బిజెపి చెలగాటంలో తెలుగు రాష్ట్రాలు

2024 ఎన్నికల సర్వేలతో దేశమంతా ఉత్కంఠ పెరుగుతున్నవేళ తెలుగు రాష్ట్రాల పరిస్థితి మరింత వేడెక్కుతున్నది. ఎ.పి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, ఆయనకన్నా ముందు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలు చేసి వచ్చారు. జగన్‌ ప్రధాని మోడీని కలిస్తే చంద్రబాబు హోం మంత్రి అమిత్‌షాను కలవడం పెద్ద సంచలనంగా ప్రచారమైంది. ఈ రెండు పర్యటనలపై వారి వారి హడావుడి తప్ప అవతలివైపు నుంచి ఎలాంటి అధికారిక స్పందనలు రాలేదు. ఇక తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌పై ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై రోజూ నిప్పులు కక్కుతుంటే మధ్యలో బిజెపి ఉభయులపై అస్త్రాలు సంధిస్తున్నది. ప్రభుత్వం కూలిపోతుందని బిఆర్‌ఎస్‌ మాట్లాడుతుంటే ఆ పార్టీనే కూలిపోతుందని కాంగ్రెస్‌ వ్యాఖ్యానిస్తున్నది. ఎ.పి లో పార్టీల ఎంఎల్‌ఎలు, ఎంపిలు అటూ ఇటూ మారుతుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ బిఆర్‌ఎస్‌ నుంచి ఒక ఎంపీని చేర్చుకున్నది. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడం రేవంత్‌కు అనివార్యమైన అవసరమనే భావన బలంగా వ్యాపిస్తుంటే ఎ.పి లో చంద్రబాబు నాయుడుకు ఇది ఆఖరి పరీక్ష అన్న వాతావరణం నెలకొన్నది. మరోవైపు జగన్‌ ప్రజల్లో పెరిగిన అసంతృప్తి అధిగమించి మరోసారి గద్దె కాపాడు కోవడమెలాగనే వ్యూహాల్లో మునిగివున్నారు. చంద్రబాబు ‘రా కదిలిరా…’ అంటూ సభలు పెడుతుంటే జగన్‌ ‘సిద్ధం’ సభలతో యుద్ధం ప్రకటిస్తున్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ శాసనసభలోకి ప్రవేశించడమే లక్ష్యంగా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠం స్వీకరించిన వైఎస్‌ షర్మిల బిజెపి మత రాజకీయాలను ఖండిస్తున్నా అన్నయ్యతో తనకున్న కుటుంబ విభేదాలపై చేసిన వ్యాఖ్యలతోనే విస్తృత ప్రచారం పొందుతున్నారు. వీటికి తోడు రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణ రాజకీయంగా కెసిఆర్‌ జగన్‌ స్నేహం, తెలుగుదేశం రేవంత్‌ మంత్రుల మధ్య మైత్రి వంటివి అదనపు అంశాలుగా తయారైనాయి. వీటన్నిటి మధ్యనా వెలువడుతున్న వివిధ సర్వేలు రకరకాల అంచనాలతో ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

  • చంద్రబాబు విన్యాసాలు, జగన్‌ సంబంధాలు

బిజెపితో మళ్లీ జట్టు కట్టడం, దాని నాయకత్వంలో చేరడం కోసం చంద్రబాబు నాయుడు చాలా కాలంగా తలుపులు తెరుచుకుని కూచునే వున్నారు. 2018లో ఎన్నికల ముందు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు చివరలో బిజెపి నుంచి విడిపోవడం, ఎన్‌డిఎ నుంచి బయిటకు రావడం కేవలం ప్రజలను నమ్మించడానికేనని అందరికీ తెలుసు. అందుకే ఆ క్రీడలు ఆయన ఓటమిని ఆపలేకపోయాయి. ఎన్నికల అనంతరం ఎన్నడూ ఆయన గానీ ఆ పార్టీ గాని బిజెపిపై పల్లెత్తు విమర్శ చేయలేదు. ఇక ప్యాకేజీని పాచిపోయిన లడ్డుగా అభివర్ణించి ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుని చేగువేరా బొమ్మతో ఊరేగిన పవన్‌ కళ్యాణ్‌ ఫలితాల తర్వాత నేరుగా బిజెపి కూటమిలో దూరడమే గాక నేరుగా సంఘ పరివార్‌ భావజాలాన్ని కీర్తించడం మొదలుపెట్టారు. మోడీ, అమిత్‌షాలే అద్భుత నాయకులుగా అనుక్షణం విధేయత ప్రకటిస్తూ వచ్చారు. అదే సమయంలో జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూడాలని అందుకు అందరనీ కలుపుతానని టిడిపితో పొత్తు పెట్టుకున్నారు. ఈ ఉభయులు కూడా రాష్ట్ర సమస్యలపై కేంద్రం నుంచి సాధించుకోవలసినవి వదలిపెట్టి కేవలం రాష్ట్ర ప్రభుత్వమే తప్పు చేస్తుందన్న పాట ఎత్తుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌ కూడా రాష్ట్రానికి రావలసిన ఆర్థిక సహాయం, విభజన సమస్యల కోసం పట్టుపట్టవలసింది పోయి మోడీకి వంత పాడటం విధానంగా చేసుకున్నారు. ఆయనకు పూర్తి మెజార్టీ వుంది గనక మనమేం చేయలేమని చేతులెత్తేశారు. ఈ విధంగా మూడు ప్రాంతీయ పార్టీలూ మోడీ ప్రదక్షిణాలలో మునిగితేలడంతో ఎ.పి ప్రయోజనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. జగన్‌ తన మీదున్న కేసుల కారణంగా మోడీకి లొంగిపోయారని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే గత ఏడాది చివరలో చంద్రబాబును కూడా జగన్‌ ప్రభుత్వం అనేక కేసులలో కోర్టుకెక్కించడంతో ఆయన కూడా అదే స్థితిలో పడిపోయారనే భావం ప్రజల్లో వచ్చింది. అంతేగాని దేశంలో మతతత్వ రాజకీయాలు, రాష్ట్రాల హక్కులపై దాడి, వనరుల కోత, పౌర హక్కులపై భావ ప్రకటనా స్వేచ్ఛపై వేటు వేయడం వంటి రాజకీయ అంశాలేవీ ఈ మూడు పార్టీల ఎజెండాలో లేకపోగా పరస్పర దూషణలే సర్వస్వంగా రాష్ట్ర వ్యవహరాలు నడిచాయి. రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చని కేంద్రం కొత్తగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వంటి దారుణాలకు తెగబడింది. అమరావతి రాజధానికి నాలుగు పైసలు విదిల్చి చేతులు దులుపుకుంది. పోలవరం నత్తనడకకూ ఆటంకాలు కల్పించింది. ఇక రెవెన్యూ లోటు భర్తీ వెవనకబడిన ప్రాంతాల నిధులు వంటివి ఎండమావు లయ్యాయి. ఇంత జరుగుతున్నా మూడు పార్టీలు పోటీపడ మోడీని మోశాయి తప్ప నిలదీసింది లేదు. వైసిపి, టిడిపి పార్లమెంటులో పోటీపడి కేంద్రానికి అనుకూలంగా ఓటు వేస్తూవచ్చాయి. అదనంగా తెలుగుదేశం అధినేత పొత్తు కోసం తలకిందులుగా తపస్సు చేసినంత పనిచేశారు.

  • బలంలేని బిజెపికి దాసోహం

బిజెపికి నిజానికి గత ఎన్నికల్లో 0.96 శాతం అంటే ఒక శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. అదే నోటాకు 1.5 శాతం ఓట్లు వచ్చాయి. అలాంటి బిజెపితో పొత్తు ఎందుకంటే ఎన్నికలు సజావుగా జరిపించుకోవడానికి ఓట్లు వేయించుకోవడానికి అని సమర్థన వినిపిస్తున్నారు. జగన్‌ను గద్దె దించాలంటే ఇదే మార్గమని టిడిపి, జనసేన అదేపనిగా వాదించాయి. వాస్తవానికి ఈ రెండు పార్టీలు 2014లోనూ బజెపితో కలసి పనిచేశాయి. కాకుంటే అప్పటికి మోడీ ప్రధాని కారు. జనసేన ఎన్నికల్లో పోటీ కూడా లేకుండా బలపర్చింది. 1996లో 13 రోజుల్లో దిగిపోవలసి వచ్చిన వాజ్‌పేయి సర్కారు 1998లో కొనసాగ గలిగిందంటే టిడిపి ప్లేటు ఫిరాయించి ఆ పంచన చేరడమే కారణం. ఆ విధంగా దేశంలో బిజెపి సర్కారు రావడానికి దక్షిణ భారతంలో కాలూనడానికి తొలి కారకుడు చంద్రబాబే. అప్పుడు జగన్‌ కాదు కదా, వాళ్ల నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా అధికారంలో లేరు. కనుక చంద్రబాబుకు సంబంధించినంతవరకూ అధికారంలోకి రావడం తప్ప మరో విధానమేదీ లేదు. అందుకోసం ఎవరితోనైనా కలవడానికి ఆయన సిద్ధమే. ఈ కారణంగానే యు టర్న్‌ ముద్ర పడింది. ఈ విషయంలో ఆయనతో పోటీ పడగలిగింది బీహార్‌ సి.ఎం నితీశ్‌ కుమార్‌ ఒక్కరే! ఇక మోడీని కలసి రాజకీయం మొదలెట్టిన పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మాన్ని అనుక్షణం పొగిడి పరవశిస్తుంటారు. కనుకనే ఉభయులూ తొలి ఎన్‌డిఎలోనే సభ్యులయ్యారు. తర్వాత కొన్నిసార్లు అటూ ఇటూ తిరిగినా మళ్లీ ఆ గూటికే చేరారు. వైసిపి విషయానికి వస్తే కేంద్రంతో సత్ససంబంధాలు అనే మంత్రమే వినిపిస్తుంది. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తేవడం వంటి గొప్పలు అధికారంలోకి వచ్చాక ఆవిరైపోయాయి. ఏతావాతా ఎ.పి కాస్త బిజెఎపి గా మార్చేందుకు కారకులైనారు. తానుగా ఆ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయినా దాంతో పొత్తు పెట్టుకోవడం తమ విద్యుక్త ధర్మమైనట్టు, దాంతో గెలుపు గ్యారంటీ అయినట్టు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అదో జైత్రయాత్రగా చిత్రిస్తుంది అనుకూల మీడియా. బాబు అరెస్టు తర్వాత లోకేశ్‌ ఢిల్లీలో పడిగాపులు కాసిన తీరు దేశమంతా చూసింది. కనక ఈ పొత్తు రాజకీయ వర్గాలకు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. బాబు చర్చల తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన జగన్‌ రాష్ట్ర సమస్యలతో పాటు రాజకీయాలు కూడా చర్చించి వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా టిడిపి గతంలోనూ ఇప్పుడూ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నదనేది వైసిపి ప్రధాన ఆరోపణ. షర్మిల వెనక కూడా టిడిపియే వుందంటారు. ఇవన్నీ వారి అభియోగాలు. మీకు వ్యతిరేకమైన కాంగ్రెస్‌ను తెలంగాణలో, ఎ.పి లో టిడిపి పరోక్షంగా ఎగదోస్తున్నదని జగన్‌ ఫిర్యాదు చేస్తే క్రైస్తవాన్ని అనుసరించే జగన్‌ హిందూత్వ వ్యతిరేకి అన్నది టిడిపి సంకేతం. ఇవి బిజెపికి తెలియనివని వీరి భ్రమ. అన్నీ తెలిసినా అవకాశవాదంతోనూ అవతలివారిని దెబ్బతీయడం కోసమూ బిజెపి ద్వంద్వ క్రీడ ఆడుతుందనేది అసలు విషయం. అది తెలిసీ తమ జుట్టుతోపాటు రాష్ట్ర భవిష్యత్తును కూడా మోడీ ముందు సమర్పణం చేయడం రాజకీయ దివాళాకోరుతనం. నిజం చెప్పాలంటే టిడిపితో జరిగిన చర్చలను బిజెపి అధికారికంగా ధృవీకరించడం లేదు కూడా. వారే వెళ్లారు వచ్చారన్న రీతిలో అమిత్‌ షా మాట్లాడుతున్నారు. టిడిపి లోనే ఒక వర్గం బలంగా వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మాత్రం చివరి ఛాన్సు బిజెపి తో చేతులు కలపడానికే నిర్ణయించుకున్నారు.

  • ఎ.పి, తెలంగాణ భవిష్యత్తు చిత్రం

తెలంగాణలోనూ కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ మధ్య ఇదే విధంగా బిజెపి రాజకీయం నడిపిస్తున్నది. పరస్పర వివాదాలే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్న ఆ రెండు పార్టీలూ బిజెపి ముప్పును విస్మరిస్తున్నాయి. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి గనక రేవంత్‌ రెడ్డి అప్పుడప్పుడు బిజెపి పేరు ప్రస్తావిస్తున్నా దాడి మొత్తం బిఆర్‌ఎస్‌ పైనే. ఇక ఆ మధ్య బిజెపిని చీల్చిచెండాడిన ఆ పార్టీ కూడా ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్‌పైనే గురిపెట్టింది. కొన్నిసార్లు బిజెపి భాష కూడా మాట్లాడుతున్నది. కాంగ్రెస్‌ కూడా బిజెపి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం ప్రధానమన్నట్టు వ్యవహరిస్తున్న సంకేతాలు లేవు. ఎన్నికల్లోనూ ఇతరత్రా వామపక్షాలతో కలసి పోరాడదామంటున్న రేవంత్‌ రెడ్డి ఆచరణలో చర్యలు చేపట్టవలసే వుంది. మళ్లీ ఎ.పి కి వస్తే టిడిపి, జనసేన, వామపక్షాలు కలిస్తే బావుంటుందని ఆశలు వెలిబుచ్చిన సిపిఐ కూడా వాస్తవాలు చూశాక దూరం కావడం అనివార్యమైంది. ఈ మూడు పార్టీల కూటమి టిడిపికి మరణశాసనం అని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు విమర్శించాయంటే ఆశ్చర్యం లేదు. దీంతో కేవలం వైసిపి, టిడిపి మధ్యనే గిరిటీలు కొడుతున్న ఎ.పి రాజకీయ రంగంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని చెప్పాలి. నిజానికి ఈ వారం ఢిల్లీలో ఈ శక్తులే విశాఖ ఉక్కుపై, ప్రత్యేక హోదాపై పోరాటం ప్రారంభించాయి కూడా. ఈ క్రమంలోనే వైసిపి, టిడిపి, జనసేన గాక ఇతర లౌకిక పార్టీలను సంఘాలను కలుపుకుని పోరాడాలని కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. బిజెపి, టిడిపి కూటమిని ఓడించేందుకు, ప్రజా వ్యతిరేక వైసిపి సర్కారుపై పోరాడేందుకు 20వ తేదీన సదస్సు జరుపుతున్నాయి.ఈ ప్రయత్నాలన్నీ ఫలప్రదం కావాలనీ, ఎ.పి ప్రయోజనాలు సాధించేవరకూ పోరాటం కొనసాగాలనీ ఆశిద్దాం. ఎన్నికలలో వైసిపి, టిడిపి, బిజెపి, జనసేనలకు తగిన పాఠం చెబితేనే అది సాధ్యమవుతుంది. తెలంగాణలోనూ ప్రజల తీర్పు సార్థకం కావాలంటే కాంగ్రెస్‌ పార్టీ మరింత సమగ్రమైన విధానంతో లౌకిక శక్తుల వేదికను కూడగట్టవలసి వుంటుంది.

telakapalli ravi

  • తెలకపల్లి రవి

 

➡️