, పని చేస్తున్న కార్మికులకు బకాయిలు చెల్లించాలని సిపిఎం, రైతు, కార్మిక సంఘాలు మార్చి 21న మహా ధర్నాను, భారీ రాస్తారోకోను నిర్వహించాయి. పది రోజుల్లో బకాయిలు చెల్లించడానికి, ఆధునీకరణకు ప్రభుత్వానికి విన్నవించడానికి ఫ్యాక్టరీ యాజమాన్యం హామీనిచ్చింది!

గోవాడ చక్కెర ఫ్యాక్టరీ రాష్ట్రంలో ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ సహకార ఫ్యాక్టరీ 25 వేల మంది రైతులు, కౌలు రైతుల సభ్యత్వంతో రైతాంగానికి విత్తనాలు, ఎరువులు, పంచదార వంటి సబ్సిడీలు ఇచ్చేది. అలాంటి షుగర్‌ ఫ్యాక్టరీ పాలకుల వైఫల్యం వల్ల నేడు లక్ష టన్నుల క్రష్షింగుకు పడిపోయింది. వచ్చే ఏడాది ఈ మాత్రం పరిస్థితి కూడా వుండదు. అనకాపల్లి బిజెపి ఎం.పీ., సి ఎం. రమేష్‌ కేంద్ర ప్రభుత్వం నుండి రూ.200 కోట్లు తెస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా సీజన్‌లో ఫ్యాక్టరీ అనేక ఇబ్బందులను ఎదర్కొంటున్నా కనీసం ఒక్కసారి కూడా అటువైపు చూడలేదు. కూటమి ప్రభుత్వం స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో కొత్త పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి ఉన్న ఒక్క సహకార గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీని ఆధునీకరించి ఉన్న ఉపాధిని కాపాడడం లేదు. కార్మికులకు నెలా నెలా జీతాలు రాక అప్పులు చేసి బతుకుతున్నారు. రైతులకు గత ఏడాది బకాయిలను నేటికీ చెల్లించలేదు. స్థానిక ఎమ్మెల్యేలు దీన్ని పూర్తి సామర్థ్యంతో నడుపుతానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ నీటి మూటగానే నిలిచిపోయింది. పైగా ఇక్కడ చెరకు బదులు డిస్టలరీ యూనిట్‌గా ఈ ఫ్యాక్టరీని మార్చుతానని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఒకవైపు చెరకు పరిశ్రమను ఆధునీకరించి ఈ ప్రాంత రైతాంగాన్ని, ప్రజల్ని ఆదుకోకుండా వచ్చే ఏడాదికి చెరుకు పంట వేయాలో లేదో, పంట వేసినా ఫ్యాక్టరీ నడుస్తుందో లేదోనని చెరుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీని మూసేస్తే ఫ్యాక్టరీ ఆస్తులను, భూములను ఎలా సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఉన్నట్టు ప్రజానీకం భావిస్తున్నారు!

మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలు చెరకు రైతులకు ప్రోత్సాహకాలు, గిట్టుబాటు ధర కల్పించి పంచదార ఉత్పత్తిలోను, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోను మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. చెరకుకు మద్దతు ధర పొరుగు రాష్ట్రాల్లో రూ.4 వేలు ఇస్తున్నా, ఇక్కడ రూ.3151 ప్రకటించినా ఇది కూడా సకాలంలో అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చెరకు దిగుబడి తగ్గిపోయి రైతాంగానికి రావాల్సిన ధర రావడం లేదు. ప్రభుత్వాలు కొత్త వంగడాలు ఇవ్వలేదు. మన రాష్ట్రంలోని ప్రభుత్వాలు గత 15 ఏళ్ల నుండి సహకార చక్కెర ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేయడం, ఉన్న ఫ్యాక్టరీని, ఇక్కడ రైతాంగాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసింది. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మీద సుమారు 11 మండలాల ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ మూతబడితే చెరకు రైతులు, కార్మికులు రోడ్డున పడతారు. గోవాడ చక్కెర ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం రైతులు, కార్మికులు, ప్రజలు ఐక్యంగా కదిలి మరో పోరాటానికి దిగడం మినహా మరో మార్గం లేదు.

వ్యాసకర్త : వి.వి.శ్రీనివాసరావు, సెల్‌: 9490098799

➡️