స్మార్ట్‌ మీటర్లతో ప్రజలకు భారం

రాష్ట్రంలో విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తున్నారు. స్మార్ట్‌ మీటర్లు బిగించాలంటే వినియోగదారుని అనుమతి కావాలి. అయితే అందుకు భిన్నంగా కరెంటు వాళ్లమని చెప్పుకుని షాపుల వద్దకు వెళ్తున్నారు. మీటరు మారుస్తున్నామని చెప్పి ప్రస్తుతం ఉన్న మీటరును తొలగించి దాని స్థానంలో స్మార్ట్‌ మీటరు బిగించి వెళ్ళిపోతున్నారు. స్మార్ట్‌ మీటర్లు బిగించినవారు అదానీ మనుషులని, ఆ స్మార్ట్‌ మీటర్లు అదానీ కంపెనీకి చెందినవన్న విషయాలు వారికి తెలియదు. ఇది విద్యుత్‌ వినియోగదారులను మోసగించటమే.

స్మార్ట్‌ మీటర్లు ఎవరివి?

స్మార్ట్‌ మీటర్లు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెందివనేనని భ్రమింపచేయటం కోసం మీటరు పైన రక్షణగా బిగించే ప్లాస్టిక్‌ షీల్డ్‌ మీద తమ పంపిణీ సంస్థ పేరు ముద్రించుకుంటున్నారు. ఉదాహరణకు ఎ.పి.సి.పి.డి.సి.ఎల్‌ పరిధిలో బిగించే స్మార్ట్‌ మీటర్ల షీల్డ్‌ పైన ప్రాపర్టీ ఆఫ్‌ ఎ.పి.సి.పి.డి.సి.ఎల్‌ అని, ఎస్‌.పి.డి.సి.ఎల్‌ పరిధిలో బిగించే స్మార్ట్‌ మీటర్ల షీల్డ్‌ పైన ప్రాపర్టీ ఆఫ్‌ ఎస్‌.పి.డి.సి.ఎల్‌ అని ముద్రిస్తున్నారు. నిజానికి ఈ స్మార్ట్‌ మీటర్లు విద్యుత్‌ పంపిణీ సంస్థకు చెందినవి కావు. అవి అదానీ కంపెనీవి. ఈ మీటర్లను విద్యుత్‌ పంపిణీ సంస్థలు కొనలేదు. డి.బి.ఎఫ్‌.ఒ.ఒ.టి పద్ధతి కింద అదానీకి అప్పజెప్పారు. ఈ పద్ధతి కింద వారే ఈ స్మార్ట్‌ మీటర్లకు డిజైన్‌ చేస్తారు. వారే తయారు చేస్తారు. వారే పెట్టుబడి పెడతారు. మీటర్లు వారి యాజమాన్యంలోనే ఉంటాయి. వారే వాటిని పని చేయిస్తారు. చివరలో వారు పంపిణీ సంస్థలకు బదిలీ చేస్తారు. దీనిని బట్టి ఈ మీటర్ల డిజైన్‌ మొదలు నిర్వహణ వరకు మొత్తం అదానీ కంపెనీయే చేస్తుందని స్పష్టం అవుతుంది. స్మార్ట్‌ మీటర్లను గురించి సమాచార హక్కు చట్టం కింద అడిగినపుడు విద్యుత్‌ పంపిణీ సంస్థలు కూడా తాము స్మార్ట్‌ మీటర్లను కొనలేదని ధృవీకరించాయి. అందువలన స్మార్ట్‌ మీటర్లు అనేవి విద్యుత్‌ పంపిణీ సంస్థల ఆస్తి కాదు. ఎవరు పెట్టుబడి పెట్టి తయారు చేసి నిర్వహిస్తారో వారి ఆస్తి. ఇప్పుడు బిగిస్తున్న స్మార్ట్‌ మీటర్లు అదానీ ఆస్తి. కనుక షీల్డ్‌ మీద తమ ఆస్తి అని ముద్రించటం వినియోగదారులను మభ్యపెట్టటం కోసమే.

పని చేస్తున్న మీటర్లు తొలగించడం ఎందుకు?

పని చేస్తున్న మీటర్లు తొలగించి స్మార్ట్‌ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు? ఇది ప్రతి వినియోగదారుడు వేసుకోవలసిన ప్రశ్న. భారత దేశంలో విద్యుత్‌ రంగంలో సంస్కరణల అనంతరం విద్యుత్‌ ఉత్పత్తిలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించారు. కాని విద్యుత్‌ పంపిణీలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించలేదు. మోడీ సర్కారు వచ్చిన తర్వాత విద్యుత్‌ పంపిణీ సంస్థలను కూడా ప్రైవేటీకరించటానికి నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ”విద్యుత్‌ సవరణ చట్టం 2022” పేరుతో ఒక బిల్లును 2022 ఆగస్టు 8న పార్లమెంటులో ప్రవేశ పెట్టి అదే రోజున స్టాండింగ్‌ కమిటీకి పంపించారు. అప్పటి నుండి ఆ బిల్లు స్టాండింగ్‌ కమిటీ వద్దనే ఉన్నది.

ప్రధానమైన మూడు సవరణలు

మొదటి సవరణ ప్రకారం ఒకే ప్రదేశంలో అనేకమంది పంపిణీదారులకు లైసెన్సులు ఇస్తారు. ఇప్పటివరకు మనకు విద్యుత్‌ పంపిణీ చేస్తున్న ఎ.పి.సి.పి.డి.సి.యల్‌, ఎ.పి.ఎస్‌.పి.డి.సి.యల్‌, ఎ.పి.ఇ.పి.డి.సియల్‌ పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రైవేటు సంస్థలు లేవు. ఈ చట్ట సవరణ జరిగితే ఈ ప్రాంతాలలో ప్రభుత్వ సంస్థలతోబాటుగా ప్రైవేటు సంస్థలు కూడా లైసెన్సులు పొంది విద్యుత్‌ పంపిణీ చేస్తాయి. మరో సవరణ ప్రకారం లైసెన్సు పొందిన వారందరూ లైన్లు వేయకుండా, ముందుగా ఎవరిలైన్లు ఉంటాయో వారు, తర్వాత లైసెన్సులు పొందిన వారిని కూడా ఆ లైన్లను వాడుకోనివ్వాలి. ఇక్కడ ముందుగా లైన్లు వేసుకున్నది ప్రభుత్వ రంగంలోని పంపిణీ సంస్థలు. ఇవి ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినవి, ఇప్పుడు వీటిని లైసెన్సు పొందిన ప్రైవేటు సంస్థలకు కూడా పంచి ఇవ్వాలి. దీనివలన ప్రైవేటు సంస్థలకు వేరే లైన్ల కోసం పెట్టుబడి పెట్టనవసరంలేదు. ముందుగా ఏ పంపిణీ సంస్థ అయితే విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో ఒప్పందం చేసుకుని ఉంటుందో ఆ ఒప్పందాలను తరువాత లైసెన్సులను పొందిన వారికి కూడా భాగం పంచి ఇవ్వాలన్నది ఇంకొక సవరణ. సహజంగానే ప్రభుత్వ రంగంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థలు ముందుగా ఒప్పందం చేసుకుని ఉంటాయి. వాటిని తరువాత లైసెన్సు పొందిన ప్రైవేటు సంస్ధలకు కూడా ఇవ్వాలి. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించటం కోసమే ”విద్యుత్‌ సవరణ చట్టం 2022” తీసుకొస్తున్నారని స్పష్టం అవుతున్నది. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించటానికి ప్రాథమిక చర్యగా ఈ స్మార్ట్‌ మీటర్లను ప్రవేశపెట్టారు.

వినియోగదారులకు నష్టం

పీక్‌ సమయం పేరుతో అధిక చార్జీలు వసూలు చేయాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. ఏ సమయానికి ఎంత విద్యుత్‌ వాడుకున్నారన్నది రికార్డు చేసే సదుపాయం ఈ స్మార్ట్‌ మీటర్లలో ఉన్నది. ఇది ప్రజలకు భారం అవుతుంది. – పోస్ట్‌ పెయిడ్‌ విధానంలో బిల్లు చెల్లించటానికి 15 రోజులు గడువు ఉంటుంది. బిల్లు చెల్లించడానికి, చెల్లించకపోతే పెనాల్టీతో చెల్లించటానికి, అప్పటికీ చెల్లించకపోతే, కనెక్షన్‌ కట్‌ చేయటానికి నిర్దిష్టమైన గడువు ఉంటుంది. బిల్లు చెల్లించటానికి వినియోగదారునికి వెసులుబాటు ఉంటుంది. ఈ గడువు వరకు వినియోగదారునికి విద్యుత్‌ సరఫరా గ్యారెంటీ ఉంటుంది. ఇవి ప్రీ పెయిడ్‌ మీటర్లు. ప్రీ పెయిడ్‌ విధానంలో అది ఉండదు. ఎప్పుడు డబ్బులు అయిపోతే అప్పుడు కనెక్షన్‌ కట్‌ అవుతుంది. – పరిశ్రమలు, వ్యాపార సంస్థలు లక్షలలో విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తుంటాయి. వాడుకున్న తరువాత చెల్లించే బిల్లు నిర్దిష్టంగా ఉంటుంది. అదే మొత్తాన్ని ముందుగా ఊహించి చెల్లించాలంటే పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు వర్కింగ్‌ కేపిటల్‌ పెరుగుతుంది. – వర్కింగ్‌ కేపిటల్‌ భారాన్ని విద్యుత్‌ జనరేషన్‌ కంపెనీలు, డిస్కంల మీద నుండి వినియోగదారుని మీదకు నెట్టివేయబోతున్నారు. దీనివలన కొన్ని పరిశ్రమలు మూతబడతాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుంది. -వాడుకున్న తరువాత పేపరు మీద బిల్లు ఇస్తే ఎంత వాడామో, ఏ రేటు చెల్లిస్తున్నామో నిర్దిష్టంగా ఉంది. ప్రీ పెయిడ్‌ అయితే యూనిట్‌కు ఎంత వసూలు చేస్తున్నారో వినియోగదారునికి తెలియదు. -స్మార్ట్‌ మీటరు ఖరీదును, దానికి అనుబంధంగా వాడే పరికరాల ఖర్చును వినియోగదారుడే భరించాలి. -సేవలు పొందిన తరువాత వినియోగదారుల నుండి చార్జీలు వసూలు చేసే విధానం నుండి, వినియోగదారుడు ముందుగానే చెల్లించి సేవలు పొందే విధానంలోనికి మార్పు చేసే ప్రక్రియే ఈ స్మార్ట్‌ మీటర్ల ప్రతిపాదన. ఈ విధానం వలన అల్పాదాయ వర్గాలకు చెందిన వినియోగదారులను విద్యుత్‌ సరఫరాకు దూరం చేసే పరిస్థితికి దారితీసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ మీటర్లు అన్ని విధాలా నష్టం. అందువలన వీటిని వ్యతిరేకించాలి.

వ్యాసకర్త : యం.వి.ఆంజనేయులు, విద్యుత్‌ వినియోగదారుల ఐక్య వేదిక కన్వీనర్‌, విజయవాడ

 

➡️