బ్రూనో సజీవ దహనం అతి పెద్ద మానవ తప్పిదం

అది ఫిబ్రవరి 17వ తేదీ. 1600 సంవత్సరం. ఇటలీ లోని రోమ్‌ నగరం, కాంపోడి ఫియోరి కూడలి. అక్కడికి ఖగోళ సిద్ధాంతకర్త, గణిత శాస్త్రజ్ఞుడు అయిన బ్రూనోను రెక్కలు విరిచి కట్టి తీసుకొచ్చారు. నాలుకకు చుట్టిన తీగ విప్పేసి, చివరిసారి అడిగారు. ”తప్పులన్నీ ఒప్పుకో! ప్రాణ భిక్ష పెడతాం!” అన్నారు రోమన్‌ మత న్యాయస్థానం పెద్దలు. బ్రూనో తల అడ్డంగా తిప్పాడు. తను ఏ తప్పు చేయలేదని నిర్భయంగా చెప్పాడు. శిక్ష అనుభవించడానికి సిద్ధం అన్నట్లుగా నిలబడ్డాడు. ‘నేను చెప్పిన నిజాలు తరతరాలుగా మీలాంటి మూర్ఖుల్ని తొలుస్తూనే ఉంటాయి’ అన్న మనో నిబ్బరం ఆయనది. మత న్యాయస్థానం అధికారులు, రాజ్యాధి నేతలు అందరూ ఆత్రంగా ఎదురు చూశారు. ఆ చివరి క్షణంలోనైనా దాసోహం అంటా డేమోనని ఆశపడ్డారు. కాని, వారి ఆశ నిరాశే అయ్యింది. సత్య స్థాపన కోసం తను ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనన్నట్లు, వారివైపు బ్రూనో జాలిగా చూశాడు. ‘ఏమిటీ విచిత్రం? గాలీ వెలుతురూ లేని చీకటి గదిలో ఏడేళ్ళు బంధించినా, రోజూ చిత్ర హింసలు పెట్టినా, క్రమం తప్పకుండా మానసికంగా వేధించినా బ్రూనోలో ఏ మాత్రం మార్పు రాలేదేమని మతాధికారులు ఆశ్చర్యపోయారు. వారి పైశాచికత్వానికి వారే భయపడ్డారు. అయితే ఆ పైశాచిక ప్రవృత్తిని బ్రూనోకు అంటగట్టారు. ఇతను మనిషి కాదు, సైతానుగా మారిపోయాడు. సైతాను రక్తం భూమి మీద పడితే అరిష్టం సంభవిస్తుంది-అని తీర్మానించుకున్నారు. మూఢత్వం లోంచి క్రూరత్వంలోకి జారి పోయారు.

అప్పటి వరకు మత విశ్వాసకులు భూమి కేంద్రకమని, దాని చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని విశ్వసించేవారు. అది తప్పని, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోందని బ్రూనో చెప్పాడు. ఈ విషయం అంతకు ముందు నికొలస్‌ కోపర్నికస్‌ (1473-1543) చెప్పిందే. దాన్ని బ్రూనో బలపరిచాడు. అంతేకాదు. ఈ భూమి లాంటి ”భూములు” (గ్రహాలు) ఇంకా ఉన్నాయన్నాడు. ఈ విశ్వానికి ఆదీ, అంతం ఉన్నాయని మత విశ్వాసకులు బోధిస్తూ ఉంటే, అలాంటివేమీ లేవన్నాడు బ్రూనో. మొత్తానికి సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం, క్రైస్తవ సన్యాసి అయి ఉండి క్రీస్తుకు, బైబిల్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలు గుప్పించడం, విమర్శించడం నాటి రోమన్‌ మత న్యాయస్థానం వారికి ఆగ్రహం తెప్పించింది. మానవీయ విలువల్ని మంటగలుపుతూ నాటి మత పెద్దలు బ్రూనోకు శిక్ష విధించారు. మనిషి, మనిషిని మనిషిగా గుర్తించక పోవడం చరిత్రలో అతి దారుణంగా నమోదైంది.
బ్రూనో (1548-17 ఫిబ్రవరి 1600) ఫిలిప్పో బ్రూనోగా ఇటలీ, నాప్లస్‌ రాజ్యం, నోలాలో పుట్టాడు. కవిగా, తత్వవేత్తగా, గణిత శాస్త్రజ్ఞుడిగా పేరు సంపాదించుకున్నా, ఖగోళ సిద్ధాంతకర్తగా ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. ఆధునిక వైజ్ఞానిక పరికరాలు లేని రోజుల్లో, టెలిస్కోపులు, అబ్జర్వేటరీలు లేని రోజుల్లో కొన్ని వైజ్ఞానిక విషయాలు కచ్చితంగా చెప్పగలిగాడంటే ఆయన ఎంతటి మేధావో మనం అంచనా వేసుకోవాలి. చుక్కలు చాలా దూరంలో ఉన్న సూర్యుళ్ళు అని మొదట చెప్పిన వాడాయన. తరువాత కాలంలో ఆయన చెప్పిన అంశాల్ని ఆధునిక పరిశోధనలు ధృవీకరించాయి. స్వయం ప్రకాశితాలు, వేడినిచ్చే కొన్ని ‘సూర్యుళ్ళు’ నిశ్చలంగా ఉన్నాయని, వాటి చుట్టు తిరిగే వాటినే ‘భూముల’ంటున్నామని, అవి వెలుగునూ, వేడిని సూర్యుల నుండి స్వీకరిస్తున్నాయని బ్రూనో ప్రకటించాడు.

వైజ్ఞానికంగా ప్రపంచం ఏమీ సాధించని రోజుల్లోనే బ్రూనో లాంటి వాళ్ళు గట్టిగా నిలబడి మూఢనమ్మకాల్ని నిరసించారు. ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మత పెద్దలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ అబద్ధాలను నిజాలుగా భ్రమింపచేస్తున్నారు. జనాన్ని మూఢత్వంలో ముంచి ఉంచుతున్నారు. బ్రూనో వారసుల అవసరం ఈ నాడు కూడా ఉంది. ఇప్పటికీ భూమినే కేంద్రంగా తీసుకుని, లెక్కలు కడుతున్న అజ్ఞాన పండితుల్ని జనం తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. మనమిప్పుడు ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రానమీ తెలుసుకోవాలి! బ్రూనో జ్ఞాపకార్థం పదిహేడు ఫిబ్రవరి సత్యాన్వేషణ దినంగా పరిగణిస్తున్నాం!

– డా|| దేవరాజు మహారాజు,
కవిరాజు త్రిపురనేని జాతీయ పురస్కార తొలి గ్రహీత.

➡️