కులాల నామినేషన్‌

Nov 12,2024 05:55 #Articles, #caste, #edit page, #nomination

ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలవుతుండగా రెండవ విడతగా భారీగా నామినేటెడ్‌ పదవుల పంపిణీని చేపట్టింది. ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు సహా మొత్తం 59 పోస్టులకు శనివారం నియామకాలు జరిపింది. ఇప్పటికే తొలి విడతలో 20 మందికి వివిధ పోస్టులు కట్టబెట్టింది. ప్రభుత్వంలోకొచ్చిన పాలక పార్టీ తొలుత చేసేది నామినేటెడ్‌ పదవుల భర్తీయే. సహజంగానే అధికార పార్టీలో ఆశావహులు భారీగా ఉంటారు. టిడిపి-జనసేన-బిజెపి.. మూడు పార్టీల కూటమి సర్కారు కనుక, పదవుల పంపిణీకి ఒక ఫార్ములా అనుకున్నందున, మూడు పార్టీల నుంచీ పదవులను ఆశించే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. సమర్ధత, త్యాగాలు, కూటమి అధికారంలోకొచ్చేందుకు చేసిన కృషిని పరిగనణనలోకి తీసుకొని విస్తృత కసరత్తు అనంతరం పదవులకు ఎంపిక చేశామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పదవులు పొందిన వారి జాబితాలను ఆసాంతం పరిశీలిస్తే సి.ఎం. వల్లించిన అంశాలేవీ ఎంపికకు పరిశీలనలోకి తీసుకున్నట్లు అనిపించదు. కేవలం కులాలు, ఉప కులాలను మాత్రమే బేరీజు వేసినట్లు అర్థమవుతుంది. నామినేటెడ్‌ పదవుల జాతరకు గతంలో వైసిపి అనుసరించిన విధానాన్నే టిడిపి అనుసరించిందని స్పష్టమవుతోంది.
కూటమి ప్రభుత్వం రెండవ తడవ ప్రకటించిన నామినేటెడ్‌ పదవుల చిట్టాలో ప్రముఖంగా ప్రస్తావించిన పేరు ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే అంశంపై ప్రభుత్వానికి సలహాదారుగా ఆయన్ని నియమించారు. కేబినెట్‌ మంత్రి హోదా కల్పించారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే వ్యక్తి విద్యార్థులకు నైతిక విలువలు బోధించడమేంటో అర్థం కాదు. ఇలాంటి పదవులకు విద్యావేత్తలనో, రాష్ట్రపతి నుంచి అవార్డులు పొందిన ఉత్తమ ఉపాధ్యాయులనో, విద్యారంగంలోని నిపుణులనో నియమించడం కద్దు. విద్యార్థులకు కావాల్సింది శాస్త్రీయ దృక్పథం తప్ప పుక్కిటి పురాణాలు కాదు. చాగంటి బోధించేది సనాతన ధర్మమేమో? కేంద్ర ప్రభుత్వం దేశంపై రుద్దిన జాతీయ విద్యా విధానం యావత్తూ కార్పొరేటీకరణ-కాషాయీకరణల మయం. ఆ విధానాన్ని గతంలో వైసిపి, నేడు టిడిపి కూటమి ప్రభుత్వం మక్కికి మక్కి అమలు చేస్తున్నాయి. విద్యార్థుల మెదళ్లను విద్వేషాలతో మోడీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం నింపుతుండగా, అందుకు కొనసాగింపు అన్నట్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాగంటిని సలహాదారుగా వేసినట్లు భావించాలి. ఆయన నియామకం వెనుక బిజెపి ఒత్తిడి ఉండే ఉంటుంది. గతంలో టిడిపి హయాంలో ఖర్చు లేని ప్రకృతి వ్యవసాయం అంటూ సుభాష్‌ పాలేకర్‌ను ప్రభుత్వ సలహాదారుగా వేశారు. ఆయన యూనివర్శిటీలు దండగ, సైన్స్‌, శాస్త్రవేత్తలు, పరిశోధనలు శుద్ధ దండగన్నారు. ఆవు విసర్జితాలతో సేద్యం చేయమన్నారు. చాగంటి వారిదీ అదే బడి.
ఎవరు ప్రభుత్వంలో ఉన్నా నామినేట్‌ పోస్టులు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు పునరావాస కేంద్రాలని పూర్వ అనుభవాలు గుర్తు చేస్తాయి. ఎంఎల్‌ఎ, ఎంపి టిక్కెట్లు రాని వారిని బుజ్జగించేందుకు నామినేటెడ్‌ పదవులను వాడుకుంటున్నారు. చంద్రబాబు చెప్పిందదే. సరైన వ్యక్తికి సరైన చోట టిక్కెట్‌ అనే విధానాన్ని ఎన్నికల్లో పాటించాం, అక్కడ పదవులు దక్కని వారికి నామినేటెడ్‌ పోస్టులిచ్చి సంతృప్తి పరుస్తున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరింత మందికి పదవులిస్తామని ఆశ పెట్టారు. కాగా కొన్ని కార్పొరేషన్లను చూస్తుంటే బాధేస్తుంది. ఆఫీస్‌, కనీసం కూర్చోడానికి కుర్చీ, అటెండర్‌ సైతం లేనివి ఉన్నాయి. రూపాయి లేకుండా ఆయా సంస్థలు ఏం చేయగలుగుతాయి? ఆయా తరగతులకు ఏం ఆర్థిక లబ్ధి చేకూరుస్తాయి? నిధుల్లేకుండా సామాజిక న్యాయం సాధ్యమేనా? కేవలం కొంత మందికి పదవులిచ్చి చేతులు దులుపుకుంటే ఆయా తరగతుల జనం మొత్తానికీ న్యాయం జరుగుతుందా? తరగతుల వారీగా ఎన్ని కార్పొరేషన్లు ఏర్పరిచినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే ఆయా తరగతుల జనం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంటుంది. కూటమి తొలి బడ్జెట్‌లో కార్పొరేషన్లకు నిధులేమీ లేవు. వైసిపి చెప్పులనే కూటమి సర్కారు వేసుకుందని తెలుస్తూనే ఉంది.

➡️