ఉపాధి హామీ ఉసురు తీస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. గత పదేళ్ళుగా ఉపాధి హామీ పనులుకు సరిపడా బడ్జెట్‌ కంటే కూడా అదనంగా నిధులు సమకూర్చామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన రాష్ట్రంలో ఉపాధి హామీ ద్వారా పల్లెలకు పండుగ తేవాలని, గ్రామ పంచాయితీలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే రోజు 13 వేలకు పైగా పంచాయితీలలో గ్రామ సభలు జరిపి గిన్నిస్‌ బుక్‌ రికార్డు వైపు పయనిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఊదరగొట్టారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టం ఉసురు తీస్తున్నాయని ప్రజలలో పని చేసే సంఘాలు వాపోతున్నాయి. ఉపాధి హామీ ద్వారా వ్యవసాయ పనులకు కూలీలు దొరకడంలేదని, పైగా వారు సోమరిపోతులుగా మారుతున్నారని, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని గ్రామీణ సంపన్నులు మరో వాదన చేస్తున్నారు. పై వాదనలను ఒకసారి పరిశీలించి వాస్తవాలేమిటో చూద్దాం.
వామపక్ష పార్టీల ప్రోద్భలంతో 2005 యుపిఎ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. కోట్లాది మంది గ్రామీణ పేదలకు పనుల్లేని సమయంలో వలసలు నివారించడానికి ఉన్న ఊళ్ళోనే ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజులు గ్యారెంటీ పని కల్పించి పట్టెడన్నం పెట్టడానికి ఈ చట్టం తెస్తున్నాము. తద్వారా ఉపాధి కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం తప్ప భారీ ఆస్తులు కూడబెట్టడం కోసం కాదని చట్టంలో పొందుపరిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ చరిత్రలోనే గ్రామీణ పేదలకు ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజులు పని గ్యారెంటీ కల్పిస్తూ తెచ్చిన మొట్టమొదటి చట్టం ఇదే.
ఈ చట్టం బాగా అమలు జరిగిన చోట పేదల వలసలు కొంత తగ్గాయి. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం పెంచుకోవటానికి దోహదపడింది. పేదల కొనుగోలు శక్తి పెరిగింది. అంతిమంగా పేదలకు బేరమాడే శక్తిని ఈ చట్టం కల్పించింది. ఇంతటి ప్రాధాన్యత కల్గిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఏటేటా బలహీన పరుస్తూ వస్తున్నది. కేంద్ర బడ్జెట్‌లో నిధులు తగ్గించడం, భారీ స్థాయిలో జాబ్‌కార్డులు తొలగించడం, చేసిన పనికి నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడం, రెండు పూటలా పని చేయాలనడం, ఆన్‌లైన్‌ మస్టర్‌ విధానం పెట్టడం, సమ్మర్‌ అలవెన్స్‌ ఎత్తివేయడం లాంటివి అనేక షరతులు పెట్టి పేదలే మాకు ఈ పని వద్దు బాబో అనేలా చేసింది. 2020-2021లో ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్‌లో రూ.లక్ష 9 వేల కోట్లు కేటాయిస్తే నేడు రూ. 81 వేల కోట్లకు కుదించింది. 2021లో వేతన రేటు రూ.255 ఉంటే నేడు రూ.305కు పెరిగింది. ఈ లెక్కన పెరిగిన వేతనం ప్రకారం బడ్జెట్‌లో కనీసం లక్షా 30 వేల కోట్లకు పెరగాలి. 2020-21లో దేశ వ్యాప్తంగా పని చేసిన కుటుంబాలు 7.55 కోట్లు ఉంటే 2023లో 4.68 కోట్లకు పడిపోయాయి. 2 కోట్ల 87 లక్షల కుటుంబాలు పని కోల్పోయాయి. 2020-21లో సగటున కుటుంబానికి 52 రోజులు పని కల్పిస్తే నేడు అది 47 రోజులకు పడిపోయింది. 100 రోజులు చేసిన కుటుంబాలు 71,97,090 వుంటే నేడు 44,97,113కు తగ్గాయి. దేశ వ్యాప్తంగా ఒక్క పని దినం కూడా నమోదు కాని పంచాయితీలు 13,467 ఉన్నాయంటే ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం ఎంత దారుణంగా దెబ్బతీసిందో అర్ధమవుతుంది.
ఈ మధ్య కాలంలో దేశంలోకెల్లా అత్యధిక జాబుకార్డులు తొలగించిన రాష్ట్రం మనదే. ప్రభుత్వ లెక్కలు ప్రకారం 2020-21లో ఉమ్మడి 13 జిల్లాల్లో 94,91,834 జాబుకార్డులుంటే నేడు 68,52,487కు తగ్గాయి. ఈ నాలుగేళ్ళలో 26,39,347 లక్షల కార్డులు (28 శాతం) తొలగించారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం జాబుకార్డులు తొలగించలేదని బుకాయిస్తున్నది. ఉదాహరణకు ఉపాధి హామీ చట్టాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా బండ్లపల్లి గ్రామంలో 2020-21లో 770 కుటుంబాలకు 52,949 పని దినాలు కల్పిస్తే అదే గ్రామంలో నేడు కేవలం 34,219 పని దినాలు నమోదయ్యాయి. ఒక్క గ్రామంలోనే 18730 పని దినాలు కోల్పోయారు. ఈ రోజు వేతనం బట్టి లెక్కిస్తే ఒకే గ్రామంలో రూ.56,19,000 లక్షలు కోల్పోయారు పేదలు. చట్టాన్ని ప్రారంభించిన గ్రామం పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన గ్రామాల సంగతి చెప్పవలసిన అవసరం లేదు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో 2021లో 27,583 మందికి జాబు కార్డులుంటే నేడు 20,113 వేలకు తగ్గాయి. కేవలం ఒక్క మండలంలో 7,470 (27 శాతం) కార్డులు తొలగించారు. కాబట్టి ఆదోని ప్రాంతం నుండి భారీ వలసలు పోతున్నారు. ఈ లెక్కలన్నీ పరిశీలించ కుండా గ్రామాలలో పండుగలు చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలు తప్ప వాస్తవాలు కాదు. ప్రారంభంలో ఉపాధి నిధులలో 90 శాతం పేదలకు పని కల్పించడం ద్వారా ఖర్చు చేయాలి. 10 శాతం మాత్రమే మెటీరియల్‌ కోసం ఖర్చు చేయాలి. అది కూడా యంత్రాలను ఉపయోగించరాదని చట్టంలో పొందుపరిచారు. నేడు ఆ నిబంధనలకు బిజెపి మంగళం పాడి కూలీలు చేసే పనులకు వేతనం తగ్గించి కాంట్రాక్టర్లు, యంత్రాలకు ఉపాధి కల్పించడానికి 10 శాతం నుండి 40 శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌ పెంచి పేదల కడుపు కొట్టారు. దీనిని బట్టి ఉపాధి హామీని ఎంత దెబ్బ తీశారో అర్ధమవుతుంది. దీనికి ఒక మెట్టు పైకెక్కి మన రాష్ట్ర ప్రభుత్వం 13 వేల పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభలు జరిపి ఇందులో ప్రజల భాగస్వామ్యం లేకుండా…ఉపాధి నిధులతో సిమెంటు రోడ్లు, ఆసుపత్రులు ఆర్టికల్చర్‌కు ఖర్చు చేయాలని నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్గం.

వ్యవసాయ అనుసంధానం అంటే…

‘ఉపాధి హామీ’ పట్ల వ్యతిరేకత కలిగిన గ్రామీణ సంపన్న వర్గాలు చట్టం రావటం వల్ల వ్యవసాయ పనుల్లో కూలీల కొరత ఏర్పడిందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టాన్ని ఎత్తి వేయాలి లేదా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వ్యవసాయానికి అనుసంధానం చేయటమంటే భూస్వాముల పొలాల్లో ఉపాధి హామీ కూలీలు నాట్లు నుంచి కోతల దాకా పనిచేయాలి. వేతనాలు ప్రభుత్వం ఇచ్చే ఉపాధి నిధులు ద్వారా తీసుకోవాలి. ప్రస్తుతం అన్ని వ్యవసాయ పనుల్లో కూలీల ద్వారా చేసే పనులు తగ్గి యంత్రాలతో చేయిస్తున్నారు. ఈ లెక్కన వ్యవసాయ అనుబంధం అంటే కూలీల కోసం వచ్చిన ఉపాధి నిధులను కాంట్రాక్టర్లకు, పెత్తందార్లకు కట్టబెట్టి కూలీల కడుపుగొట్టడమే.
గడిచిన రెండు దశాబ్దాల కాలంలో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. గతంలో కుటుంబానికి వ్యవసాయంలో 170 దాకా పని దినాలు ఉంటే నేడు వ్యవసాయంలో 40-50 రోజులకు మించి దొరకటంలేదు. ఈ కారణంగా ప్రతి యేటా లక్షలాది మంది వలసలు పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలా? వద్దా? అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి 2012లో నాటి యుపిఏ ప్రభుత్వం బిజెపి పార్లమెంట్‌ సభ్యురాలు మిహిర్షా నాయకత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ దేశమంతటా పర్యటించి ఇప్పటికే వ్యవసాయానికి అనుబంధంగా భూ అభివృద్ధి, పంట కాలువలు తవ్వడం, చెరువుల పూడిక, గట్లు వేయడం, భూగర్భ జలాలు పెరగడానికి చెక్‌డ్యాంలు లాంటి 28 రకాల పనులు జరుగుతున్నాయి. కాబట్టి వ్యవసాయానికి అను సంధానం చేయనవసరం లేదని పార్లమెంట్‌కు నివేదిక సమర్పించింది. ప్రస్తుత కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆ నివేదికకు తిలోదకాలు ఇచ్చి 10 శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌ను 40 శాతం పెంచి యంత్రాలను ప్రవేశ పెట్టడం ద్వారా ఉపాధి హామీ నిధులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలని చట్టాన్ని సవరించింది. మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పనులకు నిధలు కేటాయించకుండా పేదల కోసం వచ్చిన ఉపాధి హామీ నిధులను సిమెంట్‌ రోడ్లకు, ప్రభుత్వ భవనాలకు, ఉద్యాన పంటలకు, లైబ్రెరీ భవనాలకు మళ్లించి పేదలకు ద్రోహం చేస్తున్నది.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏ మూలకూ చాలడం లేదు. పెరుగుతున్న డిమాండ్‌, కనీస వేతనాలు దృష్టిలో పెట్టుకుంటే సంవత్సరానికి సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరం. రూ.48 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న ఈ దేశానికి కోట్ల మందికి అన్నం పెట్టే ఉపాధి హామీకి రూ.2 లక్షల కోట్లు పెద్ద భారం కాదు. అదేవిధంగా 3 లక్షల కోట్లకు చేరుకుంటున్న రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 10 శాతం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించడం లేదు. ఇప్పటికే కనీవినీ ఎరుగని నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభం, దారిద్య్రం, ఆకలి చావులు సంభవిస్తున్న ఈ దేశానికి ఉపాధి హామీ చట్టం ఒక వరం లాంటిది. కనుక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న ఈ చట్టాన్ని అదే స్ఫూర్తితో అమలు జరిగేలా పోరాడాలి. అంతేగాక, గ్రామాలతో పాటు పట్టణాలకు విస్తరింపచేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి. వీటి సాధన కోసం పెద్ద ఎత్తున పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.

వ్యాసకర్త వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు

➡️