ముప్పై ఏళ్ల క్రితం తాను చెప్పిన ”టూరిజం” సిద్ధాంతం సరైనదేనని ఇప్పటికైనా కమ్యూనిస్టులు అంగీకరించారంటూ నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన హాస్యాస్పదంగా వుంది. ఏ కమ్యూనిస్టు ఎక్కడ చెప్పారో మాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు ప్రతినిధులుగా ఉన్న సిపిఐ(ఎం)కు సంబంధించినంత వరకు 1999లో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 పేరుతో ”కమ్యూనిజానికి కాలం చెల్లిందని టూరిజం మిగిలింద”ని చెప్పిన సిద్ధాంతాన్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నది. నాడు సిపిఐ(యం) ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాట నేడు మరింత వాస్తవ రూపం దాలుస్తున్నది. కమ్యూనిజానిదే భవిష్యత్తని పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
ఈ 30 సంవత్సరాలలో ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. ఆనాడు కమ్యూనిస్టులు చెప్పినట్లుగానే ఈరోజు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విజన్ 2020 ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోగా అసమానతలను తీవ్రంగా పెంచింది. ప్రపంచంలోనే అతి గొప్ప సంపన్నులుగా కొద్దిమంది ఆంధ్రులు ఉన్న మట వాస్తవం. అదే సమయంలో అత్యంత నిరుపేదలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడే కేంద్రీకరించి ఉన్నారన్నది అంతకన్నా గొప్ప సత్యం. పి-ఫోర్ పేరుతో పేదరిక నిర్మూలనకు ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రకటించడమే అందుకు నిదర్శనం. 25 సంవత్సరాల తర్వాత పేదరిక నిర్మూలనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, చివరికి కార్పొరేట్ల సహాయంతో పేదరికం నిర్మూలిస్తామని చెప్పాల్సిన దుస్థితి చంద్రబాబు గారి టూరిజం సిద్ధాంత వైఫల్యానికి నిదర్శనం. ఈ పాతిక సంవత్సరాల కాలంలో ప్రజల ఆస్తులను, ప్రకృతి సంపదను కొల్లగొట్టి బడా కార్పొరేట్లకు కట్టబెట్టారు.
అభివృద్ధి పేరుతో లక్షలాది ఎకరాలు రైతుల నుండి బలవంతంగా లాక్కొని కార్పొరేట్లకు అప్పజెప్పారు. వారా భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకొని ఎగ్గొట్టి లాభపడ్డారు. పరిశ్రమలు రాలేదు. ఉద్యోగాలు రాలేదు. పేదరికం తగ్గలేదు. గత 25 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమి ఎంత? పెట్టిన పరిశ్రమలు ఎన్ని? ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం బట్టబయలు చేయాలి. అప్పుడే టూరిజం సిద్ధాంతం అసలు రూపం ప్రజలకు అర్థం అవుతుంది.
ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని 2024-25 ఆర్థిక సర్వేనే చెబుతున్నది. ఒక అంతర్జాతీయ సర్వే ప్రకారం భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందిలో 100 కోట్ల మందికి కొనుగోలు శక్తి లేదు. ప్రజల ఆదాయాలు పడిపోయి విహార యాత్రల ఖర్చు కూడా తగ్గించుకున్నారు. అందుకే టూరిస్ట్ కేంద్రాలు కూడా బోసిపోతున్నాయి. హోటల్ ఆక్యుపెన్సీస్ తగ్గిపోతున్నాయి. 2022లో లక్ష 66 వేల మంది విదేశీ టూరిస్టులొస్తే ఆ సంఖ్య 2023కి 60 వేలకు పడిపోయింది. టూరిస్టు లెక్కల్లో అత్యధికులు దేవాలయాలను సందర్శిస్తున్నవారే. పేదరికం, అసమానతలు పెరిగే కొద్దీ దిక్కులేని జనం భక్తి వైపు మళ్ళుతున్నారు. టూరిజం డిపార్ట్‌మెంట్ నుంచి లెక్కలు తెప్పించుకొని చంద్రబాబు పరిశీలిస్తే వాస్తవాలు అర్థమవుతాయి.
అరకు ఒక టూరిస్ట్ ప్రాంతం. అక్కడ గిరిజనుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. అరకు కాఫీ పేరుతో పార్లమెంటులో స్టాల్ పెట్టి వాళ్ళని ఉద్ధరిస్తున్నానని చంద్రబాబు గారు చెప్తున్నారు. అదే కాఫీ పండిస్తున్న రైతులకు ఇస్తున్న గిట్టుబాటు ధర ఎంతో చెప్పాలి. ఆఖరికి బకాయిలు కూడా చెల్లించలేని దుర్గతి ప్రభుత్వానిది. అసలు సిసలైన ఆర్గానిక్ కాఫీగా ఉన్న అరకు కాఫీకి ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహం ఏమిటి? అరకు కాఫీ బ్రాండ్‌తో గిరిజనులకు లాభం జరుగుతున్నదా? లేదా వాటిని మార్కెట్ చేసి అమ్ముతున్న కార్పొరేట్ల లాభాలు పెరుగుతున్నాయా పరిశీలించి చెప్పాలి. ఎవరి వాటా ఎంతో లెక్కలేసి అసెంబ్లీలో చెప్పండి. టూరిజం పేరుతో గిరిజన కళారూపాలతో వ్యాపారం చేయడం మినహా ఆ కళాకారులకు మీరు అందిస్తున్న ప్రోత్సాహం ఏమిటి? టూరిజం పేరుతో రాజ్యాంగబద్ధమైన 1/70 చట్టాన్ని ఉల్లంఘించి భూముల్ని సంపన్నులకు అప్పగిస్తున్నారు. దీర్ఘకాల లీజులు పేరుతో గిరిజన భూములపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అక్కడ గిరిజనులను టూరిస్ట్ హోముల్లో కూలీలుగా మారుస్తున్నారు. ఇదేనా టూరిజం అభివృద్ధి?
గత 30 సంవత్సరాలలో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు. రాష్ట్రం ఏం సాధించిందో ఆయన చెప్పాలి. ఆయన వ్యక్తిగత సమర్థత గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు కానీ సమర్థవంతంగా సంపన్నులను ఆదుకున్నారు. విజన్ 2020 సమీక్షించకుండానే 2047 అంటూ కొత్త రాగం తీస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ప్రపంచం వైపు చూడాలని కోరుతున్నాము. అమెరికా తీవ్ర సంక్షోభంలో ఉంది. యూరోపియన్ దేశాలు అస్థిరతలో ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సలహాలను, షరతులను అత్యధిక పేద దేశాలు తిరస్కరిస్తున్నాయి. ఈ ప్రతిఘటనతో ప్రపంచ బ్యాంకు తన ఆలోచనల్ని మార్చుకుంటున్న వైనం కనిపిస్తున్నది. ఇవి ఏమీ చంద్రబాబు నాయుడు గారి గమనంలో ఉన్నట్లు లేదు. ఎవరో ఎక్కడో చెప్పిన నాలుగు ముక్కలను పట్టుకుని ఆయన సంబరపడిపోవడం చూస్తుంటే ఆయన అల్ప సంతోషానికి విచారించడం మినహా చేయగలిగింది లేదు. మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే. చంద్రబాబు నాయుడు గారూ! ఇది 1999 కాదు. ప్రపంచం మారిపోతున్నది. మీరూ మారండి. 2000 సంవత్సరం నాడు యువతరంగా ఉన్నవారు -సో కాల్డ్ మిలీనియల్స్-మధ్యంతర తరంగా ఉంది. వారు ఇప్పుడు తమ పిల్లల భవిష్యత్తు గురించి విచారిస్తున్నారు. నేడున్నది జడ్ జనరేషన్. ఈ కొత్త తరం సంక్షోభంలో ఉంది. ఉన్న ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియక, కొత్త ఉద్యోగాలు రాక త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నది. కొత్త మార్గం కోసం అన్వేషిస్తున్నది. మీరు చెప్పే పరిష్కారం ఫలితాలను ఇవ్వడం లేదు. ఇప్పటికీ పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడితే ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు.
అసమానతలు లేని కొత్త సమాజం కావాలని ఈరోజు యువత కోరుకుంటుంది. అందుకు టూరిజం కాదు కావాల్సింది కమ్యూనిజం. టూరిజానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం కాదు. అది వినోదంతో పాటు విజ్ఞానం అందించే యాత్రలుగా ఉండాలి. లాభాలు సంపాదించిపెట్టే సాధనం కాదు. మధ్యతరగతి ప్రజలు సంవత్సరం పొడుగునా సంపాదించుకున్న దాంట్లో మిగిలిన కొద్ది మొత్తాలను ఖర్చు పెట్టించడానికి ఇది పనికి వస్తుంది. ఇది ఉత్పత్తి రంగం కాదు. ఉత్పత్తి రంగాల్లో సృష్టించబడిన సంపదను ఖర్చు పెట్టే సర్వీస్ రంగం టూరిజం. సర్వీస్ రంగం మీద ఆధారపడి మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దిక్కు తోచని స్థితిలో ఉంది. 35 సంవత్సరాల క్రితం కమ్యూనిజాన్ని పాతాళంలోకి తొక్కామని దురహంకారంతో ప్రకటించిన అమెరికా ఇప్పుడు అదే కమ్యూనిజం తమకు ప్రథమ శత్రువని గగ్గోలు పెడుతున్నది. ఆ కమ్యూనిస్టు వ్యతిరేక ఊబిలోకి మన దేశాన్ని దించాలని ప్రయత్నిస్తున్నది. మోడీ తలొగ్గుతున్నారు. చంద్రబాబు తాళం వేస్తున్నారు.
అమెరికాలో అడుగు పెడితే చాలనుకున్న యువతరం నేడు వీసాకు అప్లై చేయడానికే జంకుతున్నది. కావాలంటే ఈనాడు పేపర్ చదవండి. ఈ మార్పు బాబు గారికి అర్థం కావడం లేదా? ప్రపంచం తిరిగి సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధ దశలోకి అడుగు పెడుతున్నదన్న విశ్లేషకుల మాటలు వినపడటం లేదా? లేదంటే ఒకసారి మీరు వింతగా చెపుతున్న ”ఏ.ఐ”ను ఒకసారి అడిగి చూడండి. ఏమి చెపుతుందో? ఏ ఇజం వైపు ప్రపంచం ప్రయాణిస్తుందో మనకు అర్థమవుతుంది.
ప్రజామిత్ర