శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకె సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన లంకలో ఒక కమ్యూనిస్టు పాలనా బాధ్యతలు చేపట్టటంతో చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఐదు సంవత్సరాల క్రితం నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్.పి.పి) అభ్యర్ధిగా కేవలం 3.16 శాతం ఓట్లు తెచ్చుకున్న వామపక్ష నేత ఇప్పుడు 42.3 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలవటం, రెండవ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో 55.89 శాతం ఓట్లతో విజయం సాధించటం చిన్న విషయమేమీ కాదు. సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల పతనం తరువాత ప్రపంచంలో కమ్యూనిస్టులకు ఎదురుగాలి వీచిందన్నది వాస్తవం. కమ్యూనిస్టులపై ప్రచ్ఛన్న యుద్ధంలో విజేతలం తామే అని ప్రకటించుకున్న వారి కలలు కల్లలే అని తరువాత జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాటిలో తాజాగా శ్రీలంక చరిత్రకెక్కింది.
తాజా ఎన్నికలలో ఎన్‌పిపి అభ్యర్థి తొలి రౌండ్‌లో 42.3 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఎస్‌ఎల్‌పి అభ్యర్థి సాజిత్ ప్రేమదాస 32.76 శాతం, ప్రస్తుత అధ్యక్షుడు రానిల్ విక్రమ సింఘే 17.27 శాతం ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. మిగిలిన ఓట్లను 35 మంది ఇతర అభ్యర్థులు తెచ్చుకున్నారు. అక్కడి విధానం ప్రకారం ప్రతి ఓటరూ ముగ్గురికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయవచ్చు. సగానికి పైగా ఓట్లు తెచ్చుకున్న వారినే విజేతగా ప్రకటిస్తారు. అలా రాని పక్షంలో మొదటి ఇద్దరిని మినహాయించి మిగిలిన వారిని పోటీ నుంచి తొలగిస్తారు. వారికి వచ్చిన ఓట్లలో రెండవ ప్రాధాన్యతా ఓట్లు ఎవరికి వేశారో వారికి కలిపి 50 శాతం పైగా తెచ్చుకున్నవారిని విజేతగా నిర్ధారిస్తారు. ఆ ప్రకారం వామపక్ష నేతకు 55.89 శాతం రావటంతో ఎన్నికైనట్లు ప్రకటించారు.
ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటున్నపుడు ప్రతిదీ మార్పుకు గురవుతుందన్నది నమ్మకం కాదు, ఒక శాస్త్రీయ భౌతిక వాస్తవం. ఎక్కడైతే కమ్యూనిజం విఫలమైందని విజయ గీతాలాపన చేశారో అదే అమెరికాలో, ఇతర అలాంటి దేశాల్లో ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందని వినిపిస్తోంది. అందుకే ప్రత్యామ్నాయంగా సోషలిజం గురించి ఆసక్తి వ్యక్తమౌతున్నది. పలు రకాల భావజాలాలు కలిగిన వారందరికీ అవకాశం ఇచ్చిన జనం తగిన సమయం వచ్చినపుడు వామపక్ష శక్తులకు మాత్రం ఎందుకు ఇవ్వరంటూ అనేక మంది తగిలిన ఎదురుదెబ్బలను తట్టుకొని అరుణ పతాకను అలాగే సమున్నతంగా ఎగరేస్తూ అచంచల విశ్వాసంతో ఉన్నారు. అలాంటి వామపక్ష శక్తులు లంకలో జన సమ్మతిని పొందాయి. అనేక రకాలుగా విష ప్రచారం చేస్తున్నప్పటికీ లాటిన్ అమెరికా దేశాల్లో అనేక చోట్ల వామపక్ష శక్తుల మీద జనం విశ్వాసం ఉంచారు. దక్షిణాఫ్రికా అధికార కూటమిలో కమ్యూనిస్టులు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. నేపాల్లో తిరుగులేని శక్తిగా వామపక్షాల ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన శ్రీలంక చేరింది. దాని గురించి ఇరుగుపొరుగు దేశాలన్నింటా ముఖ్యంగా మన దేశంలో దీని గురించి చర్చ జరగటం అనివార్యం.
తప్పుడు విధానాలు అనుసరించి శ్రీలంకను దివాలా తీయించిన పాలకులను రెండు సంవత్సరాల క్రితం లంకేయులు తరిమికొట్టారు. ఆ పరిణామాల గురించి ఎంతో చర్చ జరిగింది. అలాంటి చోట కమ్యూనిస్టులను ఎలా ఎన్నుకున్నారబ్బా అని అదేమాదిరి జనం ఇప్పుడు ఆలోచిస్తారు. అలాంటి మధనం మన దేశంతో సహా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రతిదేశ పాలకుల్లో వణుకు పుట్టించటం అనివార్యం. మార్క్సిజం-లెనినిజం ఒక శాస్త్రీయ సిద్ధాంతం. దాన్ని అన్ని చోట్లా రూళ్ల కర్రలా ఒకే మాదిరి వర్తింపచేయాలని చూసిన కొన్ని పార్టీలకు ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రతి దేశ విప్లవం తనదైన పద్ధతిలో ఉంటుంది తప్ప ఏదో ఒక నమూనాలో జరగదు. చైనా మార్గంలోనో రష్యా మాదిరో వస్తుందని భావించిన వారు దుందుడుకు, మితవాద చర్యలకు పాల్పడటంతో అనేక చోట్ల ఉద్యమం దెబ్బతిన్నది. యూనిఫాం అంటే ఏకరూపం ఉండాలి తప్ప అందరికీ ఒకే కొలతలని కాదు. అలాగే మార్క్సిస్టు శాస్త్రీయ సిద్ధాంతాన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ దేశాలు, పరిస్థితులకు అన్వయించుకోవాల్సి ఉంది. ఆ అవగాహనపై వచ్చిన తేడాలే పలు కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల ఏర్పాటుకు దారితీశాయి. అలాంటిదే శ్రీలంకలో జనతా విముక్తి పెరుమన (సంఘటన). దానితో పాటు మరో 27 వామపక్ష పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు కలసి నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్.పి.పి) పేరుతో ఒక కూటమిగా పోటీ చేశాయి.
ఏడున్నరద శాబ్దాలుగా వివిధ పార్టీలను చూసిన జనం వాటి మీద విశ్వాసం కోల్పోయి వామపక్ష అభ్యర్థికి ఓట్లు వేశారు. గతంలో తుపాకి చేతపట్టి విప్లవాన్ని తీసుకువచ్చేందుకు రెండుసార్లు జనతా విముక్తి పెరుమున విఫలయత్నం చేసింది. ఇప్పుడు బాలట్ ద్వారా అధికారాన్ని పొందింది. తాజా విజయం దాని చరిత్రలో ఒక ప్రధాన మలుపు.
అధ్యక్ష పదవిలో కొలువుదీరిన వామపక్ష కూటమి పార్లమెంటులో కూడా ఆధిక్యతను సంపాదించాల్సి ఉంది. లాటిన్ అమెరికాలో అధికారానికి వచ్చిన వామపక్షాలు అధ్యక్ష, ప్రధాని పదవులు పొందుతున్నప్పటికీ పార్లమెంట్లలో మెజారిటీ తెచ్చుకోలేని కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అంతకు ముందున్న వ్యవస్థ పునాదుల మీదనే అవి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అయితే వాటికి ఉన్న పరిమితుల కారణంగా కొన్ని చోట్ల ఎన్నికల్లో ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. వాటి నుంచి లంక వామపక్ష ఎన్‌పిపి తగిన పాఠాలు తీసుకోవాలి. 2022లో ఏర్పడిన ప్రభుత్వం ఐ.ఎం.ఎఫ్, ఇతర అంతర్జాతీయ సంస్థల షరతులన్నింటికీ తల ఊపి రుణాలు తీసుకుంది. దాని వలన పౌర సంక్షేమానికి నిధుల కోత ఒకటైతే భారాల మోత మరొకటి. ఐ.ఎం.ఎఫ్ ఒప్పందాల నుంచి తక్షణమే వైదొలిగితే మరోసారి లంక చెల్లింపులతో పాటు ఇతర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. దాని షరతుల నుంచి ఉపశమనం కలిగించకపోతే జనంలో అసంతృప్తి తలెత్తటం అనివార్యం. ఈ పరిస్థితిని వామపక్ష ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. మన దేశంలో బిజెపి రెండు సీట్ల నుంచి మూడు వందలకు పైగా సీట్లతో అధికారం పొందామని గర్వంగా, ఘనతగా చెప్పుకుంటుంది. దానికి ఆ పార్టీకి మూడు దశాబ్దాలు పట్టింది. జె.వి.పి ఐదేళ్లలోనే అలాంటి అధికారాన్ని పొందింది. రాజకీయాల్లో బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవుతాయి. సింహళ హృదయ సామ్రాట్టులుగా పేరు తెచ్చుకున్న రాజపక్సే సోదరులు 2019 ఎన్నికల్లో 52.25 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. అనుసరించిన విధానాల కారణంగా వారు 2022లో జనం ఇళ్ల నుంచి తరిమికొట్టారు. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 2.57 శాతమే. అందువలన జనానికి దూరమైతే ఎవరికైనా ఇదే గతి అని లంక జనాలు చెప్పారు. మన దేశంలోని పార్టీలు దీన్ని గుణపాఠంగా తీసుకుంటాయా?
ఎం.కోటేశ్వరరావు