‘పుష్ప2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్‌లో ఒక మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్తతతో ఆస్పత్రి పాలయ్యాడు. అట్లే విఐపిలు, సెలబ్రిటీలు విద్యా వ్యాపారులు సహా వ్యాపార దిగ్గజాలు తమ చుట్టూ ఎక్కువ సంఖ్యలో బౌన్సర్లను వెంట బెట్టుకొని బయల్దేరే సంప్రదాయం మొదలైంది. కొద్ది దశాబ్దాల క్రితం ఈ దుస్థితి లేదు. బహుశా 1976లో కావొచ్చు. నేను సైకిల్ మీద ఓల్డ్ ఎంఎల్‌ఏ క్వార్టర్సు ముందు నుండి బషీర్‌బాగ్ వైపు వెళ్తున్నాను. నా పక్క నుండి ఒక ఫియట్ కారు దూసుకెళ్లి అసెంబ్లీ స్పీకర్ వీరమాచినేని ఇంటి ముందు ఆగింది. అప్పట్లో ఆ రోడ్డు ఇప్పుడున్నంత విశాలంగా లేదు. అయినా రోడ్డు మీద కారు పార్క్ చేయడానికి ఇబ్బంది ఉండేది కాదు. ఎంఎల్‌ఏల క్వార్టర్లన్నీ కాంపౌండ్ లోపల ఉండేవి. స్పీకర్ ఇంటి గేటు ఒక్కటే రోడ్డు మీదికి ఉండేది. ఆగిన కార్లోంచి తెల్లటి పంచె, తెల్ల లాల్చీ ధరించిన ఒక వ్యక్తి దిగి విసా విసా నడుచుకుంటూ స్పీకర్ ఇంట్లోకి వెళ్లారు. ఆ వ్యక్తిని చూసి నేను సంతోషం పట్టలేక పోయాను. ఎందుకంటే ఆయన ఎవరో కాదు. ఆయన నా అభిమాన తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఒక్కరే కారు నడుపుకొంటూ వచ్చారు.
ఆ తర్వాత మరోసారి ఆయన్ని అలాగే చూశాను. నేను పని చేస్తున్న ఆస్పత్రిలో సాయంకాలం ఏడు గంటల తర్వాత ఆ రోజు కలెక్షన్‌ను క్యాష్ బుక్‌తో సరిచూసుకొంటున్నాను. ఇంతలో కౌంటర్ డోర్ దగ్గర నుండి ‘ఎక్స్‌క్యూజ్ మి. వేర్ ఈజ్ జి.ఎస్.రెడ్డి రూం?’ అంటూ మృదువుగా ఒక కంఠం వినబడింది. తల తిప్పి చూస్తే నాలుగడుగుల దూరంలో ఒంటరిగా ఏఎన్నార్. సంభ్రమాశ్చర్యాలతో దిగ్గున లేచి నిలబడ్డాను. టేబుల్‌పై ఉన్న క్యాష్‌ను గబాగబా టేబుల్ డ్రా లోకి తోసి తాళం వేశాను. ‘ఐ విల్ షో యు సర్…’ అంటూ ఫస్ట్ ఫ్లోర్‌కు దారి తీశాను. నా వెనక ఏఎన్నార్. ఎదురుబడిన స్టాఫ్, పేషెంట్ల అంటెండర్లు గోడకు అతుక్కుపోయి మర్యాదగా దారి ఇచ్చారు. ‘ఇదే రూం సర్…’ అంటూ ఒక ఏసి రూంను చూపెట్టి నేను వచ్చేశాను. ఆ గదిలో ఏఎన్నార్ ఎంత సేపున్నారో ఎప్పుడు వెళ్లిపోయారో తెలియలేదు. ఎంత గప్ చుప్‌గా వచ్చారో అంతే గప్ చుప్‌గా వెళ్లిపోయి ఉంటారు.
జి.ఎస్.రెడ్డి చాలా కాలం పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన పెద్ద కాంట్రాక్టరని విన్నాను. అప్పటికి జి.కె రెడ్డి పేరు అంతగా తెలియదు. కనుక వారి బంధుత్వం గురించి తెలియదు. కాని ‘ది హిందూ’ పత్రిక కరెస్పాండెంట్ జి.కె. రెడ్డికి ఆయన బంధువని తెలుసు. ఒకసారి జి.కె.రెడ్డి కూడా జి.ఎస్.రెడ్డిని పరామర్శించడానికి వచ్చారు. ఏఎన్నార్ ను చూసి ఎంత సంతోషం కల్గిందో, జి.కె. రెడ్డిని చూసినా అంతే సంతోషం కల్గింది. ఆయన హిందూలో రాసిన వార్తలను చాలా కష్టపడి చదివేవాడిని, పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వాడిని. ఎడమ చేతిలో సిగరెట్ డబ్బా, లైటర్ కుడి చేతిలో సిగరెట్‌తో కన్పించాడు. చెయిన్ స్మోకర్ గదా. అప్పట్లో పొగ తాగడం మీద ఇప్పటిలా ఆంక్షలు లేవు. వార్డుల్లో తప్ప ఆస్పత్రి కారిడార్లలో సీనియర్ డాక్టర్లు, రిచ్ అటెండెంట్లు కులాసాగా సిగరెట్లు తాగేవారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు వనపర్తి సంస్థానం మాజీ రాజు జె.రామేశ్వరరావు కూడా డాక్టర్లను కలవడానికి తరచూ ఆస్పత్రికి ఒంటరిగానే వచ్చేవారు. క్యాష్ కౌంటర్‌కు వీపు పెట్టి డాక్టర్లతో వరండాలోనే కబుర్లు చెప్తుండేవారు. ఆయన చేతిలో ఖరీదైన సిగరెట్ డబ్బా, లైటర్, ఎప్పడూ ఉండాల్సిందే. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జయసింహ కూడా ఒంటరిగానే వచ్చేవాడు. చాలా మంది ప్రముఖులు తమ వెంట ఏ పటాలం లేకుండా ఒంటరిగానే తమ కార్లు తామే నడుపుకొంటూ వచ్చేవారు. బౌన్సర్లు, బాడీగార్డులు అంటూ ఎలాంటి హడావిడి ఉండేది కాదు. కేంద్రంలో మంత్రిగా ఉండిన కోట్ల విజయ భాస్కర రెడ్డి కూడా ఎలాంటి అలికిడి లేకుండా తనకు తెలిసిన ఓ పేషెంట్‌ను పరామర్శించి వెళ్లారు. ఈ విషయంలో మర్రి చెన్నారెడ్డి తీరు వేరు. యుపి కో, పంజాబ్ కో గవర్నర్‌గా ఉండగా ఆయన ఆస్పత్రికి వస్తున్నారని మఫ్టీ పోలీసులు వచ్చి కౌంటర్‌లో ఉన్న నాతో చెప్పారు. ఆయన్ని మర్యాదగా రిసీవ్ చేసుకోవడానికి పెద్దలెవరైనా గేట్ దగ్గర ఉండాలని దాని సారాంశం. మఫ్టీ పోలీసులు నాతో మాట్లాడుతుండగా అప్పటి నిజాం ఆర్థోపెడిక్ సూపరింటెండ్ డాక్టర్ ఎం.రంగారెడ్డి దూరం నుండి చూశారు. నా దగ్గరకొచ్చి ‘ఏమిటంట?’ అనడిగారు. నేను చెప్పాను. ఆయన మర్రి చెన్నారెడ్డికి ఎంబిబిఎస్ లో సహాధ్యాయుడో లేక సీనియరో తెలియదు గాని పొలిటీషియన్లను మనం పట్టించుకోనక్కర్లేదు. లైట్‌గా తీస్కో అన్నటు సైగ చేశారు. చెన్నారెడ్డి తన అనుచరుల పటాలంలో హడావిడిగా వచ్చారు, వెళ్లిపోయారు. ఒకసారి ఎన్‌టి రామారావు కూడా ఎవరినో పరామర్శించడానికి వచ్చారు. కౌంటర్లో ఉన్న నాకు ఆ విషయం ఎవరో చెవిన వేశారు. నేను కౌంటర్ లాక్ చేసి బయటికి వచ్చాను. ఆయన మెల్లిగా ర్యాంపు దిగుతూ వచ్చారు. ఆయన చుట్టు ఏవరూ లేరు. పదడుగుల దూరంలో ఒకతను అప్పుడప్పుడూ వెనక్కి చూస్తూ దిగుతున్నాడు బహుశా డ్రైవరేమో. టెర్లిన్ ‘హాఫ్ షర్టు’, టెరికాటన్ ప్యాంటులో సింపిల్‌గా ఉన్నారు. తనకు ఎదురుపడిన వారి ముఖాల్లోకి చిరునవ్వుతో చూస్తూ హుందాగా ర్యాంప్ దిగి వెళ్లిపోయారు. వంటి మీద నేటి హీరోల్లా రంగురంగుల పూలపూల దుస్తులేవు. అప్పటికే టెర్లిన్ బట్ట ఉత్పత్తి ఆగిపోయింది. బహుశా ఎప్పుడో కుట్టించింది వేసుకొని ఉంటారు.
నటీమణులూ అంతే. ఒక రోజు సాయంకాలం జయప్రదను వెంటబెట్టుకొని సుబ్బరామిరెడ్డి కౌంటర్ దగ్గరికి వచ్చి ‘కంటి డాక్టర్ వచ్చారా? ఈమెను చూపించాలి’ అనడిగారు. ఆయన వెనుక తెల్లగా మిలమిల మెరుస్తున్న ఒక మహిళ సాధారణ చీర, జాకెట్‌తో నిలబడి ఉంది. ఈమెను ఎక్కడో చాలా దగ్గరగా చూశాను కాని జ్ఞాపకం రావడం లేదే అని తికమక పడ్డాను. ‘భూమి కోసం’లో చెల్లి చంద్రమ్మను చూశాను కాని వెంటనే గుర్తుకు రాలేదు. ఆమె బెరుకు చూపులు చూస్తున్నారు. ఒకసారి జయసుధ ఎవరినో పరామర్శించడానికి ఒక్కరే వచ్చారు. తనను చూసి దగ్గరికి వచ్చిన వారితో ఆస్పత్రి వరండాలో నిలబడి కులాసాగా మాట్లాడారు. అప్పటికే ఆమె చేసిన సినిమాలు బాగా నడిచి మహిళల్లో ‘అభిమాన’ నటి అయ్యారు. అయినా సింపుల్ చీరలో వచ్చారు. బౌన్సర్లు, బాడీగార్డులు లేరు. స్వాతికిరణం శతదినోత్సవానికి రాజ్ కపూర్ ముఖ్య అతిథి. కమల్ హాసన్, చిరంజీవి, జయప్రద వంటి తారాగణమంతా హాజరయ్యారు. ఫంక్షన్ దేవి థియేటర్‌లో జరిగింది. ఫంక్షన్ అయ్యాక రాజ్ కపూర్ నా ముందు నుండి మెట్లు దిగి వెళ్లిపోయారు. అంత పాపులర్ నటుడి చుట్టూ ఆ సినిమాకు సంబంధించిన ఇద్దరు ముగ్గురే ఉన్నారు. బౌన్సర్లు, బాడీగార్డులు లేరు. పెద్ద కమోషన్ లేదు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పెళ్లికి సూపర్‌స్టార్ కృష్ణ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వచ్చారు. సి.ఐ.టి.యు నాయకుడు వి.శ్రీహరి కుమార్తెతో అసిస్టెంట్ డైరెక్టర్‌కు జరిగిన దండల పెళ్లి అది.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1986లో జరిగింది. ఆ సందర్భంగా కొందరు పాపులర్ నటులను, దర్శకులను గమనించాను. ప్రజాశక్తి విలేకరిగా నేను ఆ ఫిల్ము ఫెస్టివల్‌ను కవర్ చేశాను. ఫెస్టివల్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్సులు, బ్రీఫింగ్‌లు జూబ్లీహాల్ లోనూ, విధాన పరిషత్ భవనంలోను జరిగేవి. ఆ చిత్రోత్సవానికి రామకృష్ణ 70 ఎం.ఎం మెయిన్ థియేటర్ అయినా చాలా మంది నటులు, దర్శకులు, చిత్రోత్సవం అర్గనైజర్లు సినాప్సిస్‌లు కూడా అక్కడే ఇచ్చేవారు. జూబ్లీ హాల్‌కు వచ్చేవారు. అక్కడ దాదాపు ప్రతిరోజూ ఒకనాటి హిందీ హీరో అశోక్ కుమార్ కన్పించే వారు. ఆయనకు ఒక చేతిలో సిగరెట్ ప్యాకెట్ మరో చేతిలో స్టిక్ ఉండేది. వెంట ఎవరూ ఉండే వారు కాదు. పలుకరించిన వారితో సరదాగా మాట్లాడేవారు. ఒక్కడే బయటికి వచ్చి వాహనం ఎక్కి తన హోటల్‌కో, సినిమా థియేటర్‌కో వెళ్లేవారు. ఆ సమయంలో ఒకరోజు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఒంటరిగా మెట్లు దిగి వస్తున్న ప్రఖ్యాత దర్శకుడు హృషికేశ్ ముఖర్జీని చూశాను. వెనక ముందూ ఎవరూ లేరు. నేను చిరునవ్వుతోనే నమస్కారం పెట్టి ఆయన వెనకే మెట్లు దిగొచ్చారు. నా సహాయం ఏదైనా అవసరమౌతుందేమో అనుకొన్నాను. ఆయన రోడ్డు మీదికి వచ్చి ఆటో ఆపి అందులో ఎక్కి వెళ్లారు.
కాగా ఏఎన్నార్ మరణించినప్పుడు చూసిన ఒక సంఘటన నాకు విస్మయం కల్గించింది. నివాళులు అర్పించడానికి ఒక హీరో దాదాపు 20 మంది బౌన్సర్లతో వచ్చాడు. బౌన్సర్లు జడ్ ప్లస్ కేటగిరి నాయకుడికి చేసేంత హడావిడి చేశారు. ఆ హీరో ఒక నిమిషం కూడా అక్కడ ఉండకుండా యంత్రంలా పుష్పగుచ్ఛం ఉంచి యంత్రంలా వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయారు. సినీ ప్రముఖులు మాత్రమే ఉండే చోటుకి అంత పెద్ద సంఖ్యంలో బౌన్సర్లను వేసుకొని ఎందుకొచ్చినట్లు? సంతాపం ప్రకటించే చోట ఇలా షో పుటప్ చేయడేమిటి! అన్పించింది. ఎంతమంది బౌన్సర్లను వెంటేసుకొని వస్తే అంత గొప్ప అనుకొంటున్నారేమో అన్పిస్తుంది. వ్యాపారవేత్త అదాని కూడా అంతే. అదాని వెంట ఇంగ్లీషు సినిమాల్లోని విలన్లు చూట్టూ ఉన్నట్లుగా నల్ల కళ్లద్దాలు పెట్టుకొన్న ఫుల్‌సూట్ కమెండోలు కన్పిస్తారు. విజరు మాల్యా చుట్టూ అలాగే ఉండేవారు. బౌన్సర్లు, చుట్టూ ఉన్న వారిని దుర్మార్గంగా నెట్టేయడం సాధారణమైంది. ‘పుష్ప 2’ సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిందదే. పోలీసులు ఆ దురంతంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన మహిళ కుటుంబానికి 25 లక్షలతో పాటు బాలుని చికిత్స ఖర్చులు తాను భరిస్తానని ‘పుష్ప2’ హీరో అల్లు అర్జున్ ప్రకటించారు. పోలీసులు చేస్తున్న దర్యాప్తు ఫలితం ఎలా ఉన్నా సెలబ్రిటీలు, బడా వ్యాపారుల చుట్టూ ఉండే బౌన్సర్లకు ఒక నియమావళి అంటూ రూపొందించడం అవసరం.
వ్యాసకర్త ఎస్. వినయ కుమార్ ‘ప్రజాశక్తి’ పూర్వ సంపాదకులు,
సెల్ : 9989716311