నయా ఉదారవాద విధానాల అమలుకు పూర్వ కాలంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అభివృద్ధి రేటు ఎంత ఉండేదో అంతకన్నా ఎక్కువ అభివృద్ధి రేటు నయా ఉదారవాద కాలంలో సాధించడం జరిగిందని ఎవరూ చెప్పుకోలేరు. అప్పటికన్నా ఎంతో కొంత తగ్గిందే తప్ప పెరిగింది ఏమీ లేదు. కాని మరోవైపు జిడిపి వృద్ధి రేటు మాత్రం గణనీయంగా పెరిగినట్టు అంచనాలు ఉన్నాయి. కొంతమంది ఆర్థికవేత్తలు ఈ జిడిపి వృద్ధిరేటును ఉన్నదానికన్నా ఎక్కువగా పెంచి చూపించారని వాదిస్తున్నారు. ఏదేమైనా, అంతకు పూర్వపు కాలంలో కన్నా నయా ఉదారవాద కాలంలో జిడిపి వృద్ధిరేటు ఎక్కుగానే ఉందని అంగీకరిద్దాం. 1990 కన్నా ముందు కాలంలో ఆహారధాన్యాల ధరలు నిరంతరం పెరుగుతూ వుండేవి. వాటిని అదుపు చేయడానికి ధరలను నియంత్రించే చర్యలు తీసుకుంటూ వుండేవారు. అంటే ఆ కాలంలో ఆహారధాన్యాల ఉత్పత్తి కన్నా వాటికి డిమాండ్ ఎక్కువగా ఉండేదన్నమాట. కాని నయా ఉదారవాద కాలంలో ప్రభుత్వం ప్రతీ ఏడాదీ ఆహారధాన్యాల అదనపు నిల్వలను ఏ విధంగా నిర్వహించాలి అన్న సమస్యను ఎదుర్కొంటూ వస్తోంది. పౌర సరఫరాల వ్యవస్థ ద్వారా పంపిణీ చేసిన ఆహార ధాన్యాల కన్నా ఎక్కువగా ధాన్య సేకరణ జరుగుతూ వస్తోంది. పైగా ఇండియా ఆహారధాన్యాలను ఎగుమతి కూడా చేస్తోంది. 2023-24లో 1040 కోట్ల డాలర్ల విలువైన బియ్యాన్ని ఎగుమతి చేసింది.
ఒకవైపు తలసరి ఆదాయాలు వృద్ధి చెందుతూంటే మరోవైపు ఆహారధాన్యాల వినియోగం తగ్గిపోవడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? నయా ఉదారవాద సమర్ధకులకు ఈ ధోరణి పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినా, అలా పెరిగిన ఆదాయాన్నంతటినీ ఆహారం కోసమే ఖర్చు చేయరు. కనుక వారి ఆదాయాలతో పోల్చితే ఆహారం కోసం చేసే ఖర్చు శాతం తగ్గుతుంది అని వారు వివరిస్తారు. ఆహార ధాన్యాల మార్కెట్‌లో మిగులు ఉండడం అంటేనే నయా ఉదారవాద వ్యవస్థలో అన్ని తరగతుల ప్రజలూ మెరుగైన జీవితాలను గడుపుతున్నట్టు లెక్క అని వారంటారు.
వాళ్ళు చెప్పే ఈ వాదనకి వాస్తవాలకి ఏ మాత్రమూ సంబంధం లేదు. ఆదాయాలు పెరిగినప్పుడు అందులో ఆహారం కోసం చేసే ఖర్చు శాతం తగ్గవచ్చు కాని ప్రజలు స్వీకరించే ఆహారం పరిమాణం తగ్గిపోదు కదా? ప్రాసెస్డ్ ఫుడ్‌ను, మాంసాహారాన్ని (కోళ్ళకు, పశువులకు పెట్టే మేతతో కలుపుకుని) కూడా పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తే అటు గ్రామాల్లో గాని, ఇటు పట్టణాల్లో కాని ప్రజలు తీసుకునే తలసరి ఆహారం యొక్క కేలరీల విలువ తగ్గిపోయింది. 2200 కేలరీల చొప్పున తలసరి కనీస స్థాయిలో ఆహారాన్ని తీసుకోలేకపోయినవారు 1993-94లో 58 శాతం ఉంటే వారు 2017-18 నాటికి 80 శాతానికి చేరుకున్నారు. అంటే వారి ఆదాయాలు కుదించివేయబడ్డాయి. ఇదే విషయాన్ని ప్రపంచ ఆకలి సూచిక నుండి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వరకూ స్పష్టం చేస్తున్నాయి (ఈ సర్వే ప్రకారం మహిళల్లో రక్తహీనత చాలా ఆందోళనకర స్థాయికి చేరింది).
మన ముందు రెండు రకాల అభివృద్ధి పంధాలు ఉన్నాయి. మొదటిది: ప్రభుత్వ నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ నడిచే విధానం. ఇది నయా ఉదారవాదానికి ముందు అనుసరించిన విధానం. ఈ విధానం అమలులో ఉన్నప్పుడు ప్రజలు కోరిన మేరకు ఆహారధాన్యాలను సరఫరా చేయలేని స్థితి ఉండేది. ఆ కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధి రేటు మొత్తం వృద్ధిరేటును ప్రేరేపించగలిగేేంత ఎక్కువగా లేదు. ఆహారధాన్యాలకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ధరలు పెరిగేవి. అది ద్రవ్యోల్బణానికి దారి తీసేది. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటును మొత్తం ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును ప్రేరేపించగలిగేంత స్థాయిలో పెంచలేకపోవడం ఈ విధానంలో ఉన్న సమస్య. ఈ విధానం అనుసరించిన కాలంలో మన ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని పిలిచేవారు. ఇక్కడ సమస్య పెట్టుబడి తగినంత లేకపోవడం అనేది కానేకాదు. భూపంపకం సమూలంగా జరగకపోవడమే.
ఇక రెండో అభివృద్ధి విధానం నయా ఉదారవాద విధానం. ప్రస్తుతం అమలు జరుగుతున్నది ఇదే. ఇందులో ఆహారధాన్యాల మిగులు ఉన్నది. ఇక్కడ వృద్ధిరేటు పెరగకపోవడానికి ప్రధాన ఆటంకం ఎగుమతులు పెరగకపోవడమే. అంతర్జాతీయ మార్కెట్‌లోకి తన సరుకులను ఎక్కువగా అమ్ముకోగలిగితే. వీలైతే తక్కిన దేశాల మార్కెట్లను కూడా ఆక్రమించగలిగితే అప్పుడు వృద్ధి రేటు పెరుగుతుంది. ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న పోటీని తట్టుకోడానికి దేశ ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక-వ్యవస్థీకృత మార్పులను అమలు చేస్తేనే ఎగుమతులు పెరుగుతాయి. ఆ మార్పులు శ్రామికుల ఉత్పాదకతను పెంచుతాయి. అందువలన కొత్త ఉపాధి అవకాశాలు పరిమితంగానే ఏర్పడతాయి. కొత్త అవకాశాల కన్నా అధికంగా ఉద్యోగార్ధుల సంఖ్య పెరుగుతుంది. వీరిలో కొత్తగా నిరుద్యోగులుగా వచ్చినవారే గాక, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థీకృత, సాంకేతిక మార్పుల కారణంగా ఉపాధిని కోల్పోయినవారు కూడా ఉంటారు. వారికి అంతవరకూ ప్రభుత్వం నుండి లభించిన మద్దత్తు (నయా ఉదారవాద విధానాల అములకు పూర్వ కాలంలో) ఇప్పుడు లభించనందున వారు దుర్భర దారిద్య్రానికి నెట్టబడ్డారు. పనులు చేసే వారితో పోల్చితే నిరుద్యోగలు శాతం క్రమంగా పెరిగిపోతూవుంటుంది. అందుచేత శ్రామికుల తలసరి ఆదాయాల వాస్తవ విలువలు పడిపోతూ వుంటాయి. ఇలా ఆదాయాలు కుదించబడిన కారణంగానే ఆహారధాన్యాల నిల్వలు పేరుకుపోతూ వుంటాయి. ఇక్కడ మనం రెండు నిర్ధారణలకు రావచ్చు.
మొదటి అంశం: ఒక దేశ ప్రగతిని నిర్ధారించడానికి ప్రధాన సూచికగా జిడిపిని పరిగణిస్తూవచ్చారు. నిజమైన ప్రజాసంక్షేమం ప్రాతిపదికన దేశ అభివృద్ధిని మదింపు చేయాలంటే ఈ జిడిపి ని అందుకు ప్రమాణంగా తీసుకోవడం మానేయాలి. దాని స్థానంలో ప్రజల తలసరి ఆహార లభ్యతలో వృద్ధిని ప్రమాణంగా తీసుకోవాలి. ఇతర నిత్య జీవితావసర సరుకుల లభ్యతను కూడా ఆ ప్రమాణంలో కలపాలి. నయా ఉదారవాద విధానాల అమలుకు పూర్వ ఉన్న వ్యవస్థకు, నయా ఉదారవాద వ్యవస్థకు-రెండింటికీ ఈ ప్రమాణాన్ని వర్తింపజేయవచ్చు. పాత విధానంలో పెట్టుబడుల రాకపోకలమీద నియంత్రణలు ఉండేవి. ఆ కారణంగా దేశీయ మార్కెట్‌లో వృద్ధి ఎంత సాధ్యపడేదో, అంతమేరకే తలసరి వినియోగం కూడా వృద్ధి జరిగేది. అదే నయా ఉదారవాద వ్యవస్థ వచ్చేసరికి ఇక్కడ పెట్టుబడుల రాకపోకలమీద నియంత్రణలు లేవు. ఉత్పత్తిని పెంచుకోవచ్చు. కాని శ్రామిక ప్రజల వద్ద ఉన్న కొనుగోలు శక్తి చాలా పరిమితంగా ఉన్నందువలన ఇక్కడ వృద్ధిరేటు పరిమితం అవుతోంది.
రెండవ అంశం: ఇక్కడ మార్కెట్‌లో సరుకుల మిగులు ఉంది. కనుక వాటిని వినియోగించే వేగాన్ని పెంచాలి. అందుకు ఉపాధి కల్పనను విస్తరించాలి. అలా ఉపాధి విస్తరించాలంటే అందుకు ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచాలి. పెరిగే ప్రభుత్వ వ్యయాన్ని బడ్జెట్‌లో ద్రవ్య లోటును పెంచడం ద్వారా గాని, సంపన్నుల మీద అదనపు పన్నులను విధించడం ద్వారా గాని భర్తీ చేసుకోవచ్చు. శ్రామిక ప్రజానీకం మీద పన్నుల భారాన్ని పెంచితే దానివలన వినిమయం ఆ మేరకు తగ్గిపోతుంది. కాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి బడ్జెట్ లోటును పెంచడానికి గాని, సంపన్నుల మీద పన్నులను పెంచడానికి కాని ఒప్పుకోదు. అంటే దేశంలో ఉపాధి పెరగకపోడానికి అసలు ఆటంకం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సాగిస్తున్న పెత్తనం. ఇప్పుడు ఒక పక్క మిగులు ఆహారధాన్యాలు పేరుకుపోవడం, ఇంకోపక్క నిరుద్యోగం పెరిగిపోవడం-ఏక కాలంలో కొనసాగడం అనే అసంబద్ధ పరిస్థితిని అధిగమించాలంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనాన్ని అధిగమించాలి. ఆ పెత్తనం నుండి బైట పడడానికి పెట్టుబడుల రాకపోకలమీద ప్రభుత్వం నియంత్రణలు పెట్టాలి. అటువంటి నియంత్రణలు పెట్టడం అంటే నయా ఉదారవాద వ్యవస్థకు ముగింపు పలకడమే. నయా ఉదారవాద విధానాల సారాంశం పెట్టుబడుల రాకపోకలు ప్రపంచవ్యాప్తంగా ఇష్టారాజ్యంగా కొనసాగడం. దానికి కళ్ళెం వేయడం అంటే నయా ఉదారవాద వ్యవస్థను తిరస్కరించడమే అవుతుంది.
దేశ వృద్ధికి ప్రమాణంగా జిడిపి వృద్ధి రేటుకు బదులు ప్రజల వినియోగం వృద్ధి రేటును తీసుకున్నప్పుడు నయా ఉదారవాద విధానం కాలం అంతకు మునుపటి కాలం కన్నా చాలా హీనంగా కనిపిస్తుంది. పైగా ఈ విధానం ఆహారధాన్యాల నిల్వలను కూడా మనల్ని వినియోగించుకోనివ్వకుండా, ప్రజల కడుపులను నింపనివ్వకుండా అడ్డం పడుతోంది. మరోపక్క అదనంగా ఉపాధి కల్పించడానికి కూడా ఆటంకంగా ఉంది. అందుచేత పాత విధానం కన్నా నయా ఉదారవాద విధానం హీనమైనది. అంతే కాదు, అది హేతువిరుద్ధమైనది కూడా.
ఇలా చెప్పడం అంటే మనం మళ్ళీ గతంలో, నయా ఉదారవాద విధానాలకు పూర్వం ఏ విధానాలను అనుసరించామో ఆ విధానాలవైపు మళ్ళమని చెప్పడం కాదు. ఆ పాత విధానంలో వృద్ధిరేటు వ్యవసాయంలో సాధించే వృద్ధిమీద, ఆ రంగంలో ఏర్పడే మిగులు మీద ఆధారపడి వుండేది. ఇప్పుడు ఉపాధి అవకాశాలను పెంచి, వ్యవసాయ ఉత్పత్తులలో వృద్ధిని సాధించే విధంగా ముందడుగు పడితేనే ప్రయోజనం కలుగుతుంది. అది జరగాలంటే భూసంస్కరణలను తీవ్ర స్థాయిలో అమలు చేయాలి. దానితోబాటు ప్రభుత్వం ఆ భూమి యొక్క ఉత్పాదకతను బాగా పెంపొందించే చర్యలు తీసుకోవాలి.
భూ సంస్కరణలు అనగానే కేవలం భూస్వాముల వద్ద కేంద్రీకృతమై ఉన్న భూమిని ముక్కలు చేసి పంచడం అన్న పరిమిత అర్ధంలో చూడకూడదు. చాలా విస్తారమైన భూములు ఎప్పటినుండో, స్వాతంత్య్రానికి పూర్వ కాలం నుండీ కూడా, సరైన ఉత్పాదకతను ఇవ్వగలిగిన పరిస్థితిలో లేవు. దేశంలో ఈ విధంగా ఉన్న విస్తారమైన భూములను కూడా పూర్తి స్థాయి వాడుకలోకి తీసుకువచ్చేలా భూ సంస్కరణలు ఉండాలి. ఇప్పుడు నయా ఉదారవాద విధానంలో ఎగుమతుల వృద్ధి మీద ఆధారపడిన ఆర్థిక వృద్ధి విధానం ఉంది. దానికి బదులు కేవలం ప్రభుత్వ జోక్యంతో జరిగే వృద్ధి మాత్రమే గాక, వ్యవసాయంలో ప్రభుత్వ పర్యవేక్షణలో సాధించే వృద్ధి మీద ఆధారపడిన ఆర్థిక వృద్ధి రావాలి.
( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్ పట్నాయక్