వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే బిజెపిని ఓడించాల్సిందే

ఫిబ్రవరి 13 నుండి హర్యానా లోని శంభు బోర్డర్‌ దగ్గర ఆందోళన చేస్తున్న రైతాంగం మీద హర్యానా బిజెపి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దమనకాండ సాగిస్తున్నది. పోలీసు కాల్పులలో శుభకరణ్‌ సింగ్‌ అనే యువ రైతు మృతి చెందగా, మరొక నలుగురు రైతులు గుండె ఆగి చనిపోయారు. ఈ దాడిలో అనేక మంది రైతులు చూపు, వినికిడి కోల్పోయారు. 200 ట్రాక్టర్లు ధ్వంసం అయ్యాయి. ఈ వార్తలు బయటకు తెలియకుండా 171 యూ ట్యూబ్‌ చానళ్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. పైగా రైతు ఉద్యమంపై ప్రభుత్వం అనేక దుష్ప్రచారాలు సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో గత పది సంవత్సరాలలో రైతాంగం పట్ల, వ్యవసాయ రంగం పట్ల బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానాలను పరిశీలించుకోవడం అవసరం.

ఎన్నికల వాగ్దానాల అమలు తీరు!
బిజెపి 2014 ఎన్నికలలో 1. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2. స్వామినాథన్‌ కమిషన్‌ సూచనల ప్రకారం సి2+50 మద్దతు ధరలు అమలు పరుస్తామని 3. రైతులను రుణ విముక్తులను చేస్తామని వాగ్దానం చేసింది. స్వయాన ప్రధాని మోడీ అనేక బహిరంగ సభల్లో ప్రకటించారు. ఎన్నికల అనంతరం ఈ వాగ్దానాలన్నింటికీ తిలోదకాలు ఇచ్చారు.
స్వామినాథన్‌ కమిషన్‌ సూచన ప్రకారం సి2+50 మద్దతు ధరలు ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రత్యామ్నాయంగా ధరల వ్యత్యాస పథకం తెచ్చింది. ఈ పథకం విఫలం కావడంతో ప్రైవేటు ప్రొక్యూర్మెంట్‌, స్టోరేజ్‌ పథకం ప్రకటించారు. ఈ పథకం వల్ల కూడా కంపెనీలకే ప్రయోజనం కలిగింది తప్ప రైతులకు ఎలాంటి ఉపయోగం లేకపోయింది. ఇదీ విఫలం కావడంతో ఈనామ్‌ మార్కెట్‌ విధానం తెచ్చారు. ఈ విధానం వల్ల పోటీ పెరిగి రైతులకు మంచి ధరలు వస్తాయని ఊరించారు. ఆచరణలో ఏ ఒక్క మార్కెట్‌లో ఏ ఒక్క పంటకు ధర రాలేదు. పప్పుధాన్యాలపై స్వయంగా ప్రధాని మోడీ నియమించిన అరవింద సుబ్రమణ్యం కమిటీ సిఫారసులను కూడా చెత్తబుట్టలో వేసింది. రైతుల ప్రయోజనాల కోసం అంటూ మూడు నల్ల చట్టాలు తెచ్చింది. ఆ చట్టాల వల్ల ప్రమాదాన్ని గుర్తించిన రైతు సంఘాలన్నీ ఏకమై 13 మాసాలు పోరాడటంతో ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. నాడు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలుపర్చకుండా, దొడ్డిదారిలో ఆ విధానాలనే అమలు పర్చాలనుకుంటున్నది.

కనీస మద్దతు ధర చట్టాలు
వ్యవసాయ ధరల కమిషన్‌ (సిఎసిపి) పంట పండించడానికి అయ్యే ఖర్చులను లెక్కవేసి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. దీని ప్రకారం రైతు పెట్టిన పెట్టుబడులు మాత్రమే వస్తాయి. రైతు సంఘాలు స్వామినాథన్‌ సూచించిన సి2+50 ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఫార్ములాను అమలు పరచడం ద్వారా మాత్రమే … ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి బయట పడగలుగుతారని… స్వామినాథన్‌ కడవరకు నొక్కి చెప్తూ వచ్చారు. ఈ ఫార్ములా అమలుకు గ్యారంటీ ఇస్తూ చట్టం చేయాలని రైతుసంఘాలు కోరుతున్నాయి.

రైతుల ఆదాయం రెట్టింపు
బిజెపి ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కోసం మూడు సూత్రాలు రూపొందించింది. 1.దిగుబడులు పెంచడం 2. ఉత్పత్తి ఖర్చులు తగ్గించడం 3.నూర్పిళ్ళ అనంతరం నష్టాలు తగ్గించడం. పెట్టుబడులను తగ్గించడంలో భాగంగా రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, ప్రకృతి వ్యవసాయం అమలుపరచడం వల్ల పెట్టుబడులు భారీగా తగ్గిపోతాయని చెప్పింది. గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం గురించి, ఆవు పేడ సిద్ధాంతం గురించి హడావిడి చేసింది. 10 వేల ఎఫ్‌సిఓల ద్వారా 10 లక్షల ఎకరాలు కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఈ పది సంవత్సరాల కాలంలో ఎప్పుడూ రైతుకు కనీస మద్దతు ధరలు కూడా రాలేదు. పది సంవత్సరాల వ్యవసాయ మార్కెట్ల తీరు పరిశీలించిన వ్యవసాయ ఆర్థికవేత్తలు కనీస మద్దతు ధరలకు కూడా అమ్ముకోలేనందున రైతాంగం ఏటా రూ.2 లక్షల కోట్లు కోల్పోతున్నారని, ఆ మేరకు అప్పులు పెరిగిపోతున్నాయని తేల్చి చెప్పారు. రుణ భారాలను తాళలేక రైతాంగం ఆత్మహత్యలు ఈ కాలంలో 26 శాతంగా పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. పెట్టుబడులు తగ్గించాలని సలహా ఇచ్చిన ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీలు తగ్గించింది. ఎరువుల ధరలు పెరిగిపోయాయి. డీజిల్‌ ధరలు పెంచింది. ఫలితంగా వ్యవసాయ పెట్టుబడులు రెట్టింపు అయ్యాయి. ఈ కాలంలో ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, తదితర పరికరాలపై 28 శాతం జిఎస్‌టి విధించింది. గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీము నిలిపివేసింది. ఆహార భద్రతా చట్టానికి నిధుల్లో కోత విధించింది. ఆహార ధాన్యాల సేకరణ రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేసింది.

సమగ్ర పంటల బీమా
దిగుబడి ఆధారిత పంటల బీమాను, వాతావరణ పంటల బీమాను కలిపి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన బిల్లు తెచ్చింది. రెండు ప్రభుత్వ బీమా కంపెనీలతోపాటు పది ప్రైవేట్‌ బీమా కంపెనీలకు అప్పగించింది. ఈ కంపెనీలు మన వ్యవసాయ, రెవెన్యూ శాఖలు తీసిన శాంపిల్‌ సర్వే తిరస్కరించి రైతులకు బీమా ఇవ్వడానికి నిరాకరించాయి. ఈ బీమా పథకం ప్రైవేటు బీమా కంపెనీలకు ఆదాయ వనరుగా మారింది. వ్యవసాయ ప్రధానమైన 9 రాష్ట్రాలు ఈ పథకం నుండి వైదొలిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పరచిన బీమా కంపెనీలకు గుర్తింపు నిరాకరించింది.

విద్యుత్‌ సవరణ చట్టం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ చట్ట సవరణను రైతు సంఘాలతో చర్చించి బిల్లు సవరిస్తామని ఇచ్చిన హామీకి భిన్నంగా పార్లమెంటులో ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ముందుకే సాగుతున్నది. విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు, విద్యుత్‌ ట్రాన్స్‌కో, విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలన్నీ ప్రయివేటు కంపెనీలకు అప్పగించడానికి చట్టం చేస్తున్నది.

సహకార రంగం
రైతులకు పరపతి సేవలు, ఎరువులు తదితర వస్తు సేవలు అందిస్తున్న సహకార సంఘాలను కేంద్ర అధీనంలోకి తీసుకొంటున్నది. సహకార రంగంలోకి కార్పొరేట్‌ కంపెనీల ప్రవేశానికి వీలు కల్పిస్తూ జీవోలు ఇచ్చింది.

సలహా కమిటీలు
ప్రభుత్వం ఏకపక్షంగా ఏర్పరచిన వ్యవసాయ కమిటీలోని వారందరూ మూడు వ్యవసాయ నల్ల చట్టాల రూపకర్తలు, వాటిని బలపరిచిన వారే. అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ శాఖలోను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ కంపెనీల ఉన్నతాధికారులను సలహా దారులుగా పెడుతున్నారు. వ్యవసాయానికి సంబం ధించిన అన్ని శాఖలు ఇకనుండి కార్పొరేట్‌ కంపెనీల ఉన్నతాధికారులు కనుసన్నలలోనే నడుస్తాయి. ఇటీవలే నీతి ఆయోగ్‌ డైరెక్షన్‌లో తెచ్చిన భూమి హక్కుల చట్టం కూడా కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాల కోసమే.
గత పది సంవత్సరాల అనుభవం మన ముందున్నది. 2014, 2019 ఎన్నికలలో రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా చేసిన చట్టాలన్నీ రైతాంగానికి హాని కలిగించాయి. రైతాంగాన్ని రుణగ్రస్తం చేశాయి. ఆత్మహత్యలను నిరోధించలేకపోయాయి.
సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎమ్‌) విస్తృతంగా చర్చించి రూపొందించిన పంటల మద్దతు ధరల చట్టం, రుణ విమోచన చట్టం మాత్రమే రైతులకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. కానీ బిజెపి ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు కంకణం కట్టుకుంది. కావున రాబోయే ఎన్నికల్లో మోడీ నాయకత్వాన ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని, దాని మద్దతుదారులను ఓడించడం ద్వారానే అవసరమైన చట్టాలను సాధించుకోగలం. వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడుకోగలం.

(ఎస్‌కెఎమ్‌ ఆధ్వర్యంలో మార్చి 14న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో రైతుల భారీ బహిరంగ సభ)

 


– వ్యాసకర్త: వై. కేశవరావు, రైతుసంఘం సీనియర్‌ నాయకులు

 

➡️