పేదరికాన్ని కాదు…పేదల్ని నిర్మూలించే బడ్జెట్‌

నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అంబానీ, అదానీ, కార్పొరేట్ల కోసమే అన్నట్టుగా ఉంది. గతంతో పోల్చుకుంటే మన బడ్జెట్‌ సైజు ఐదు శాతం పెరిగింది. ప్రతి పద్దుకూ ఐదు శాతం కేటాయింపులు పెరిగితే.. పోయినసారి కేటాయింపులతో సమానంగా ఉంటుంది. ఉత్పత్తి వర్గాలైన గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కార్మికులు, పట్టణ ప్రాంతాల్లోని అసంఘటిత కార్మికులు, కార్మికులు, సామాజికంగా దళితులు, గిరిజనులు, మైనార్టీలు, ఓబీసీలు, మహిళలకు కేటాయింపు ఎలా ఉందనేది చూడాలి. వారిని అడ్రెస్‌ చేయకుండా ఎన్ని కేటాయింపులు చేసినా నిరుపయోగం. ఎంత గొప్ప పదాలు ఉపయోగించినా ప్రయోజనం లేదు.
ఉపాధి హామీకి గత బడ్జెట్లో రూ.86 వేల కోట్లు ఇచ్చారు. సవరించిన దాంట్లో 86 వేల కోట్లే. ఇప్పుడు కూడా 86 వేల కోట్ల రూపాయలే. ఐదు శాతం పెంచాలంటే సుమారు రూ.90 వేల కోట్లు ఇవ్వాలి. ఉపాధి హామీ చట్టానికి కనీసం రూ.2.5 లక్షల కోట్లు కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గుతాయి. కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఉపాధి హామీ అంటే ఏమిటి? మోడీ దృష్టిలో ఉపాధి అంటే అంబానీ, అదానీ, కార్పొరేట్లకు ఉపాధి కల్పించడం.
పేదరికాన్ని నిర్మూలించాలంటే ఆహార భద్రతకు ఎక్కువ నిధులు కేటాయించాలి. 24 కోట్ల రేషన్‌ కార్డుల్లో 84 కోట్ల మంది ఆహార భద్రత మీద ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో రూ.2.70 లక్షల కోట్లు ఇచ్చారు. మోడీ ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ తగ్గిస్తూ పోయినేడాది రూ.2.03 లక్షల కోట్లకు కుదించింది. సవరించిన అంచనాల్లో రూ.1.97 లక్షల కోట్లకు కుదించారు. ఇక అంతకంటే ఎక్కువ కేటాయించ లేనని మోడీ సర్కార్‌ చెప్పేసింది. ఇప్పుడు రూ.2.04 లక్షల కోట్లు ఇచ్చేస్తున్నాం అని ప్రకటించింది. పేదరికం లేని భారతాన్ని ఎలా సృష్టిస్తారు?
దేశంలో 65 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. పోయిన సంవత్సరం గ్రామాలకు రూ.2.60 లక్షల కోట్లు కేటాయించింది. ఖర్చు పెట్టింది 1.90 లక్షల కోట్ల రూపాయలే. అంటే, రూ.75 వేల కోట్లను గ్రామాల అభివృద్ధికి ఇక ఖర్చు పెట్టలేమని పార్లమెంట్‌ సాక్షిగా మోడీ సర్కారు తెగించి చెప్పింది. వ్యాధులకు ప్రధాన కారణం తాగు నీరు శుభ్రంగా లేకపోవడం, సరైన ఆహారం అందకపోవడమేనని ఐక్యరాజ్యసమితి ఘోషిస్తున్నది. పోయిన సంవత్సరం జల్‌ జీవన్‌ (రక్షిత తాగునీటి జలాల కోసం)కు రూ.70 వేల కోట్లు కేటాయించి…దాన్ని రూ.22 వేల కోట్లకు సవరించారు. 70 శాతం నిధులనే జల్‌ జీవన్‌కు వాడారు. ఇప్పుడు రూ.65 వేల కోట్లు కేటాయి స్తున్నట్టు గొప్పగా చెప్పింది. పోయిన సారే ఖర్చు పెట్టలేదు. ఈసారి ఏం ఖర్చు పెడుతుంది?
ఇంకా విచిత్రమైన, ఆందోళనకరమైన అంశాలేమిటంటే రైతులకు అత్యంత ముఖ్యమైనది యూరియా. పోయిన బడ్జెట్‌లో యూరియాకు రూ.1.19 లక్షల కోట్లు కేటాయించి రూ.1.18 లక్షల కోట్లను ఖర్చు చేసింది. ఇప్పుడు 1.18 లక్షల కోట్ల రూపాయలనే ప్రకటించింది. వ్యవసాయానికి సరిగ్గా నిధులు ప్రకటిస్తే రైతు బతుకుతాడు. ఈ ప్రభుత్వానికి అది ఇష్టం లేదు. రైతులు బతికితే కంపెనీలు వ్యవసాయంలోకి రావు. జిడిపిలో రూ.70 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ రంగంపై అంబానీ, అదానీ లాంటి బహళజాతి కంపెనీల దృష్టి పడింది. అందుకే ఫెర్టిలైజర్లకు ఇచ్చే నిధులను పెంచలేదు. రైతులు దివాళా తీస్తే కార్పొరేట్లు వ్యవసాయాన్ని కబ్జా చేయడం సుళువవుతందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నది. అందుకే వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు తగ్గించిందనే విషయం తేటతెల్లం అవున్నది.
మూడో అంశం..సామాజిక న్యాయం. ఎవరు కాదన్నా అవునన్నా మన దేశంలో కుల వివక్ష ఉంది. మతపరమైన దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ నిర్మూలించాలనే విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజనలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు రూ.54 వేల కోట్లు కేటాయిస్తే…సిమెంట్‌, ఐరన్‌ రేటు పెరిగిన నేపథ్యంలో అవి సరిపోవని నిరసన తెలిపాం. అయినా, సర్కారుకు పట్టలేదు. రూ.32,426 కోట్లు అంటే దాదాపు 40 శాతం నిధులు కేటాయించిన దాంట్లో కత్తిరించి పడేసింది. ఇది అహంభావంతో కూడుకున్నది కాదా? అర్బన్‌ ప్రాంతానికి సంబంధించి రూ.30 వేల కోట్లు ఇచ్చారు. ఖర్చు పెట్టింది రూ.13,672 కోట్లు మాత్రమే. 60 శాతానికిపైగా నిధులు ఖర్చు పెట్టలేదు. కాగితాల్లో ఇప్పుడు ఇళ్లు కట్టుకునేందుకు రూ.60 వేలు ఇస్తామంటున్నారు? ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ఇళ్లు ఇవ్వలేని ప్రభుత్వం అనొద్దా? పోయిన సంవత్సరం ఆరోగ్య రంగానికి రూ.89 వేల కోట్లు కేటాయించి రూ.88 వేల కోట్లే ఖర్చు పెట్టారు. విద్యా రంగానికి రూ.1.25 లక్షల కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది రూ.1.14 లక్షల కోట్లే. అంటే సవరించిన దాంట్లో 8 శాతం తగ్గించింది. సాంఘిక సంక్షేమం పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరించింది.
ఈనాటికీ అంటరానితనం విలయ తాండవం చేస్తున్నది. కులాంతర వివాహాలు చేసుకుంటే కులం పేరుతో చంపేస్తున్నారు. ఈ పరిస్థితిని ఎదిరించే శక్తి రావాలంటే సామాజిక న్యాయం కీలకం. పోయినసారి రూ.52 వేల కోట్లు కేటాయించి..సవరణల్లో రూ.46 వేల కోట్లకు తగ్గించారు. అంటే 18 శాతం తగ్గించారు. కేటాయింపుల్లో పేపర్ల మీద బాగా చూపి గ్రామీణ ప్రాంతాలకు, సంక్షేమ రంగాలకు, సామాన్య ప్రజానీకానికి సంబంధించిన నిధుల్లో కేంద్రం నిర్దాక్షిణ్యంగా కోత పెడుతున్నదనేది ముమ్మాటికీ నిజం. రక్షణ శాఖకు పెంచింది. కార్పొరేట్లకు పన్నుల రాయితీ ఎక్కువగా ఇచ్చింది. కార్పొరేట్లకు సవరించిన అంశాల్లో పెంచుకుంటూ పోతున్నది. సామాజిక అంశాలకేమో తగ్గిస్తూ పోతున్నది. ప్రధానమంత్రి పేరుతో ఎస్సీ పిల్లల స్కాలర్‌ షిప్పుకు పోయినసారి రూ.6,050 కోట్లు కేటాయిస్తే సరిపోవని చెప్పాం. రూ.4,500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. సవరించిన దాంట్లో 22 శాతం కోత పెట్టారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఇది అన్యాయం చేయడం కాదా? ఆ పిల్లలు ఉన్నత చదువులు చదవొద్దనే కుట్ర దాని వెనుక ఉన్నట్టేగా? ఇది ఆధిపత్య కులాల బడ్జెట్‌ అని ఎందుకు అనకూడదు? ఇప్పుడు రూ.7 వేల కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పకుంటున్నారు. ఎస్టీ పిల్లలకు ఇచ్చింది రూ.4,300 కోట్లు. సరిపోవని వాదించినా ఖర్చు పెట్టింది రూ.3,630 కోట్లే. సవరణ పేరుతో మోడీ సర్కారు కోత కోస్తున్నదనే విషయం స్పష్టమవుతున్నది. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 8 కోట్ల మంది మూడేళ్ల లోపు చిన్నారులున్నారు. కోటిమంది వరకు గర్భిణీలు న్నారు. తల్లికి పౌష్టికాహారం అందిస్తే పిల్లలు ఆరోగ్యంగా పుడతారనే ఉద్దేశంతోనే అంగన్‌వాడీ కేంద్రాలను పెట్టారు. పోషణ్‌-1, పోషణ్‌-2 రెండింటికీ బడ్జెట్‌లో కోశారు. గత బడ్జెట్‌లో వైబ్రెంట్‌ ఇండియా అనే పథకాన్ని పెట్టారు. రూ.1,000 కోట్లు కేటాయించి రూ.209 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. వైబ్రెంట్‌ ఇండియా అంటే ఇదేనా?
కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి దుర్మార్గంగా అన్యాయం చేసింది. రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చారు. అమరావతి కోసం లోన్లు తెచ్చుకోవాలని చెప్పారు. పోలవరంలో కాంట్రాక్టర్లకు ఆగిపోయిన బిల్లులను గుర్తిస్తున్నారు తప్ప నిర్వాసితుల గురించి పట్టించుకోవడం లేదు. భూములు, ఉపాధి కోల్పోయిన గిరిజనుల గురించి మాట్లాడటం లేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన దానికి నిధులేవి? వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు కేటాయిస్తామన్నారు. వాటికీ బడ్జెట్‌లో నిధులు చూపలేదు. నిర్మలా సీతారామన్‌ తెలుగింటి కోడలు. ఆమె గురజాడ మాటల్ని ఉటంకిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తిండి కలిగితే కండ కలదోరు..కండ కలవాడే మనిషోరు అన్నాడు గురజాడ. తిండేది? కండేది? ఈ బడ్జెట్‌ ఆకలి చావులను పెంచే బడ్జెట్‌. నిరుద్యోగాన్ని పెంచే బడ్జెట్‌. కొనుగోలు శక్తిని తగ్గించే బడ్జెట్‌. అసమానతలను పెంచే బడ్జెట్‌. వలసలను పెంచే బడ్జెట్‌. కార్పొరేట్లు తయారు చేస్తే ఆర్‌.ఎస్‌.ఎస్‌ డైరెక్షన్‌లో పార్లమెంట్‌లో చదివిన బడ్జెట్‌ ఇది. అందుకే దేశవ్యాప్తంగా బడ్జెట్‌ కాపీలను దహనం చేశాం. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో వారం పాటు నిరసనలు చేపడతాం. 5న ఎస్‌కెఎమ్‌, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్యాంపెయిన్‌ చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ పోరాటంలోకి రావాలి. రెండు తెలుగు రాష్ట్రాధినేతలు మేల్కోవాలి.

   

వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌

➡️