రక్షణ కవచానికి తూట్లు

Feb 1,2025 05:57 #1/70 Act, #Articles, #edit page

విశాఖ వేదికగా జరిగిన పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు పెట్టుబడులు పెట్టేందుకు 1/70 చట్టం ఆటంకంగా ఉందని, గిరిజన చట్టాలను సడలించాలని శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చెప్పడం ఆదివాసులకు హాని తలపెట్టడమే! గిరిజన చట్టాలు సక్రమంగా అమలు జరగకపోవడం వల్ల ఇప్పటికే ఏజెన్సీలో గిరిజనేతరుల ఆక్రమణల జోరు ఎక్కువైంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలోని గణనీయమైన భాగం 5వ షెడ్యూలు కిందకు వస్తుంది. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ను ఉల్లంఘించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. ప్రఖ్యాత సమతా కేసులో భారత సర్వోన్నత న్యాయస్థానం ఏనాడో ఈ విషయం తేల్చి చెప్పింది. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయి. బినామీ పేర్లతో గిరిజన భూముల్లో హోటళ్లు, రిసార్టులు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు 1/70ని సవరిస్తే గిరిజనులకు ఉన్న భూమి దక్కకుండా పోవడం ఖాయం. అడవుల్లో లభించే సహజ వనరులను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎప్పటి నుండో పలు పథకాలు వేస్తోంది. అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించింది. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు మోడీ సర్కారు ప్రయత్నాలకు వంత పాడడమే! భూ బదలాయింపు నియంత్రణ (ఎల్‌టిఆర్‌) చట్టం 1960 దశకంలో పెద్దఎత్తున సాగిన ఆదివాసీ పోరాటాల ద్వారా సంపాదించుకున్నదే తప్ప పాలకుల దయాదాక్షిణ్యాలతో వచ్చింది కాదు. ఈ చట్టం మూలంగానే గిరిజనులకు ఎంతోకొంత భూమిపై అధికారం వచ్చింది. అలాగే యుపిఎ-1 ప్రభుత్వంపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చి అటవీ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చాయి. అటవీ భూమిపై గిరిజనులకు హక్కులను ఈ చట్టం మరింత బలోపేతం చేయగా మోడీ ప్రభుత్వం దానినీ నిర్వీర్యపరచి గిరిజనుల నుండి భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాలను ఏజెన్సీ ప్రాంతంలో అదానీ కంపెనీల పరం చేయడాన్ని ఆదివాసీలు ప్రతిఘటిస్తున్నారు. ఇప్పటికే గిరిజన సలహా మండలి, పెసా చట్టం, జిఓ నెంబరు మూడు వగైరా రక్షణలన్నీ ఒక్కొక్కటీ ఎగిరిపోతున్నాయి. ఆదివాసీల ప్రయోజనాలను కాలరాస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ సేవలో మునిగి తేలుతున్నాయి.

స్పీకర్‌ అన్నట్టు హోటళ్లు, లాడ్జీలు, రిసార్టులు కడితే ఏజెన్సీ అభివృద్ధి చెందదు. గిరిజనుల అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తే వారు ఆర్థికంగా అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికీ డోలీ మోతలు తప్పని ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు సమకూరిస్తే అభివృద్ధి చెందుతుంది. వాటన్నిటికీ ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలే తప్ప, గిరిజన ప్రాంత భూముల్లోకి అభివృద్ధి పేరిట కార్పొరేట్‌ శక్తులకు, వ్యాపారవేత్తలకు అవకాశం ఇవ్వరాదు. గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న ఎల్‌టిఆర్‌ చట్టానికి సవరణలు చేస్తే ఆదివాసీ సహజ వనరులను, ఖనిజాలను, అడవులను సంపన్నులు స్వాధీనం చేసుకుని వ్యాపారం సాగిస్తారు. ఆదివాసీ జీవనోపాధి, సంస్కృతి ధ్వంసమవుతాయి. బాక్సైట్‌ తవ్వకాలకు అడ్డుగా ఉందని 1/70 చట్టానికి సవరణలు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నాటి టిడిపి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసి…ఇక్కడి గిరిజన సలహా మండలిలో తీర్మానం చేయించింది. రాష్ట్ర శాసనసభకు చట్ట సవరణ అధికారం లేనందున ఆనాటి రాష్ట్రపతి ఆమోదం సంపాదించడానికి సకల యత్నాలూ చేసింది. అయితే వివిధ ఆదివాసీ సంఘాలు, సిపిఎం ఇతర వామపక్షాలు సాగించిన బలమైన బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమంతో అవి సాగలేదు. ఇప్పుడు మరలా టిడిపి కూటమి ప్రభుత్వం విజన్‌ 2047 వంటి విధానాలతో అలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టిందని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా చట్ట సవరణ మూలంగా తీవ్రంగా నష్టపోయే ఆదివాసీ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసీలు 1/70ని సవరిస్తే మరింత వెనుకబడిపోతారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇలాంటి ఆలోచనలు విరమించుకొని గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.

➡️