అమరావతి రాజధాని మొదటి దశ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రుణ ప్రాజెక్టును ఆమోదించాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సమక్షంలో ప్రపంచ బ్యాంకు, ఎడిబి లతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు రుణంలో ప్రపంచ బ్యాంకు, ఎడిబి లు రెండూ రూ.6800 కోట్ల చొప్పున మొత్తం రూ.13,600 కోట్లు ఇవ్వనున్నాయి. మిగిలిన రూ.1400 కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని, ఈ అప్పుపై కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. రాబోయే ఐదేళ్లలో ఈ రుణాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ రుణంతో పాటు గృహ మరియు పట్టణాభివృద్ధి కార్పొరేషన్ (హడ్కో), జర్మనీకి చెందిన కె.ఎఫ్.డబ్ల్యు డెవలప్‌మెంట్ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి రూ.15 వేల కోట్లు (11 వేల కోట్లు+4 వేల కోట్లు) రుణం ఇచ్చేందుకు అంగీకరించాయని ముఖ్యమంత్రి తెలియజేశారు.
ప్రపంచ బ్యాంక్ రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లో ప్రయత్నం చేసినది కాదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచ బ్యాంకు నుండి రుణం సేకరించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే 2019 ఎన్నికల దగ్గరకొచ్చేసరికి టిడిపి, బిజెపిల మధ్య రాజకీయ మిత్రత్వం తెగిపోవడంతో కేంద్ర బిజెపి ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం ప్రపంచ బ్యాంకుకు చేసిన రుణ విజ్ఞప్తిని జులై 2019లో ఉపసంహరించుకుంది. ఆ తరువాత వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల సమస్యను ముందుకు తీసుకురావడంతో గత ఐదేళ్లులో ప్రపంచ బ్యాంకు ముందడుగు వేయలేదు. ఇప్పుడు టిడిపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగమేఘాల మీద మరల ప్రపంచ బ్యాంకు రుణం కోసం పావులు కదపటం, ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి రాజధాని ప్రాంతం పర్యటన చేయటం, ఎడిబి తో కలిసి రుణం ఆమోదం తెలపటం అన్నీ చక చకా జరిగిపోయాయి.
రాజధాని నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎపి సిఆర్‌డిఏ), అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ (ఎడిసి)లు స్టేక్ హోల్డర్లుగా కీలక పాత్ర పోషించనున్నాయి. అమరావతి రాజధాని అందులో ఏమేమి నిర్మాణం కాబోతున్నాయో, నిర్మాణాలకు నిధులు ఎలా సమకూర్చుకోవాలి, పరిపాలనా విధి విధానాలు ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలో తదితర విషయాలతో ప్రపంచ బ్యాంకు 118 పేజీలతో కూడిన పర్యావరణ, సామాజిక వ్యవస్థల నివేదికను విడుదల చేసింది. అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి ప్రపంచబ్యాంకు తన వ్యూహాన్ని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన విధి, విధానాలను అభివృద్ధి నమూనాను ఈ నివేదికలో తెలియజేసింది.
ఈ రుణాలు పూర్తిగా సంస్కరణలతో కూడుకున్నవి. ప్రపంచ బ్యాంకు ఆదేశించిన నమూనా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే దశల వారీగా రుణం ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే అమరావతి నిర్మాణ ప్రాజెక్టుకు దీర్ఘకాలిక ప్రాతిపదికన టెక్నికల్, ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్లను కూడా ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో నియమించాల్సి ఉంటుంది.
ఈ నివేదికలో మొత్తం 53,748 ఎకరాల్లో 34,390 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా 28,740 మంది రైతులు నుండి సేకరించినట్లు, ప్రస్తుత రాజధాని పరిధి 217 చదరపు కిలోమీటర్లు గాను ఇందులో ప్రస్తుతం ఉన్న 25 గ్రామ పంచాయతీలలో సుమారు లక్ష మంది ప్రజలు ఉన్నట్లు పేర్కొన్నది. ఈ మొత్తంలో పరిపాలనకు అవసరమైన ప్రభుత్వ కాంప్లెక్స్‌లు అనగా సీడ్ కాపిటల్ పరిధి 16.94 చదరపు కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది.
రాజధానిని మొత్తం 12 జోన్లుగా విభజించటంతో పాటు నివాస, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, హరిత ప్రాంతాలు అనే నాలుగు విభాగాలుగా ఉంటుందని తెలిపింది. వీటిలో పరిపాలన, న్యాయ, ఎలక్ట్రానిక్, నాలెడ్జ్, ఆరోగ్య, విద్య, ఫైనాన్షియల్, క్రీడా, పర్యాటక అనే తొమ్మిది నగరాలుగా నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నది.
మొదటిది ప్రభుత్వం చేపట్టబోతున్న అన్ని రకాల ప్రాజెక్టుల్లోనూ కార్యకలాపాల్లో ప్రైవేట్ పెట్టుబడుల భాగస్వామ్యంతో చేపట్టాలని కోరింది. ముఖ్యంగా మంచినీరు, రహదారులు, పారిశుధ్యం మురుగునీటి పారుదల, విద్యుత్, కమ్యూనికేషన్లు, పార్కులు, రిక్రియేషన్, ప్రజల ఉమ్మడి సదుపాయాల కల్పన వంటి పౌర సేవలన్నింటిలోనూ ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ పెట్టుబడుల భాగస్వామ్యం కల్పించాలని అంటే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) కింద చేపట్టాలని కోరుతున్నది. ఉదాహరణకు అమరావతి నగరానికి రోజూ సుమారు 478 మిలియన్ లీటర్ల మంచినీరు అవసరమని పేర్కొన్నది. ఈ మంచినీటి ప్రాజెక్టును పిపిపి కింద చేపట్టాల్సి ఉంటుంది. అలాగే దీని నిర్వాహణకు ప్రత్యేక రెగ్యులేటరీ నీటి బోర్డు ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టును నిర్వహించాలి. దీని ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్‌ను పూర్తిగా ప్రైవేట్ సంస్థకి అప్పజెప్పాలి. మంచినీటి చార్జీలను పూర్తిగా ఈ సంస్థే నిర్ణయిస్తుంది. అలాగే పారిశుధ్యం, మురుగు నీటి నిర్వహణ ఇలా అనేక పౌర సేవలు పూర్తిగా ప్రైవేట్ సంస్థల కిందే అమలు చేయబడతాయి. దీనిని బట్టి అమరావతి రాజధాని నగరంలో ఏర్పడబోయే సదుపాయాలు ఎవరికోసమో అర్ధం చేసుకోవచ్చు.
రెండోది రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రైవేట్ మార్కెట్ల నుండి కూడా రుణాల రూపంలో సేకరించుకోవాలని కోరింది. ఇందులో మున్సిపల్ బాండ్ల రూపంలో రుణాలు సేకరించుకోవడం ముఖ్యమైనది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతి బాండ్లు విడుదల చేసి రూ.2 వేల కోట్లు రుణాలు సేకరించారు. ఈ బాండ్ల రుణాల ద్వారా చేపట్టబోయే ప్రాజెక్టులు పిపిపి కింద చేపట్టటంతో పాటు దానిని వ్యాపార పద్ధతిలో నడపాల్సి ఉంటుంది. పన్నులు ఎంత విధిస్తారో, తీసుకున్న రుణాలను ఎలా ఆ ప్రాజెక్టు ద్వారా తీరుస్తారో, ప్రత్యేక ఎస్క్రో అకౌంట్ల ఏర్పాటు మొదలగునవి ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ తరహా మౌలిక సదుపాయాలు, పౌర సేవలన్నీ వాణిజ్య పరమైనవిగా ఉంటాయి. బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బాండ్ల రూపంలో మున్సిపల్ సంస్థలు రుణాలు సేకరించుకుంటేనే కేంద్ర ప్రభుత్వ నిధులు పొందేందుకు అర్హత ఉంటుందని ఆంక్షలు విధిస్తున్నది. దీనికోసం ముందుగా మున్సిపల్ సంస్థలు స్టాక్ ఎక్సేంజ్ లలో నమోదు కావాలని, ప్రైవేట్ సంస్థల వలేె క్రెడిట్ రేటింగ్ ర్యాంకులు పొందాలని ఒత్తిడి చేస్తున్నది. ఇప్పుడు వీటన్నిటికీ ప్రయోగశాలగా అమరావతి రాజధాని కాబోతున్నది.
మూడోది రాజధాని కోసం సేకరించిన భూమిని పూర్తిగా వ్యాపార సరుకుగా మార్చాలని కోరుతున్నది. ఈ భూమిని వివిధ ప్రైవేట్ వ్యాపార, వాణిజ్య సంస్థలకు కేటాయించి తద్వారా పెట్టుబడుల ఫైనాన్సింగ్‌ను సమకూర్చుకొని రాజధాని నిర్మాణానికి వినియోగించుకోవాలని ఆదేశిస్తున్నది. అయితే ఈ నమూనాలో ప్రజల ఉమ్మడి ప్రయోజనాలు ఉండవు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని బడా పెట్టుబడిదారులకు కేటాయించే పనిలో చురుగ్గా ఉంది.
నాలుగోది పట్టణ స్థానిక సంస్థ (అమరావతి మున్సిపల్ కార్పొరేషన్) ఎలా ఏర్పాటు చేయాలి? అందులో పౌర సేవలు నిర్వహణ ఎలా ఉండాలి? వీటి కోసం నియమ నిబంధనలు, చట్టాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు ఆదేశించింది. ప్రస్తుతం అమరావతి నగర స్థానిక పరిపాలనా స్వభావాన్ని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయలేదు. రాజ్యాంగం నిర్దేశించిన మూడంచెల పరిపాలనా వ్యవస్థలో భాగంగా అమరావతి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులతో మున్సిపల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారా? లేదా కొన్ని ప్రాంతాలను విడదీసి నోటిఫైడ్ ఏరియాలుగా ఏర్పాటు చేసి సిఆర్‌డిఎ సంస్థ వలే ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థ ఆధీనంలో ఉంచుతారా? అనే సందేహాలకు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా దాని అధికారాలు చాలా పరిమితంగానే ఉంటాయి. కార్పొరేషన్ పరిధి లో ఉండే భూమిపై దీనికి ఎలాంటి అధికారం ఉండదు. ఎందుకంటే ఈ భూమి పూర్తిగా ఏపి సి.ఆర్.డి.ఎ పరిధిలో ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు, పౌరసేవల కల్పన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పివి) ఆధీనంలో జరుగుచున్నాయి. దీని నిర్వహణ అంతా అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ (ఎడిసి) కింద వుంది. దీనిని 2015లో చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్టులో భాగంగా 2013 కంపెనీ చట్టం కింద ఏర్పాటు చేసింది. ఈ లిమిటెడ్ సంస్థపై ఎన్నికైన మున్సిపల్ మేయర్, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారం ఉండదు. అలాగే ఇవి చేపట్టే ప్రాజెక్టుల నిర్ణయం, అమలు, జోక్యం, పర్యవేక్షణ ఏ ఒక్క దానిపై కూడా మున్సిపల్ కౌన్సిళ్లకు అధికారం ఉండదు. ఇది పూర్తిగా స్థానిక సంస్థలకు సమాంతర వ్యవస్థ. బ్యూరోక్రాట్లు, ప్రైవేట్ సంస్థలు కలిసి ఈ లిమిటెడ్ సంస్థలను నడుపుతున్నాయి. పట్టణ స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేసేందుకే ప్రపంచబ్యాంకు ఆదేశాలతో మోడీ ప్రభుత్వం ఈ నిరంకుశ చర్యకు పాల్పడింది.
కనుక ప్రభుత్వం చెబుతున్నట్లు అమరావతి ప్రజా రాజధాని ఎన్నటికీ కాలేదు. ఇది పూర్తిగా కార్పొరేట్ పెట్టుబడుల నమూనాతో, విలాసవంతమైన ఆధునిక సౌకర్యాలతో, వ్యాపార, వాణిజ్య కేంద్రాల లాభాల కోసం, సంపన్నుల రాజధానిగా నిర్మాణం చేయడానికి ప్రపంచ బ్యాంకు ఆధీనంలో నరేంద్ర మోడీ-చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ బృందం ప్రయత్నం చేస్తున్నది. ఈ నమూనా భారతదేశ పట్టణ ప్రజల ప్రయోజనాలకు, సదుపాయాలకు, సేవలకు తీవ్ర నష్టం కలిగించేదనటంలో ఎలాంటి సందేహం లేదు.
డా.బి. గంగారావు వ్యాసకర్త సెల్ : 9490098792 /