ఢిల్లీ ఎన్నికలలో విజయం సాధించిన బిజెపి కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా నిర్ణయించవలసి వుండగా మణిపూర్ మంటల మధ్య ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేసి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆయన అనివార్యంగా తొలగించబడ్డారు. 2023మే నెలలో మణిపూర్‌లో జాతి కలహాలు మొదలై దేశమంతా దుమారం రేగినా చలించని కేంద్ర మోడీ సర్కారు అక్కడ హుటాహుటిన రాష్ట్రపతి పాలన విధించింది. ఇప్పటికైనా ఏదో ఒకటి చేశారని అనుకుందామా అంటే ఇది తాత్కాలికమేననీ, సరైన పరిస్థితులు నెలకొనగానే ఎత్తివేస్తామనీ చెబుతున్నారు. మణిపూర్ మంటలు మలుపులలో రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. మొదటిది ఎన్ని ఎన్నికలు ఎన్ని రకాలుగా గెలిచినా దేశంలోని చాలా రాష్ట్రాలలో బిజెపి తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటూ దేశంలో చాలా సంక్షోభాలకు కారణమవుతున్నది. రెండవది తన స్వల్ప రాజకీయ మనుగడ కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను బలిచేయడానికి, విద్వేష రాజకీయాలు కొనసాగించడానికి ఆఖరుకు రాజ్యాంగ సూత్రాలను కూడా మంటగలపడానికి వెనుకాడదు.
సాంకేతిక చిట్కాలతో రాజ్యాంగానికి ఇష్టానుసారం వ్యాఖ్యానాలు చెబుతూ స్వార్థపూరత పోకడలకు దిగజారడానికి మణిపూర్ కన్నా మరో ఉదాహరణ అవసరం వుండదు. ఎప్పుడూ లేని విధంగా ఈశాన్య భారతం తన గుప్పిట్లోకి వచ్చిందని గొప్పలు చెప్పుకునే బిజెపి నాయకత్వం మణిపూర్ సంక్షోభం వల్ల ఆ ప్రాంతంపై వినాశకర ప్రభావాన్ని బేఖాతరు చేసి అవకాశవాద రాజకీయాలు నడిపింది. అటు గిరిజన తెగలకు వ్యతిరేకంగానూ, మరోవైపున మతాల వారీగానూ తాను సాగిస్తున్న రాజకీయ హోమానికి దాన్ని బలిపీఠంగా మార్చింది. హైకోర్టు చేసిన అనర్థదాయక వ్యాఖ్యలే ఆధారంగా బీరేన్ సింగ్ సర్కారు దురుద్దేశపూర్వకంగా అంత:కలహాల అగ్నికీలలకు ఆజ్యం పోసింది. గిరిజనులకు ఉద్దేశించిన రిజర్వేషన్ మైదానాలలో ప్రధానంగా స్థిరపడిన మెయితీలకు ఎందుకు ఇవ్వకూడదని హైకోర్టు అసందర్భ వ్యాఖ్యానం చేయడం ఒకటైతే అందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన ప్రభుత్వం చెప్పడంలో దురుద్దేశం ఇదే. కుకీ, జో, మెయితీ తెగల మధ్య మొదలైన ఈ వివాదంలో ఆయన బాహాటంగా రెండో పక్షం వహించారు. కుకీలలో క్రైస్తవ మత ప్రభావం ఎక్కువగా వుండటం, ఈ తెగల తగాదా చాటున మత రాజకీయాలు కూడా దాగి వుండటం పరిస్థితిని జటిలం చేసింది. చాప కింద నీరులా కొన్ని తీవ్రవాద శక్తుల ప్రభావం వుందనే సాకు చూపి ఈ సమస్యను కేవలం సాయుధ బలగాలతో పరిష్కరిస్తానన్నట్టు కేంద్ర హోం శాఖ వ్యవహరించింది.
అల్లకల్లోలం…
2023 మే నుంచి తీవ్రతరమైన మణిపూర్ జాతి ఘర్షణల్లో 250 మందికి పైగా మరణించగా హింసా కాండలో వందల మంది గాయపడ్డారు. 60,000 మంది ప్రజలు నివాసాలు కోల్పోయి శరణార్థులుగా మారారు. కుకీ ప్రాబల్యంగల కొండ ప్రాంతాలకూ, మైతేయీలు ప్రధానంగా ఉన్న లోయ ప్రాంతానికి మధ్య ఒక రక్షిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికే 60 వేల మంది కేంద్ర పోలీసు బలగాలను నియోగించవలసిన పరిస్థితి దాపురించింది. వాస్తవం ఏమంటే ఒకరికి సంబంధించిన ప్రాంతంలోకి మరొకరు అడుగు పెట్టే పరిస్థితే లేకుండా పోయింది. హింసా ప్రజ్వలన ఇంఫాల్ తదితర జిల్లాల్లో విద్యార్థుల తీవ్ర స్థాయిలో నిరసనలకు కారణమైంది. పోలీసులతో ఘర్షణలు ఇంఫాల్ తూర్పు పశ్చిమ జిల్లాలలో కర్ఫ్యూ విధించడానికి దారితీశాయి. ఇంటర్నెట్ మొబైల్ డేటా కూడా నిలిపివేయబడ్డాయి. ఇరుపక్షాలతో సంప్రదింపులు, చర్చలు జరిపి రాజకీయ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం ఒకటైతే దాన్ని స్వార్థానికి వాడుకోవాలనే కుట్రలు మంటలు ఎగదోశాయి. కేంద్ర పోలీస్ బలగాలు ప్రత్యేకించి అస్సాం రైఫిల్స్ కీలక స్థానంలోకి వచ్చాయి. మెయితీ రాజకీయ పక్షాలు అస్సాం రైఫిల్స్‌ను ఇతర కేంద్ర బలగాలను ఉపసంహరించాలని కోరుతుంటే కుకీలతో ఒప్పందాలను రద్దు చేయాలనే వాదన మరోవైపు నుంచి వచ్చింది. కుకి తీవ్రవాదులు డ్రోన్లను, రాకెట్లను ప్రయోగించటం వల్ల బయటి శక్తులు చొరబాటు గురించిన ఆందోళన జాతీయ భద్రతపై సందేహాలకు కారణమైంది. ముఖ్యమంత్రి నివాసంపైన కూడా దాడులు, నిరసనలు జరిగాయి.
బీరేన్ సింగ్ పక్షపాత వైఖరి
కుకీ మిలిటెంట్ గ్రూపులతో ఆపరేషన్ల నిలుపుదల ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నుంచి కూడా రావడం వల్ల కొండ ప్రాంతాల్లో మరోసారి తిరుగుబాటు కార్యక్రమాలు పెరిగాయి. కొన్ని మెయితీ తీవ్రవాద సంస్థల పట్ల సానుకూల సహాయ పాత్ర వహించారు. ఇటీవలనే బయటికి వచ్చిన ఒక ఆడియో ఫైల్‌ను అల్లర్లపై దర్యాప్తు జరుపుతున్న విచారణ కమిషన్‌కు సమర్పించారు. ముఖ్యమంత్రి తన అధికార నివాసం నుంచి తీవ్రవాద సంస్థలతో మాట్లాడటం, పోలీసు ఆయుధాగారం నుంచి వేలాది ఆయుధాలు కొల్లగొట్టిన వారి పట్ల ఆయన అనుకూలంగా ఉండటం వెల్లడించే ఆడియో టేపులు కూడా న్యాయ విచారణ సంస్థకు అందాయి. ముఖ్యమంత్రి పాక్షిక పాత్ర పూర్తిగా తెలిసి కూడా మోడీ ప్రభుత్వం బిజెపి కేంద్ర నాయకత్వం అతన్నే పదవిలో కొనసాగించారంటే రాజకీయ వ్యూహాలు, అంతర్గత కలహాలే కారణం. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లు మెయితీ తీవ్రవాద జాతి దురభిమానానికి మరింత ఆజ్యం పోయడానికే నిర్ణయించుకున్నాయి గనకే ఈ తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడైన టెంగోల్ ఎల్ సనజోబాను రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఈ సుదీర్ఘమైన ప్రతిష్టంభనతో అన్ని తరగతులలోనూ తీవ్రవాదులకు మరింత బలం చేకూరింది. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఈ కాలమంతటా ఒక్కసారి కూడా మణిపూర్ సందర్శించడానికి నిరాకరిస్తూ తన ఆశీస్సులు ఎటున్నాయో స్పష్టం చేశారు.
అవిశ్వాసం భయంతోనే…
తన దాకా వస్తేగానీ తెలియదన్నట్టే సమాజంలో అంత:కలహాలకు స్పందించని బిజెపి అధిష్టానం స్వంత పార్టీలో అంతర్గత కలహాలు రాగానే కళ్లు తెరిచినట్టు నటిస్తున్నది. హోం శాఖ మాజీ కార్యదర్శి అజరు కుమార్ భల్లాను గవర్నర్‌గా నియమించినప్పుడే అమిత్ షా ఆలోచన తేలిపోయింది. 60 మంది సభ్యులు గల శాసనసభలో బిజెపికి 32 స్థానాలున్నాయి. ఏడు స్థానాలున్న నాగా పీపుల్స్ పార్టీ, ఆరుగురున్న జెడియు కూడా మద్దతు తెలిపాయి. కాంగ్రెస్‌కు 5, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు 5, కుకీ అలయన్స్‌కు 2, ముగ్గురు ఇండిపెండెంట్లు ఎన్నికైనారు. అయితే ఈ అలజడి తర్వాత ఎన్‌పిపి మద్దతు వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మరో దశలో జెడియు రాష్ట్ర నాయకత్వం కూడా అదే విధమైన ప్రకటన చేసింది. అయితే నితీష్ కుమార్‌పై ఒత్తిడి తెచ్చి ఆ ప్రకటన ఉపసంహరింపచేశారు. కానీ ఇంతలో ఇంట్లోనే ముసలం పుట్టిందన్న కథనాలు వచ్చాయి. బీరేన్ సింగ్ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. ఈ దశలో ఆయన శాసనసభ సమావేశం ఏర్పాటు చేశారు గానీ శాసనసభా పక్ష సమావేశానికి సగం మంది హాజరు కాకపోవడంతో మద్దతు లేదని స్పష్టమైంది. రాజీనామా చేయడానికి సింగ్ వెళ్లినప్పుడు కూడా ఆయన వెంట పద్నాలుగు మంది ఎంఎల్‌ఎలు మాత్రమే వున్నారంటే సంకేతం అదే. రాజీనామా అన్నాక కూడా ఆయన బృందాన్ని ఢిల్లీ పిలిపించుకుని కేంద్ర నేతలు మంతనాలు జరిపినా మరో నాయకుడిని ఎంపిక చేసి సర్కారు నడిపించే అవకాశం కనిపించలేదు. దీర్ఘకాలికంగా సంక్షుభితంగా వున్న రాష్ట్ర పరిస్థితి రీత్యా శాసనసభను రద్దు చేయవచ్చని అనేక మంది పొరబడ్డారు. ఏదో విధంగా ఎంత చిన్న రాష్ట్రమైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే బిజెపి స్వభావానికే అది విరుద్ధం. శాసనసభను సమావేశపరిస్తే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం ఖాయం. దాంతో రాజీనామాను సాకుగా చూపి గవర్నర్ సమావేశాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకసారి సభ జరుగుతుందన్నాక గవర్నర్ పాత్ర వుండదు. ఆయన మరో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలి. లేదా అవిశ్వాస తీర్మానం అయ్యాక రంగ ప్రవేశం చేయాలి. ప్రభుత్వం లేకుండా సమావేశం వద్దనుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేవరకూ కొనసాగమని కోరాలి. అవేవీ చేయకుండా పిలిచిన అసెంబ్లీ సమావేశాలను రద్దు చేయడం రాజకీయ శృంగ భంగాన్ని తప్పించుకోవడానికి మాత్రమే. రెండు సమావేశాల మధ్య ఆరునెలలకు మించి వ్యవధి వుండరాదనే రాజ్యాంగ నిర్దేశం రీత్యా సమావేశాలను వాయిదా వేస్తే కుదరదు. కనుకనే రాష్ట్రపతి పాలనతో గవర్నర్ అడ్డు చక్రం వేశారు. ఈలోగా ఏదోలా రాజకీయ అతుకులతో కథ నడిపించాలంటే సభ్యులపై ఒత్తిడి తేవాలి. వలలు వేయాలి. రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తేవడానికి కేంద్రం కష్టపడుతున్నట్టు చెబుతున్నా నిజమైన వ్యూహం మాత్రం ఇదే. ఎవరిని నాయకుడిని చేసినా సభలో, పాలనలో నెగ్గేే పరిస్థితి లేదు.
జరగాల్సిందేమిటి?
బిజెపి ఎత్తుగడలు ఏమైనా మణిపూర్‌కు కావలసింది శాంతి సామరస్యాలే. జాతి కలహాలను చల్లార్చి ప్రజాస్వామిక విలువలను బతికించుకోవడం, దేశానికి అవసరం. సాయుధ బలగాల నీడలో కేంద్రం పరోక్ష పెత్తనం ఎక్కువ కాలం సాగించడం క్షేమదాయకం కాదు. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ పరిస్థితి కల్లోలితంగానే వుంది. అనేకమంది భయోత్పాతంతో బతుకుతున్నారు. సమాజంలో వివిధ వర్గాల్లో సాయుధ గ్రూపుల ప్రాబల్యం పెరిగిపోయింది. కేంద్రం అండదండలతో మాజీ ముఖ్యమంత్రి అనుసరించిన పక్షపాత వైఖరిలో భాగంగా ఇరు పక్షాల సయోధ్య కోసం వలంటీర్లు అనేవారు పుట్టుకొచ్చి ఆయుధాలతో స్వైరవిహారం చేస్తూ కొత్త బెడదగా మారారు. ఈ దేశంలో సాయుధ చర్యలకు పాల్పడేవారే గాక మయన్మార్‌లో సాయుధ పోరాటం చేస్తున్న వారు కూడా ఈ శక్తులలో కలసిపోయారని నిఘా వర్గాల సమాచారం చెబుతున్నది. కేవలం కుకీలను మాత్రమే నిరాయుధులను చేయాలని చూసిన బీరేన్ గత ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇప్పుడు నేరుగా కేంద్రమే వ్యవహారాలు చేతిలోకి తీసుకున్నది గనక ప్రశాంతతను నెలకొల్పే ప్రక్రియ వేగం పుంజుకోవాలి. మెయితీ, కుకీ, జో వర్గాలతో సహా అందరినీ భాగస్వాములను చేయాలి. అదే విధంగా రాజకీయ పక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. శాంతి సామరస్యాల పునరుద్ధరణకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవడంతో పాటు పౌర హక్కులను హరించే నిర్ణయాలను, నిర్దేశాలను వెనక్కి తీసుకోవాలి. మామూలుగా అయితే ఇలాంటి తరుణంలో నేరుగా ఎన్నికలకు వెళ్లి ప్రజల తీర్పు కోరడమే సరైన పరిష్కారంగా వుండేది. ఆ వాతావరణం లేదని రాష్ట్రపతి పాలన పెట్టారు గనక నిర్ణీత వ్యవధి లోగా ఎన్నికల నిర్వహణ దిశలో అడుగులు వేయాలి.
తెలకపల్లి రవి