కృష్ణానది విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. అందుతున్న లెక్కల ప్రకారం కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ వద్ద 11 లక్షల 43 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. 1903, 2009లో వచ్చిన వరద నీటి కంటే ఇది ఎక్కువ. కరకట్ట, ప్రకాశం బ్యారేజి భద్రతల గురించి ప్రభుత్వం, ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గేట్ల భద్రత గురించి నిపుణులతో నీటి పారుదల అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, పార్టీలు, వ్యక్తులు, మానవతా వాదులు వరద ప్రాంత ప్రజలకు సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇంకా కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే సముద్రంలోకి వందల టిఎంసీల నీరు చేరింది. ఇటీవలే కేరళలో వరదలతో కొండ చెరియలు విరిగిపడి వందల మంది చనిపోయారు. దేశంలో గత పది సంవత్సరాల్లో పది పెద్ద వరదలు వచ్చి వేల మంది ప్రజలు, లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అద్భుతమైన పురోగతి సాధించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వరదలను ఎదుర్కోలేమా? వీటిని అరికట్టి మానవాభివృద్ధికి మళ్ళించలేమా?
మానవ నాగరికతకు నదులే తల్లులు. ప్రపంచంలో ఎక్కడైనా మానవ నాగరికత అభివృద్ధి చెందిందంటే అది నదీ పరివాహక ప్రాంతాల్లోనేనని చరిత్ర చెబుతుంది. మన దేశంలో సింధూ నాగరికత అందులో భాగమే. ‘అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారే ఏరు’ వున్న చోటనే జీవించమని మన శతకకారులు ప్రజలకు బోధించారు. నదుల పక్కన వున్నప్పుడు వరదల ప్రమాదాలు సహజం. వాటి నుండి రక్షించుకోవడానికి అనాది నుండి మనుషులు అనేక ప్రయత్నాలు చేసి, ఆనకట్టలు, చిన్న ప్రాజెక్టులు, చెరువులు నిర్మించడంతో పాటు ఆ నీటిని పంట పొలాల వైపు మళ్ళించుకున్నారు. మనవాభివృద్ధిలో, రాజుల విజయ గాధల్లో ఈ నీటి కట్టడాలకు ఎంతో ప్రాముఖ్యత వుంది. కరువుల నివారణకు బ్రిటీష్ వారు భారీ ప్రాజెక్టులు కట్టాల్సి వచ్చింది. స్వాతంత్య్రానంతరం మరిన్ని ప్రాజెక్టులు నిర్మించుకున్నాం. అయినా దేశంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 37 శాతం భూమికి మాత్రమే నికరమైన నీటి పారుదల అవకాశాలు వున్నాయి. 77 ఏళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలోని 63 శాతం వ్యవసాయ భూమి వర్షం మీద, అరకొర నీటి పారుదల మీద ఆధారపడాల్సి వస్తున్నది. దేశంలో ప్రస్తుతం మొత్తం నీటి వనరులు 1929 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బి.సి.ఎం). ఇందులో 1100 క్యూబిక్ మీటర్లు మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. ఇందులో 433 బి.సి.ఎం లు భూగర్భ జలాలు కాగా, 690 బి.సి.ఎం లు ఉపరితల ప్రవాహాలు. ప్రస్తుత నీటి వాడకం ఇలాగే కొనసాగితే 2030 తర్వాత తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవలసి వస్తుందని నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరదల ద్వారా అందుబాటులోకి వస్తున్న నీటి వాడకానికి ఎంతో ప్రాధాన్యత వుంది.
సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక ప్రకారం 2022 నాటికి దేశంలో 5,334 పెద్ద డ్యామ్‌లు ఉన్నాయి. వీటిలో 80 శాతం డ్యామ్‌లు 25 ఏళ్ళ నాటివి కాగా 227 డ్యామ్‌లు వందేళ్ల క్రితానివి. వీటిలో 41 డ్యామ్‌లు వరదల తాకిడిని తట్టుకునే స్థితిని కోల్పోయాయి. 1980 నుండి 2017 మధ్య దేశంలో వచ్చిన 253 వరదల వల్ల 1,26,286 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు, 1.93 కోట్ల మంది ఆస్తులు నష్టపోయారు. 1953 నుండి 2022 వరకు ప్రతి సంవత్సరం సగటున 1712 మంది మరణించినట్లు, ప్రతి సంవత్సరం రూ.3,612 కోట్ల ఆస్తి నష్టం జరుగుతున్నట్లు జాతీయ విపత్తుల శాఖ లెక్కలు చెబుతున్నాయి. వరదల వల్ల ప్రపంచంలో మరణిస్తున్న వారిలో ఐదవ వంతు మన దేశంలోనే వున్నారు. ఇందుకు ఒక కారణం మన దేశానికి ఎనిమిది వేల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం వుంది. దేశం మొత్తం భూ విస్తీర్ణంలో 12 శాతం భూమి అంటే 45.64 మిలియన్ హెక్టార్ల భూమి వరదల తాకిడికి గురవుతుందని అంచనా. వరదలను సకాలంలో నివారించగలిగితే ఇందులో దాదాపు 80 శాతం భూమిని వరదల నుండి కాపాడుకోవచ్చు అని వరదలపై 1980లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ ప్రభుత్వానికి నివేదించింది. గత ఇరవై సంవత్సరాల్లో 2004లో సునామీ, 2005లో మహారాష్ట్ర, 2008లో బీహార్, 2013లో ఉత్తరాఖండ్, 2014లో కాశ్మీర్, 2015లో చెన్నై, 2018, 2019, 2024లో కేరళ, 2019లో పాట్నా వరదలు ప్రజాజీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ వరదలకు గురైన లక్షల కుటుంబాలు తమ జీవిత కాలంలో కోలుకోలేని విధంగా నష్టపోయారు.
మన రాష్ట్రం భారత దేశానికి ఆగేయ ప్రాంతంలో ఉంది. పశ్చిమ, తూర్పు కనుమల పర్వత శ్రేణుల నుండి వచ్చే అనేక నదుల ద్వారా మన రాష్ట్రానికి నీరు చేరుతుంది. కృష్ణా, గోదావరి ప్రధాన నదులతో పాటు, తుంగభద్ర, పెన్నా, వంశధార, నాగావళి నదులు మన రాష్ట్రానికి ప్రకృతి ప్రాసాదించిన సహజ నీటి వనరులు. దేశంలో గంగా, గోదావరి, బ్రహ్మపుత్ర తర్వాత కృష్ణా నది పరివాహక ప్రాంతం అతి పెద్దది. మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా 1288 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మన రాష్ట్ర సాగు నీటి వనరులలో ఈ నది ముఖ్య భూమిక పోషిస్తుంది. మన రాష్ట్రానికి చేరుతున్న కృష్ణా నీటిని పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నాం. 2003 నుండి 2022 వరకు 6501 టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోయింది. మరో ప్రధాన నది గోదావరి. ఇది దేశంలో అతి పొడవైన రెండవ నది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిషా ల మీదుగా 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ నది నీటిని కూడా పూర్తిగా ఉపయోగించుకోలేక పోతున్నాము. 2003-2022 మధ్య 43,780 టిఎంసీల నీరు సముద్రంలో కలిసింది. గత 19 సంవత్సరాల్లో ఈ రెండు నదుల నుండి 50 వేల టిఎంసీల నీరు సముద్రంలోకి చేరింది. ఒక టిఎంసీ నీటితో పది వేల నుండి పద్నాలుగు వేల ఎకరాల్లో పంటలు పండించవచ్చు. 50 వేల టిఎంసీలను వ్యవసాయ భూములకు మళ్ళించగలిగితే ఆంధ్రప్రదేశ్ పేరులోనే కాదు, వాస్తవంగా కూడా అన్నపూర్ణ అవుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నికర సాగు నీరు అందించవచ్చు. తద్వారా రైతుల ఆదాయం, కూలీలకు పనులతో పాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. పాలకులు ఇచ్చే భరోసాలు, నేస్తాలు, వందనాల లాంటి పథకాల కోసం ప్రజలు ఎదురు చూసే స్థితి వుండదు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా కొత్త ప్రాజెక్టులను నిర్మించడం కాదు, ప్రస్తుతం వున్న ప్రాజెక్టులనే ప్రభుత్వాలు సక్రమంగా నిర్వహించడంలేదు. వరదలు వచ్చినప్పుడు గేట్లు, డ్యామ్ భద్రత గురించి హడావుడే తప్ప వాటి నిర్వహణకు అవసరమైన నిధులు ఇవ్వడం లేదు. సిబ్బందిని నియమించడం లేదు. ఇందువల్లే 2021లో అన్నమయ్య డ్యామ్ తెగిపోయి అపార నష్టం జరిగింది. పులిచింతల గేటు విరిగిపోయింది. ఇటీవల తుంగభద్ర గేటు కొట్టుకుపోయింది. ఇంకా అనేక ప్రాజెక్టులు ఆందోళనకరంగా వున్నాయి. అయినా మన పాలకులు ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడంలేదు. ప్రధాన పార్టీలు ఒకదానిపై ఒకటి విమర్శలు చేయడానికి వరదలను కూడా ఉపయోగించుకుని తద్వారా తమ రేటింగ్ లెక్కలు వేసుకుంటున్నారే తప్ప, ఈ విపత్తుల వల్ల పోతున్న ప్రాణాలు, నష్టపోతున్న ఆస్తులు, అడుగంటుతున్న వ్యవసాయాన్ని గురించి ఆలోచించడంలేదు.
ప్రకృతి విపత్తులుగా వున్న వరదలను సరైన చర్యలు చేపట్టడం ద్వారా ఎదుర్కోవడమే కాకుండా అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు అని అనేక దేశాలు రుజువు చేస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుండి వచ్చే అధిక నీటి ప్రవాహాలను తట్టుకోవడానికి నదుల ఒడ్డును తగినంత సామర్థ్యంతో ఎప్పటికప్పుడు పరిరక్షించడం, ఆక్రమణలకు గురికాకుండా పటిష్టంగా కాపాడడం, నదీ ప్రవాహాలకు ఏర్పడుతున్న కోతలను సకాలంలో నివారించడం, ప్రాజెక్టులలో పెరుగుతున్న పూడికలను తొలగించడం లేదా సమాంతరంగా మరో ప్రాజెక్టును నిర్మించడం ద్వారా వరదలను అనేక దేశాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో వరదలవల్ల పంటపొలాలే కాదు. పట్టణాలు, నగరాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. 2005లో ముంబయి, 2015లో చెన్నై, 2019లో పాట్నా, 2009లో కర్నూలు, ఇప్పుడు విజయవాడలో వచ్చిన వరదల పట్టణ ప్రజల జీవితాలు, పేద, మధ్యతరగతి కుటుంబాలు అనేక కష్టాలకు గురవుతాయి. పట్టణ ప్రాంత వరదలకు సరైన డ్రైనేజీ నెట్‌వర్కు లేకపోవడం, చెరువులు, కుంటలతోపాటు మురికి కాల్వల ఆక్రమణలు, చెత్త నిర్వహణ సక్రమంగా లేకపోవడం ప్రధాన కారణాలుగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్ నివేదిక తెలిపింది. ఇందుకు ప్రభుత్వాలు, మున్సిపల్, నగర పాలక సంస్థలు చేపట్టాల్సిన చర్యలను సూచించింది. వీటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం కొనసాగుతూనే వున్నది.
వరదలను కూడా మతతత్వ రాజకీయాలకు, మూఢ విశ్వాసాలకు వాడుకునే గ్యాంగ్ సోషల్ మీడియాల్లో పెడుతున్న పోస్టింగ్‌లు మానవత్వం ఉన్న వారందరికి వెగటు పుట్టిస్తుంది. కేరళ వరదలకు ఏనుగు చనిపోవడం కారణమని కేంద్ర బిజెపి నాయకులతో మొదలు, పరివార్ భావజాలం ఎక్కిన సినీనటుల వరకు మాట్లాడారు. వానదేవుడు మా పార్టీలో చేరాడని మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పదే పదే చెప్పడం, ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వర్షాలే రావని లేదా అతివృష్టి వస్తుందని చెప్పడం ద్వారా మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు. ఇలాంటి అశాస్త్రీయ భావాలు తాత్కాలికంగా అధికార పీఠాన్ని ఎక్కించగలవేమోగానీ, ప్రజలను కష్టాల సుడిగుండాల నుండి గట్టెక్కించలేవు. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, సాంకేతికాభివృద్ధిని సక్రమంగా ఉపయోగించడం ద్వారానే ప్రకృతి విపత్తులను ఎదుర్కోగలం. వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని సాగు భూముల వైపు మళ్ళించగలం. ఆ దిశగా కృషి చేయాలని పాలకుల మీద ప్రజా ఒత్తిడి తీసుకు రావాలి.
– వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్