ప్రజావ్యతిరేకత పెల్లుబికినప్పుడు పాలకులు దాని మూలాలను వీక్షించి, సమస్యలను పరిష్కరించటంపై దృష్టి పెట్టటం ప్రజాస్వామికం. అందుకు భిన్నంగా అసహనం పెంచుకొని, నియంతృత్వ ధోరణులకు కోరలు తొడగటం అప్రజాస్వామికం. దాదాపు రెండేళ్లుగా గొంతెత్తుతున్న ప్రజా నిరసనలను, ప్రతిపక్షాల ఘోషను పట్టించుకోని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ అహంకారపూరిత వైఖరి … ఇప్పుడు అతడి పదవికే ఎసరు పెడుతోంది. మంగళవారం సాయంత్రం అతడు ఆకస్మికంగా తీసుకున్న సైనిక పాలన నిర్ణయంపై దేశ ప్రజలు దిగ్భ్రాంతికి గురై, లక్షలాదిగా వీధుల్లోకి వచ్చారు. తక్షణం ఆ నిరంకుశ ప్రకటనను ఉపసంహరించుకోవాలని గళమెత్తారు. సైనిక దళాల అవరోధాలను అధిగమించి, పార్లమెంటు సభ్యులు రాత్రంతా సభలో చర్చించి, ఆ నియంతృత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు. ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీ, ఇంకో నాలుగు చిన్న పక్షాలతో పాటు అధికారిక పార్టీకి చెందిన 18 మంది సభ్యులూ అధ్యక్షుడి ప్రకటనకు వ్యతిరేకించారు. దీంతో, కేవలం ఆరు గంటల వ్యవధిలోనే దక్షిణ కొరియా సైనిక పాలన కోరల నుంచి బయటపడింది.
1953 నుంచి అమెరికా చెప్పుచేతల్లో నడుస్తున్న దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ శుష్కించుకుపోతోంది. పెరిగిన ధరవరలకు తగ్గట్టుగా వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పరస్పర రక్షణ ఒప్పందం పేరుతో అమెరికా సైనిక దళాలు 70 ఏళ్ల నుంచి దక్షిణ కొరియాలో తిష్ట వేసుక్కూర్చొన్నాయి. దాంతోపాటు అమెరికా ఆర్థిక విధానాలకు అనుగుణంగానే దక్షిణ కొరియా నడుస్తోంది. అమెరికా సైన్యంతోనూ, సహకారంతోనూ తమ దేశం గొప్పగా రాణిస్తున్నట్టు దక్షిణ కొరియా పాలక పక్షాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. దీనికి భిన్నంగా దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు యూన్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు మరింత క్షీణించాయి. 2022లో 0.8 శాతం ఓట్ల స్వల్ప తేడాతో అధ్యక్షుడిగా ఎన్నికైన యూన్ రెండేళ్లు తిరక్కముందే ప్రజామోదాన్ని కోల్పోయాడు. 2024 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అతడి పీపుల్స్ పవర్ పార్టీ 300 స్థానాలకు గానూ 114 స్థానాలను మాత్రమే పొందింది. ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీ 156 స్థానాలు సాధించింది. అప్పటినుంచి పార్లమెంటులో అధ్యక్షుడి వైఫల్యాలపై నిలదీయడం పెరిగింది. పార్లమెంటు బయటా ఉద్యోగ, కార్మిక ఉద్యమాలు ఊపందుకున్నాయి. వైద్య రంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత ఫిబ్రవరిలో సమ్మె బాట పట్టారు. తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే- 18 వేల పౌన్ల జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామంటూ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ప్రజాసమస్యలపై అధ్యక్షుడి స్పందనకు ఇదొక ఉదాహరణ మాత్రమే! అన్ని రంగాల ఆందోళనలూ, అభ్యర్థనల పట్లా ఇదే నిరంకుశ వైఖరి కొనసాగింది. నిత్యావసరాల ధరలు నాలుగైదు రెట్లు పెరిగినా ఎలాంటి ఉపశమన చర్యలూ చేపట్టలేదు. ఉల్లి ధరలు భారీగా పెరిగి, ఏప్రిల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక ప్రచారాస్త్రంగా మారింది. అధిక ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే- యూన్ అమెరికాను సంతృప్తపరచటానికి 30 వేల కోట్ల డాలర్ల వ్యయంతో కూడిన అంతరిక్ష సైనికీకరణ ప్రాజెక్టును చేపట్టాడు. దీనిపై ప్రజల్లో, కార్మికుల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సంక్షేమ రంగానికి భారీగా నిధుల కోత పెట్టిన ఈ పద్దును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని స్పష్టం చేశాయి. దీంతో, అధ్యక్షుడు నిరాధారమైన నిందలు మోపాడు. ప్రతిపక్షాలు ఉత్తర కొరియాతో జత కట్టి, దేశద్రోహానికి పాల్పడుతున్నా యంటూ ఎదురుదాడికి దిగాడు. సైనిక పాలన విధించి, ప్రజాస్వామ్యం పీక నులమాలని చూశాడు. ప్రజలూ, ప్రజాప్రతినిధులూ వెంటనే స్పందించి, ఆ నియంతృత్వాన్ని తిప్పికొట్టారు. ఎలాంటి నిబంధనలూ పాటించకుండా ఏకపక్షంగా సైనిక పాలన అస్త్రాన్ని ప్రయోగించిన అధ్యక్షుడు యూన్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. మరోవైపు యూన్ వెంటనే రాజీనామా చేయాలని, లేకుంటే దేశవ్యాప్త సమ్మె చేపడతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ప్రజాభీష్టాన్ని పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలకు పోతే- ఎలాంటి గతి పడుతుందో యూన్ ఒక ఉదాహరణగా నిలవబోతున్నాడు!