బ్రిటన్‌ ఎన్నికలు-టోరీలకు గడ్డు పరిస్థితి!

May 29,2024 04:46 #editpage

వచ్చే ఏడాది జనవరి వరకు పార్లమెంటు గడువు ఉన్నప్పటికీ జులై నాలుగున ముందస్తు ఎన్నికలు జరిపేందుకు ప్రధాని రిషి సునాక్‌ నిర్ణయించాడు. లేబర్‌ పార్టీతో పోల్చితే టోరీల పలుకుబడి 21 పాయింట్లు తక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతుండగా తీసుకున్న ఈ నిర్ణయం అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్టోబరు లేదా నవంబరులో ఎన్నికలకు వెళతారన్న పండితుల అంచనాలు తలకిందులయ్యాయి. ఇటీవలి కాలంలో రిషి సునాక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువలన రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఓటమి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు గనుక దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న చందంగా ఇప్పుడు ఎన్నికలు జరిపితే ఓడినా గౌరవ ప్రదంగా కొన్ని సీట్లు తెచ్చుకోవచ్చన్న ఎత్తుగడే ప్రధానంగా కనిపిస్తోంది.మేనెల పదమూడవ తేదీ సర్వే ప్రకారం లేబర్‌ పార్టీ 44, టోరీలు 23పాయింట్లతో ఉండగా ప్రధాని రిషి సునాక్‌ పనితీరు బాగోలేదన్నవారు గత ఏడాది జూన్‌తో పోల్చితే 57 నుంచి 65శాతానికి పెరిగారు. వ్రతం చెడినా ఫలం దక్కుతుందా ?
సునాక్‌ దంపతుల సంపద 12 కోట్ల నుంచి 65.1కోట్ల పౌండ్లకు పెరిగిందని తాజాగా సండే టైమ్స్‌ ధనికుల జాబితాలో ప్రకటించింది. కానీ ప్రధానిగా జనాభిమానం మాత్రం దిగజారుతోంది. పద్నాలుగేళ్ల టోరీల పాలన పొదుపు చర్యలతో జనం విసిగిపోయారు.అన్ని విధాలుగా కార్మికవర్గం దెబ్బతిన్నది. లండన్‌ కింగ్స్‌ కాలేజీ జరిపిన అధ్యయనం ప్రకారం 2010-20 సంవత్సరాల మధ్య ప్రభుత్వ పొదుపు విధానాల వలన 148 వేల మంది మరణించారు. ఇళ్ల అద్దెలపై అడ్డుఅదుపూ లేదు, బలహీనవర్గాల ఇళ్ల పథకాన్ని రద్దు చేశారు. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలలో బ్రిటన్‌ ఒకటిగా చెబుతున్న సంగతి తెలిసిందే. జనాభా 6.7 కోట్ల మందిలో ఒక ప్రమాణాన్ని తీసుకుంటే కోటీ పది లక్షలు, ఇళ్ల ధరలను కూడా పరిగణనలోకి తీసుకుంటే 1.44 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు అంచనా. పిల్లల్లో 42.2 లక్షల మంది దారిద్య్రంలో ఉన్నారు. పది సంవత్సరాల క్రితం ఈ సంఖ్య 22.8 లక్షలు. 2021-22లో దాదాపు 2.8 లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవు. అక్కడ ఉన్న చట్టాల ప్రకారం ఎవరికైనా ఇల్లు లేకపోతే కనీసం ఆరునెలలు ఉండేందుకు ప్రభుత్వం ఇంటి వసతిని చూపాల్సి ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర నిద్రపోతూ పని చేసే వారు గణనీయంగా ఉన్నారు. అలా నిద్రపోతూ దొరికిన వారికి వెయ్యి పౌండ్ల వరకు జరిమానా విధించే నిబంధనలను ప్రభుత్వం చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా జీవన వ్యయం విపరీతంగా పెరిగింది. మన దేశంలో తగినంత ఉపాధి చూపటంలో విఫలమైన నరేంద్రమోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా పేదలు ఆహారధాన్యాలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉన్నారు.ఈ కారణంగానే 80 కోట్ల మందికి నెలకు ఐదు కిలోల చొప్పున ఐదేళ్ల పాటు ఉచితంగా ఇస్తున్నట్లు సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో తినటానికి తిండి దొరకనివారికి ఆహార కూపన్ల ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఆహార పొట్లాలను అందిస్తారు. వాటిని ఆహార బ్యాంకులని ముద్దుపేరుతో పిలుస్తారు. ట్రసెల్‌ అనే పేరుతో ఉన్న ఒక ట్రస్టు నిర్వహిస్తున్న ఆహార బ్యాంకు నుంచి 2008-09లో కేవలం 25,899 మంది ఇలా ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటే 2022-23నాటికి ”మన హిందువు, భారత సంతతి ”గా అనేక మంది కీర్తించిన రిషి సునాక్‌ ఏలుబడిలో వారి సంఖ్య 29 లక్షల 86 వేల 203కు పెరిగింది.
పొట్ట చేతబట్టుకొని లేదా అణచివేతలను తప్పించుకొనేందుకు శరణార్ధులుగా వచ్చే వారిని సహించలేని స్థితిలో బ్రిటన్‌ పెట్టుబడిదారీ వర్గం ఉన్నదంటే అతిశయోక్తి కాదు. దీన్ని ఎదుర్కొనేందుకు అనుమతి లేకుండా వచ్చే వారిని బలవంతంగా ఆఫ్రికాలోని రువాండా దేశానికి తరలించి అక్కడ శిబిరాల్లో ఉంచి వారికి బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించాలా లేదా అన్నది నిర్ణయించేందుకు రువాండా ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నది బ్రిటన్‌. అందుకు గాను ప్రతి మనిషికి ఇంత అని చెల్లిస్తుంది. ఉదాహరణకు మూడు వందలు అంతకు మించి జనాలను పంపితే పన్నెండు కోట్ల పౌండ్లు ప్రభుత్వానికి, ఇరవైవేల చొప్పున శరణార్ధులకు చెల్లిస్తుంది. డబ్బు కక్కుర్తితో ర్వాండా సర్కార్‌ కూడా శరణార్ధులను స్వీకరించేందుకు అంగీకరించింది. ముందు రువాండాకు తరలించి బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించేదీ లేనిదీ అక్కడ విచారిస్తారు. ఆశ్రయం కల్పించేందుకు నిర్ణయిస్తే బ్రిటన్‌కు తిరిగి అనుమతిస్తారు లేకపోతే రువాండా అంగీకరిస్తే అక్కడే ఉండేందుకు లేదా మూడో దేశం ఏదైనా అంగీకరిస్తే అక్కడకు పంపుతారు. ఇంగ్లీషు ఛానల్‌ దాటి పడవల ద్వారా అనుమతి లేకుండా ప్రవేశించిన వారు స్వచ్ఛందంగా వెనక్కు వెళ్లిపోయేం దుకు అంగీకరిస్తే వారికి మూడు వేల పౌండ్లు ఇస్తారు, లేకుంటే విమానాల ద్వారా రువాండాకు బలవంతంగా తరలిస్తారు. సుప్రీం కోర్టు ఈ ఒప్పందం చట్టవిరుద్ధమని కొట్టివేసిన తరువాత తీర్పును వమ్ము చేస్తూ మరొక చట్టాన్ని 2023 నవంబరులో పార్లమెంటు ఆమోదించింది. దీని మీద కూడా పిటీషన్లు దాఖలైతే విచారణకు 25 కోర్టు గదులు, 150 మంది న్యాయమూర్తులను సిద్దంగా ఉంచారు. తన కుటుంబం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన సంగతి గుర్తుంటే వలస వచ్చిన వారిని బలవంతంగా రువాండా పంపే కార్యక్రమానికి రిషి సునాక్‌ పూనుకొని ఉండేవాడు కాదు. ఓడమల్లయ్య-బోడి మల్లయ్య కథ మాదిరి ఒక కార్పొరేట్‌గా తన వర్గ స్వభావాన్ని ప్రదర్శించాడు.
టోరీల పద్నాలుగేళ్ల చరిత్రను చూసినపుడు ప్రతి ప్రధానీ విఫలం చెందినట్లు రుజువైంది.ముందస్తు ఎన్నికలతో రిషి సునాక్‌ కూడా చారిత్రక వైఫల్యాన్ని అంగీకరించినట్లే. ”ఇది ఏం చేయాలో తోచని వ్యక్తి ఆడుతున్న ఆట,దారులు కూడా మూసుకుపోయాయి, తన అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశ సైతం కనిపించని స్థితి” అని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ రాసింది. మార్చినెలలో 3.2 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు 2.3 శాతానికి తగ్గటం తన ఘనతే అని చెప్పుకుంటూ ఓటర్ల ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. 2008 సంక్షోభం నుంచి బ్రిటీష్‌ పెట్టుబడిదారీ విధానం ఇంకా కోలుకోలేదని, అంతకు ముందుతో పోలిస్తే ఏడాదికి ప్రతి కార్మికుడు సగటున పద్నాలువేల పౌండ్లు నష్టపోతున్నట్లు ఒక అంచనా వెలువడింది. వేతన పెరుగుదల తీరుతెన్నులు చూస్తే నెపోలియన్‌ యుద్ధాల (1803-15) తరువాత ఇంత అధ్వాన్నంగా ఎప్పుడూ లేదని చెబుతున్నారు. ప్రభుత్వ ఖర్చులకు కోత, జన జీవితాలు గిడసబారి పోవటంతో ఆలస్యయ్యేకొద్దీ వ్యతిరేకత పెరుగుతుందని భయపడుతున్నారు. ఒక సర్వేలో ఈ ఏడాది తమ జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని 58 శాతం మంది చెప్పారు. అనేక మంది రుణ ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితిలో సునాక్‌ ప్రకటనతో అధికారం ముందుగానే దక్కనుందనే సంతోషంతో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ పండుగ చేసుకుంటున్నది. జులై నాలుగు స్వాతంత్య్ర దినమని కొందరు వర్ణించారు. పిచ్చి పని అని టోరీ ఎంపీలు తమలో తాము గొణుక్కుంటున్నారు. కార్మికుల మీద దాడులు జరిపిన టోరీ పాలనకు స్వస్తి చెప్పేందుకు ముందుగానే వచ్చిన అవకాశమని కార్మిక సంఘాలు కూడా ఎన్నికలను స్వాగతించాయి. అయితే కెయిర్‌ స్టార్మర్‌ నాయకత్వంలో ఏర్పడే లేబర్‌ పార్టీ ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా కొన్ని సంఘాలు హెచ్చరించాయి. కార్మికవర్గ జీవితాలను ఫణంగా పెట్టి తాము బయటపడాలని కార్పొరేట్‌ శక్తులు చూస్తున్నాయని, స్టార్మర్‌ యజమానులకు, ఇజ్రాయిల్‌కు అనుకూలం, కార్మికులు, వలసలకు వ్యతిరేకి అని పేర్కొన్నాయి. ఇటీవల లేబర్‌ పార్టీ ప్రకటనలు చూస్తే యజమానులకు అనుకూలంగా ఉన్నందున ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచీ ప్రతిఘటించాల్సిందేనని సోషలిస్టు వర్కర్‌ వంటి సంస్థలు స్పష్టం చేశాయి. ఎవరు గెలిచినా సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరు కొనసాగాల్సిందేనని పేర్కొన్నాయి. బ్రిటన్‌ ప్రజాప్రతినిధుల సభ (కామన్స్‌) లోని 650 స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో కన్సర్వేటివ్‌ (టోరీ) పార్టీ 43.6 శాతం ఓట్లతో 365, లేబర్‌ పార్టీ 32.1 శాతం ఓట్లతో 202 సీట్లు తెచ్చుకుంది.ఈసారి ఎన్నికల్లో టోరీ పార్టీకి 98, లేబర్‌ పార్టీకి 468 వస్తాయని సండే టైమ్స్‌ సర్వే పేర్కొన్నది. అనేక మంత్రులు కూడా ఓడిపోనున్నట్లు జోశ్యం చెప్పింది. ప్రధాని రిషి సునాక్‌ కూడా ప్రత్యర్ధి కంటే కేవలం 2.5 శాతం ఆధిక్యంతోనే ఉన్నట్లు, ఓడిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పింది. వేల్స్‌, స్కాట్లాండ్‌ ప్రాంతాలలో, లండన్‌ నగరంలో ఒక్క సీటూ గెలిచే అవకాశం లేదన్నది.
రిషి సునాక్‌ మనవాడు! బ్రిటన్‌ గద్దెపై తొలి హిందువు! భారత్‌కు అనుకూలంగా బ్రిటన్‌ విధానాలు! భారతీయులను అణగదొక్కిన వారి మీద ప్రతీకారం తీర్చుకున్న భారత్‌! బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి గురించి మన మీడియాలో ఊదరగొట్టిన అంశాలు. చర్చోపచర్చల సంగతి సరేసరి. తెల్లవారే సరికి బ్రిటన్‌ రూపురేఖలు మార్చగల ఆర్థికవేత్త అంటూ కొండంత రాగాలు. సునాక్‌ తాతలు ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం గుజ్రాన్‌వాలాకు చెందిన వారు. దేశ విభజనకు ముందే వారు బతుకు తెరువు కోసం ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియాకు వలస వెళ్లారు. కెన్యాలో సునాక్‌ తండ్రి, టాంజానియాలో తల్లి జన్మించారు.1960 దశకంలో వారి కుటుంబం బ్రిటన్‌ వలస వచ్చింది. తరువాత 1980 మే 16న రిషి సునాక్‌ బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌లో జన్మించాడు. చదువుకొనేటపుడు మన దేశానికి చెందిన ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిన్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షత లండన్‌లో చదివేటపుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు.
అనేక దేశాల్లో భారతీయ మూలాలు ఉన్న వారు అనేక మంది ఉన్నత పదవులను అధిష్టించారు.ఆ జాబితాను చూసినపుడు రిషి సునాక్‌కు ఇచ్చినంత ప్రచారం మరొకరికి ఎవరికీ ఎన్నడూ ఇవ్వలేదు. వారిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఉన్నారు. ఎందుకు వీరిని పట్టించుకోలేదు? ఎవరిని సంతుష్టీకరించేందుకు మన మీడియా ఇంతగా పాకులాడినట్లు? మీడియా అంతటిని హిందూ వ్యతిరేకులు ఆక్రమించారనే తప్పుడు ప్రచారాన్ని నిరంతరం సాగిస్తున్నవారు ఈ ప్రచారం గురించి ఏమంటారు? మీడియాను ఎవరు నియంత్రిస్తున్నారు? కన్సర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌ బ్రిటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. అది కాదనలేని వాస్తవం. పంజాబీ మూలాలున్న తొలి ఆసియన్‌ను ప్రధానిగా రాజు ఛార్లెస్‌ నియమించాడు. ఆరునెలల కాలంలోనే ఇద్దరు ప్రధానుల రాజీనామాతో మూడవ కృష్ణుడిగా రిషి రంగంలోకి వచ్చాడు. ఆరు సంవత్సరాల కాలంలో ఐదుగురు ప్రధానులు మారిన బ్రిటన్‌లో ఏర్పడిన అస్థిరతకు ఈ పరిణామాలు నిదర్శనం. బ్రిటన్‌ చరిత్రలో కేవలం 50 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్‌ ట్రస్‌ చరిత్రకెక్కారు. బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ పార్టీకి 190 సంవత్సరాలు, తొలుత దాని పేరు టోరీ. నూట పన్నెండు సంవత్సరాల క్రితం కన్సర్వేటివ్‌ అని మార్చుకున్నది. అయినప్పటికీ ఈ పార్టీ వారిని ఇప్పటికీ టోరీలనే ఎక్కువగా పిలుస్తారు. ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ 1906లో కనిష్టంగా 131 సీట్లు తెచ్చుకుంది. ఈ సారి రిషి సునాక్‌ నాయకత్వంలో 98కి మించి రావనే సర్వేలు నిజమైతే పార్టీ చరిత్రలో మరో అధ్యాయం నమోదౌతుంది.

ఎం . కోటేశ్వరరావు

➡️