నిజం.. నిజం… డార్విన్‌ సిద్ధాంతం

bjp govt false propaganda on charles darwin theory of evolution

డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతమంటే ఎందుకింత వ్యతిరేకత? ఉండదా మరి? అనాదిగా నిర్మించుకున్న సౌధాలు కుప్పకూలుతుంటే! యుగాలుగా చలాయిస్తున్న ఆధిపత్యానికి బీటలు వారుతుంటే! ఉండదా మరి అక్కసు! అదేమిటి? డార్విన్‌ సిద్ధాంతం వెలుగు చూసీచూడక ముందే ఎందుకంత ఉలికిపాటు? ఎప్పుడో పందొమ్మిదో శతాబ్దపు 30వ దశకంలో బీగిల్‌ నౌకపై ప్రకృతి పరిశీలకుడుగా సేకరించిన ఆధారాలతో 1859లో ‘జాతుల పుట్టుక’ పుస్తకం రాశాడు. అందులోనే జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. విడుదలైన తొలి రోజే 1250 కాపీలు అమ్ముడయ్యాయి. ఒకవైపు ఊహించని స్పందన, మరోవైపు ఊహకందని దాడి. ఏడాది తిరగకుండానే వేడి వేడి చర్చలు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నాచురల్‌ హిస్టరీ మ్యూజియం హాలులో 1860లో జరిగిన చర్చ ఇందుకు మచ్చుతునక. ఇదే చరిత్రలో ప్రసిద్ధికెక్కిన హక్సలే-విల్చర్‌ పోర్స్‌ల సంవాదం. ఒక విధంగా చెప్పాలంటే డార్విన్‌ సిద్ధాంతానికదే తొలి పబ్లిక్‌ ప్రతిస్పందన. వెయ్యి మంది సభ్యలతో హాలు కిటకిటలాడింది. విల్చర్‌ పోర్స్‌ తీవ్ర స్థాయిలో డార్విన్‌పై విరుచుకుపడ్డాడు. ఆ సభలకు డార్విన్‌ హాజరు కావలసి ఉంది. అనారోగ్యంతో రాలేకపోయాడు. ఆ సభలోనే ఉన్న ధామస్‌ హెన్రీ హక్సలే ఆ లోటును భర్తీ చేశాడు. చర్చ వేడెక్కి వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకుంది. హక్సలేను ఎగతాళి చేస్తూ ‘నీవు కోతివా? నీ తాతలు కోతులా? అమ్మ తరపునుండా? అయ్య తరపునుండా?’ అని విల్చర్‌ పోర్స్‌ రెచ్చగొట్టాడు. హక్సలేను వెక్కిరిస్తూ సభలో నవ్వులు, అరుపులు. ఆ గందరగోళం మధ్య నుండి హక్సలే నిబ్బరంగా లేచాడు జవాబిచ్చేందుకు. ఆయన మాటలు వినడానికి నిశ్శబ్దం చెవులిచ్చింది. తన శక్తియుక్తులనూ, మేధస్సునూ, వైజ్ఞానిక చర్చల్లో ఎదుటివారిని అవమానించడానికి, ఎగతాళి చేయడానికి వినియోగించే మనిషికంటే నా తాతలు, నేను కోతులకు వారసుడిగా ఉండటానికే ఇష్టపడతాము’ అని ధీటైన జవాబునిచ్చాడు. నాటి కోతి ప్రహసనం నుండి నిన్న మొన్నటి మన మంత్రుల కోతి ముచ్చట్ల వరకూ పరిణామ సిద్ధాంతంపై అలుపెరగని దాడి. ఆ సిద్ధాంతం వెలుగు చూసి 165 ఏళ్లయినా ఇంకా జనం నోళ్లలో నానుతుందంటే దాని శక్తి, ప్రాసంగికత ఎంతటిదో అర్థమవుతుంది.

ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఆ సిద్ధాంతం అసలు ఏం చెప్పింది? సైన్సులో ఏ ఒక్క సిద్ధాంతమూ చవిచూడని శతృత్వం దీనిపైనే ఎందుకు? దగ్గర సంబంధం ఉండే జాతుల నుండి కొత్త జాతులు ఆవిర్భవిస్తాయని చెప్పింది. జీవించే క్రమంలో నెలకొన్న పరిస్థితులతో సరిపెట్టుకుంటూ జీవులు మార్పు చెందుతాయనీ, ఆ మార్పులు దీర్ఘ కాలంలో కొత్త జాతి ఏర్పడటానికి దోహదం చేస్తాయనీ చెప్పాడు. ఇందులో ప్రకృతి ఎంపిక (నేచురల్‌ సెలక్షన్‌) కీలకంగా పనిజేస్తుందని సూత్రీకరించాడు. దీనిలో ఏ అతీత శక్తుల ప్రమేయం అవసరం ఉండదనీ, ఇది కేవలం భౌతిక ప్రక్రియ మాత్రమేననీ, ఆధారాలతో తేల్చి చెప్పాడు.

ఇదే సృష్టివాదులకు కంటగింపు అయింది. ప్రతి జాతి అవసరమైన ప్రత్యేక లక్షణాలతో సృష్టించబడిందనీ. అది మార్పు చెందదనేది వారి ప్రచారం, నమ్మకం. డార్విన్‌ సిద్ధాంత వెలుగులో ఈ నమ్మకం దూదిపింజలా తేలిపోతుంటే చూస్తూ ఊరుకుంటుందా మతం. అప్పటికి అందుబాటులో ఉన్న వైజ్ఞానిక ఆధారాలతో తన దార్శనికతను జోడించి అనంత జీవవైవిధ్యానికి కారణం జీవులు పరిణామం చెందడమేనని సిద్ధాంతీకరించాడు. పరిణామమే నిజమైతే మార్పు చెందే క్రమంలో ఉన్న మధ్యంతర జీవులేవి? కొత్త జాతులనేవి ప్రకృతిలో సహజంగా ఏర్పడటం సాధ్యమా? ఇలాంటి అనేక ప్రశ్నలకు డార్విన్‌ కాలంలో రుజువులు చూపటం సాధ్యం కాలేదు. పరిణామానికి రుజువు దొరక లేదంటే సృష్టి జరిగిందనే వాదన కూడ సరైంది కాదు.

డార్విన్‌ తదనంతర కాలంలో జీవ పరిణామ సిద్ధాంతాన్ని రుజువు చేసే ఎన్నో ఆధారాలు లభ్యమయ్యాయి. డార్విన్‌ సైతం ఊహించనంతటి కచ్చితమైన శిలాజ నిదర్శనాలు దొరికాయి. నీటిలో నివసించే చేపలు నేలపై జీవనానికి అనుకూలమైన మార్పులతో ఉన్న మధ్యంతర శిలాజాలు ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. 2004లో నీల్‌ షుబిన్‌ కనిపెట్టిన తిక్తాలిక్‌ అనే చేప శిలాజం…చేపరెక్కలు కాళ్లుగా మారే క్రమాన్ని వెల్లడించింది. శిలాజ నిదర్శనాలతో పాటు ఆధునిక జన్యుశాస్త్ర అధ్యయనాలు జీవపరిణామాన్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. సూక్ష్మజీవి నుండి తిమింగలం, మనిషి వరకు అన్ని జీవుల్లోనూ దండలో దారంలా డిఎన్‌ఎ కీలంకంగా ఉండటమనేదే అతి పెద్ద రుజువు. జీవుల మనుగడకు అవసరమైన ప్రోటీన్లుగాని, వాటి తయారీ యాంత్రికంగాని జీవులన్నింటిలోనూ ఒకే విధంగా ఉండటం దేనిని సూచిస్తున్నది? అన్ని ప్రోటీన్లలోనూ అవే 20 అమైనో అమ్లాలు ఉండటం హైస్కూలు విద్యార్థులకు సైతం తెలిసిన సత్యమే. కేంద్రక ఆమ్లాలు, మైటోకాండ్రియా, సైట్‌క్రోమ్‌సి, కంటి కటకాల ఆల్ఫా క్రిస్టలిన్‌…ఇలా ఏ జీవాణువైనా క్రమానుగత సారూప్యతను చూపటం… ఒకే మూలం నుండి శాఖలుగా విడిపోయిన పరిణామ వృక్షాన్ని తలపిస్తాము. జీనోమ్‌ విజ్ఞానం మరింత కచ్చితంగా వివిధ జీవుల మధ్య సంబంధాన్ని ఆవిష్క రిస్తున్నది. జీవుల సమిష్టి వారసత్వం పిండాభివృద్ధికి కారణమైన జన్యువుల్లో సైతం కనబడుతుంది. ఉదాహరణకు పిండంలో కళ్లు ఏర్పడటాన్ని ప్రేరేపించే జన్యువు పాక్స్‌ 6, నత్తల నుండి వెన్నెముక జంతువులన్నింటిలోనూ ఒకే పాత్ర పోషించడం జీవపరిణామానికి తిరుగులేని సాక్ష్యం.

జీవపరిణామ సిద్ధాంతం, ఊహాజనితం కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, నిగ్గుదేలిన సిద్ధాంతం. జరిగిన, జరుగుతున్న ఒక వాస్తవానికిది సిద్ధాంత రూపం. సైన్సు ఇచ్చిన జవాబు. డార్విన్‌ పుట్టిన రోజు ఫిబ్రవరి 12న ప్రపంచం ‘డార్విన్‌ దినోత్సవం’గా జరుపుకొంటున్నది. సత్యాన్వేషులు, సైన్సు సైనికులూ ఇందులో పాల్గొని నేటి సమాజానికి ఈ సిద్ధాంత ప్రాసంగికతను తెలియజేస్తారు.

( ఫిబ్రవరి 12 ప్రపంచ డార్విన్‌ సిద్ధాంత దినోత్సవం)

– కట్టా సత్యప్రసాద్‌

➡️